'హిందూ ఉగ్రవాదం': మహారాష్ట్ర‌లో మోదీ ప్రసంగంపై రేగిన దుమారం

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

'హిందూ ఉగ్రవాదం అన్న పదాన్ని తెరపైకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే’ అని మహారాష్ట్ర‌లో నిర్వహించిన తన మొదటి ఎన్నికల సభలో మోదీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగుతోంది.

మతం కార్డును వాడుకోవడం మోదీకి కొత్తేమీ కాదని, తద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ఆయన ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మోదీవి చవకబారు రాజకీయాలని, ఎన్నికల నేపథ్యంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర‌లో నిర్వహించిన సభలో మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ హిందువులను అవమానించిందని అన్నారు.

''ఈ దేశంలోని కోట్లాది మందిపై 'హిందూ ఉగ్రవాదులు' అన్న మచ్చను రుద్దేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. (సభికులను ఉద్దేశిస్తూ) ఆ మాట విన్నప్పుడు మీ మనసు గాయపడిందా? లేదా? వేల ఏళ్ల చరిత్రలో హిందువులు ఉగ్రవాదానికి దిగిన ఘటన ఒక్కటైనా ఉందా?

బ్రిటీష్ చరిత్రకారులు సైతం హిందువులు హింసకు దిగుతారని ఎన్నడూ అనలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను శిక్షించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకే మెజార్టీ వర్గం ప్రజలు ఎక్కువగా ఉండే చోట పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకులు జంకుతున్నారు'' అని మోదీ వ్యాఖ్యానించారు.

అయితే మోదీ అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ ఆరోపించారు.

'హిందూ ఉగ్రవాదం' అన్న పదప్రయోగం మొదటగా చేసింది బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్‌కే సింగ్ అని, కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయన ఆ మాట వాడారని తివారీ అన్నారు.

నిఘా సంస్థలు అందించిన సమాచారంతోనే 'హిందూ ఉగ్రవాదం' అంశాన్ని చాలా రోజుల క్రితం తాము ప్రస్తావించామని, అయితే ఇప్పుడు భయంతోనే తొమ్మిదేళ్ల కిందటి వ్యవహారాన్ని మోదీ తవ్వి తీస్తున్నారని కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మోదీపై ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై దేశానికి ఆయన క్ష‌మాపణలు చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు.

ఎన్నికల కోసం మతం అంశాన్ని తెరపైకి తేవడం మోదీకి ఇది కొత్తేమీ కాదని బీబీసీతో మాట్లాడుతూ విశ్లేషకుడు జాన్సన్ చోరగూడి అన్నారు.

ప్రయోజనం ఉంటుందనుకున్న చోట ఈ పాచికను మోదీ ప్రయోగిస్తుంటారని అభిప్రాయపడ్డారు.

తనపై హ‌త్యా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ గతంలో మోదీ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని జాన్సన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)