సావర్కర్ క్షమాపణ పత్రంలో ఏం రాశారు? విడుదలయ్యాక ఏం చేశారు

ఫొటో సోర్స్, SAVARKARSMARAK.COM
- రచయిత, రాఘవేంద్ర రావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
"ప్రభుత్వం నన్ను దయతో విడిచిపెడితే, రాజ్యాంగ పురోగతికి కట్టుబడి ఉంటాను. బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడనై ఉంటాను.
ఏ హోదాలోనైనా బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నాలో వచ్చిన మార్పు నిజమైనది. భవిష్యత్తులో కూడా ఇంతే నిజాయితీగా ప్రవర్తిస్తానని విన్నవించుకుంటున్నాను.
నన్ను జైల్లో ఉంచడం వల్ల ఏమీ లాభం ఉండదు. కానీ, నన్ను విడుదల చేస్తే చాలా ప్రయోజనం కలుగుతుంది. పరాక్రమవంతులు మాత్రమే దయ చూపగలరు. అందుకే, అవలక్షణాలున్న పుత్రుడు (ప్రాడిగల్ సన్) తల్లిదండ్రుల చెంతకే చేరుతాడు. ఇంకెక్కడికి వెళ్లగలడు?
నా ప్రారంభ జీవితంలో నాకు వచ్చిన మంచి అవకాశాలు అంతే వేగంగా చేజారిపోయాయి. ఇది చాలా బాధాకరం. అందుకే, విడుదల నాకు పునర్జన్మగా భావిస్తాను. మీ కృపా వీక్షణాలు మా మనసులో నిలిచిపోతాయి. భవిష్యత్తులో మీకు రాజకీయంగా ఉపయోగపడగలవాడను. అధికారం పనిచేయని చోట ఔదార్యం విజయం సాధిస్తుంది.
నేనూ, నా సోదరుడూ స్థిర కాలం పాటు నిశ్చయంగా రాజకీయాల్లో భాగం పంచుకోకుండా ఉంటామని ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
ఈ తరహా ప్రతిజ్ఞల అవసరం లేకుండా కూడా, అనారోగ్యం కారణంగా రానున్న రోజుల్లో ప్రశాంతంగా, నా విశ్రాంత జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. ఇకపై క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించేలా నన్ను ఏదీ ప్రేరేపించలేదు.”
వినాయక్ దామోదర్ సావర్కర్ 1913, 1920 మధ్య అండమాన్‌లోని సెల్యులార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న కాలంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాభిక్ష కోరుతూ రాసిన లేఖలోని వాక్యాలివి.
అందుకే భారతదేశంలోని రాజకీయ వర్గాల్లో సావర్కర్‌ను చాలామంది విమర్శిస్తారు.
కానీ, ఆర్ఎస్ఎస్, బీజేపీలతో సంబంధం ఉన్నవారు మాత్రం సావర్కర్ జాతీయతను ప్రశంసిస్తూ ఆయనను ఒక వీరుడిగా చూపేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఈ నేపథ్యంలో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి.
కుట్ర పన్ని సావర్కర్‌కు చెడ్డ పేరు తీసుకొచ్చారని, గాంధీ ఆదేశాల మేరకే సావర్కర్ ఆంగ్లేయులను క్షమాభిక్ష కోరారని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, క్షమాభిక్ష కోరడం, ఫలితంగా 50 ఏళ్ల శిక్ష పదేళ్లకు తగ్గి కాలాపానీ నుంచి విడుదల కావడంతోనే ఈ విషయం ఆగిపోలేదని సావర్కర్ వ్యతిరేకులు అంటారు.
విడుదల అయిన తరువాత సావర్కర్ వలస పాలన విధానాలకు మద్దతు ఇచ్చారని, స్వతంత్ర పోరాటం నుంచి దూరం జరిగారని ఆరోపిస్తారు.
