వందేళ్ల ఆర్ఎస్ఎస్: ముస్లింలు, క్రైస్తవులపై ఈ సంస్థ వైఖరి ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాఘవేంద్రరావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది.
ఈ వందేళ్లలో ఆర్‌ఎస్‌ఎస్, దాని భావజాలం, కార్యకలాపాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.
కేంద్రంలో 2014లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ ప్రభావం అనేక రెట్లు పెరిగింది. సంఘ్ ఎప్పుడూ లేనంత బలమైన స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది.
అయితే, ఈ వందేళ్ల కాలంలో భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చే విషయంలో సంఘ్ ప్రాధాన్యం, మైనారిటీల పట్ల దాని వైఖరి గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, Getty Images

సాధారణంగా ఆర్ఎస్ఎస్ లేదా సంఘ్ అని పిలిచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 1925లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన ఒక హిందూ జాతీయవాద సంస్థ.
హిందూ జాతీయవాద ఆలోచనాపరుడు వినాయక్ దామోదర్ సావర్కర్ ఆలోచనలతో హెడ్గేవార్ ప్రభావితమయ్యారని అంటుంటారు.
హెడ్గేవార్ కొంతకాలం కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆ తర్వాత సైద్ధాంతిక విభేదాల కారణంగా పార్టీని విడిచిపెట్టి ఆర్ఎస్ఎస్‌ని స్థాపించారు. - (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కా పరిచయ్, మాధవ్ గోవింద్ వైద్య, పేజీలు 11-13)
ఆర్ఎస్ఎస్‌ని ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా పిలుస్తుంటారు. కానీ, దానిలో ఎంతమంది సభ్యులు ఉన్నారనే దానిపై అధికారిక సంఖ్య అందుబాటులో లేదు.
ఆర్ఎస్ఎస్ తనను తాను రాజకీయేతర సాంస్కృతిక సంస్థగా చెప్పుకుంటుంది కానీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి 'సంరక్షకుడిగా' దాని చర్యలుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఆర్ఎస్ఎస్ ప్రకారం.. ఇది హిందూ సంస్కృతి, హిందూ ఐక్యత, స్వావలంబన విలువలను ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేసే సాంస్కృతిక సంస్థ.
జాతీయ సేవ, భారతీయ సంప్రదాయాలు, వారసత్వ పరిరక్షణను ఆర్ఎస్ఎస్ నొక్కి చెబుతోంది.
రాజకీయాలకు అతీతులమని చెప్పుకొంటున్నప్పటికీ, చాలామంది ఆర్ఎస్ఎస్ సభ్యులు రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీలదీ ఆర్ఎస్ఎస్ నేపథ్యమే.
''సమాజాన్ని పరిపాలించే ప్రత్యేక శక్తిగా మారాలని ఆర్ఎస్ఎస్ కోరుకోవడం లేదని, సమాజాన్ని బలోపేతం చేయడమే దాని ప్రధాన లక్ష్యం'' అని ఆర్ఎస్ఎస్ ఆలిండియా పబ్లిసిటీ ఇన్‌చార్జ్ సునీల్ అంబేకర్ తన పుస్తకం "ది ఆర్ఎస్ఎస్: రోడ్ మ్యాప్స్ ఫర్ ది 21 సెంచరీ" (పేజీ 9)లో రాశారు.
అదే పుస్తకంలో 'సంఘ్ సమాజ్ బనేగా (సంఘ్ సమాజం అవుతుంది)' అనేది ఆర్ఎస్ఎస్‌లో తరచుగా ఉపయోగించే నినాదమని అంబేకర్ తెలిపారు.
ఆర్ఎస్ఎస్ ప్రస్తుత చీఫ్ మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ "పనిచేసే ఒక వ్యవస్థ, మరేమీ కాదు" అని చెప్పారు.
ఆయన ప్రకారం.. ఆర్ఎస్ఎస్ "వ్యక్తిత్వ నిర్మాణంపై పనిచేస్తుంది." (భవిష్య కా భారత్—సంఘ్ కా దృష్టికోణ్, పేజీ 19)

ఫొటో సోర్స్, Getty Images

శాఖ అనేది ఆర్ఎస్ఎస్ ప్రాథమిక సంస్థాగత విభాగం, అట్టడుగు స్థాయిలో ఇది పెద్ద ఉనికిగా ఉంటుంది. శాఖ అనేది ఆర్ఎస్ఎస్ సభ్యులకు సైద్ధాంతికంగా, శారీరకంగా శిక్షణ ఇచ్చే ప్రదేశం. చాలా శాఖలు ప్రతి ఉదయం, కొన్నిసార్లు సాయంత్రం జరుగుతాయి. కొన్ని ప్రాంతాలలో ఈ శాఖలు వారానికి కొన్ని రోజులు జరుగుతాయి.
ఆర్ఎస్ఎస్ ప్రకారం.. భారతదేశంలో 73,000 కంటే ఎక్కువ శాఖలున్నాయి. శాఖలోని కార్యకలాపాలలో సమష్టి కృషి, నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరచడానికి రూపొందించిన శారీరక వ్యాయామాలు, ఆటలు, అలాగే కవాతు, ఆత్మరక్షణ పద్ధతులు ఉంటాయి.
ఈ శాఖలోనే ఆర్ఎస్ఎస్ సభ్యులు సైద్ధాంతిక విద్యను పొందుతారు. వారికి హిందూత్వం, హిందూ జాతీయవాదం, ఆర్ఎస్ఎస్ ఇతర ప్రధాన సూత్రాల గురించి బోధిస్తారు. దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ తన ఉనికిని విస్తరించడానికి, కొనసాగించడానికి ఈ శాఖలపై ఆధారపడుతుంది.
ఇందులో ఎలాంటి సభ్యత్వ నమోదు ఉండదని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. శాఖలలో పాల్గొనే వారిని స్వయంసేవకులు (స్వచ్ఛంద సేవకులు) అంటారు.
