ఆమెకు కత్తితో కోసినా నొప్పి తెలియదు...

ఫొటో సోర్స్, Peter Jolly/REX/Shutterstock
ఆమె చర్మం కాలుతోంది.. కానీ ఆమెకు ఆ విషయం తెలీదు. చర్మం కాలుతున్న వాసన వేసినపుడు మాత్రమే ఆమెకు విషయం అర్థమైంది. వంట చేస్తున్నపుడు తరచూ ఆమెకు కాలిన గాయాలు అవుతుంటాయి. కానీ ఆమెకు నొప్పి తెలియదు. అందుకే తనకు గాయాలవుతున్నపుడు ఆమె జాగ్రత్తగా ఉండలేదు.
ఆమె పేరు జో కామెరూన్. ఇలాంటి అరుదైన సమస్య ప్రపంచంలో ఇద్దరికి మాత్రమే ఉంది. అందులో కామెరూన్ ఒకరు. ఈ పరిస్థితి వల్ల నొప్పి తెలియదు, భయం కానీ, ఆందోళన కానీ ఉండదు.
65 ఏళ్ల వయసులో కామెరూన్‌కు ఒక పెద్ద ఆపరేషన్ చేశారు.
సర్జరీ పూర్తయ్యాక, తనకు పెయిన్ కిల్లర్స్ అవసరంలేదు అని కామెరూన్ అంటే, మొదట్లో డాక్టర్లు నమ్మలేకపోయారు.
ఆ సందర్భంలోనే కామెరూన్‌కు కూడా తన పరిస్థతి అర్థం కాలేదు.
తన చేతికి ఆపరేషన్ చేశాక, నొప్పి తీవ్రంగా ఉంటుందని డాక్టర్లు హెచ్చరించారు. కానీ ఆమెకు అస్సలు నొప్పి తెలియలేదు.
అపుడు తనకు మత్తుమందు ఇవ్వడానికి వచ్చిన వైద్యుడు డా.దేవ్‌జిత్ శ్రీవాస్తవ, ఆమెను యూనివర్సిటీ ఆఫ్ లండన్ అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన 'పెయిన్ జెనిటిసిస్ట్' వద్దకు పంపారు.
కొన్ని పరీక్షల అనంతరం, అందరిలా కామెరూన్‌కు శారీరక బాధ కలగకపోవడానికి కారణం జన్యుమార్పులేనని వైద్యులు కనుగొన్నారు.

ఫొటో సోర్స్, Jo Cameron
'ప్రసవంలో కూడా నొప్పి లేదు..!'
స్కాట్లాండ్‌కు చెందిన జో కామెరూన్ బీబీసీ స్కాట్లాండ్ న్యూస్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ, ఆపరేషన్ తర్వాత తనకు పెయిన్ కిల్లర్స్ అవసరం ఉండదు అని చెప్పినపుడు డాక్టర్లు నమ్మలేకపోయారని అన్నారు.
''ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లక ముందు, నాకు పెయిన్ కిల్లర్స్ అవసరంలేదని కచ్చితంగా చెప్పాను. అందరూ పరిహాసం చేశారు. కానీ ఆపరేషన్ అయ్యాక నాకు నిజంగానే నొప్పికలగకపోవడంతో, డాక్టర్ నా పాత మెడికల్ రిపోర్ట్స్‌ను పరిశీలించాడు.
నేనెప్పుడూ పెయిన్ కిల్లర్స్ వాడలేదని ఆయనకు అప్పుడు అర్థమైంది'' అని కామెరూన్ అన్నారు.
అప్పుడే కామెరూన్‌ను ఇంగ్లండ్‌లోని నిపుణుల వద్దకు పంపారు. వైద్య పరీక్షల అనంతరం, కామెరూన్.. తనను తాను అర్థం చేసుకోవడం ప్రారంభించారు.
''ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, నాకెప్పుడూ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం రాలేదు.
కానీ, పెయిన్ కిల్లర్స్ అవసరం ఎందుకు రాలేదని నన్ను నేను ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు.
ఎదుటి వ్యక్తి మనల్ని ప్రశ్నించేవరకూ, మనం మనలాగే ఉంటాం. నేను అందరిలా కాదు అన్న విషయం తెలియక, ఇంతవరకూ నేను చాలా ఆనందంగా కాలం గడిపాను'' అని కామెరూన్ అన్నారు.
'పిల్లలను కనేటపుడు కూడా తనకు నొప్పి లేదు' అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ,
''ఇది చాలా చిత్రంగా అనిపిస్తుంది. కానీ నాకు అస్సలు నొప్పి లేదు. చెప్పాలంటే.. ఆ సందర్భాన్ని చాలా ఎంజాయ్ చేశా'' అన్నారు.

