డాక్టర్ తవ్వా వెంకటయ్య.. వ్యవసాయ కూలీ: తెలుగు సాహిత్యంలో పీహెచ్‌డీ చేసినా ఉద్యోగం దొరక్క ఇబ్బందులు

తవ్వా వెంకటయ్య
    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

కరోనావైరస్ మహమ్మారి వల్ల ఎన్నో జీవితాలు తారుమారవుతున్నాయి. వైరస్ సోకిన వారే కాకుండా, లాక్‌డౌన్ వల్ల ఏర్పడిన పరిస్థితులు ఎంతోమందికి ఉపాధిని దూరం చేశాయి.

ముఖ్యంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసిన అధ్యాపకులు ప్రస్తుతం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో కడప జిల్లా ఖాజీపేట మండలం తవ్వారుపల్లెలోని డాక్టర్ తవ్వా వెంకటయ్య ఒకరు.

తెలుగు సాహిత్యంలో పీహెచ్‌డీ చేసి, సొంత మండల కేంద్రంలో డిగ్రీ విద్యార్థులకు పాఠాలు చెప్పిన వెంకటయ్య ఇప్పుడు కూలీగా మారారు. పొలం పనులకు వెళ్తూ రోజులు గడుపుతున్నారు. కుటుంబ పోషణకు కూలీగా మారిన డాక్టర్ వెంకటయ్య జీవితం కొందరిపై కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో చెబుతుంది.

డాక్టర్ తవ్వా వెంకటయ్య

పరిశోధనలకు ప్రశంసలు

తవ్వా వెంకటయ్య చిన్నతనం నుంచి కష్టపడి ఎదిగారు. సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన వెంకటయ్య కుటుంబానికి 75 సెంట్ల సొంత భూమి మాత్రమే ఉంది. సొంతూరిలో ప్రాథమిక విద్య, ఖాజీపేటలో హైస్కూల్ విద్య పూర్తిచేసిన వెంకటయ్య డిగ్రీ కోసం కడప వెళ్లారు.

డిగ్రీ చదవడానికి అవసరమైన పుస్తకాలు కొనుక్కోడానికి ఆయన అప్పట్లో ఆకాశవాణి కడప కేంద్రంలో పనిచేశారు. రేడియోలో కథలు చెప్పినందుకు వచ్చిన పారితోషకంతో పుస్తకాలు కొనుక్కుని చదువు పూర్తి చేశారు.

తర్వాత కడప యోగివేమన యూనివర్సిటీలో రాయలసీమ సాహిత్యానికి సంబంధించిన పరిశోధనలకు పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.

పీహెచ్‌డీ, ఆ తర్వాత కూడా వెంకటయ్య ప్రయత్నాలకు ఎన్నో ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా రాయలసీమ సాహిత్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆయన వెలుగులోకి తెచ్చారు.

రాయలసీమలో కథా రచన 1941లో ప్రారంభమైందని అందరూ అనుకుంటున్న సమయంలో సీమలో 1918లోనే తొలి కథ ఆనవాళ్లు ఉన్నాయని వెంకటయ్య తన పరిశోధన ద్వారా తెలిపారు.

తొంభై ఏళ్ల క్రితమే హెచ్.మహబూబ్ మియా సాహెబ్ కథలు రాశారని తగిన ఆధారాలతో వెలుగులోకి తీసుకొచ్చిన వెంకటయ్య, రాయలసీమలో ముస్లిం కథా రచయితల చరిత్ర మూలాలు తెలుసుకునేందుకు కృషి చేశారు.

డాక్టర్ తవ్వా వెంకటయ్య

ఉన్న ఉద్యోగమూ పోయింది

సీమలో మహిళా రచయితల ప్రస్థానంపై కూడా విశేష పరిశోధనలు చేశారు.

1926 నాటికే రాయలసీమలో నలుగురు కథా రచయిత్రులు ఉండేవారని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. ఇలా ఎన్నో అంశాలలో వెంకటయ్య కృషిని పలువురు ప్రముఖులు, రచయితలు, కవులు అభినందించారు.

అంతేకాదు, తన రచనలు కొన్నింటిని యోగివేమన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారని కూడా ఆయన చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, డాక్టర్ తవ్వా వెంకటయ్య.. వ్యవసాయ కూలీ

పీహెచ్‌డీ పూర్తి చేసినా తగిన ఉద్యోగం రాకపోవడంతో, ఆయన చివరకు ఖాజీపేటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు. గత పదేళ్లుగా ఆయన అక్కడే తెలుగు పండిట్‌గా పాఠాలు చెబుతున్నారు.

కళాశాలలో బోధనలకే పరిమితం కాకుండా ఆయన వివిధ అంశాల మీద పుస్తకాలు కూడా రాయడం ప్రారంభించారు. ఇప్పటి వరకూ వెంకటయ్య రాసిన ఆరు రచనలు పుస్తకాలుగా వచ్చాయి.

వీటిలో ‘రాయలసీమ తొలితరం కథలు’, ‘సీమ కథా తొలకరి’ వ్యాస సంపుటి, ‘యువతరం’ వంటి పుస్తకాలు ఆదరణ పొందాయి.

మరిన్ని పుస్తకాలు రాసేందుకు ప్రాథమిక ప్రయత్నాలు పూర్తి చేశానని వెంకటయ్య బీబీసీకి చెప్పారు.

“చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు చదవడం అలవాటు. పుస్తకమే నా జీవితాన్ని మలుపుతిప్పుతుందని అనుకున్నాను. కానీ పీహెచ్‌డీ చేశాక తగిన ఉద్యోగం రాకపోవడంతో, కుటుంబ పోషణ భారంగా మారింది. డిగ్రీ కాలేజీలో అధ్యాపకుడిగా 10వేల జీతం వచ్చేది. ఆ సంపాదనతోనే నేను, నా భార్యతోపాటూ నాన్న, మా తమ్ముడిని కూడా చూసుకునేవాడిని” అన్నారు.

పీహెచ్‌డీ పట్టా

ఫలించని ఉద్యోగ ప్రయత్నాలు

“ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదు. తెలుగు అధ్యాపకుల పోస్టులు భర్తీ కావడం లేదు. ఎయిడెడ్ పోస్ట్ కోసం చాలా ప్రయత్నించినా ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో భర్తీ చేయలేకపోతున్నామని చెబుతున్నారు. అందుకే వచ్చే జీతంతోనే కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకోడానికి ప్రయత్నిస్చున్నా. ఊళ్లో సొంత ఇంట్లోనే ఉంటున్నా. రోజూ కాలేజీకి 5 కిలోమీటర్లు సైకిల్ మీదే వెళ్లొచ్చేవాడిని” అన్నారు వెంకటయ్య.

కరోనావైరస్ నియంత్రణ కోసం మార్చిలో లాక్‌డౌన్ విధించారు. దాంతో, అన్ని సంస్థలతోపాటూ వెంకటయ్య పాఠాలు చెప్పే కాలేజీకి కూడా తాళాలు పడ్డాయి.

దాంతో వెంకటయ్య వచ్చే జీతం డబ్బుల ఆశ కూడా పోయింది. లాక్‌డౌన్‌లో వేతనాలివ్వలేమని యాజమాన్యం చేతులెత్తేయడంతో, ఆయన జీవితం గందరగోళంలో పడింది.

చివరికి కొంతమంది మిత్రుల దగ్గర అప్పులు చేసి కొన్నాళ్లు పాటు కుటుంబాన్ని నెట్టుకొచ్చానని చెప్పిన వెంకటయ్య.. తర్వాత ఆ అప్పు కూడా పుట్టకపోవడంతో ఏదో ఒక పనికి వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు.

“భార్య, పిల్లల్ని పోషించాలి. అప్పులు కూడా కష్టం అవుతోంది. అందుకే రెక్కల కష్టం నమ్ముకున్నాను. బేల్దార్ పనులకు వెళ్లాను. వర్షాలు పడ్డాక మళ్లీ వ్యవసాయ పనులు మొదలవడంతో కూలికి వెళుతున్నాను. అలవాటు లేని పని కాబట్టి కష్టంగానే ఉంటుంది. అయినా పొలంలో దిగి పనులు చేస్తున్నాను. కరోనా వల్ల ఉపాధి పోయిందనే బాధ లేదు గానీ కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలీక తల్లడిల్లిపోయాను. ఇప్పుడు నా కష్టమే నాకు దిక్కని అనుకుంటున్నా. పని ఏదైనా సంతృప్తిగానే చేస్తున్నాను. కానీ ఈ కష్టానికి అలవాటుపడాలంటే, సమయం పడుతుంది అన్నారు” వెంకటయ్య.

వెంకటయ్య పుస్తకాలు

అక్కరకు రాని...అపార జ్ఞానం

డాక్టర్ వెంకటయ్య చదువు, జ్ఞానానికి తగిన అవకాశాలు ఆయనకు రావడం లేదని తవ్వారుపల్లె ప్రజలు భావిస్తున్నారు. తమ ఊళ్లో ఒక ఉన్నత విద్యావంతుడు పొలం పనులకు వెళ్తుండడం చూస్తుంటే బాధగానే ఉంటుందని చెబుతున్నారు.

ఆయనకు మంచి అవకాశం రావాలని తాము కోరుకుంటున్నట్లు గ్రామస్థుడు కిరణ్ బీబీసీతో చెప్పారు.

“అవకాశాలు రాక వెంకటయ్య అలా ఉండిపోయారు. లేదంటే డిగ్రీ చదివేటప్పుడే ఆకాశవాణిలో కథలు వినిపించిన వెంకటయ్య ఎంతో రాణించేవారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా పోవడం బాధాకరం. ఇప్పటికయినా ఆయన అర్హతలకు తగిన ఉపాధి చూపిస్తే బాగుటుంది. డాక్టరేట్ ఉన్న వ్యక్తి పొలంలో పార పట్టడం చూస్తుంటే మాకు కూడా కష్టంగానే ఉంది. వెంకటయ్య పరిస్థితిపై ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నాం” అన్నారు.

సాహిత్య పరిశోధనలో సత్తా చాటి, డాక్టరేట్ కూడా సాధించిన వెంకటయ్య చివరకు కరోనా వల్ల ఉన్న చిన్న ఉద్యోగం కూడా పోగొట్టుకున్నా, ధైర్యంగా పరిస్థితులను ఎదర్కోగలనని ధీమాగా ఉన్నారు.

త్వరలోనే అంతా సర్థుకుంటుందని, తర్వాత మరో నాలుగైదు పుస్తకాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెబుతున్నారు.

మనోబలంతో పరిస్థితులను ఎదుర్కొంటున్న వెంకటయ్య తమలో చాలామందికి ఆదర్శం అని గ్రామస్థులు చెబుతున్నారు. ఆయనకు తగిన గుర్తింపు దక్కాలని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)