ఆర్ఎస్ఎస్ ప్రకారం, ఏ హిందూ పురుషుడైనా స్వయంసేవకుడు కావచ్చు. ఎవరైనా సమీపంలోని 'శాఖ'ను సంప్రదించి స్వయంసేవక్ కావచ్చు. స్వయంసేవక్ కావడానికి ఎటువంటి రుసుము, రిజిస్ట్రేషన్ ఫారమ్ లేదా దరఖాస్తు అవసరంలేదు. ఉదయం లేదా సాయంత్రం రోజువారీ శాఖలో పాల్గొనే వారు ఎవరైనా స్వయంసేవక్ అవుతారని ఆర్ఎస్ఎస్ చెబుతోంది.
సమీపంలో పనిచేస్తున్న శాఖ లేదా స్వయంసేవక్ గురించి ఎవరికైనా సమాచారం లేకపోతే, వారు ఆర్ఎస్ఎస్ వెబ్‌సైట్‌లో ఒక ఫారమ్‌ను పూరించవచ్చని, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్‌లో చేరడానికి వీలుగా సమీప శాఖ లేదా స్వయంసేవక్ గురించి సమాచారం అందిస్తారని ఆ సంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

మహిళలు ఆర్ఎస్ఎస్‌లో సభ్యులుగా చేరలేరు.
ఆర్‌ఎస్‌ఎస్ వెబ్‌సైట్‌లోని 'తరచుగా అడిగే ప్రశ్నలు('Frequently Asked Questions)' విభాగంలో.. సంస్థను హిందూ సమాజాన్ని నిర్వహించడానికి స్థాపించారని, ఆచరణాత్మక పరిమితులను పరిగణనలోకి తీసుకుంటే, హిందూ పురుషులు మాత్రమే చేరడానికి అనుమతి ఉందని పేర్కొంది.
ఆర్‌ఎస్‌ఎస్ ప్రకారం, హిందూ మహిళలకు ఇలాంటి సంస్థ అవసరమని భావించి వార్ధా (మహారాష్ట్ర)కు చెందిన లక్ష్మీబాయి కేల్కర్ అనే సామాజిక కార్యకర్త ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్‌ను సంప్రదించారు. ఆయనతో చర్చల తర్వాత 1936లో రాష్ట్ర సేవిక సమితిని ప్రారంభించాలని నిర్ణయించారు. ఆర్‌ఎస్‌ఎస్, రాష్ట్ర సేవిక సమితి లక్ష్యాలు ఒకటేనని, కాబట్టి మహిళలు రాష్ట్ర సేవిక సమితిలో చేరవచ్చని ఆర్‌ఎస్‌ఎస్ సూచించింది.
అయితే, ఆర్‌ఎస్‌ఎస్ తన శతాబ్ది సంవత్సరంలో మహిళా సమన్వయ కార్యక్రమాల ద్వారా భారతీయ ఆలోచన, సామాజిక మార్పులో వారి చురుకైన భాగస్వామ్యాన్ని పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రిజిస్టర్డ్ సంస్థ కాదు. దీంతో ఈ సంస్థకు పారదర్శకత, జవాబుదారీతనం లేదని తరచూ విమర్శలు వస్తున్నాయి. ఆదాయపు పన్ను రిటర్న్‌లను కూడా దాఖలు చేయకపోవడంతో ఆర్ఎస్ఎస్ నిధుల విషయంలో కూడా పారదర్శకతగా లేదనే ఆరోపణలున్నాయి.
అయితే, ఆర్ఎస్ఎస్ స్వయం సమృద్ధి సంస్థ అని, ఒకవేళ బయటివారు డబ్బులు స్వచ్ఛందంగా ఇవ్వాలనుకున్నా తీసుకోదని ఆర్ఎస్ఎస్ అంటోంది. కాషాయ జెండాను గురువుగా భావించి, సంవత్సరానికి ఒకసారి తన స్వచ్ఛంద సేవకులు ఇచ్చే 'గురు దక్షిణ' ద్వారా తన ఖర్చులను సంస్థ భరిస్తుందని ఆర్ఎస్ఎస్ పేర్కొంది.
తన స్వచ్ఛంద సేవకులు అనేక సామాజిక సేవా కార్యకలాపాలలో పాల్గొన్నారని, సమాజం నుంచి సహాయం పొందుతున్నారని ఆర్ఎస్ఎస్ కూడా పేర్కొంది. ఈ సామాజిక కార్యకలాపాల కోసం, స్వచ్ఛంద సేవకులు ట్రస్టులను ఏర్పాటు చేసి, డబ్బును సేకరించి, చట్టపరంగా తమ ఖాతాలను నిర్వహిస్తున్నారని వివరించింది.
గతంలో, అయోధ్యలో జరిగిన కొన్ని వివాదాస్పద భూ ఒప్పందాల సందర్భంలో.. ఆర్ఎస్ఎస్ రిజిస్టర్డ్ కాదని, ఆదాయపు పన్ను పరిధి కింద లేదనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది.
ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ కాకపోవడం గురించి, మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ ప్రారంభమైనప్పుడు భారతదేశంలో స్వతంత్ర ప్రభుత్వం లేదని, స్వాతంత్య్రం తర్వాత ప్రతి సంస్థా రిజిస్టర్ చేసుకోవాలని ఎటువంటి చట్టం చేయలేదని అన్నారు.
భగవత్ ప్రకారం.. ఆర్ఎస్ఎస్ అనేది "వ్యక్తుల సంఘం", అందువల్ల దానిపై పన్ను విధించలేరు.
ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఖాతాలను అడగకపోయినా విశ్వసనీయతను కాపాడుకోవడానికి సంస్థలోని ప్రతి పైసాకు లెక్క ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుందని, ప్రభుత్వం ఎప్పుడు అడిగినా ఆర్ఎస్ఎస్ ఖాతాలు సిద్ధంగానే ఉన్నాయని భగవత్ స్పష్టంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో అత్యున్నత స్థానం సర్‌సంఘ్‌చాలక్ (చీఫ్). తదుపరి ముఖ్యమైన స్థానం సర్‌కార్యవాహ్, ఆయన ఆర్ఎస్ఎస్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి, సంస్థ రోజువారీ వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. ప్రస్తుతం, దత్తాత్రేయ హోసబాలే ఆర్ఎస్ఎస్ సర్‌కార్యవాహ్.
