రాహుల్ గాంధీ: మోదీని ఢీకొని ప్రధాని పదవి సాధించగలరా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు ఇందిరా గంధీ వయసు 42 ఏళ్ళు. సంజయ్ గాంధీ తొలిసారిగా ఎన్నికల్లో పోటీకి దిగినప్పుడు ఆయనకు 30 ఏళ్లే. రాజీవ్ గాంధీ 36 ఏళ్లప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇక రాహుల్ 2004లో రాజకీయాల్లో ప్రవేశించేనాటికి ఆయన వయసు 34.
భారత రాజకీయాలను బట్టి చూస్తే, రాహుల్‌ను రాజకీయాల్లో చిన్న పిల్లాడు అనే అనవచ్చు. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన అంశం ఏంటంటే, పదిహేనేళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నా, వయసు 40కి పైబడినా ఇప్పటికీ ఆయన్ను కొందరు బాలుడే అంటున్నారు. 'చిన్నపిల్లాడు' అంటూ 2008లో రాజ్‌నాథ్ సింగ్ ఓసారి రాహుల్‌నుద్దేశించి వ్యాఖ్యానించగా, దానిపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.
"ఆయన నన్ను బాలుడిగా భావించేలా ఉంటే, ఆయనకు నచ్చినా నచ్చకపోయినా ఒక విషయం చెబుతున్నా. భారతదేశంలో 70శాతం జనాభా ఈ విభాగంలోనే ఉన్నారు" అని రాహుల్ అన్నారు. యువతకు పెద్దగా రాజకీయ పరిజ్ఞానం ఉండదు అని భారత రాజకీయాల్లో ఇప్పటికీ బలమైన అభిప్రాయం ఉంది. అయితే ఈ ముద్రను రాహుల్ గాంధీ క్రమంగా చెరిపేసుకున్నారని, 2019 ఎన్నికల్లో ప్రధాని పదవికి ఆయన ఓ బలమైన ప్రత్యర్థి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, INDIRA GANDHI MEMORIAL TRUST, ARCHIVE
ఇందిరకు రాహుల్ అంటే చాలా ఇష్టం
1970 జూన్ 19 న జన్మించిన రాహుల్ గాంధీ తన రాజకీయ ఓనమాలు నానమ్మ ఇందిర నుంచే నేర్చుకున్నారు. రాహుల్ పుట్టిన కొన్ని రోజుల తర్వాత ఇందిర అమెరికాలో నివసించే తన స్నేహితుడు దొరోతీ నార్మన్‌కు ఓ లేఖ రాశారు. "రాహుల్ ముఖంపై ముడతలు పోయాయి. కానీ, ఇప్పటికీ ఆయనకు రెండు గడ్డాలు (డబుల్ చిన్) ఉన్నాయి" అని దానిలో రాశారు. "ఇంటి దగ్గర ప్రజలను కలుసుకునే సమయంలో చాలా సందర్భాల్లో రాహుల్, ప్రియాంకలు ఇందిరతోనే ఉండేవారు. ఎన్నోసార్లు పిల్లలిద్దరూ ఆమె వద్దే నిద్రపోయేవారు" అని ఇందిరా గాంధీ జీవిత చరిత్ర రాసిన కేథరిన్ ఫ్రాంక్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
డూన్, స్టీఫెన్స్, హార్వర్డ్, కేంబ్రిడ్జిలలో విద్యాభ్యాసం
రాహుల్ గాంధీ పాఠశాల విద్యా అంతా డూన్ స్కూలులో జరిగింది. ఆ తర్వాత ఆయన దిల్లీలోని ప్రముఖ విద్యాసంస్థ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చేరారు. ఆ తర్వాత అమెరికాలోనే హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రం (ఎకనామిక్స్)లో చేరారు. కానీ, భద్రతా కారణాల రీత్యా అక్కడి నుంచి వచ్చేసి ఫ్లోరిడాలోని ఓ కాలేజీలో చేరారు. అక్కడే ఆయన 'అంతర్జాతీయ సంబంధాలు' అనే సబ్జక్టుతో డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ట్రినిటీ కాలేజీలో చేరి 1995లో డెవలప్‌మెంట్ స్టడీస్‌పై ఎంఫిల్ పట్టా పొందారు.
