చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్... మధ్యలో బలూచిస్తాన్

చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, చైనా ప్రధాని షీ జిన్ పింగ్
    • రచయిత, సరోజ్ సింహ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైనా-పాకిస్థాన్‌ల మధ్య స్నేహం ఈనాటిది కాదు. వాణిజ్య బంధం ద్వారా రెండు దేశాలు మరింత సన్నిహితం కావాలని కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా-పాకిస్థాన్ కారిడార్‌ను ప్రకటించాయి.

2015లో ఏర్పాటు చేసిన ఈ కారిడార్‌ను రెండు దేశాలు గేమ్‌ చేంజర్‌గా ప్రకటించాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు 2008లోనే పునాది పడింది.

ఈ ప్రాజెక్టును పాకిస్థాన్‌ ద్వారా తన ప్రయోజనాలకు వాడుకునేందుకు చైనా చేసిన ప్రయత్నమని కొందరు నిపుణులు చెబుతుండగా, ఇది పాకిస్థాన్‌లో పంజాబ్‌లాంటి ధనిక రాష్ట్రాలకు మాత్రమే ప్రయోజనకారిగా ఉంటుందని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ కారిడార్‌లో చాలా భాగం పూర్తయింది. ఇంకా పనులు జరుగుతున్నాయి. మధ్యలో కొన్ని ఆర్ధిక సమస్యలు వచ్చాయి. కొన్నిసార్లు పాకిస్థాన్‌వైపు నుంచి సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా బలూచిస్తాన్ వ్యవహారం చైనాకు ఇబ్బందిగా మారింది.

सीपेक

ఫొటో సోర్స్, Getty Images

సెపెక్ అంటే ఏంటి?

చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌నే సంక్షిప్తంగా సెపెక్( CPEC) అని పిలుస్తున్నారు. ఇది చైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ బిజినెస్ నెట్‌వర్క్‌లో భాగం. సెపెక్ ఆధ్వర్యంలో పాకిస్థాన్‌లో అనేక మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

ఇందులో చైనా 62 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. తన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టులో దీన్ని అత్యంత కీలకమైనదిగా భావిస్తోంది చైనా. ఇది విజయవంతం కావడం ఆ దేశానికి చాలా ముఖ్యం.

మధ్య ఆసియా నుంచి అనేక శక్తి వనరులను కూడగట్టుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని జేఎన్‌యూలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో పని చేస్తున్న ప్రొఫెసర్ స్వరణ్ సింగ్ అన్నారు. ''సింగపూర్‌ సమీపంలోని మలక్కా జల ఒప్పందం గురించి చైనా ఆందోళన చెందుతోంది. భవిష్యత్తులో వనరులు కూడగట్టుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావచ్చని భావిష్తున్న ఆ దేశం వివిధ మార్గాలను ఎంచుకుంటోంది'' అని స్వరణ్ సింగ్ అన్నారు.

గ్వాదర్ పోర్ట్‌ ద్వారా చైనా ఇప్పటికే ఒక మార్గాన్ని సిద్ధం చేస్తోందని స్వరణ్‌ సింగ్ చెప్పారు. గత మూడు దశాబ్దాలుగా సాగుతున్నప్పటికీ ఈ ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాలేదని స్వరణ్‌ సింగ్‌ అన్నారు. ఈ నౌకాశ్రయంలోకి ఓడల రాకపోకలు ఇంకా ప్రారంభం కాలేదు. దీనికి కారణం బలూచిస్తాన్ ప్రజల తిరుగుబాటేనని స్వరణ్‌ సింగ్ అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

బలూచిస్తాన్ ప్రజలతో ఇబ్బంది ఏంటి?

పాకిస్థాన్‌లో చైనా పెట్టుబడులకు ప్రధానమైన అవరోధం బలూచిస్తాన్. ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న గ్వాదర్ పోర్ట్‌ ప్రాజెక్టు విషయంలో పాకిస్థాన్ ఈ ప్రాంత నాయకత్వం అభిప్రాయాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు.

ఈ ప్రాజెక్టు వల్ల పాకిస్థాన్ ప్రభుత్వానికి లేదంటే పంజాబ్‌లాంటి ఇతర ప్రావిన్సులకు తప్ప తమకు ఎలాంటి ప్రయోజనం లేదని, తమ వనరులను దోచుకుంటున్నారని బలూచిస్తానీల నుంచి వాదన వినిపిస్తోంది. సెపెక్‌ వల్ల తమకు ఒనగూరేది ఏమీ లేదని బలూచీలు భావిస్తున్నారని స్వరణ్ సింగ్ అన్నారు.