చరిత్రను పరిశీలిస్తే, హెడ్గేవార్ తర్వాత నియమితులైన ఐదుగురు సర్‌సంఘ్‌చాలక్(చీఫ్)లలో నలుగురు సర్‌సంఘ్‌చాలక్ కావడానికి ముందు సర్‌కార్యవాహ్, ఒకరు సహ-సర్‌కార్యవాహ్ బాధ్యతలు నిర్వర్తించారు.
సహ-సర్‌కార్యవాహ్ అనేది ఉమ్మడి కార్యదర్శి(జాయింట్ సెక్రటరీ) పాత్రకు సమానం. ఆర్ఎస్ఎస్‌లో ఒకేసారి అనేకమంది సహ-సర్ కార్యవాహ్‌లు ఉండవచ్చు.
ఆర్ఎస్ఎస్ సంస్థాగత నిర్మాణంలో దేశవ్యాప్తంగా 46 ప్రావిన్సులు, విభాగాలు, జిల్లాలు, ఆపై బ్లాక్‌లు ఉన్నాయి. ఆ సంస్థ ప్రకారం.. 922 జిల్లాలు, 6,597 బ్లాక్‌లు, 27,720 మండలాలలో 73,117 రోజువారీ శాఖలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ పరిధిలోని ప్రతి మండలంలో 12 నుంచి 15 గ్రామాలుంటాయి.
ఆర్ఎస్ఎస్‌కు అనుబంధ సంస్థలు ఉన్నాయి, వీటిని సంఘ్ పరివార్ అని పిలుస్తారు. సంఘ్ పరివార్‌లో భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), స్వదేశీ జాగరణ్ మంచ్, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం, రాష్ట్రీయ సిక్కు సంగత్, హిందూ యువ వాహిని, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్ వంటి సంస్థలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఆర్ఎస్ఎస్కు సర్‌సంఘ్‌చాలక్ (చీఫ్) బాధ్యతలు ఇప్పటివరకు ఆరుగురు నిర్వర్తించారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ 1925 నుంచి 1940 వరకు మొదటి సర్‌సంఘ్‌చాలక్. ఆయన మరణం తరువాత, మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ 1940లో రెండవ సర్‌సంఘ్‌చాలక్ అయ్యారు. ఆయన 1973 వరకు ఆ పదవిలోనే కొనసాగారు.
1973లో గోల్వాల్కర్ మరణం తరువాత బాలాసాహెబ్ దేవరస్ బాధ్యతలు తీసుకున్నారు, 1994 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు. 1994లో దేవరస్ ఆరోగ్యం క్షీణించడంతో రాజేంద్ర సింగ్‌ను తన వారసుడిగా నియమించారు. రాజేంద్ర సింగ్ 2000 వరకు సర్‌సంఘ్‌చాలక్‌గా కొనసాగారు.
2000లో కె.ఎస్. సుదర్శన్ ఆర్ఎస్ఎస్ కొత్త చీఫ్ అయ్యారు, ఆయన 2009 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2009లో మోహన్ భగవత్‌ను తన వారసుడిగా ఎన్నుకున్నారు సుదర్శన్. భగవత్ ఆర్‌ఎస్‌ఎస్‌లో ఆరవ సర్‌సంఘ్‌చాలక్ .
ఆర్‌ఎస్‌ఎస్‌లో సర్‌సంఘ్‌చాలక్‌ను ఎంచుకోవడానికి ఎటువంటి అధికారిక ప్రక్రియ లేదు, ఇది విమర్శలకు తావిస్తోంది. హెడ్గేవార్ తర్వాత వచ్చిన అన్ని సర్‌సంఘ్‌చాలక్‌లను అంతకుముందు ఆ పదవిలో ఉన్నవారే నియమించారు. సర్‌సంఘ్‌చాలక్ పదవీకాలం జీవితాంతం ఉంటుంది, ఆయనే తన వారసుడిని ఎన్నుకుంటారు.
డాక్టర్ హెడ్గేవార్, గోల్వాల్కర్ వంటి గొప్ప నాయకులు ఒకప్పుడు ఈ బాధ్యతను చేపట్టారు కాబట్టే, ఈ పదవిని ఎంతో గౌరవంగా చూస్తారని మోహన్ భగవత్ అంటున్నారు.
"నా తర్వాత ఎవరు సర్ సంఘచాలక్ అవుతారనేది నా నిర్ణయం, నేను ఎంతకాలం సర్ సంఘచాలక్‌గా ఉంటాననేది కూడా నా నిర్ణయమే. ఆర్ఎస్ఎస్‌లో నాకు అధికారం లేదు. నేను ఒక స్నేహితుడిని, మార్గదర్శిని, దార్శనిక ప్రదర్శకుడిని మాత్రమే. సర్‌సంఘచాలక్‌కు వేరే అధికారం ఉండదు. ఆర్ఎస్ఎస్ సర్‌కార్యవాహుడే సంస్థకు ముఖ్య కార్యనిర్వాహక అధికారి, ఆయన చేతుల్లోనే అన్ని అధికారాలు ఉంటాయి. ఆయన నన్ను ఒక పని ఆపివేసి వెంటనే నాగ్‌పూర్‌కు వెళ్లమని చెబితే, నేను వెళ్లాల్సి ఉంటుంది. ఆయన ఎన్నిక ప్రతి మూడేళ్లకు ఒకసారి అధికారికంగా నిర్వహిస్తారు." (భవిష్య కా భారత్—సంఘ కా దృష్టికోణ్, పేజీలు 105-106).

ఫొటో సోర్స్, Getty Images

మహాత్మాగాంధీ హత్యతో తొలిసారిగా ఆర్ఎస్ఎస్‌ని నిషేధించారు. 1948 జనవరి 30న మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపారు.
గాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందని, గాడ్సే ఆ సంస్థ సభ్యుడని ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం అనుమానించింది. ఆర్ఎస్ఎస్‌ను మత విభజనను ప్రోత్సహించే సంస్థగా పరిగణించి, ఫిబ్రవరి 1948లో నిషేధించింది కేంద్రం. ఆర్ఎస్ఎస్ సర్‌సంఘ్‌చాలక్ అయిన గోల్వాల్కర్‌ను అరెస్టు చేసింది.
తదుపరి సంవత్సరం, నిషేధం ఎత్తివేయడంపై గోల్వాల్కర్, కేంద్ర ప్రభుత్వం మధ్య అనేక చర్చలు జరిగాయి.