ఆ తర్వాత లండన్‌లోని మానిటర్ గ్రూపులో మూడేళ్లు పనిచేశారు. అక్కడ రాహుల్ ఓ మారుపేరుతో ఉద్యోగం చేశారు. తాము ఇందిరాగాంధీ మనుమడితో పనిచేస్తున్నామని తోటి ఉద్యోగులెవరికీ కనీసం అనుమానం కూడా రాకుండా జాగ్రత్తగా ఉన్నారు.
2002లో భారత్‌కు తిరిగి వచ్చి కొంతమందితో కలసి ముంబయిలో బ్యాక్ ఆప్స్ సర్వీసెస్ లిమిటెడ్ అనే ఓ కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీలో తనకు 83 శాతం వాటా ఉన్నట్లు 2004 లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, TWITTER.COM/BHARAD
బాక్సింగ్, షూటింగ్, పారాగ్లైడింగ్ అంటే చాలా ఇష్టం
ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ప్రముఖ బాక్సింగ్ కోచ్ ఓం ప్రకాశ్ భరద్వాజ్‌కు 2008లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఓ ఫోన్ వచ్చింది. "10, జన్‌పథ్ నుంచి ఒకరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు" అని దాని సారాంశం.
కాసేపటి తర్వాత భరద్వాజ్‌కు పి.మాధవన్ ఫోన్ చేసి, రాహుల్ గాంధీ మీ దగ్గర బాక్సింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు అని చెప్పారు. భరద్వాజ్ వెంటనే అంగీకరించారు. "దీనికి మీరు ఎంత ఫీజు తీసుకుంటారు అని భరద్వాజ్‌ను అడిగినప్పుడు ఆయన అడిగింది ఒక్కటే.. రోజూ తనను ఇంటి నుంచి తీసుకెళ్లి, మళ్లీ తీసుకొచ్చి దింపాలి అని.
ఆ తర్వాత రాహుల్ గాంధీకి భరద్వాజ్ 12, తుగ్లక్ లేన్‌లోని ఇంటిలో బాక్సింగ్ శిక్షణనిచ్చారు. వారానికి మూడురోజుల పాటు ఈ శిక్షణ కొన్నివారాలపాటు జరిగింది. సోనియా, ప్రియాంక, ఆమె పిల్లలు మిరాయ, రైహాన్‌లు అప్పుడప్పుడూ వచ్చి రాహుల్ శిక్షణను చూసేవారు. రాహుల్‌ను ఎప్పుడూ సర్ అనో, రాహుల్ జీ అనో భరద్వాజ్ పిలిచేవారు. 'కానీ రాహుల్ తనను అలా పిలవొద్దు, నేను మీ విద్యార్థిని, నన్ను కేవలం రాహుల్ అని పిలిస్తే చాలు' అని రాహుల్ చెప్పేవారని భరద్వాజ్ గుర్తుచేసుకుంటారు.
ఓసారి నాకు చాలా దాహం వేసింది. నీళ్లు కావాలని అడిగా. అక్కడ చాలామంది పనివాళ్లున్నా రాహుల్ స్వయంగా వెళ్లి నాకోసం నీళ్లు తెచ్చి ఇచ్చారు. శిక్షణ పూర్తయ్యాక గేటు వరకూ వచ్చి రాహుల్ నన్ను సాగనంపేవారు అని భరద్వాజ్ గుర్తుచేసుకున్నారు" అని రాహుల్ గాంధీ జీవిత చరిత్ర రాసిన జతిన్ గాంధీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బాక్సింగ్‌తోపాటు స్విమ్మింగ్ (ఈత), స్క్వాష్, పారాగ్లైండింగ్, షూటింగ్‌లలో కూడా రాహుల్‌కు మంచి ప్రతిభ ఉంది. తీరికలేని షెడ్యూళ్లలో కూడా ఇప్పటికీ ఆయన రోజూ వ్యాయామానికి సమయం కేటాయిస్తారు.
ముంబయిలో జరిగిన 2011 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రాహుల్ గాంధీ తన స్నేహితులతో కలిసి చౌపట్టీలోని న్యూయార్కర్ రెస్టారెంట్‌కు వెళ్లి పిజ్జా, పాస్తా, మెక్సికన్ టోస్టడాలను తిన్నారు. బిల్లు తీసుకోవడానికి రెస్టారెంట్ మేనేజర్ ఒప్పుకోకపోయినా రాహుల్ బలవంతంగా 2223 రూపాయల బిల్లు చెల్లించారు. రాహుల్ ఇప్పటికీ కాఫీ తాగడానికి తరచుగా దిల్లీలోని ఖాన్ మార్కెట్‌కు వెళ్తుంటారు. ఆంధ్రా భవన్‌లోని భోజనం అంటే ఆయనకు చాలా ఇష్టం.

