అంతర్జాతీయ మహిళా దినోత్సవం: మహిళలకు పురుషులతో సమానంగా ఆర్థిక హక్కులు అందిస్తున్న దేశాలెన్ని?

ఫొటో సోర్స్, Getty Images
చట్టపరంగా పురుషులకు, మహిళలకు సమాన హక్కులు కల్పించే దేశాల సంఖ్య ఇంకా ఒకే అంకె దగ్గరే నిలిచి ఉంది.
ఆరు దేశాలు మాత్రమే మహిళలకు కూడా, పురుషులతో సమానంగా హక్కులు అందిస్తూ చట్టాలు చేశాయి.
ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన 'మహిళలు, వ్యాపారం, చట్టం' నివేదికలో మొత్తం 187 దేశాల్లో ఆరు దేశాలు మాత్రమే మహిళలకు, పురుషులకు 'పూర్తి సమానత్వం' అందిస్తున్నాయని తెలిపింది.
ఆర్థిక, చట్టపరమైన, ఉద్యమ స్వేచ్చ, ప్రసూతి, గృహ హింస, ఆస్తి నిర్వహణ లాంటి ఇతర అంశాలకు సంబంధించి పదేళ్ల గణాంకాలను పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ దీనిపై ఒక రిపోర్ట్ విడుదల చేసింది.
బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, లాత్వియా, లక్సంబర్గ్, స్వీడన్ మాత్రమే ఈ అంశాల్లో పురుషులకు, స్త్రీలకు పూర్తి సమానత్వం అందిస్తున్నాయని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మహిళలు మాత్రమే పురుషులకు ఉన్న హక్కులను కూడా ఆస్వాదిస్తున్నారు.
ప్రాంతీయ వ్యత్యాసం
వివిధ ప్రాంతాలను బట్టి ఈ గణాంకాలలో వ్యత్యాసం కనిపిస్తోంది. అంటే, యూరప్, మధ్య ఆసియాలో ఇది 84.7 శాతం ఉంటే, మధ్యప్రాచ్యం, తూర్పు, ఉత్తర ఆఫ్రికాలో ఇది 47.3 శాతానికి పడిపోయింది.
లింగ సమానత్వం 83.75 శాతం ఉన్నప్పటికీ అమెరికాకు ఈ జాబితాలోని టాప్ 50 దేశాల్లో చోటు దక్కలేదు.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల హక్కుల కాపాడే చట్టాలు ఉన్న దేశాల జాబితాలో సౌదీ అరేబియా 25.6 శాతం స్కోరుతో అట్టడుగున నిలిచింది.
"తొలి ఉద్యోగం పొందిన ఒక 25 ఏళ్ల యువతి, లేదా పనిని, పిల్లలనూ బ్యాలెన్స్ చేసే ఒక తల్లి నుంచి, పదవీ విరమణకు సిద్ధంగా ఉన్న వృద్ధుల వరకూ మహిళలందరి ఆర్థిక నిర్ణయాలను చట్టాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయనేదానిపై మేం అన్వేషించాం" అని ప్రపంచ బ్యాంక్ తాత్కాలిక అధ్యక్షురాలు క్రిస్టలినా జార్జీవా ఒక ప్రకటనలో తెలిపారు.
చాలా చట్టాలు, నిబంధనలు మహిళలు పనుల్లోకి రాకుండా, వ్యాపారం ప్రారంభించకుండా అడ్డుకోవడం కొనసాగుతోంది. మహిళలు ఆర్థికంగా, శ్రామిక శక్తిలో భాగస్వామ్యం కాకుండా ఈ వివక్ష శాశ్వత ప్రభావం చూపిస్తోందని ఆమె అన్నారు.
కానీ, కొన్ని దేశాలు తీసుకున్న సానుకూల చర్యలను కూడా ప్రపంచ బ్యాంక్ నివేదిక హైలెట్ చేసింది.
లింగ సమానత్వం పెంచడానికి 131 దేశాలు గత దశాబ్దానికి పైగా 274 సంస్కరణలు, నిబంధనలను అమలు చేశాయని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
పనిచేసే చోట మహిళల భద్రత
పనిచేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళలను కాపాడే చట్టాలు ప్రవేశపెట్టిన 35 దేశాలు దశాబ్దం క్రితం నుంచీ 200 కోట్ల మందికి పైగా మహిళలను కాపాడుతున్నాయని ఈ నివేదిక తెలిపింది.
ప్రపంచంలోనే అత్యంత నిరుపేద దేశాలు ఉన్న సహారా ఆఫ్రికా గత దశాబ్దం నుంచీ లింగ సమానత్వం కోసం ఎక్కువ సంస్కరణలు అమలు చేశాయని చెప్పింది.
ఉద్యోగం సంపాదించడం నుంచి, వ్యాపారాలు నడపడం, ఫించన్ పొందడం వరకు ఒక మహిళ మొత్తం పని జీవితంలో ఉన్న సూచికలను ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది.

ఫొటో సోర్స్, Getty Images
33 దేశాలు పితృత్వ సెలవులు పరిచయం చేశాయని, 47 దేశాలు గృహ హింసపై చట్టాలు రూపొందించాయని కూడా ఈ నివేదిక పేర్కొంది.
"లింగ సమానత్వం సాధించడం అంటే, దానికి చట్టాలు మార్చడంతోపాటూ ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. చట్టాలను అర్థవంతంగా అమలు చేయాలి. దానికి అన్ని సమాజాల పురుషులు, మహిళల నుంచి దృఢమైన రాజకీయ సంకల్పం, నాయకత్వం అవసరం. ప్రబలంగా నాటుకుపోయిన సాంస్కృతిక ప్రమాణాలు, వైఖరిలో కూడా మార్పు రావాలి" అని క్రిస్టలినా జార్జీవా తెలిపారు.
మొత్తానికి, చట్టం అనేది మహిళలు తమ సామర్థ్యాన్ని అడ్డుకోకుండా వెనక్కి లాగకుండా, వారిని శక్తిమంతంగా మార్చే ఒక ఆయుధంగా మారగలదనే విషయాన్ని ఈ గణాంకాలు మనకు చూపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: ఈ అమ్మాయి 24 ఏళ్లకే ఎంపీ అయ్యారు
- 'రాక్షసుడి బంగారం' బయటకు తీసే కార్మికుల కథ
- 'ఎయిర్ఫోర్స్ ఉన్నతాధికారి నన్ను రేప్ చేశాడు' - అమెరికా సెనెటర్ మార్తా మెక్శాలీ
- జీబ్రాలపై చారలు ఎందుకు ఉంటాయి?
- ''గూగుల్ నా కుమార్తె మరణాన్ని సొమ్ము చేసుకుంటోంది''
- అందరికీ మరుగుదొడ్లు కల్పిస్తామన్న మోదీ హామీ నెరవేరిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