ఆర్ఎస్ఎస్ రాతపూర్వక, ప్రచురిత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలని, దాని కార్యకలాపాలను సాంస్కృతిక రంగానికే పరిమితం చేయాలని, హింస, గోప్యతను త్యజించాలని, భారత రాజ్యాంగం, జాతీయ జెండా పట్ల విధేయతను చూపాలని ప్రభుత్వం సూచించింది. (ది ఆర్‌ఎస్‌ఎస్: ఎ మెనేస్ టు ఇండియా, ఎ.జి. నూరాని, పేజీ 375)
ఆ సమయంలో సర్దార్ పటేల్, గోల్వాల్కర్ మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. ఈ లేఖలలో ఒకదానిలో గోల్వాల్కర్‌కు ఆర్‌ఎస్‌ఎస్ ప్రసంగాలన్నీ మతపరమైన విషంతో నిండి ఉన్నాయని, ఫలితంగా దేశం గాంధీని కోల్పోవడాన్ని భరించాల్సి వచ్చిందని సర్దార్ పటేల్ రాశారు.
గాంధీ మరణం తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు వేడుకలు జరుపుకొని, స్వీట్లు పంచుకున్నారని నిఘా సంస్థల నుంచి సమాచారం ఉందని సర్దార్ పటేల్ రాశారు.
చివరగా, 1949 జూలై 11న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆ ప్రకటనలో.. "ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు చేసిన మార్పులు, ఇచ్చిన స్పష్టీకరణల దృష్ట్యా, భారత రాజ్యాంగం పట్ల విధేయత, జాతీయ జెండాను గుర్తించడం, గోప్యతను విడనాడటం, హింసను త్యజించడం ద్వారా ఆర్ఎస్ఎస్‌కు ప్రజాస్వామ్య, సాంస్కృతిక సంస్థగా పనిచేయడానికి అవకాశం ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది" అని తెలిపింది. (ది ఆర్‌ఎస్‌ఎస్: ఎ మెనెస్ టు ఇండియా, ఎ.జి. నూరాని, పేజీ 390)

ఫొటో సోర్స్, Getty Images
కానీ, ఎటువంటి షరతులు లేకుండా నిషేధం ఎత్తివేశారని ఆర్ఎస్ఎస్ పేర్కొంది.
1949 అక్టోబర్ 14న బాంబే శాసనసభ సమావేశంలో దీని గురించి ఒక ప్రశ్న అడిగినప్పుడు, ఆర్ఎస్ఎస్‌పై నిషేధాన్ని ఎటువంటి షరతులు లేకుండా ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, ఆర్ఎస్ఎస్ నాయకత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి హామీ ఇవ్వలేదని సంస్థ ఆల్ ఇండియా కో-పబ్లిసిటీ హెడ్ నరేంద్ర ఠాకూర్ సంపాదకీయంలో పేర్కొన్నారు. (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కా దృష్టికోన్, నరేంద్ర ఠాకూర్, పేజీ 25)
1975లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు ఆర్ఎస్ఎస్ సంస్థపై నిషేధం పడింది. 1977లో అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత ఈ నిషేధం ఎత్తివేశారు.
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత, ఆర్ఎస్ఎస్‌ను మూడవసారి నిషేధించారు. అయితే, జూన్ 1993లో జస్టిస్ బహ్రీ కమిషన్ ఈ నిషేధం సరైన చర్య కాదనడంతో కేంద్ర ప్రభుత్వం దానిని ఎత్తివేయవలసి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పై ఒక ప్రధాన విమర్శ ఏమిటంటే, అది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొనలేదని. 1925లో ఆర్ఎస్ఎస్ ఉనికిలోకి వచ్చే సమయానికి, స్వాతంత్య్ర ఉద్యమం ఊపందుకుంది. గోల్వాల్కర్ ప్రకటనలను ఉటంకిస్తూ, ఆర్ఎస్ఎస్ 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనలేదని తరచుగా వార్తలొచ్చాయి.
మరోవైపు, ఆర్ఎస్ఎస్ మాత్రం భారత స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నట్లు పేర్కొంది. 1930 జనవరి 26న ఆర్ఎస్ఎస్ అన్ని శాఖలలో స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుందని, వేలాదిమంది స్వచ్ఛంద సేవకులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని, సంస్థ వారికి బహిరంగంగా మద్దతు ఇచ్చిందని సునీల్ అంబేకర్ తన పుస్తకంలో రాశారు.
శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ఆర్ఎస్ఎస్ పాల్గొన్నట్లు అంబేకర్ పేర్కొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ గురించి విస్తృతంగా పరిశోధించిన ప్రముఖ రచయిత ధీరేంద్ర ఝా ఆర్‌ఎస్‌ఎస్ రెండవ సర్‌సంఘ్‌చాలక్ గోల్వాల్కర్‌పై ఇటీవల ఒక పుస్తకాన్ని ప్రచురించారు.
ఆయన గతంలో నాథూరామ్ గాడ్సే, హిందూత్వపై పుస్తకాలు రాశారు.
ధీరేంద్ర ఝా ప్రకారం.. ఆర్ఎస్ఎస్ పునాది హిందూత్వ సిద్ధాంతం, ఇది "హిందువులకు అతిపెద్ద శత్రువులు ముస్లింలని, బ్రిటిష్ ప్రభుత్వం కాదని చెప్పడానికి ప్రయత్నం చేసింది".
"1930లో గాంధీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఆర్ఎస్ఎస్‌లో గందరగోళం నెలకొంది. సంస్థలోని ఒక వర్గం ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుకుంది. ఆ సమయంలో హెడ్గేవార్ సందిగ్ధంలో పడ్డారు. సంస్థను బ్రిటిష్ వ్యతిరేక మార్గంలో తీసుకెళ్లలేరు, అదేసమయంలో తన సభ్యుల ముందు బలహీనంగా కనిపించకూడదు. కాబట్టి, ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొనదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా వెళ్లాలనుకుంటే వ్యక్తిగతంగా పాల్గొనవచ్చని సూచించారు. అందుకే, ఆయన స్వయంగా తన పదవికి రాజీనామా చేసి, ఎల్బీ పరాంజపేను సర్‌సంఘ్‌చాలక్‌గా నియమించారు, తర్వాత హెడ్గేవార్ జంగిల్ సత్యాగ్రహంలో పాల్గొనడంతో అరెస్టయ్యారు" అని ధీరేంద్ర ఝా తెలిపారు.