ఫొటో సోర్స్, Jo Cameron
‘నేను ఆనందంగా ఉండి అందర్నీ ఇబ్బంది పెట్టాను’
నొప్పి అన్నది చాలా ముఖ్యమైనదని జో కామెరూన్ చెబుతున్నారు. ''మనుషులకు నొప్పి ఉండటం వెనుక ఓ కారణం ఉంటుంది. నొప్పి అన్నది ఒక హెచ్చరిక. ప్రమాద సమయాల్లో అలారం బెల్‌లాగ నొప్పి పని చేస్తుంది. నాకు ఆర్థరైటిస్ ఉంది. కానీ నాకేమో నొప్పి తెలియదు. పరిస్థితి విషమించేవరకూ నేను మేలుకోలేదు. ఇప్పుడు అస్సలు నడవలేకపోతున్నాను'' అని కామెరూన్ అన్నారు.
గాయాల నుంచి సాధారణ మనుషులకంటే త్వరగా కామెరూన్ కోలుకోగలరని వైద్యులు విశ్వసిస్తున్నారు. తన శరీరంలో ప్రత్యేకమైన జన్యుకలయిక వల్ల ఆందోళన స్థాయిలు తక్కువగా ఉంటాయని, మతిమరుపు వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
''నేను ఆనందంగా ఉంటూ, నా మతిమరుపుతో.. జీవితంలో అందర్నీ ఇబ్బంది పెట్టాను'' అని కామెరూన్ అన్నారు.

ఫొటో సోర్స్, Jo Cameron
కామెరూన్ జన్యువులు ఇతరులకు సాయం చేయగలవా?
ఈమధ్య కారు డ్రైవ్ చేస్తున్నపుడు తనకు తగిలిన ఓ గాయం గురించి చెబుతూ, గాయమైనపుడు అస్సలు ఏమీ జరగనట్లుగానే ఉన్నానని, తన స్థానంలో వేరొకరికి అది నొప్పి కలిగించేదని అన్నారు.
''నాకు అడ్రినలిన్ లేదు. నొప్పి ద్వారా హెచ్చరికలు వస్తాయి. కానీ ఏంచేస్తాం? నేను దేన్నీ మార్చలేనుకదా..'' అన్నారు.
''ప్రమాదం జరిగినపుడు అవతలి కారు డ్రైవర్ నిలువెల్లా వణికిపోతున్నాడు. కానీ ఆ ఫీలింగ్ నాకు లేదు. అందుకే ప్రశాంతంగా ఉండగలిగాను. ఇది ధైర్యం కాదు. భయం కలగకపోవడమే'' అన్నారు.
ఇలాంటి సమస్యతో బాధపడేవారు చాలామంది ఉండే అవకాశం ఉందని అధ్యయనకారులు చెబుతున్నారు.
''ఈమధ్యకాలంలో ఆపరేషన్ పూర్తయ్యాక ప్రతి ఇద్దరిలో ఒకరు.. నొప్పిని కొంతవరకూ భరించగలుగుతున్నారు. ఇప్పుడు మేం గుర్తించిన విషయం ఆధారంగా సరికొత్త చికిత్స విధానాలు అభివృద్ధి చెందాలి. సర్జరీ తర్వాత కలిగే నొప్పిని ఎదుర్కొని, గాయాలను త్వరగా నయం చేయగలిగిన పెయిన్ కిల్లర్స్ కనుగొనే దిశగా అధ్యయనకారులు ఆలోచిస్తున్నారు. అలాంటి పెయిన్ కిల్లర్స్.. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆపరేషన్లు చేయించుకుంటున్న 33కోట్లమంది పేషెంట్లకు వరప్రదాయినిగా మారే అవకాశం ఉంది'' అని డా.శ్రీవాస్తవ అన్నారు.
జో కామెరూన్ పరిస్థితి గురించి, 'బ్రిటీష్ జర్నల్ ఆఫ్ అనస్థీషియా' సంచికలో డా.శ్రీవాస్తవ, డా.జేమ్స్ కాక్స్ రాసిన వ్యాసం అచ్చు అయ్యింది.
''ఇలాంటి వ్యక్తులు.. వైద్య శాస్త్ర అధ్యయనానికి ఎంతో విలువైనవారు. వారిలో కలిగే జన్యుమార్పులు ఎలాంటి ప్రభావం చూపుతాయి, వారు నొప్పిని ఎలా గుర్తిస్తారు అని మేం తెలుసుకుంటాం. నొప్పిని గుర్తించలేని వ్యక్తులు ముందుకురావాలని మేం కోరుతున్నాం. సర్జరీ తర్వాత కలిగే నొప్పిని నియంత్రించడం, దీర్ఘకాలిక నొప్పులు, ఆందోళన, గాయాలను త్వరగా మాన్పగలిగే మందుల కోసం జరుగుతున్న అధ్యయనాలకు మా అధ్యయన ఫలితాలు తోడ్పడతాయని భావిస్తున్నాం'' అని డా.జేమ్స్ కాక్స్ అన్నారు.
ఇవి కూడా చదవండి
- ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ డైరీ: ఆయన 24 సార్లు అసెంబ్లీకి వస్తే.. 248 సార్లు కోర్టుకు వెళ్లారు - జగన్‌పై చంద్రబాబు ఆరోపణ
- ఈ తెగలో వ్యభిచారం ఓ ఆచారం, అమ్మాయి పుడితే సంబరాలు చేసుకుంటారు
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- 'గంగ ప్రక్షాళన జరిగిందా? మేం ఆ నీటిని పరీక్షించాం.. అందులో ఏం తేలిందంటే...'
- కాళేశ్వరం ప్రాజెక్టు: కలల నిర్మాణం ఒక వైపు... కడతేరని విషాదం మరో వైపు
- ప్రస్తుత లోక్‌సభలో అత్యంత ధనికులైన ఆ నలుగురు ఎంపీలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