ఈ ప్రాంతాన్ని చైనా పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటుందని, వనరులను స్థానికులు వినియోగించుకునే అవకాశం లేకుండా చేసే ప్రమాదముందని ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగానే సిపెక్‌ను బలూచీలు వ్యతిరేకిస్తున్నారు. ఇది బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా మారిపోయింది.

అయితే, గ్వాదర్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పోర్టుకు కొత్త యంత్రాలు వస్తున్నాయి. రోడ్లు, కొత్త భవనాలు,కాలనీలు నిర్మిస్తున్నారు. కానీ గ్వాదర్‌వాసులు మాత్రం మంచి నీటి కోసం అల్లాడుతున్నారు. నగరంలో ఆకాడ్ ఆనకట్ట నుండి ఏడాది మొత్తంలో కొన్ని వారాలు మాత్రమే మంచి నీరు అందుతుంది. ఇది స్వచ్ఛమైన నీరు లభించే ఏకైక వనరు.

''ఇక్కడ లభించే ఉపాధి అవకాశాలలో తమకు సమాన వాటా లభించదన్నది స్థానిక ప్రజల భయం. కానీ పాకిస్థానీలు దీన్ని ఒప్పుకోవడం లేదు'' అని స్వరణ్ సింగ్ అన్నారు.

గ్వాదర్ పోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఒప్పుకోని పాకిస్తాన్

అయితే బలూచిస్తానీలు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉన్నారన్న వాదనను సౌత్ ఏషియన్ స్ట్రాటజిక్ స్టెబిలిటీ యూనివర్సిటీకి డైరక్టర్ జనరల్‌గా పని చేస్తున్న డాక్టర్ మరియా సుల్తానా అంగీకరించడం లేదు. ఈ కారిడార్ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలను ఆమె నిశితంగా గమనిస్తున్నారు. బలూచిస్తానీలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించకపోగా, సహకరిస్తున్నారని ఆమె అంటున్నారు. సెపెక్‌కు బలూచిస్తాన్ అడ్డంకి అన్నప్పుడు ఎంత శాతంమంది దీనికి వ్యతిరేకంగా ఉన్నారో కూడా గమనించాలని ఆమె అంటున్నారు.

ఎవరో కొందరు అతివాద గ్రూపులకు చెందిన వ్యక్తులు తప్ప బలూచిస్తాన్ నుంచి వ్యతిరేకత పెద్దగా లేదని ఆమె అంటున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తాము ఆర్ధికంగా అభివృద్ధి చెందుతామని ఎక్కువమంది బలూచీలు నమ్ముతున్నారని డాక్టర్ మరియా అంటున్నారు. ఈ ప్రాజెక్టు మూడు రూట్లలో ఉంటుంది. ఒకటి వెస్ట్రన్ రూట్, రెండోది సెంట్రల్ రూట్, మూడోది ఈస్ట్రన్ రూట్. ఈ మూడింటిలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. ఎనర్జీ కారిడార్ వచ్చిన తర్వాత అందులో అనేక ప్లాంట్లను ఏర్పాటు చేసే పని కూడా పూర్తయింది.

సెపెక్‌ కేవలం రహదారిగానే చాలమంది చూస్తున్నారని, ఓ రైలు మార్గం, ఒక పైప్ లైన్ ఈ ప్రాజెక్టులో భాగమని డాక్టర్ మరియా సుల్తానా చెప్పారు.

ఈ ప్రాజెక్టులో ఇప్పటికే మొదటి ఐదేళ్లు పూర్తయ్యాయి. అనేక రహదారులు వివిధ భూభాగాల గుండా వెళతాయి. మొదట దీనిని పంజాబ్ ప్రాంతంలో నిర్మిస్తారని భావించారు. తర్వాత బలూచిస్తాన్లో నిర్మిస్తారని అన్నారు. కానీ రెండూ జరగలేదు.

చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌లో 90శాతం మౌలిక సదుపాయాల పనులు పూర్తయ్యాయని డాక్టర్‌ మరియా సుల్తానా బీబీసీతో అన్నారు. రోడ్డు మార్గాన్ని మరికొన్ని చోట్ల అనుసంధానించాల్సి ఉందని, ఆ పని కూడా వేగంగా జరుగుతోందని ఆమె అన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ మొదటి దశకు సంబంధించినవి. వీటిని మొదటి ఐదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంది. తదుపరి ప్రారంభం కాబోయే ఎనర్జీ ప్రాజెక్టులలో తనకు ఏది అనుకూలమో, లాభదాయకమో పాకిస్థాన్ నిర్ణయించుకుని పాకిస్థాన్ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.