1935లో ఆర్ఎస్ఎస్ తన పదో వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్నప్పుడు, హెడ్గేవార్ తన ప్రసంగాలలో ఒకదానిలో బ్రిటిష్ పాలనను 'యాక్ట్ ఆఫ్ ప్రొవిడెన్స్' అని అభివర్ణించారని ధీరేంద్ర ఝా చెప్పారు.
"బ్రిటిష్ వారికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా లేదు. ఒకానొక సమయంలో హిందువులు, ముస్లింలు కలిసి చేస్తున్న బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాన్ని ఆర్ఎస్ఎస్ విభజించింది. ఈ సంస్థ కేవలం హిందూ ప్రయోజనాల గురించి మాత్రమే మాట్లాడుతోంది" అని ఝా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్ఎస్ఎస్ ప్రముఖుల గురించి సీనియర్ జర్నలిస్ట్, రచయిత నీలాంజన్ ముఖోపాధ్యాయ 'ది ఆర్ఎస్ఎస్: ఐకాన్స్ ఆఫ్ ది ఇండియన్ రైట్' అనే పుస్తకాన్ని రాశారు.
"వలస పాలన నుంచి స్వేచ్ఛ సాధించడం ఆర్ఎస్ఎస్ లక్ష్యం కాదు. ఇస్లాం, క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా హిందూ సమాజాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో ఆర్ఎస్ఎస్ స్థాపించారు. బ్రిటిష్ వారిని తరిమికొట్టడం వారి లక్ష్యం కాదు. హిందూ సమాజాన్ని ఏకం చేసి, ఒకే గొంతుతో మాట్లాడేలా వారిని సిద్ధం చేయడమే లక్ష్యం" అని ముఖోపాధ్యాయ తెలిపారు.
1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత డాక్టర్ హెడ్గేవార్‌ను కలవడానికి ప్రయత్నించారు. ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు గోపాల్ ముకుంద్ హుద్దర్ ద్వారా ఈ ప్రయత్నం చేశారు బోస్. కానీ, హెడ్గేవార్ అనారోగ్యం కారణంగా ఆ సమావేశం తిరస్కరించారు. గోపాల్ ముకుంద్ హుద్దర్ 1979లో ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో రాసిన ఒక వ్యాసంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
2022లో ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ 'ది ఆర్గనైజర్'లో ప్రచురితమైన ఒక వ్యాసంలో.. 1940 జూన్ 20న డాక్టర్ హెడ్గేవార్‌ను కలవడానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వచ్చారని దమరు ధర్ పట్టనాయక్ పేర్కొన్నారు.
"ఆ సమయానికి హెడ్గేవార్ ప్రముఖ ఆర్ఎస్ఎస్ కార్యకర్త బాబాసాహెబ్ ఘటాటే ఇంట్లో ఉన్నారు. బోస్ చేరుకునే సమయానికి, హెడ్గేవార్ నిద్రలో ఉన్నారు."
పట్టనాయక్ ప్రకారం.. హెడ్గేవార్‌ను ప్రచారకులు మేల్కొలపడానికి ప్రయత్నించినప్పుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారిని ఆపి, మరొక రోజు కలుస్తానని చెప్పి వెళ్లిపోయారు. హెడ్గేవార్ నిద్రలేచి బోస్ తనను కలవడానికి వచ్చారని తెలుసుకున్నారు. బోస్ ఇంకా అక్కడే ఉన్నారా? అని చూడటానికి మనుషులను ఆత్రుతగా పంపారు.
మరుసటి రోజే హెగ్డేవార్ చనిపోయారని పట్నాయక్ తెలిపారు.
నేతాజీ బోస్‌ను హెడ్గేవార్ కలిశారని 2018లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. కానీ, ఆ సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలను ఆయన వెల్లడించలేదు.
"ఆయన (హెడ్గేవార్) విప్లవకారులతో కలిసి పనిచేశారు. ఆ కాలంలోని స్వాతంత్య్ర ఉద్యమాలలో పాల్గొన్నారు. సుభాష్‌ను కలిశారు, సావర్కర్‌ను కలిశారు. ఆయనకు విప్లవకారులతో సంబంధాలున్నాయి" అని భగవత్ చెప్పారు. (భవిష్య కా భారత్—సంఘ కా దృష్టికోన్, పేజీలు 17, 18)

ఫొటో సోర్స్, Getty Images

ఆర్ఎస్ఎస్‌పై వచ్చిన అత్యంత తీవ్రమైన విమర్శలలో ఒకటి, మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ సభ్యుడు అని.
గాడ్సే ఆర్ఎస్ఎస్ వ్యక్తి కాదని చెప్పడానికి ఆ సంస్థ చాలాసార్లు ప్రయత్నించింది. గాడ్సే ఆర్ఎస్ఎస్‌లో భాగం కాదని, అందువల్ల గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్‌ని నిందించడం సరికాదని ఆ సంస్థ పేర్కొంది.
హత్య తర్వాత జరిగిన విచారణ సందర్భంగా.. నాథూరామ్ గాడ్సే కోర్టులో తాను ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ సభ్యుడినని, కానీతరువాత హిందూ మహాసభలో చేరడానికి ఆర్ఎస్ఎస్‌ను విడిచిపెట్టానని పేర్కొన్నారు.
గాడ్సేపై "గాంధీస్ అస్సాసిన్: ది మేకింగ్ ఆఫ్ నాథూరామ్ గాడ్సే అండ్ హిస్ ఐడియా ఆఫ్ ఇండియా" అనే పుస్తకం రాశారు ధీరేంద్ర ఝా .
అక్కడ రెండు ప్రశ్నలు ఉన్నాయని ఝా చెప్పారు: గాడ్సే ఎప్పుడు ఆర్ఎస్ఎస్‌ను విడిచిపెట్టారు? ఎప్పుడు హిందూ మహాసభలో చేరారు?
