భారత సైన్యం LAC వద్ద చలికాలంలో పహరా కాసేందుకు ఎలా సిద్ధమవుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుగల్ ఆర్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్టేషన్ నుంచి రైలు కొద్దిలో మిస్ అయ్యేది. ప్రయాణికులు ఇంకా రైలు ఎక్కుతూనే ఉన్నారు. జనంలో తోసుకుని రైల్లోకి ఎలా ఎక్కాలో అలవాటున్న వాళ్లు ఎక్కేశారు. హఠాత్తుగా మరో ప్రయాణికుల గుంపు వచ్చింది. వాళ్లు కూడా ఆ రైలే ఎక్కాలి. కానీ, వాళ్లు ఎక్కలేకపోయారు. ఎందుకంటే రైలు ఇక ఎక్కువసేపు వేచిచూడలేదు.
గత మూడు నెలలుగా భారత, చైనా సైనికులు రకరకాల ప్రాంతాల్లో అమీతుమీకి సిద్ధమైన తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది..
అయితే, రెండు వైపులా సైనికుల ఉపసంహరణ గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ పేరు బయటపెట్టద్దనే షరతుపై ఇండియన్ ఆర్మీ అధికారి ఒకరు “భారత సైన్యం మన ఉనికిని బలోపేతం చేసుకోడానికి ఆ ప్రాంతానికి పంపించిన అదనపు బలగాలను, ప్రస్తుతానికి అక్కడే ఉంచుతామని చెప్పారని” తెలిపారు.
అంటే, ప్రస్తుతం ఇక్కడున్న సైనిక బలగాలు శీతాకాలంలో కూడా ఇక్కడే ఉండబోతున్నాయి. అది ప్రస్తుత పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది.

ఫొటో సోర్స్, getty Images\Pacific Press
అసలు విషయం ఏమిటి?
లద్దాఖ్‌లో ప్రతి ఏటా వేసవి కాలం మొదలవగానే రహదారులపై మంచు తొలగించే పనులు మొదలవుతాయి. సైనికులకు సరుకులు అందించే పనులు అప్పటి నుంచే మొదలవుతాయి. ఎందుకంటే, చలికాలంలో ఇక్కడ రహదారులు మూసుకుపోతాయి. సైనికులకు అవసరమైన వస్తువులు పంపించడం చాలా కష్టవుతుంది.
వేసవిలో రోడ్డు మార్కంలో లద్దాఖ్ వెళ్లే చాలా మంది ఆ రహదారుల్లో ఒకేలా ఉండే ఆర్మీ వాహనాల భారీ కాన్వాయ్ కచ్చితంగా చూసుంటారు.
చలికాలంలో ఎత్తైన ప్రాంతాల్లో ఉండే సైనికులు నిల్వ చేసుకోవడానికి వాహనాల్లో వస్తువులు పంపిస్తారు. శీతాకాలంలో శ్రీనగర్ నుంచి జోజిలా పాస్, మనాలీ మీదుగా, రోహ్తాంగ్ పాస్ గుండా లద్దాఖ్ చేరుకునే ఈ రహదారులను మంచు భారీగా కప్పేసి ఉంటుంది.
ఈ కాన్వాయ్ ద్వారా సుదూర ప్రాంతాల్లో, లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ), లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) దగ్గర ఉండే అడ్వాన్స్ ఫ్రంట్, సియాచిన్, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్(ఎన్‌జీపీఎల్) దగ్గర మోహరించిన సైనికుల కోసం నిత్యావరాలతోపాటూ ఇంధనం, ఆయుధాలు, మందుగుండు, చలికాలంలో వేసుకునే బట్టలు లాంటివి పంపిస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images\AFP
ఇందులో కొత్తేముంది
సరిహద్దులకు బదులుగా భారత్, చైనాను విభజించే ఎల్ఏసీ దగ్గర ఉండే సైనికుల సంఖ్య ఎల్ఓసీ దగ్గర మోహరించినట్లు భారీగా ఉండదు. అంతే కాదు, ఎల్ఏసీలో కంచె నిర్మాణం, ఫ్లడ్ లైట్స్ లాంటి మౌలిక సదుపాయాలు కూడా ఉండవు.
భారత్, చైనా మధ్య 3488 కిలోమీటర్ల పొడవున్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంది. అది లద్దాఖ్ నుంచి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం మీదుగా అరుణాచల్ ప్రదేశ్ దగ్గర వరకూ ఉంది. ఈ సరిహద్దు మొత్తం ఓపెన్‌గా, విశాలంగా ఉంటుంది. ఇక్కడ రెండు సైన్యాలూ గస్తీ కాస్తుంటాయి. టెక్నికల్ సర్వేలెన్స్ ద్వారా నిఘా పెడతాయి. అందుకే ప్రస్తుత పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి.
