'నా అన్వేషణ' అన్వేష్ వివాదం: 'నేను మారిపోయాను, బూతులు మాట్లాడను'

ఫొటో సోర్స్, Anvesh
అన్వేష్.. నా అన్వేషణ.. ఇప్పుడు తెలుగు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఈ పేర్లు. తెలుగులో ఎక్కువ మంది వీక్షించే ట్రావెల్ వ్లాగర్లలో అన్వేష్ ఒకరు. అయితే, తన వీడియోలతో పాటు, ఆ వీడియోల్లో వాడే భాషతో ఆయన తరచూ చర్చల్లో ఉంటారు. విమర్శలూ ఎదుర్కొంటూ ఉంటారు.
మహిళల వస్త్రధారణపై ఇటీవల నటుడు శివాజీ కామెంట్ల వివాదంలో తన వాదన వినిపించే క్రమంలో చెప్పరాని భాష వాడడం, హిందూ దేవతల పేర్లు తీసుకురావడంతో మరోసారి వార్తల్లో నిలిచారు అన్వేష్.
అయితే, ఆయన ప్రవర్తనపై కొంత కాలంగా ఆగ్రహంతో ఉన్న తోటి వ్లాగర్లు కూడా ఈ వివాదంలోకి దిగి, అన్వేష్ చానల్‌ను అన్ సబ్‌స్క్రైబ్ చేయాలంటూ ప్రచారం ప్రారంభించారు. కొందరు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

తాజా వివాదమేంటి?
శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలపై నటి అనసూయ స్పందించారు. తరువాత సినిమా రంగం నుంచే కాక, ఇతర రంగాల్లోని వారు కూడా మహిళల వస్త్రధారణపై మాట్లాడటంతో ఆ వివాదం కొంతకాలం నడిచింది. అన్వేష్ కూడా దీనిపై స్పందించారు.
శివాజీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ, ఆడవారి వస్త్రధారణ వల్ల అఘాయిత్యాలు జరుగుతాయా? అనే వాదనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేశారు.
అయితే, ఆ వీడియోల్లో చెప్పలేని, రాయలేని భాష వాడారు అన్వేష్. పురాణగాథల్లో జరగని ఘటనలు జరిగినట్టు అర్థం వచ్చేలా, సీత, ద్రౌపదిల గురించి వ్యాఖ్యానించారు.
ప్రవచనకారులు గరికిపాటి నరసింహారావు గతంలో ఆడవారి దుస్తుల గురించి మాట్లాడిన దానిపై స్పందిస్తూ ఆయనపై ఘాటైన భాషలో వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఇంకా అనేక ఇతర అంశాలపై మాట్లాడారు.
దీంతో అన్వేష్ వ్యాఖ్యలు మరోసారి తీవ్ర వివాదం సృష్టించాయి.
గతంలో చైనా అభివృద్ధిపై ఆయన చేసిన వీడియోలో చైనా అభివృద్ధిని భారత్‌తో పోల్చి చెప్పడాన్ని తప్పుపడుతూ అప్పట్లో వివాదం రేగింది.
ఇప్పుడు అది మళ్లీ బయటకు వచ్చింది. అన్నింటికీ మించి సీత, ద్రౌపదిల గురించి అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
దానిపై హిందూత్వ సంఘాల వారు పోలీసు ఫిర్యాదులు ఇచ్చారు. ఆ క్రమంలోనే పలువురు తోటి ట్రావెల్ వీడియో బ్లాగర్లు కూడా ఈ అంశంపై స్పందించడం మొదలుపెట్టారు. బయ్యా సన్నీ యాదవ్, రవి అందులో కీలకంగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Instagram/soaringeagletrots
'అన్వేష్ వ్యతిరేక ప్రచారం ఎందుకు చేశామంటే..'
తోటి వ్లాగర్ అన్వేష్ చానల్ సబ్‌స్క్రైబ్ చేయవద్దు అని ప్రచారం చేస్తున్న మరో వ్లాగర్ రవి బీబీసీతో మాట్లాడారు. అన్వేష్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు రవి.
''మూడేళ్ల నుంచి చెబుతున్నాను.. అన్వేష్ హానికరమైన వ్యక్తి అని. ఎవరూ నామాట వినలేదు. ఇన్నాళ్లకు అతని నిజ స్వరూపం జనాలకు తెలిసి వచ్చింది. తాజాగా అతనికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం నేను ప్రారంభించింది కాదు. గతంలో నేను చెప్పినప్పుడు వినలేదు, ఇప్పుడు సమయం వచ్చింది. జనాలు అతని గురించి నిజాలు తెలుసుకుంటున్నారు. అతని బాధితుల్లో నేను ఒకడిని. అతను ఎలా ప్రవర్తించేవాడో చెప్తున్నాను.. అంతే'' అని చెప్పారు రవి.
'అతని నిజ స్వరూపం ఇప్పుడు తెలిసొచ్చింది'
తన తల్లి, భార్యపై తీవ్రమైన చెప్పరాని భాషలో గతంలో అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని రవి చెప్పారు.
''అప్పట్లో అన్వేష్ కంటే నాకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయన్న అక్కసుతో అతను అసత్య ప్రచారాలు చేసేవాడు. నేను 186 దేశాలు తిరగలేదు అనేవాడు. ఆ మాటలు నమ్మి నన్ను చాలా మంది ట్రోల్ చేశారు. తెలుగువాడిని కాదన్నాడు. పాకిస్తాన్ ఏజెంటును అన్నాడు. ఇలా ఎన్నో చేసినా నేను చలించలేదు. చివరకు నా తల్లి, భార్యలపై చాలా దారుణంగా చెప్పరాని భాష వాడాడు. ఇప్పుడు అదే భాష దేవతలపై కూడా వాడాడు. అతని నిజ స్వరూపం ఇప్పుడు తెలిసొచ్చింది. అతను అనేకమంది స్త్రీలను అబ్యూజివ్‌గా మాట్లాడాడు. అందుకే అటువంటి వ్యక్తి నిజ స్వరూపాన్ని బయటపెట్టాలని ప్రచారం చేస్తున్నాను నేను'' అన్నారు రవి.
తానే కాకుండా బయ్యా సన్నీ యాదవ్, ఉమా తెలుగు ట్రావెలర్ కూడా అన్వేష్ బాధితులేనని రవి చెప్పారు.