ఫొటో సోర్స్, Getty Images
ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణం
ఓసారి ముంబై వెళ్లినప్పుడు రాహుల్ తన సెక్యూరిటీ, వెంట ఉన్న ఇతర సిబ్బందికి తెలియకుండా అక్కడి లోకల్ రైళ్లలో ప్రయాణించడానికి వెళ్లారు. నిబంధనల ప్రకారం ప్లాట్‌ఫాంపై ఎదురుచూస్తూ, జనానికి అభివాదం చేశారు. తన పక్కన మరో వ్యక్తిని కూర్చోపెట్టుకుని, తన ఎదురుగా ఉన్నవారితో కరచాలనం చేస్తూ, మధ్యలో ఓ ఫోన్ మాట్లాడుతూ తన ప్రయాణాన్ని కొనసాగించారు.
ట్రైన్ దిగేముందు అక్కడ ఎదురుచూస్తున్న మీడియా వాళ్లెవరితోనూ ఆయన మాట్లాడలేదు. అక్కడి నుంచి నేరుగా ఓ ఏటీఎంకు వెళ్లి, అక్కడ కూడా డబ్బు తీసుకోవడానికి కొద్దిసేపు లైన్‌లో నిలబడ్డారు.

ఫొటో సోర్స్, EPA
ఇప్పటికీ బ్రహ్మచారే.. ఆయన గర్ల్ ఫ్రెండ్ ఓ ఆర్కిటెక్ట్
48 సంవత్సరాల వయసున్న రాహుల్ గాంధీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లిగురించి ఎప్పుడు మాట్లాడినా ఆయన దానిపై సమాధానాన్ని దాటవేస్తారు. తన గర్ల్ ఫ్రెండ్ పేరు జువానిత కాదు వెరోనిక్ అని ఓసారి వృందా గోపీనాథ్‌తో మాట్లాడుతూ రాహుల్ అంగీకరించారు. "ఆమెది స్పెయిన్.. వెనెజ్వేలా కాదు. ఆమె ఓ ఆర్కిటెక్ట్.. అంతేగానీ, ఏ రెస్టారెంట్లోనూ పనిచేయడం లేదు. ఒకవేళ ఆమె హోటల్లో పనిచేస్తున్నప్పటికీ నాకేం ఇబ్బంది లేదు. ఆమె నాకు మంచి స్నేహితురాలు" అని ఆయనన్నారు. కానీ, ఆ తర్వాత కూడా రాహుల్ ప్రియురాలు ఎవరనే దానిపై చాలా ఊహాగానాలే నడిచాయి.

ఫొటో సోర్స్, Getty Images
'పప్పు' అంటూ విమర్శలు
రాహుల్ గాంధీకి రాజకీయాలు కొత్త, పైగా ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కాదు. సభలు, సమావేశాల్లో తల్లి సోనియా వెనక నిలబడి ఉండేవారు. వచ్చిన ప్రజలను చూసి ఆయన సోదరి ప్రియాంక చేతులెత్తి అభివాదం చేసేవారు. కానీ రాహుల్ కనీసం చెయ్యెత్తడానికి కూడా అంగీకరించేవారు కాదు.
ఈ మౌనం ఆయనపై ఎన్నో విమర్శలకు తావిచ్చింది. రాహుల్‌కు మాట్లాడటంలో ఇబ్బందులున్నాయనే వరకూ ఈ విమర్శలు వెళ్లాయి. అయితే, ఇది నిజం కాదు. క్రమంగా మితవాద రాజకీయ ప్రత్యర్థులు ఆయనను 'పప్పు' అని పిలవడం ప్రారంభించారు. పప్పు అనే ముద్రను చెరిపేసుకోవడానికి రాహుల్ మొదట్లో ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. అదే సమయంలో 'పప్పూ పాస్ హో గయా' (పప్పు పాస్ అయ్యాడు) అనే ఓ బాలీవుడ్ సినిమా విడుదలైంది. 2008లో మరో బాలీవుడ్ సినిమాలోని 'పప్పు కాంట్ డాన్స్' (పప్పు డాన్స్ చెయ్యలేడు) పాట సూపర్ హిట్ అయ్యింది.