ఇండియన్ ఆర్మీ ఉధంపూర్ ఉత్తర కమాండ్ కమాండర్‌గా పనిచేసిన లెఫ్టినెంట్ జనలర్ డీఎస్ హుడా(రిటైర్డ్) అక్కడి పరిస్థితిని చెప్పారు.
“ఇంత భారీ స్థాయిలో, ఇంత పెద్ద ఆపరేషన్ వల్ల ప్రస్తుతం అక్కడున్న సైనికులకే కాదు, అక్కడకు పంపిన అదనపు బలగాలకు కూడా సాయం అందిస్తుంది. తూర్పు లద్దాఖ్‌లో ఇలాంటి ఆపరేషన్ ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. దీనిని అసాధారణంగా మార్చింది అదే” అన్నారు.
“సాధారణంగా ఇది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే మొదలవుతుంది. చలికాలం కోసం స్టాక్ నిల్వ చేసేందుకు ఆర్మీ ఈ సామానుల సరఫరా మొదలుపెడుతుంది. వాటిలో బట్టలు, సరుకుల కాంట్రాక్టులు ఇవ్వడం, వస్తువుల తయారీ, రవాణా ఉంటుంది. నవంబరుకల్లా ఈ వస్తువులను పోస్టుల్లో అందుబాటులో ఉంచాలి” అని ఆయన చెప్పారు.
“లద్దాఖ్‌లో మోహరించిన 14వ కోర్‌లోని 80 వేల మంది సైనికులకు ఇవి సరిగ్గా సరిపోతాయి. కానీ, ఇప్పుడు మన దగ్గర అక్కడ అదనపు బలగాలు కూడా ఉన్నారు. వారికోసం కాంట్రాక్టులు, రవాణా లాంటి అన్ని పనులూ ముందు నుంచే ప్రారంభించాలి. కానీ, ఇప్పుడు అంత సమయం లేదు. అంటే రోడ్డు మార్గం ద్వారా నవంబర్‌లోపు ఈ పనులన్నీ పూర్తి కావాలి. ఆ తర్వాత విమానాల ద్వారా వాటిని చేర్చాల్సి ఉంటుంది” అంటారు హుడా.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు మీకు రైలు కథ అర్థమైందా?
నిజానికి ఈ పరిస్థితి, ప్రస్తుతం తూర్పు లద్దాఖ్‌కు మాత్రమే పరిమితం కాలేదని ఆర్మీ అధికారులు చెబుతున్నారు.
సైన్యానికి చెందిన ఒక రిటైర్డ్ అధికారి దానితో ఏకీభవించారు. భారత్ ఎల్ఏసీ దగ్గర పూర్తి సన్నద్ధతతో ఉంది. మనం లద్దాఖ్‌లో ఒత్తిడి కొనసాగిస్తే, అరుణాచల్ ప్రదేశ్‌లో ఎలాంటి అపార్థాలకూ ఎదురుదెబ్బలు తినకుండా ఉండచ్చు” అన్నారు.
భారీ ప్రయత్నాలు
ఈసారీ లద్దాఖ్‌లో సైనికుల పనితీరు ఎంత భిన్నంగా ఉండబోతోంది అని మేం తెలుసుకోవాలనుకున్నాం. భారత సైన్యం డిప్యూటీ చీఫ్‌గా రిటైరైన లెఫ్టినెంట్ జనరల్ ఎస్‌కే ప్రత్యాల్ లేహ్‌లో ఉన్న 14వ కోర్ కమాండర్‌గా పనిచేశారు. అక్కడ పరిస్థితి గురించి చెప్పారు.
“ఎల్ఏసీ దగ్గర శాంతి సమయంలో తక్కువ సంఖ్యలో ఉండే ఒక ఆర్మీ కంపెనీ(దాదాపు 100 సైనికుల దళం)ని మోహరిస్తారు. ఇప్పుడు ఉద్రిక్తతలు ఉండడం వల్ల ఎల్ఏసీకి దగ్గర సైనికుల సంఖ్య ఎక్కువగా ఉంది. వాళ్లెక్కడికి వెళ్లినా తమతో అన్నీ తీసుకుని వెళ్లాల్సుంటుంది. అంటే, ఇంజనీర్లు, కమ్యూనికేషన్స్, మెడికల్ కోర్ అన్నీ వారితో మూవ్ అవుతాయి” అన్నారు
వస్తువులను సరిహద్దులకు చేర్చడమే కాదు, వాటిని ఎక్కడైనా సురక్షిత ప్రాంతాల్లో స్టోర్ చేయడం కూడా చాలా అవసరం. అది చాలా పెద్ద పని.