బ్రిటిష్ ప్రభుత్వం నుంచి సావర్కర్ నెలకు రూ. 60 పెన్షన్ కూడా తీసుకునేవారని విమర్శకులు అంటారు.

ఫొటో సోర్స్, Ani
క్షమాభిక్ష కాదు, లొంగుబాటు
జైల్లో మరణించే కన్నా దేశానికి సేవ చేయడమే ఉత్తమ మార్గంగా సావర్కర్ భావించారని ఆయన అభిమానులు సమర్థిస్తుంటారు.
కానీ, "సావర్కర్ విడుదలయిన తరువాత గాంధీని వ్యతిరేకించడమే ధ్యేయంగా బతికారు. 1937లో జైలు నుంచి బయటపడ్డ దగ్గర నుంచి 1966లో మరణించేవరకు దేశ సేవ అని చెప్పుకోగలిగే పనులేవీ చేయలేదు" అని రచయిత షంసుల్ ఇస్లాం అంటారు.
షంసుల్ ఇస్లాం దిల్లీ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రం బోధించేవారు. ఆర్ఎస్ఎస్, సావర్కర్‌లపై పలు పుస్తకాలు రచించారు. వాటిల్లో 'సావర్కర్: మిథ్స్ అండ్ ఫ్యాక్ట్స్', 'హిందుత్వ: సావర్కర్ అన్‌మాస్కుడ్' పుస్తకాలు ప్రాచుర్యం పొందాయి.
"క్షమాభిక్ష మాత్రమే కాదు, లొంగి ఉంటానని కూడా సావర్కర్ యాచించారు. ఇది క్షమాభిక్ష కోరడం కన్నా భిన్నమైనది" అని షంసుల్ ఇస్లాం అంటారు.
"జైలులో సావర్కర్ ఎలాంటి నిరాహార దీక్షలో పాల్గొనలేదు. అలా చేస్తే, శిక్షగా ఆయనకు వచ్చే ఉత్తరాలను నిలిపివేస్తారు."
"గతంలో చాలా తప్పులు చేశానని, ఉజ్వల భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకున్నానని సావర్కర్ తన క్షమాపణ పత్రంలో రాశారు. బ్రిటిష్ విధానాలను సమర్థిస్తూ, వారికి మద్దతిస్తానని కూడా అన్నారు. నన్ను విడుదల చేస్తే, నన్ను ఆదర్శంగా తీసుకుని పోరాడుతున్న తిరుగుతుబాటుదారులందరూ ఆయుధాలు విడిచిపెడతారని రాశారు."
ఇవన్నీ చదివితే.. "మీకు ఎలా కావాలంటే అలా నన్ను ఉపయోగించుకోవచ్చు" అని సావర్కర్ బ్రిటిష్ వారికి చెప్పినట్లు స్పష్టం అవుతోందని షంసుల్ ఇస్లాం అంటారు.
"1923లో, సావర్కర్ తన పుస్తకంలో 'భారతదేశం ఒక హిందూ దేశం' అని రాయడం ద్వారా నేరుగా బ్రిటిష్ వారికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు. ఆయనకు కాలా పానీలో 50 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కానీ, పదేళ్లే అక్కడ ఉన్నారు. బ్రిటిషర్లు ఆయనకు హిందూ మహాసభను సంఘటితం చేసే అధికారం ఇచ్చారు. పెన్షన్ కూడా నిర్ణయించారు."
"ఇంగ్లండ్ రాణికి ఉత్తరం రాస్తూ భారతదేశాన్ని నేపాల్ రాజుకు ఇచ్చేయండి. ఎందుకంటే నేపాల్ రాజు ప్రపంచంలోని హిందువులందరికీ రాజు అని సావర్కర్ అన్నారు."
హిందూ మహాసభ సమావేశాలు నేపాల్ రాజుకు వందనం చేయడంతో ప్రారంభమవుతాయి, ఆయనకు దీర్ఘాయుష్హు కలగాలని కోరుకుంటూ ముగుస్తాయని షంసుల్ ఇస్లాం తెలిపారు.