''మా దగ్గరున్న రికార్డులు గాడ్సే 1938లో నిజాం భూభాగంలోని హైదరాబాద్‌కు హిందూ మహాసభ నాయకుడిగా వెళ్లారని సూచిస్తున్నాయి. కాబట్టి, గాడ్సే హిందూ మహాసభ నాయకుడిగా అక్కడికి వెళ్లినట్లయితే, అతను ఆర్ఎస్ఎస్‌ను విడిచిపెట్టారని అర్థమా?. గాంధీ హత్య తర్వాత నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డులు 1939, 1940లో జరిగిన అనేక ఆర్ఎస్ఎస్ సమావేశాలలో గాడ్సే ఉనికిని రుజువు చేస్తున్నాయి. ఆ రోజుల్లో చాలామంది ఆర్ఎస్ఎస్ సభ్యులు కూడా హిందూ మహాసభలో భాగమయ్యారు. పలువురు హిందూ మహాసభ సభ్యులు ఆర్ఎస్ఎస్‌లో చేరారు. 1947లో బాంబే పోలీసులు హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ సభ్యుల జాబితాను తయారు చేసినప్పుడు, రెండింటిలోనూ ఉన్న సభ్యులను కనుగొన్నారు'' అని తెలిపారు ఝా.
నాథూరామ్ గాడ్సే సోదరుడు, గాంధీ హత్యలో సహ కుట్రదారుడు అయిన గోపాల్ గాడ్సే జైలు నుంచి విడుదలైన తర్వాత నాథూరామ్ గాడ్సే ఎప్పుడూ ఆర్ఎస్ఎస్‌ను విడిచిపెట్టలేదని చెప్పారని ఝా వివరించారు. అనేక సందర్భాల్లో గాడ్సే కుటుంబ సభ్యుల ప్రకటనలు వెలువడ్డాయి. నాథూరామ్ గాడ్సే చివరివరకు ఆర్ఎస్ఎస్‌తోనే ఉన్నారని వారు నొక్కి చెప్పారు.
"ఆర్ఎస్ఎస్‌లో సభ్యత్వ నమోదు ఉండదు, కాబట్టి చేరడానికి లేదా రాజీనామా చేయడానికి ఎటువంటి అధికారిక ప్రక్రియ లేదు. గాడ్సే ఆర్ఎస్ఎస్‌లో ఉన్నారు, ఉరికి ముందు ఆయన చేసిన చివరి పని ఆర్ఎస్ఎస్ ప్రార్థన పాడటం. ఆర్ఎస్ఎస్ పట్ల ఆయన విధేయతకు ఇంతకంటే గొప్ప రుజువు ఇంకేముంటుంది?. గాడ్సే తన యవ్వనం నుంచి చనిపోయే వరకు ఆర్ఎస్ఎస్ భావజాలానికి పూర్తిగా నిబద్ధత కలిగిన స్వచ్ఛంద సేవకుడు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో చురుకుగా లేకపోయినా ఆచరణాత్మక ప్రయోజనాల కోసం గాడ్సే ఆర్ఎస్ఎస్ వ్యక్తిగానే ఉన్నారు" అని నీలాంజన్ ముఖోపాధ్యాయ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఆర్ఎస్ఎస్ను భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వెన్నెముకగా పరిగణిస్తారు. గత మూడు లోక్‌సభ ఎన్నికలు, అనేక అసెంబ్లీ ఎన్నికలలో ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్రస్థాయి కార్యకర్తల ఉనికి నుంచి బీజేపీ రాజకీయంగా ప్రయోజనం పొందిందని, ప్రభుత్వాల ఏర్పాటులో సహాయపడిందని తరచుగా చర్చ జరుగుతోంది.
ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు రాజకీయాలకు దూరమని పదేపదే చెబుతుంటారు. అయితే, ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉన్న చాలామంది ఇప్పుడు బీజేపీలో భాగమయ్యారని, రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారనేది అందరికీ తెలుసు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వంటి నాయకులు తమ తొలినాళ్ల నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగమయ్యారు.
2015లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత, మోదీ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు దిల్లీలో వసంత్ కుంజ్‌లోని మధ్యాంచల్ భవన్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ సమావేశానికి వరుసగా మూడు రోజులు హాజరై, వారి వారి మంత్రిత్వ శాఖల పనితీరు గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల మధ్య ఉన్న సన్నిహిత సంబంధం కనిపించింది. అప్పట్లో వచ్చిన వార్తల ప్రకారం.. రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, మనోహర్ పారికర్, జె.పి. నడ్డా వంటి సీనియర్ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఆర్థిక వ్యవస్థ, విద్య, జాతీయ భద్రత వంటి అంశాలపై బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్ విధానపరమైన సూచనలు ఇచ్చిందని కూడా వార్తలొచ్చాయి. మూడవ రోజు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సమావేశానికి హాజరయ్యారు. మీడియా నివేదికల ప్రకారం, స్వయంసేవక్‌గా ఉండటం గర్వంగా ఉందని మోదీ అన్నారు.
అయితే, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వ మంత్రులు తమ పని నివేదికలను ప్రభుత్వేతర సంస్థకు సమర్పించడం సబబు కాదని విమర్శకులు అన్నారు. ఇది దేశ వ్యవస్థ, రాజ్యాంగ నియమాలకు విరుద్ధమని తెలిపారు.
ఈ సమావేశం తర్వాత, ఆర్ఎస్ఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే.. "గోప్యత ఎక్కడ ఉంది? మేం కూడా దేశ పౌరులమే. మంత్రులు సమావేశాలలో మాట్లాడతారు, మాతో మాట్లాడినట్లే మీడియాకు వివరిస్తారు" అని చెప్పినట్లుగా మీడియా కథనాలు వెల్లడించాయి.

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని సంవత్సరాల క్రితం సంస్థకు రాజకీయాలకు సంబంధం లేకపోతే బీజేపీకి ఆర్ఎస్ఎస్ సంస్థాగత కార్యదర్శిని ఎందుకు అందిస్తోందని మోహన్ భగవత్‌ను అడిగినప్పుడు.. ఆయన ''సంస్థాగత సెక్రటరీని ఇప్పటివరకు బీజేపీ తప్ప ఎవరూ అడగలేదు, ఎవరైనా అడిగితే పరిశీలిస్తాం, పని బాగుంటే ఖచ్చితంగా అందిస్తాం'' అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్‌కు ఒక విధానం ఉందని, పెరుగుతున్న సంస్థ బలం ఆ విధానానికి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలకు ప్రయోజనం చేకూరుస్తుందని భగవత్ అన్నారు.