అదే సంవత్సరంలో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 'పప్పు కాంట్ ఓట్' (పప్పు ఓటు వెయ్యలేడు) అంటూ ఎన్నికల సంఘం ఓ ప్రచారాన్ని ప్రారంభించింది. పిచ్చి పనులు చేస్తూ సమయం వృథా చేసే ఓ వ్యక్తిగా పప్పు అనే కేరక్టర్‌ను చిత్రించారు. రాహుల్ నాయకత్వంలో ఎన్నికల్లో దిగిన కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో వరసపెట్టి బీజేపీ చేతిలో పరాజయాలు మూటగట్టుకుంది. అప్పట్లో బీజేపీ గ్రూపుల్లో ఓ జోక్ బాగా ప్రచారమైంది... 'మాకు ముగ్గురు ప్రచారకర్తలున్నారు, మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ' అని.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ అపరిపక్వత
రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలినాళ్లలో కాంగ్రెస్ సభ్యులే ఆయన వెనకాల జోకులేసుకుని నవ్వుకునేవారు. 'మీరెంత ఎక్కువ అసహ్యంగా తయారై, పిచ్చిపట్టినవాడిలా ఉంటే మీకు అంత ఎక్కువగా రాహుల్ గాంధీకి దగ్గరయ్యే అవకాశాలు పెరుగుతాయి' అనుకునేవారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ యువజన విభాగం సభ్యులు రాహుల్ గాంధీని కలిసే ముందు వారి రోలెక్స్ వాచీలను తీసేసి, తమ కార్లను దగ్గర్లోని ఫైవ్ స్టార్ హోటల్లో పార్క్ చేసి, ఆటోల్లో వచ్చేవారు.
'1992లో నెహ్రూ కుటుంబం అధికారంలో ఉండి ఉంటే బాబ్రీ మసీదు కూలి ఉండేది కాదు' అని 2007 మార్చి 19న రాహుల్ దేవ్‌బంధ్‌లో ఓ ప్రకటన చేశారు. కానీ ఆ సమయంలో పీవీ నరసింహరావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉంది. "బాబ్రీ మసీదు కూలిపోయే ప్రమాదం ఉందని తెలిస్తే నేను వెళ్లి దానికి అడ్డుగా నిలబడతాను, ఆందోళనకారులు ముందు నన్ను చంపిన తర్వాతే దాన్ని కూల్చాలి అని మా నాన్న.. మా అమ్మతో చెప్పేవారు" అని రాహుల్ వ్యాఖ్యానించారు.
బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి రాహుల్ వ్యాఖ్యలను రాజకీయ అపరిపక్వతగా అప్పట్లో రాజకీయ విశ్లేషకులు అభివర్ణించారు.

ఫొటో సోర్స్, TWITTER@RAHULGANDHI
'పప్పు' ఇమేజ్ నుంచి బయటకు ఎలా వచ్చారు?
పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో భారత రాజకీయాలు, విదేశాంగ విధానాలపై ఓ అర్థవంతమైన చర్చలో పాల్గొన్న తర్వాత ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపించింది. అక్కడి నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన రాహుల్‌లో ఆత్మవిశ్వాసం స్థాయి అమాంతంగా పెరిగింది.
ఆ తర్వాత జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించలేకపోయినా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడంలో విజయం సాధించారు. ఆ తర్వాత చోటుచేసుకున్న ఘటనలు ఇప్పటికీ ఊహకు అందనివే. హిందీ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ముందుండి విజయతీరాలకు చేర్చారు. నరేంద్ర మోదీ స్వయంగా తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహించినప్పటికీ మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్‌లలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో 2019 ఎన్నికలను ఎదుర్కోవడం నరేంద్ర మోదీకి అంత సులభం కాదనే విషయం స్పష్టమైంది.

