కరోనావైరస్: ఆర్థిక సంక్షోభం గట్టెక్కటానికి మన్మోహన్ సింగ్ చెప్పిన మూడు సలహాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ మహమ్మారి వలన దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే ఇండియా వెంటనే మూడు చర్యలు తీసుకోవాలని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సూచించారు.
భారతదేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ప్రఖ్యాతిగాంచిన డా. మన్మోహన్ సింగ్ ఈ వారం బీబీసీతో మాట్లాడారు. కోవిడ్-19 కారణంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డా. సింగ్‌తో ముఖాముఖి మాట్లాడడం కుదరలేదు. ఈమెయిల్ ద్వారా ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
కుదేలైన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోవాలంటే మూడు ముఖ్యమైన విధానాలు పాటించాలని ఆయన తెలిపారు.
ఒకటి - "దేశ ప్రజల జీవనోపాధికి రక్షణ కల్పించి, ప్రత్యక్ష నగదు సహాయం ద్వారా వారి కొనుగోలు శక్తిని మెరుగుపరచాలి".
రెండు - వ్యాపారాలకు తగినంత మూలధనం అందుబాటులో ఉండేలా "ప్రభుత్వ పరపతి హామీ పథకాలను" రూపొందించాలి.
మూడు- "సంస్థాగత స్వయంప్రతిపత్తిని" కల్పించడం ద్వారా ఆర్థిక రంగాన్ని మెరుగుపరచాలి.

ఫొటో సోర్స్, AFP
కోవిడ్-19 వ్యాపించకముందే భారత ఆర్థిక వ్యవస్థ కుంటుపడడం మొదలయ్యింది. 2019-20 లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 4.2% గా నమోదయ్యింది. గత దశాబ్దకాలంలో ఇదే అత్యంత తక్కువ వృద్ధిరేటు.
కరోనావైరస్ కారణంగా ప్రకటించిన లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత ఇప్పుడిప్పుడే దేశంలో ఆర్థిక వ్యవహారాలు మళ్లీ పుంజుకుంటున్నాయి.
అయితే కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. గురువారంనాటికి, భారతదేశం 20 లక్షల కోవిడ్ -19 కేసులను దాటిన మూడవ దేశంగా నిలిచింది.
2020-21 సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. 1970ల తరువాత ఇంతటి సంక్షోభం రాలేదని అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఆర్థికమాంద్యం లాంటి పదాలను ఉపయోగించడం నాకిష్టం లేదు కానీ తీవ్రమైన, దీర్ఘకాలికమైన సంక్షోభం తలెత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది” అని డా. సింగ్ అన్నారు.
"మానవతా సంక్షోభం వల్లే ఆర్థికవ్యవస్థ కుదేలయ్యింది. ఆర్థిక గణాంకాలు, విధానాలకంటే మన సమాజంలోని విశ్వాసాల నేపథ్యంలో ప్రస్తుత కుంగుబాటుని పరిశీలించాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటుపై ఆర్థికవేత్తల మధ్య ఏకాభిప్రాయం ఉన్నట్టు కనిపిస్తోందని, అదే గనక నిజమైతే స్వతంత్ర భారత చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని డా. సింగ్ అన్నారు.
“అయితే ఈ ఏకాభిప్రాయం తప్పవ్వాలని నేను కోరుకుంటున్నాను" అని ఆయన అన్నారు.
కోవిడ్-19 కారణంగా మార్చిలో ప్రకటించిన లాక్‌డౌన్ తొందరపాటు నిర్ణయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. వలసకూలీల సంక్షోభాన్ని అంచనా వేయలేకపోయారని ఆరోపిస్తున్నారు.
మిగతా దేశాలన్ని ఏం చేసాయో ఇండియా కూడా అదే చేసిందని, ఆ పరిస్థితుల్లో లాక్‌డౌన్ అనివార్యమని డా. సింగ్ అభిప్రాయపడ్డారు.
"కానీ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన విధానం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. అకస్మాత్తుగా, ముందస్తు ప్రణాళికలు లేకుండా లాక్‌డౌన్ ప్రకటించించడం ఆలోచనారహితమే కాకుండా అమానుషం కూడా" అని డా. సింగ్ అన్నారు.