ఫొటో సోర్స్, Anvesh
'గరికిపాటి విషయంలో తప్పుచేశా'
ఈ వివాదం తరువాత అన్వేష్ మరికొన్ని వీడియోలు చేశారు. కొన్ని వీడియోలలో క్షమాపణ చెప్పారు.
కొందరు కావాలని తనపై వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు. కొందరికి క్షమాపణలు చెప్పారు. కొందరిపై వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చేశారు. మొత్తం వివాదంపై బీబీసీతో కూడా విపులంగా మాట్లాడారు అన్వేష్.
''గరికిపాటి గారి విషయంలో నేను తప్పు చేశాను. వాడిన భాష అసభ్యకరం. నేను మార్చుకుంటాను. కానీ, ఆయన మాట్లాడింది కూడా తప్పే. అంత వయసు, జ్ఞానం ఉన్న వ్యక్తి అమ్మాయిని చూస్తే మూడ్ వస్తుంది వంటి పదాలు వాడడం తప్పు కదా. ఆయన కూడా తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి’’ అని చెప్పారు అన్వేష్.
‘‘ నేను ఎక్కడ తిరిగినా చివరకు భారతదేశమే వస్తాను. నేను భారతీయుడిని. ఇక నా చానల్ అన్ సబ్‌స్క్రైబ్ చేయాలన్న ప్రచారానికి నేను బాధపడను. నేనెవర్నీ సబ్‌స్క్రైబ్ చేయమని గానీ, ఫాలో అవ్వమని గానీ ఎప్పుడూ అడగలేదు. జస్ట్ గో విత్ ఫ్లో కంటెంట్ చేసుకుంటూ పోయాను. పని చేయి, ఫలితం ఆశించకు అన్నట్టు. అడగకుండానే వచ్చారు. చెప్పకుండానే పోయారు. దానికి నేనేం బాధపడను. ఎండ్ ఆఫ్ ద డే.. ఎంగేజ్మెంట్, వ్యూస్, మనీ ఉన్నాయా లేదా అనేది చూస్తాను'' అని బీబీసీకి చెప్పారు అన్వేష్.

ఫొటో సోర్స్, Facebook/Sri Garikipati Narasimha Rao
‘ఇవి పూర్తిగా అర్థరహితమైనవి, కవ్వింపు చర్యలు’
ఈ వివాదంపై ప్రత్యక్షంగా గరికిపాటి నరసింహ రావు ఎక్కడ మాట్లాడలేదు కానీ, డిసెంబర్ 30న, అంటే అన్వేష్ వీడియో విడుదలైన 4 రోజులకు ఆయన కార్యాలయం ఒక ప్రకటన ఇచ్చింది. అందులో అన్వేష్ పేరు ఎక్కడ లేదు.
"గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక వివాదానికి గురువుగారు ఎప్పుడో చెప్పిన మాటలను జోడించి, వక్రీకరించి వివిధ యూట్యూబ్ చానళ్లు లేని సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వ్యూస్ కోసం గురువుగారి మాటలు, ఫొటోలు ఇష్టానుసారంగా వాడుకోవడం పరిపాటి అయిపోయింది. ఇవి పూర్తిగా అర్థరహితమైనవి, కవ్వింపు చర్యలు. గురువుగారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై, ఛానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయం" అని గరికిపాటి సాంకేతిక బృందం పేరుతో ప్రకటన విడుదల అయింది.