ఎన్నికల సమయంలో బీజేపీ టిక్కెట్ల కోసం అభ్యర్థుల గురించి అడిగినప్పుడు, స్వచ్ఛంద సేవకులు అట్టడుగు స్థాయిలో పనిచేస్తారు కాబట్టి సంస్థ ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుందని ఆర్ఎస్ఎస్ అంటోంది. ఇదికాకుండా ఆర్‌ఎస్‌ఎస్ ఎన్నికల నిర్ణయాలను ప్రభావితం చేయదు లేదా ఎన్నికల వ్యూహాలను నిర్ణయించదు. (ఆర్‌ఎస్‌ఎస్: 21వ శతాబ్దానికి రోడ్‌మ్యాప్‌లు, పేజీ 220)
బీజేపీ ప్రభుత్వాలను రిమోట్‌గా నియంత్రిస్తామనే ఆరోపణలను ఆర్‌ఎస్‌ఎస్ కూడా ఖండించింది.
"ఆర్ఎస్ఎస్ బీజేపీ పనిలో జోక్యం చేసుకోదు లేదా అలా చేయాలనుకోదు కూడా. ఎవరికి ఏ స్థానం లభిస్తుంది? ర్యాలీలు ఎక్కడ జరుగుతాయి? ఈ విషయాలతో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎటువంటి సంబంధం లేదు" అని అంబేకర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

భారత త్రివర్ణ పతాకాన్ని ఆర్‌ఎస్‌ఎస్ రెండవ సర్ సంఘ్‌చాలక్ గోల్వాల్కర్ విమర్శించారు. ఆయన రాసిన "బంచ్ ఆఫ్ థాట్స్" పుస్తకంలో జెండా గురించి అభిప్రాయాలను వెల్లడించారు.
"ఈ జెండా ఎలా ఉనికిలోకి వచ్చింది? ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఫ్రెంచ్ వారు సమానత్వం, సోదరభావం, స్వేచ్ఛ అనే మూడు ఆలోచనలను వ్యక్తీకరించడానికి వారి జెండాపై మూడు చారలను వేశారు. మన స్వాతంత్య్ర సమరయోధులకు కూడా మూడు చారలు ఒక రకమైన ఆకర్షణగా నిలిచాయి. కాబట్టి, దీనిని కాంగ్రెస్ చేపట్టింది" అని గోల్వాల్కర్ పుస్తకంలో అభిప్రాయపడ్డారు.
త్రివర్ణ పతాకం "మన జాతీయ చరిత్ర, వారసత్వం ఆధారంగా ఏ జాతీయ దృక్పథం లేదా సత్యం ద్వారా ప్రేరణ పొందలేదు" అని ఆయన తెలిపారు.
ఆర్‌ఎస్‌ఎస్‌లో కాషాయ జెండాకు గురువు హోదా ఇచ్చారు. కాషాయ జెండా పురాతన కాలం నుంచి నేటి వరకు ఆర్‌ఎస్‌ఎస్ వారసత్వానికి చిహ్నంగా ఉండటమే దీనికి కారణమని మోహన్ భగవత్ అన్నారు.
"మన చరిత్ర గురించి చర్చించినప్పుడల్లా ఈ కాషాయ జెండా ఎక్కడో ఒకచోట ఉంటుంది. స్వతంత్ర భారతదేశ జెండా ఏదై ఉండాలనే ప్రశ్న తలెత్తినప్పుడు కూడా జెండా కమిటీ నివేదిక సుప్రసిద్ధమైన, బాగా స్థిరపడిన కాషాయ జెండాను సూచించింది. తరువాత, దానిని త్రివర్ణ జెండాగా మార్చారు. అది మన జాతీయ జెండా, మేం దానిని పూర్తిగా గౌరవిస్తాం" అని మోహన్ భగవత్ అన్నారు. (భవిష్య కా భారత్—సంఘ్ కా దృష్టికోన్, పేజీ 31)
నేడు, ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ జెండాను గౌరవిస్తామని చెబుతోంది కానీ, స్వాతంత్య్రానికి ముందు, తరువాత అనేక దశాబ్దాలుగా త్రివర్ణ పతాకం పట్ల దాని వైఖరి గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
"1929లో లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశం సంపూర్ణ స్వాతంత్య్ర లక్ష్యాన్ని ప్రకటించినప్పుడు, 1930 జనవరి 26ని స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకోవాలని, త్రివర్ణ జెండాను ఎగురవేయాలని నిర్ణయించారు. ఆ రోజున త్రివర్ణ పతాకానికి బదులుగా కాషాయ జెండాను ఆర్‌ఎస్‌ఎస్ ఎగురవేసింది" అని నీలాంజన్ ముఖోపాధ్యాయ తెలిపారు.
ధీరేంద్ ఝా ప్రకారం.. 1930 జనవరి 21న డాక్టర్ హెడ్గేవార్ రాసిన లేఖలో ఆర్ఎస్ఎస్ శాఖలలో త్రివర్ణ పతాకాన్ని కాకుండా కాషాయ జెండాను ఎగురవేయాలని ప్రస్తావించారు. 1950 జనవరి 26 తర్వాత, ఆర్ఎస్ఎస్ తన ప్రధాన కార్యాలయంలో తదుపరి ఐదు దశాబ్దాల పాటు త్రివర్ణ జెండాను ఎగురవేయలేదని మరో విమర్శ ఉంది. 2002 జనవరి 26న ఆర్ఎస్ఎస్ తన ప్రధాన కార్యాలయంలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
2002 వరకు ఆర్ఎస్ఎస్ జాతీయ జెండాను ఎగురవేయలేదని, ఎందుకంటే అప్పటివరకు ప్రైవేట్ పౌరులకు జాతీయ జెండాను ఎగురవేయడానికి అనుమతి లేదని ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు, నాయకులు బదులిచ్చారు.
అయితే, 2002 వరకు అమలులో ఉన్న జెండా కోడ్ నియమాల ప్రకారం.. ఏ భారతీయ వ్యక్తి లేదా సంస్థ అయినా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి నాడు జెండాను ఎగురవేయకుండా నిరోధించలేదు.
