''అవును.. మదురో సత్యసాయి బాబా భక్తుడే, పుట్టపర్తికీ వచ్చారు’’

అమెరికా, వెనెజ్వెలా, డోనల్డ్ ట్రంప్, సత్యసాయిబాబా, భక్తులు, భారత్

ఫొటో సోర్స్, satyasai.org

ఫొటో క్యాప్షన్, పుట్టపర్తి సత్యసాయిబాబాను 2005లో మదురో (వృత్తంలోని వ్యక్తి) దర్శించుకున్నప్పటి ఫోటో
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

''అవును.. మదురో సత్యసాయి భక్తుడే. వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, సిలియా ఫ్లోరెస్ 2005లో పుట్టపర్తిలోని సత్య సాయి బాబా ఆశ్రమాన్ని సందర్శించి, బాబా ఆశీర్వాదాలు పొందారు '' అని పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ బీబీసీకి చెప్పారు.

వెనెజ్వెలా రాజధాని కారకస్‌పై జనవరి 3న అమెరికా సేనలు దాడి చేసి అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకున్నాయి.

ఈ క్రమంలో మదురో గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి వచ్చి సత్యసాయిబాబాను దర్శించుకోవడం తెలుగునేలపై చర్చగా మారింది.

‘‘నికోలస్ మదురో పుట్టపర్తి సాయిబాబాను దర్శించుకోవడం నిజమేనని’’ రత్నాకర్‌ బీబీసికి స్పష్టం చేశారు.

''వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, సిలియా ఫ్లోరెస్ 2005లో పుట్టపర్తిలోని సత్య సాయి బాబా ఆశ్రమాన్ని సందర్శించి, బాబా ఆశీర్వాదాలు పొందారు. ఇక్కడికి ఎంతో మంది విదేశీ భక్తులు వస్తుంటారు.ఆ విదేశీభక్తులు ఎవరనేది ఫలానావాళ్లమని వారే చెబితే తప్ప మనకు తెలియదు.

మదురో వచ్చిన సమయంలో ఓ పెద్ద కార్యక్రమం కూడా జరుగుతోంది. అప్పుడు బాబాను వారు లోపలికి వెళ్లి కలిసినట్టు ఉన్నారు. రిక్వెస్ట్ చేసి ఫొటో తీసుకున్నారు. ఆ ఫొటో ఒక్కటే మా దగ్గర ఉంది’’ అని రత్నాకర్ వివరించారు.

‘‘వెనెజ్వెలాలో కూడా బాబాకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అక్కడే కాదు... ప్రపంచ దేశాల్లో బాబా పేరుతో చాలా ఆశ్రమాలు ఉన్నాయి. వాటన్నింటిలో కార్యక్రమాలు జరుగుతుంటాయి.

ఆయన సత్య సాయి బాబాకు భక్తుడు. బాబా బోధనలను అనుసరించేవారు. మదురో తన భవనంలో సత్యసాయి ఫొటో పెట్టుకున్నట్టు కూడా మాకు తెలిసింది'' అని రత్నాకర్ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా, వెనెజ్వెలా, డోనల్డ్ ట్రంప్, సత్యసాయిబాబా, భక్తులు, భారత్

ఫొటో సోర్స్, satyasai.org

ఫొటో క్యాప్షన్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వెబ్‌సైట్, ఫేస్‌బుక్‌లో ఉన్నఫొటోలు, వివరాల ప్రకారం రోడ్రిగ్జ్ 2023 ఆగస్టులో, 2024 అక్టోబర్‌లో పుట్టపర్తికి వచ్చారు.

వెనెజ్వెలా తాత్కాలిక అధ్యక్షురాలు కూడా...

ప్రస్తుత, వెనెజ్వెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ కూడా సత్యసాయి భక్తురాలేనని రత్నాకర్ బీబీసీకి చెప్పారు. ఉపాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమె పుట్టపర్తికి వచ్చారని, సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకున్నారని తెలిపారు.