ఫొటో సోర్స్, naa_anveshana
'ఇకపై బూతులు మాట్లాడను'
''నేను స్త్రీల హక్కుల కోసం మాట్లాడాను. తాలిబాన్లు ఉన్న దేశంలో కూడా స్త్రీల హక్కుల గురించి మాట్లాడాను. మన దేశంలో ఆడవారిపై అత్యాచారాల గురించి ఎన్నో వీడియోలు చేసి నా చానల్‌లో పెట్టాను.
కాకపోతే ఇక్కడ జెన్ జీ కిడ్స్‌కి దగ్గరవ్వాలని వెకిలిగా, వెకిలి చేష్టలతో, బూతు మాటలతో వాళ్ళని దగ్గర చేసుకొని, వాళ్లకి చదువు ప్రాధాన్యం గురించి చెప్పే క్రమంలో ఏవేవో మాట్లాడాను. వాళ్లని దగ్గర చేసుకొని వాళ్లకు చదువు విలువ నేర్పించాను. కానీ, ఇప్పుడు అవన్నీ సరిదిద్దుకుంటాను.
ఇకపై నేనైతే బూతులు మాట్లాడను, ఆడవాళ్లను అసహ్యంగా చూపించడం జరగదు'' అన్నారు అన్వేష్.
''నేను వివిధ దేశాలు తిరిగే క్రమంలో వివిధ మతాల్ని స్వీకరిస్తుంటాను. నేను ఆ మతంలోకి వెళ్తేనే కదా ఆ మతం గురించి నాకు తెలుస్తుంది. మిషనరీ స్కూల్‌లో చదువుకున్నాను. ఏసుక్రీస్తు అంటే చాలా ఇష్టం. అలాగని హైందవ మతాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఎందుకంటే నాకు మన ఇతిహాసాలు, సనాతన ధర్మం, భగవద్గీత, రామాయణం, మహాభారతంపై అనర్గళమైన పట్టు ఉంది. రీసెంట్‌గా నా చానల్‌లో మహాభారతం 60 రోజులు నాన్ స్టాప్‌గా సింగిల్ టేక్‌తో ఒంటిపూట ఉపవాసంతో చెప్పాను. భక్తి అంటే నాకు పిచ్చి.
అదే సమయంలో ‘సబ్ కా మాలిక్ ఏక్ హై’ అనే సిద్ధాంతంతో ఉంటాను. ఈ మధ్యన ఇరాన్ వెళ్లేటప్పుడు జోరాస్ట్రియన్ మతాన్ని కూడా స్వీకరించాను'' అని వివరించారు అన్వేష్.
"తోటి ట్రావెలర్లతో నాకు శత్రుత్వం లేదు. బెట్టింగ్ యాప్ విషయంలో చాలా మందిని శత్రువులుగా చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మా నాన్నగారు బెట్టింగ్ వల్ల చనిపోవాలి అనుకున్నారు. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని 2020 నుంచి పోరాడుతూనే ఉన్నాను. ఫైనల్‌గా మన దేశం బ్యాన్ చేసింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, naa_anveshana
'ఆ మాట అనకుండా ఉండాల్సింది'
చివరగా సీత, ద్రౌపది వివాదాలపై కూడా బీబీసీతో మాట్లాడారు అన్వేష్.
''నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ద్రౌపది దేవిపై కీచకుడు, సైందవుడు బలాత్కారం చేయబోయి చనిపోయారు. సీతాదేవిని రావణుడు అపహరించుకుపోయాడు అని చెప్పే క్రమంలో రేప్ అనే పదం పొరపాటున దొర్లింది. ఆ తర్వాత కామా పెట్టి సీతాదేవి పేరు వాడి ఉంటే ఈ రచ్చ లేకపోయేది. ఈ రేప్ అనే పదం రాంగ్ గా పోర్ట్రేట్ అయింది. దానికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. మాట దొర్లాం కాబట్టి దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను.
ఈ గొడవల వల్ల నేను నేర్చుకునేది ఒక్కటే. ఇవన్నీ సరిదిద్దుకొని 2026 నుంచి కొత్తగా జీవితం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. అందులో మొదటిది బూతులు మానేయడం. రెండోది…అలాగే ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను" అని తెలిపారు.
- ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
- సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