ఫొటో సోర్స్, Getty Images
శత్రువుపై దాడికి కాదు, దేశ భద్రత
ఇంత భారీగా సైనికులను మోహరించిన భారత్ చైనామీద దాడి చేయాలని చూస్తోందా. సైన్యం సైనికుల సంఖ్య, వాస్తవిక మోహరింపు గురించి భారత్ పెదవి విప్పడం లేదు. అది ఆశించినదే. అయితే ఎక్కువ మంది సైనికులను మోహరించడాన్ని రక్షణాత్మక చర్యగా పరిగణించాలని, దాడి కోసం అన్నట్లు దానిని చూడకూడదని నిపుణలు చెబుతున్నారు.
“లద్దాఖ్‌లో చలి తీవ్రంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు పడిపోతాయి. మంచు 40 అడుగుల వరకూ పేరుకుపోతుంది. అక్కడ చలికాలంలో గస్తీ కాయాలంటేనే కష్టంగా ఉంటుందనే విషయం మనం తెలుసుకోవాలి. మనం యుద్ధం ప్రారంభించాలని అనుకోవడానికి ఇది కచ్చితంగా తగిన సమయం కాదు” అని ప్రత్యాల్ అన్నారు.
భారత సైన్యం మిగతా సమయాలతో పోలిస్తే, ఇప్పుడు పూర్తిగా సర్వ సన్నద్ధంగా ఉంది. అందుకే, అవసరమైతే వెంటనే రంగంలోకి దించడానికి అక్కడకు అదనపు బలగాలను పంపించారు. అని చెప్పారు.
జనరల్ హుడా కూడా దీనితో ఏకీభవించారు. “శత్రువు మరింత ముందుకు రాకుండా అడ్డుకోవడానికే బలగాలను మోహరించారు. నాకు తెలిసినంత వరకూ చైనా ఇప్పటికీ మన ముందు ఒక పెద్ద దళంతో నిలిచుంది” అన్నారు.
ఇంకా ఎన్నో ఆందోళనలు
ఈ సరిహద్దుపై నిఘా పెట్టడానికి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)ను ఏర్పాటుచేశారు. అందుకే ఏడాదంతా దానిని ఎల్ఏసీకి దగ్గరగా మోహరించి ఉంటారు.
ఐటీబీపీ మాజీ ఐజీ జయవీర చౌధరికి ఆ ప్రాంతంలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది.
“భారీ సంఖ్యలో ఎల్ఏసీకి చేరుకున్న సైనికులకు అవసరమైన సరుకులు అందించడం చాలా సవాలుతో కూడుకున్నదనేది నిరూపితం కాబోతోంది. దాని హ్యూమన్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అది ఒక డ్యూటీ. సవాళ్లు ఎవరినీ అడ్డుకోలేవు. ప్రతిసారీలాగే, ఈసారి కూడా కష్టాలున్నా మనం అలా చేయక తప్పదు” అన్నారు.
సైన్యంలో 14వ కోర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థాయిలో పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ కులకర్ణి(రిటైర్డ్) మరో విషయాన్ని గుర్తు చేశారు.
“భారత్, చైనా సైనికుల మధ్య చాలాసార్లు ఎల్ఏసీలో గస్తీ కాసే సమయంలో గొడవలు వస్తుంటాయి. అలా జరిగినప్పుడు తక్షణం వాటిని పరిష్కరిస్తారు. ఇప్పుడు ఈ మోహరింపుతో అది మారిపోయింది. ఇప్పుడు రెండు వైపులా ఏ ఘటన జరిగినా కావాలనే చేసినట్లు అనుకుంటారు. అది ఈ సమస్యను మరింత జటిలం చేస్తుంది” అన్నారు.
“ఇక్కడ వారికి బట్టలు అందించడం, షెల్టర్లు, వాటి తయారీ కెపాటిసీకి సంబంధించి ముఖ్యమైన సవాలు ఎదురవుతోంది. సైనికులకు మాత్రమే కాదు, ఎక్విప్‌మెంటుకు కూడా షెల్టర్ల అవసరం ఉంటుంది. ట్యాంకులు, ఆర్ముడ్ పర్సనల్ కారియర్స్ లాంటి వాటిని మనం అలా బయటే వదిలేయలేం కదా” అంటారు హుడా.