ఆమె సత్యసాయి సమాధిని దర్శించుకుంటున్న ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వెబ్‌సైట్, ఫేస్‌బుక్‌లో ఉన్నఫొటోలు, వివరాల ప్రకారం రోడ్రిగ్జ్ 2023 ఆగస్టులో, 2024 అక్టోబర్‌లో పుట్టపర్తికి వచ్చారని, ప్రశాంతి నిలయంలోని సమాధి మందిరంలో సత్యసాయి సమాధిని దర్శించుకున్నారని తెలుస్తోంది.

వెనెజ్వెలా, పుట్టపర్తి, మదురో

ఫొటో సోర్స్, satyasai.org

ఫొటో క్యాప్షన్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వెబ్‌సైట్, ఫేస్‌బుక్‌లో ఉన్నఫొటోలు, వివరాల ప్రకారం రోడ్రిగ్జ్ 2023 ఆగస్టులో, 2024 అక్టోబర్‌లో పుట్టపర్తికి వచ్చారు.

రోడ్రిగ్జ్ 2024 అక్టోబర్ 26న పుట్టపర్తికి వచ్చినపుడు ఆమె వెనెజ్వెలా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంటుగా ఉన్నారని, ఆ సమయంలో సత్యసాయి ట్రస్ట్ జారీ చేసిన ఒక ప్రత్రికా ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో ఆమెతో పాటు భారత్‌లోని వెనెజ్వెలా రాయబారి కపాయా రోడ్రిగ్జ్ గాంజాల్వెజ్ కూడా వచ్చారని ఆ ప్రెస్ రిలీజ్‌లో తెలిపారు.

వారిని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్జే రత్నాకర్ ఆహ్వానించారు. 2023లో మాత్రం డెల్సీ రోడ్రిగ్జ్ జీ20 సదస్సుకు హాజరైన వెనెజ్వెలా ప్రతినిధి బృందంలో భాగంగా పుట్టపర్తికి వచ్చారు. అది ఆమె వ్యక్తిగత పర్యటనగా అప్పట్లో చెప్పారు.

మదురో సత్యసాయి భక్తుడుగా ఉన్నారని, ఇటీవల వెనెజ్వెలా ప్రభుత్వం నేషనల్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రచురించిన ఇన్విటేషన్ కార్డులో ఓంను కూడా ముద్రించిందంటూ ఆ ఫోటోలను అరుణ్ పుదూర్ అనే ఒక యూజర్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ అంశాన్ని బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించడం లేదు.

నికోలస్ మదురో

ఫొటో సోర్స్, Getty Images

మదురోను అమెరికా ఎందుకు నిర్బంధించింది?

వామపక్ష అధ్యక్షుడు హ్యూగో చావెజ్, యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజ్వెలా హయాంలో నికోలస్ మదురో ఎదిగారు. గతంలో బస్సు డ్రైవర్‌గా, యూనియన్ నాయకుడిగా పనిచేసిన మదురో, చావెజ్ స్థానంలో 2013 నుంచి అధ్యక్షుడిగా ఉన్నారు.

2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మదురోను విజేతగా ప్రకటించారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం తమ అభ్యర్థి ఎడ్ముండో గోంజాలెజ్ ఉర్రుతియా ఓట్ల లెక్కింపులో భారీ మెజారిటీతో గెలిచారని చెప్పుకొచ్చాయి.

వెనెజ్వెలా నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు రావడానికి మదురో కారణమని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అమెరికాలో పెరుగుతున్న మాదకద్రవ్యాల సరఫరాను, ముఖ్యంగా ఫెంటానిల్, కొకైన్‌ను అరికట్టడంపై దృష్టిసారిస్తామని చెప్పారు . ట్రెన్ డి అరగువా, కార్టెల్ డి లాస్ సోలెస్‌ అనే రెండు వెనెజ్వెలా ముఠాలను 'విదేశీ ఉగ్రవాద సంస్థల' జాబితాలో చేర్చారు.

వీటిలో రెండవ గ్రూపునకు మదురో స్వయంగా నాయకత్వం వహిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ ప్రకటనను మదురో తీవ్రంగా ఖండించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)