ఫొటో సోర్స్, AFP
బీజేపీకి వారి స్టైల్‌లోనే జవాబు
ఒక్కసారి లోతుల్లోకి పడిపోయాక ఇంక కిందకి వెళ్లడానికి ఏమీ ఉండదు. పైకి మాత్రమే దారి ఉంటుంది. ఇది రాహుల్ గాంధీ విషయంలో నిజమైంది. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల క్రితం దారుణ ఓటమినెదుర్కొంది. ఆ పార్టీ లోక్‌సభలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. దీంతో కనీసం ప్రతిపక్ష నాయకుడిగా ఉందామనుకున్నా గానీ రాహుల్‌కు ఈ సంఖ్య చాలా చిన్నదైపోయింది.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన తర్వాత తన వ్యక్తిత్వంలో అనూహ్య మార్పులు చేసుకున్నారు రాహుల్ గాంధీ. మారిన రాహుల్ గాంధీ గుళ్లు, గోపురాలు తిరగడానికి, పర్వతాలు (కైలాస్ మానసరోవర్)ఎక్కడానికి, తన జంధ్యాన్ని చూపించడానికి కూడా వెనకాడటం లేదు. ప్రత్యర్థులు ఆదిత్యనాథ్ వంటివారిలా తీవ్రభావాలు కాకుండా యుక్తితో, సామరస్య పూర్వక హిందుత్వ భావనను ప్రదర్శించారు. "కాంగ్రెస్ వైఫల్యాలకు గోసంరక్షణ అనే అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ కేవలం బీజేపీ వైఫల్యాల ఆధారంగానే తమ రాజకీయాలకు పదనుపెడుతోంది" అని ప్రముఖ జర్నలిస్ట్ రాధికా రామశేషన్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ ఖాతాలో మూడు రాష్ట్రాలు
దీని ఫలితమే కాంగ్రెస్‌కు మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం. బీజేపీకి కంచుకోటలుగా భావించే ఈ రాష్ట్రాల్లో ఆ పార్టీతో భీకరంగా పోరాడి విజయాన్ని సాధించింది కాంగ్రెస్. 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లోని 65 సీట్లలో 62 సీట్లను బీజేపీ దక్కించుకుంది. అందుకే ఈ విజయం అంత ప్రత్యేకం. ఒక్కసారిగా రాహుల్ ఖ్యాతి దేశవ్యాప్తంగా మరింత పెరిగింది. డీఎంకీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా రాహుల్‌ను పొగడ్తల్లో ముంచెత్తకుండా ఉండలేకపోయారు. కాంగ్రెస్ పార్టీకి చిరకాల ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడును కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో రాహుల్ విజయం సాధించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES,TWITTER
మోదీపై పదునైన వాగ్బాణాలు
రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల సాధించిన విజయాలు ఆయన్ను దేశ అత్యున్నత పదవికి పోటీలో బలంగా నిలబెట్టాయి. అంతేకాదు, మోదీపై హాస్యోక్తులను (ఇటీవల ఓ ట్వీట్‌లో 'ప్రపంచ నాటకరంగ దినోత్సవ శుభాకాంక్షలు' అని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు) విసరడం ప్రారంభించారు. మీడియా సమావేశాల్లో మాట్లాడటానికి ఏమాత్రం సిగ్గుపడటం లేదు.
కఠిన నిర్ణయాలేమైనా తీసుకోవాలంటే రాహుల్ గతంలో విదేశాలకు వెళ్లిపోయేవారు. ప్రస్తుతం నెలకొన్న వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక వ్యవస్థ పతనం, పెరుగుతున్న నిరుద్యోగం, రఫేల్ కుంభకోణం వంటి వాటిపై ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్ నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. లోక్‌సభలో ఓ చర్చ సందర్భంగా మోదీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. తన రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూడననే సందేశాన్నివ్వడానికే ఆయన అలా చేశారు. మోదీపై ఆయన ఎన్ని విమర్శలు చేసినప్పటికీ మోదీ అనుసరిస్తున్న ఆర్థిక విధానానికి దీటైన విధానాన్ని ప్రతిపాదించలేకపోతున్నారు.
ఇటీవల కాంగ్రెస్ గెలిచిన మూడు రాష్ట్రాల్లో వారికి విజయాన్ని అందించిన అంశం వ్యవసాయ రుణాల మాఫీ. సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా పేదలకు సంవత్సరానికి రూ. 72,000 అందించే కనీస ఆదాయ పథకాన్ని రాహుల్ ప్రకటించారు. అయితే, దీనికి అవసరమైన నిధులెలా సమకూరుస్తారో మాత్రం స్పష్టం చెయ్యలేదు.