"ఇలాంటి పబ్లిక్ హెల్త్ సమస్యలకు స్థానిక అధికారులు, నిర్వాహకులు మెరుగైన పరిష్కారాలు చూపించగలుగుతారు. కేంద్ర ప్రభుత్వం సూచనలిస్తూ, అవసరమైన సహాయం అందిస్తే చాలు. కోవిడ్-19పై పోరాటాన్ని మొదట్లోనే రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పజెప్పి ఉంటే బావుండేది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దాదాపు 20 యేళ్ల క్రితం, 1991 ఆర్థిక సంక్షోభం తరువాత డా. సింగ్ ఆర్థిక సంస్కరణలను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు.
"1991 సంక్షోభం అంతర్జాతీయ కారకాలవలన తలెత్తిన దేశీయ సంక్షోభం. కానీ ప్రస్తుత సంక్షోభం అసాధారణమైనది. దీని స్థాయి, ప్రభావం ఊహించలేనంత తీవ్రమైనది."
"రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ప్రపంచమంతా ఇలా ఏకకాలంలో మూసేయలేదు" అని డా. సింగ్ అన్నారు.
ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికిగానూ ఏప్రిల్‌లో బీజేపీ ప్రభుత్వం 266 బిలియన్ డాలర్ల (దాదాపు 170 కోట్లు) ఉద్దీపనను ప్రకటించింది. భారత సెంట్రల్ బ్యాంక్ కూడా తాత్కాలిక రుణ మాఫీ, రేట్ల తగ్గింపును ప్రకటించింది.
పన్నుల ద్వారా వచ్చే ఆదాయం క్షీణిస్తుండడంతో నగదు కొరత అధికంగా ఉన్న సమయంలో ప్రత్యక్ష నగదు బదిలీలకు నిధులు సమకూర్చగలగడం, కుంటుపడుతున్న బ్యాంకులకు మూలధనాన్ని సమకూర్చడం, వ్యాపారస్తులకు రుణాలు అందజేయడంలాంటివన్నీ ప్రభుత్వం ఎలా నిర్వహించగలదనే అంశంపై ఆర్థికశాస్త్ర నిపుణుల మధ్య చర్చ నడుస్తున్నది.
వీటన్నిటికీ జవాబు ‘ప్రభుత్వ రుణాలు’ అని డా. సింగ్ అన్నారు. "అధిక రుణాలు తప్పవు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్యం, జాతీయ భద్రతకు సంబంధించిన సవాళ్లు ఎదుర్కోడానికి జీడీపీకి అదనంగా 10% ఎక్కువ ఖర్చు పెట్టాలన్నా సరే రుణాలు తీసుకోకతప్పదు" అని చెప్పారు.
"జీడీపీలో ప్రభుత్వ రుణ నిష్పత్తి (డెబ్ట్ టు జీడీపీ) పెరిగినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజల ఆరోగ్యం, జాతీయ భద్రత మెరుగుపడతాయనుకున్నప్పుడు రుణాలు తప్పవు. రుణాలు తీసుకోవడానికి మొహమాటపడక్కర్లేదు. కానీ వాటిని ఎలా ఉపయోగిస్తున్నామన్న విషయంలో కచ్చితమైన అవగాహన, ప్రణాళిక ఉండాలి" అని ఆయన పేర్కొన్నారు.
"ఇంతకుముందు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాక్‌లాంటి అంతర్జాతీయ సంస్థలనుంచీ రుణాలు తీసుకోవడం దేశ ఆర్థిక బలహీనతను సూచిస్తుంది కానీ ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే ఇండియా స్థానం బలపడింది. కాబట్టి రుణాలు తీసుకోవడం ఎంతమాత్రం బలహీనతను సూచించదు" అని అభిప్రాయపడ్దారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి నగదు అచ్చు వేయడం ఒక విధానంగా అనేక దేశాలు భావిస్తున్నప్పటికీ, దానివల్ల డబ్బు సరఫరా పెరిగి ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందేమోననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
"అభివృద్ధి చెందిన దేశాల్లో అదనపు డబ్బు సరఫరా వలన పెరిగే ద్రవ్యోల్బణం ఒక సమస్య కాదుగానీ ఇండియాలాంటి దేశాల్లో అదనపు ద్రవ్య ముద్రణ వాణిజ్యం, ద్రవ్యోల్బణంపై ప్రభావాన్ని చూపిస్తుంది. ద్రవ్యలోటును పూడ్చడానికి మరింక ఏ అవకాశమూ లేనప్పుడు చివరి ప్రయత్నంగా నగదు ముద్రణ చేపట్టాలని" డా. సింగ్ సూచించారు.