ఈ ప్రాజెక్టుకు, 2018లో చైనా కాన్సులేట్‌పై దాడికి సంబంధం ఉందని డాక్టర్ మరియా సుల్తానా భావించడం లేదు. ఆమె అభిప్రాయం ప్రకారం, బలూచ్ వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ భూభాగం నుంచి కాకుండా యూరప్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థను ఉగ్రవాద గ్రూపుగా పాకిస్థాన్ ఇంతకు ముందే గుర్తించింది.

కరాచీలోని చైనా వాణిజ్య రాయబారి కార్యాలయం 2018లో జరిగిన దాడి దృశ్యం

ఫొటో సోర్స్, XINHUA

ఫొటో క్యాప్షన్, కరాచీలోని చైనా వాణిజ్య రాయబారి కార్యాలయం 2018లో జరిగిన దాడి దృశ్యం

చైనాపై బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ దాడులు

నవంబర్ 2018న కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో చైనా కాన్సులేట్‌పై దాడి జరిగింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దీనికి తానే బాధ్యురాలినని ప్రకటించుకుంది. ఈ ఘటనలో 7గురు మరణించారు. బలూచ్ వేర్పాటువాదులు చైనాను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకు ముందు 2018 ఆగస్టులో కూడా బిఎల్‌ఎ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అంగీకరించింది.

పాకిస్థాన్‌లో ఈ ప్రాజెక్టును రక్షించడానికి ప్రత్యేక సైన్యాన్ని కూడా సిద్ధం చేసింది చైనా. ఒక దేశం మరో దేశంలో తన పెట్టుబడులను రక్షించుకోడానికి సైన్యాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని స్వరణ్ సింగ్ అన్నారు.

చైనా ప్రతిపాదనను పాకిస్తాన్‌ కూడా అంగీకరించింది. స్పెషల్‌ సెక్యూరిటీ డివిజన్‌ అని పిలిచే ఈ సైన్యం చైనా ప్రజలను, చైనా వస్తువులు, ప్రాజెక్టులను రక్షించడానికి అక్కడ సిద్ధంగా ఉంది. చైనాపై బలూచ్ వేర్పాటువాదులు ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఇది కూడా ఒక కారణం.

బలూచ్ వేర్పాటువాదులు సెపెక్‌ను అడ్డుకుంటున్న మాట వాస్తవమేనని, అయితే అదొక్కటే ప్రాజెక్టు ఆలస్యానిక కారణం కాదని ఆక్స్‌ఫర్డ్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన సుశాంత్ శరీన్ అన్నారు. వివిధ కారణాలతో ప్రాజెక్టు ఆలస్యమవుతోందని శరీన్ అభిప్రాయపడ్డారు.

ఈ ప్రాజెక్టులో భాగమైన కొన్ని అంశాలలో మార్పులు చేర్పులు చేపట్టాలని పాకిస్థాన్ కోరుకుంటోంది. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు దేశాల మధ్య ఒప్పందం పూర్తి కావడం లేదు.

బలూచ్ తిరుగుబాటును ఎలా ఎదుర్కోవాలో ఇరు దేశాలకు మొదట ఒక ఆలోచన ఉందని, అందులో భాగంగానే సైన్యం కూడా ఏర్పాటయిందని సుశాంత్ చెప్పారు.

బలూచిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చరిత్ర

బలూచిస్తాన్ లిబరేషన్‌ ఆర్మీ 1970ల నుంచి ఉనికిలోకి వచ్చింది. మాజీ ప్రధాని జుల్ఫికర్‌ అలీ భుట్టో పాలనకు వ్యతిరేకంగా బలూచిస్తాన్లో సాయుధ తిరుగుబాటు మొదలైంది.

అయితే సైనిక నియంత జియావుల్‌ హక్‌ అధికారం చేపట్టాక బలూచ్‌ నాయకులతో చర్చలు జరిగాయి. ఫలితంగా సాయుధ తిరుగుబాటు ముగిసింది. తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా తెరమరుగైంది.

అయితే బలూచిస్తాన్ హైకోర్టు న్యాయమూర్తి నవాజ్‌ మిరి ని హత్య చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి బలూచీల నాయకుడు నవాజ్‌ ఖైర్‌ బక్ష్‌ మిరిని పర్వేజ్‌ ముషారఫ్‌ ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు మరోసారి వేర్పాటువాదులు చెలరేగిపోయారు. పాకిస్థాన్ ప్రభుత్వ భవనాలు, ఆస్తులపై దాడులు జరిగాయి. 2000 సంవత్సరం నుంచి జరుగుతున్న ఈ దాడులు కాలం గడుస్తున్న కొద్దీ దాడులు పెరగడమే కాక, బలూచిస్తాన్ అంతటికీ వ్యాపించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)