ఫొటో సోర్స్, TWITTER/@RAHULGANDHI
అశోక్ గెహ్లాట్, కమల్‌నాథ్‌లకు రాష్ట్రాల పగ్గాలు
సచిన్ పైలట్‌ను రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించినప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి అశోక్ గెహ్లాట్‌ను పక్కన పెట్టలేదు.
అలాగే మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్యకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించినప్పటికీ, ముఖ్యమంత్రిని నిర్ణయించాల్సి వచ్చినప్పుడు సీనియర్ నేత కమల్‌నాథ్‌నే రాహుల్ ఎంపిక చేశారు.
కర్నాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జేడీఎస్‌తో కలసి కూటమిని ఏర్పాటు చేశారు. రెండో పెద్ద పార్టీ అయినప్పటికీ సీఎం పీఠాన్ని జేడీఎస్‌కు ఇవ్వడం ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీని ఆహ్వానించినప్పటికీ, అభిషేక్ మను సింఘ్వీని చండీగఢ్ నుంచి పంపించి సుప్రీంకోర్టులో రాహుల్ పిటిషన్ వేయించారు. దీంతో బీజేపీ ప్రభుత్వం 48 గంటల్లోపే గద్దె దిగింది. ఇవన్నీ రాహుల్‌కున్న రాజకీయ దూరదృష్టికి ఉదాహరణలు.

ఫొటో సోర్స్, Getty Images
ముందున్న దారి ముళ్లబాటే
రాహుల్ ఇప్పటి వరకూ ముఖ్యమంత్రిగా కాదు కదా, కనీసం మంత్రిగా కూడా పనిచేయలేదు. ఆయన కావాలనుకుంటే ఏదో ఒక పదవి వచ్చి ఉండేది. తన సొంత లోక్‌సభ నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి పనులేవీ చెయ్యలేదనే ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. మూడుసార్లు ఎంపీగా ఉన్న రాహుల్‌కు ఇదొక మచ్చ. .
ఇప్పటివరకూ ఆయన ఏ పదవిలో ఉన్నప్పటికీ అవన్నీ వారసత్వంగా వచ్చినవే. దానికి ఆయన పెద్దగా కష్టపడింది లేదు. ప్రధాని పదవికి రాహుల్ సిద్ధమైనా, ఆయన మద్దతుదారులు, వ్యతిరేకులు ఇద్దరూ అనుకునేది ఒకటే... ఆయనకు ఆ పదవిని చేపట్టేంత అనుభవం లేదు అని. రాజకీయాల్లో ఈ విమర్శ ఏమాత్రం మంచిది కాదు.
'ఓపెన్' మ్యాగజైన్ ఎడిటర్ ఎస్. ప్రసన్నరాజన్ దీనిపై ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
"మోదీ కాలంలో గాంధీగా ఉండటమే రాహుల్‌కున్న అతిపెద్ద సమస్య. ఇది ఎవరికైనా కష్టమే. మోదీ అయిదేళ్లపాటు ప్రధాని పదవిలో ఉన్న మోదీని 2019 ఎన్నికల్లో ఓడించడం అంత సులభం కాదని రాహుల్‌కు కూడా తెలుసు. అయితే, తనకు మోదీని ఢీకొట్టేందుకు అవసరమైన శక్తిసామర్థ్యాలున్నాయని గడిచిన మూడు నెలల కాలంలో రాహుల్ నిరూపించారు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి.
- 'అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా': కల్యాణదుర్గం సభలో రాహుల్ గాంధీ
- కాంగ్రెస్‌కు రాహుల్ గెలుపు గుర్రం అవుతారా?
- 'హిందూ ఉగ్రవాదం': మోదీ ప్రసంగంపై రేగిన దుమారం
- ‘చంద్రబాబు బాహుబలిలో భల్లాల దేవుడు': నరేంద్ర మోదీ
- ‘అమ్మ కూరగాయలు అమ్మి ఇచ్చిన డబ్బు.. రూ.500లతో ఎన్నికల్లో గెలిచిన ఎంపీ’
- ఈ తెగలో వ్యభిచారం ఓ ఆచారం, అమ్మాయి పుడితే సంబరాలు చేసుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