ప్రపంచంలోని కొన్ని దేశాలను అనుకరిస్తూ దిగుమతులపై అధిక పన్నులు, వాణిజ్య అవరోధాలను విధించడం దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేయదని హెచ్చరించారు.
గత మూడు దశాబ్దాలుగా భారత వాణిజ్య విధానం దేశంలోని అన్ని వర్గాలకూ ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టిందని డా. సింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గత మూడు దశాబ్దాలలో ఆసియాలో మూడవ పెద్ద దేశంగా ఎదిగిన భారత్ ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ కరోనావైరస్ అనంతరం బలంగా కోలుకుంటుందా లేదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ...
"1990లలో కన్నా ప్రస్తుతం ఇండియా జీడీపీ 10 రెట్లు ఎక్కువ. అప్పటినుంచీ ఇప్పటివరకూ 30 కోట్ల జనాభాను పేదరికం నుంచీ బయటకు తీసుకువచ్చింది. ఇండియా అంతర్గతంగా బలమైన వ్యవస్థగా ఎదిగింది. కాబట్టి ఈ సంక్షోభం నుంచీ బయటపడగలదని” ఆశాభావం వ్యక్తం చేసారు.
భారత ఆర్థిక వ్యవస్థ బలపడడానికి ముఖ్య కారణం విదేశీ వాణిజ్యం గణనీయంగా పెరగడం అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం. గత మూడు దశాబ్దాలలో ప్రపంచంలోని ఇతర దేశాలతో భారత వాణిజ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయి. జీడీపీలో, గ్లోబల్ ట్రేడ్ వాటా ఐదు రెట్లు పెరిగింది.
"ఇండియా ఇప్పుడు ప్రపంచ దేశాలతో మునుపుకన్నా ఎక్కువగా కలిసిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పు జరిగినా దాని ప్రభావం భారతదేశంపై కూడా పడుతుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దాని ప్రభావం ఇండియాపై కూడా తీవ్రంగానే ఉంటుంది."
"ఇంతకుముందు వచ్చిన సంక్షోభాలు పూర్తిగా స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి. వీటిని ఆర్థిక విధానాల ద్వారా పరిష్కరించుకోవచ్చు. కానీ ఇప్పుడొచ్చినది ఒక అంటువ్యాధి కారణంగా తలెత్తిన సంక్షోభం. ఇది ప్రజల్లో తీవ్ర భయాన్ని, అనిశ్చితిని కలగజేసింది. ఇప్పుడు మోనెటరీ పాలసీలాంటి ఆర్థిక విధానాలు పరిష్కారం చూపుతాయన్నది సందేహమే" అని డా. సింగ్ అన్నారు.
అంతిమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనావైరస్ ప్రభావం పూర్తిగా అంచనా వెయ్యడం కష్టమే! దీనినుంచీ ప్రపంచ దేశాలన్నీ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు.
ఇవి కూడా చదవండి:
- గౌతమ బుద్ధుడు భారతీయుడు ఎలా అయ్యారు? - భారత్‌ను ప్రశ్నించిన నేపాల్
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- చైనాలోని వీగర్ ముస్లింల సమస్యలపై ప్రపంచ దేశాలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?
- ’గాంధీ కళ్లద్దాల విలువ చెప్పినప్పుడు.. వాటి యజమానికి గుండె ఆగినంత పనైంది’
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- LAC వద్ద చలికాలంలో పహరా కాసేందుకు భారత సైన్యం ఎలా సిద్ధమవుతోంది?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో రియా చక్రవర్తి ఎందుకు విలన్ అయ్యారు?
- అమ్మోనియం నైట్రేట్: విశాఖ రేవుకు జోరుగా దిగుమతులు, విజయవాడలో భారీ నిల్వలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