ఫొటో సోర్స్, PACIFIC PRESS
ఆర్మీకి అండగా ఎయిర్ ఫోర్స్
ఆర్మీకి సాయం అందించేందుకు భారీ స్థాయిలో రవాణా విమానాలు, హెలికాప్టర్లు కూడా మోహరించారు. అలా భారత వైమానిక దళం కూడా ఈ మొత్తం ఆపరేషన్‌లో పాల్గొంటోంది.
దీనిపై ఎయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహాదూర్(రిటైర్డ్) బీబీసీతో మాట్లాడారు.
“ఈసారీ ఈ ప్రాంతానికి నేరుగా వెళ్లే ఫ్లైట్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఐఏఎఫ్ రవాణా యూనిట్ సేవలు అందిస్తాయి. లేహ్, థోయిస్ మన ప్రధాన బేస్‌లు. అక్కడి నుంచి మన ఆర్మీకి సపోర్ట్ అందిస్తాం. మన దగ్గర సీ17, ఐఎల్ 76, సీ130జే, ఎఎన్32 లాంటి తిరుగులేని సామర్థ్యం ఉన్న విమానాలు ఉన్నాయి. మనకు ఎంఐ17 వీ5, చేతక్, చీతా లాంటి హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. అవి ఐఏఎఫ్, ఆర్మీ ఏవియేషన్ రెండింటితో కలిసి పనిచేస్తాయి” అని తెలిపారు.
ఫండింగ్ ఎలా జరుగుతుంది
వీటితోపాటు ఈ సమయంలో అత్యవసరమైనది మరొకటి ఉంది. వ్యయం కూడా భారీగా పెరుగుతుంది.
కానీ, మే 15న ఒక వెబినార్‌లో ప్రసంగించిన ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే వ్యయంలో కోత విధిస్తామని చెప్పారు.
“ఖర్చులను తగ్గిస్తాం. మనం ఎలా కోతలు పెట్టుకోవచ్చు అనేది ఈ ఏడాది మొత్తం చూడాలి. ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించవచ్చు అనేదానిపై, మేం కొన్ని రంగాలను గుర్తించాం” అన్నారు.
“అయితే, ఎల్ఏసీ దగ్గర అప్పటికీ, ఇప్పటికీ చాలా వేగంగా మార్పులు జరిగాయి. ప్రభుత్వం భారత సైన్యం కోసం ఒక కేటాయించిన బడ్జెట్ పెంచాలని ఆర్మీలో దాదాపు ప్రతి అధికారి కోరుకుంటున్నారు” అని నరవణే చెప్పారు..
గత నెలలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) వార్షిక బడ్జెట్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ పెద్ద మొత్తంలో పెంచిన తర్వాత ప్రభుత్వం ఉద్దేశం ఏంటి అనే సంకేతాలు వచ్చాయి. బీఆర్ఓ సరిహద్దు ప్రాంతాల్లో కీలక మౌలిక సదుపాయాలైన రహదారులను నిర్మించడంలో నిమగ్నమై ఉంది.
చివరగా, భారత్ మరో విషయంలో కూడా కొత్త దారిలో వెళ్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖ విదేశీ వెండర్లకు పోటీగా భారతీయ వెండర్లకు కాంట్రాక్టర్లు ఇవ్వడం ప్రారంభించింది. దీనివల్ల వస్తువులు తక్కువ సమయంలో తయారై, చేరాల్సిన ప్రాంతాలకు త్వరగా చేరుకుంటాయి.
“స్థానిక వెండర్లకు ఇచ్చే కాంట్రాక్టులు 2015-16లో 39 శాతం ఉంటే, అవి ఇప్పుడు 2019-20లో 75 శాతానికి పెరిగాయ”ని మార్చిలో రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ కొత్త మ్యాప్ గురించి చైనా ఎందుకు నోరు మెదపలేదు
- భారత్-చైనా సరిహద్దుల్లో భారీ రవాణా సదుపాయాలు ఎందుకు నిర్మిస్తున్నారు?
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కేరళలో ఎయిరిండియా విమాన ప్రమాదం: కోళికోడ్‌లో ల్యాండవుతూ జారడంతో దుర్ఘటన... 17 మంది మృతి
- ఏడుగురు ఫ్రెండ్స్ చనిపోయారు.. నేను చనిపోయినా బాగుండేది’
- అమ్మోనియం నైట్రేట్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరం
- 'నా భర్త నన్ను కొడుతుంటే అందరూ ఇది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