1950, 60, 70లలో కూడా ప్రైవేట్ కంపెనీలు ఆగస్టు 15, జనవరి 26వ తేదీలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాయని నీలాంజన్ ముఖోపాధ్యాయ చెప్పారు.
"జాతీయ జెండా దుర్వినియోగం కాకుండా చూసుకోవడమే జెండా కోడ్ ఉద్దేశం" అన్నారాయన.
2001 జనవరి 26న నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ స్మృతి భవన్‌లో ముగ్గురు యువకులు బలవంతంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
2013 ఆగస్టు 14న వెలువడిన ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. "ప్రాంగణ ఇన్‌చార్జ్ సునీల్ కథలే మొదట వారిని ప్రాంగణంలోకి ప్రవేశించకుండా ఆపడానికి ప్రయత్నించారు. తరువాత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకుండా నిలువరించడానికి ప్రయత్నించారు."
ఈ ముగ్గురు వ్యక్తులపై అతిక్రమణ కేసు నమోదైంది. కానీ, ఆధారాలు లేకపోవడంతో నాగ్‌పూర్ కోర్టు 2013లో వారిని నిర్దోషులుగా ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుత ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వివిధ సందర్భాల్లో భారతదేశంలోని ప్రజలందరూ హిందువులేనని, దేశాన్ని నివాసంగా భావించే ఎవరైనా హిందువులేనని పేర్కొన్నారు. 'భారతదేశం హిందూ దేశం' అని కూడా ఆయన పదేపదే చెప్పారు. మైనారిటీ వర్గాల పట్ల, ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవుల పట్ల ఆర్‌ఎస్‌ఎస్ వైఖరి గురించి కూడా అనేక ప్రశ్నలు తలెత్తాయి.
ఈ అంశంపై ఆర్‌ఎస్‌ఎస్ దృక్పథాన్ని రెండవ సర్‌సంఘచాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ రాసిన "బంచ్ ఆఫ్ థాట్స్" పుస్తకంలో చూడవచ్చు.
"ఒకప్పుడు కొద్దిమంది ముస్లింలు మాత్రమే శత్రువులుగా, ఆక్రమణదారులుగా ఇక్కడికి వచ్చారని అందరికీ తెలుసు. అలాగే, కొంతమంది విదేశీ క్రైస్తవ మిషనరీలు ఇక్కడికి వచ్చాయి. అయితే, ఇప్పుడు ముస్లింలు, క్రైస్తవుల సంఖ్య పెరిగారు. వారు స్థానిక ప్రజలను మతమార్పిడి చేశారు. స్థానిక జనాభాను మార్చారు. మన పూర్వీకులలోని ఒక భాగం ముస్లింలుగా, మరొక భాగం క్రైస్తవులుగా మారిపోయారు. మిగిలిన వారిని మతం మార్చలేకపోయారు, వారే హిందువులుగా మిగిలిపోయారు" అని తెలిపారు గోల్వాల్కర్.
అదే పుస్తకంలో ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులను "దేశ అంతర్గత శత్రువులు"గా అభివర్ణించారు గోల్వాల్కర్.
"బంచ్ ఆఫ్ థాట్స్"లో ముస్లింలను శత్రువులుగా పేర్కొంటూ గోల్వాల్కర్ చేసిన ప్రకటన గురించి భగవత్‌ను 2018లో అడిగినప్పుడు "ప్రకటనలు నిర్దిష్ట పరిస్థితులు, సందర్భాలలో చేస్తారు, అవి శాశ్వతమైనవి కావు" అని ఆయన అన్నారు.
గోల్వాల్కర్ సిద్ధాంతాలపై సేకరించిన కొత్త ఎడిషన్‌లో అంతర్గత శత్రువుల ప్రస్తావన తొలగించారు.
"హెడ్గేవార్ చేసిన కొన్ని ప్రకటనలను తప్పకుండా అనుసరించే సంస్థ ఆర్ఎస్ఎస్ కాదు. కాలం మారుతోంది, సంస్థ పరిస్థితి మారుతోంది. మన ఆలోచనా విధానం కూడా మారుతోంది. హెడ్గేవార్ మనకు మారడానికి అనుమతి ఇచ్చారు" అని భగవత్ అన్నారు. (భవిష్య కా భారత్—సంఘ్ కా దృష్టికోన్, పేజీ 90).
జూలై 2021లో భగవత్ మాట్లాడుతూ "మనం ఒకే పూర్వీకుల వారసులం. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది. గత 40 వేల సంవత్సరాలుగా భారతదేశంలోని ప్రజలందరి డీఎన్ఏ ఒకేలా ఉంది. ఒక్క ముస్లిం కూడా ఇక్కడ ఉండకూడదని హిందువులు చెబితే, ఆ హిందువును కూడా హిందువుగా పరిగణించలేం" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Ministry of Home Affairs, Government of India

1966లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ఉత్తర్వు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగి ఏ రాజకీయ పార్టీ లేదా రాజకీయాల్లో పాల్గొనే ఏ సంస్థలోనూ సభ్యుడిగా ఉండకూడదని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగానూ ఏదైనా రాజకీయ ఉద్యమం లేదా కార్యకలాపాల్లో పాల్గొనడం, దానికి సహకరించడం లేదా సహాయం చేయడం నిషేధమని అందులో పేర్కొంది.
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లేదా జమాత్-ఇ-ఇస్లామీ వంటి సంస్థలలో సభ్యుడిగా లేదా అనుబంధంగా ఉంటే, సివిల్ సర్వీస్ ప్రవర్తనా నియమాల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వు స్పష్టంచేసింది. 1970, 1980లలో జారీ అయిన ఉత్తర్వులలో కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
2024 జూలైలో కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) ఒక సర్క్యులర్ జారీ చేసింది. 1966, 1970, 1980లలో జారీ చేసిన ఆదేశాలను సమీక్షించిన తర్వాత, అందులో నుంచి ఆర్ఎస్ఎస్ పేరును తొలగించింది.
సులభంగా చెప్పాలంటే, ఇప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఆర్ఎస్ఎస్‌లో చేరడానికి లేదా దాని కోసం పనిచేయడానికి అధికారికంగా ఎలాంటి అడ్డంకులు లేవు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