గాంధీ హత్యలో ప్రధాన నిందితుడు
1948లో గాంధీ హత్య జరిగిన ఆరు రోజుల తరువాత, ఈ కుట్రలో భాగం పంచుకున్నారనే ఆరోపణలతో సావర్కర్‌ను ముంబయిలో అరెస్ట్ చేసారు.
1949 ఫిబ్రవరిలో సావర్కర్‌ను నిర్దోషిగా ప్రకటించినప్పటికీ, తరువాత వచ్చిన కపూర్ కమిషన్ నివేదికలో ఆయన పూర్తిగా నిర్దోషి అని చెప్పలేదు.
ఈ విషయాలను షంసుల్ ఇస్లాం 'సావర్కర్: అన్‌మాస్కుడ్' పుస్తకంలో ప్రస్తావించారు.
"గాంధీ హత్య తరువాత, 1948 ఫిబ్రవరి 27న సర్దార్ పటేల్, నెహ్రూకు లేఖ రాస్తూ.. 'ఇది కచ్చితంగా సావర్కర్ నేతృత్వంలోని హిందూ మహాసభకు చెందిన ఓ మతోన్మాద శాఖ పన్నిన కుట్ర’ అని అన్నారు.
అలాగే, 1948 జూలై 18న శ్యామా ప్రసాద్ ముఖర్జీకి రాసిన లేఖలో గాంధీ హత్య గురించి ప్రస్తావిస్తూ.. ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ కార్యకలాపాల ఫలితంగా దేశంలో ఇంత దారుణానికి ఒడిగట్టే పరిస్థితి దాపురించిందని నాకొచ్చిన సమాచారం బట్టి స్పష్టం అవుతోందని రాశారు."

ఫొటో సోర్స్, AFP/BBC
'విషయాలను వక్రీకరిస్తున్నారు'
వీర్ సావర్కర్ తమ్ముడు డాక్టర్ నారాయణరావు సావర్కర్. ఆయన మనుమడు రంజిత్ సావర్కర్. ముంబయిలోని 'స్వతంత్ర వీర్ సావర్కర్ నేషనల్ మెమోరియల్'తో రంజిత్‌కు విడదీయరాని అనుబంధం ఉంది.
వీర్ సావర్కర్‌పై వచ్చిన అభియోగాలను రంజిత్ సావర్కర్ తోసిపుచ్చారు.
"క్షమాపణ పిటీషన్లో రాసిన కొన్ని వాక్యాలను అపార్థం చేసుకుంటున్నారు. ప్రాడిగల్ సన్ (అవలక్షణాలు గల పుత్రుడు) అనే పదం బైబిల్‌లోనిది. ఆంగ్లేయులు తమను తాము దైవాంశ సంభూతులుగా భావిస్తుండేవారు. ఇది వారిని ఉద్దేశించి చేసిన వ్యంగ్య వ్యాఖ్య" అని రంజిత్ అన్నారు.
"వీర్ సావర్కర్ రాసిన మాటలను సందర్భం నుంచి విడదీసి చూస్తున్నారు. వాటిని వక్రీకరిస్తున్నారు. ఆ లేఖలో ఆయన ఉపయోగంచిన భాష చూస్తే ఆంగ్లేయులను విమర్శించారని స్పష్టం అవుతోంది. నిజంగా బ్రిటిష్ ముందు తల వంచితే అలాంటి భాష వాడరు. 'మేము శాంతియుతంగా ముందుకు సాగాలని మీరు కోరుకుంటే అలా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం' అని సావర్కర్ బ్రిటిషర్లకు చెప్పారు. 1896లో ఉన్న కఠిన పరిస్థితులు మమ్మల్ని ఆయుధాలు చేపట్టేలా ప్రేరేపించాయని తన లేఖలో రాశారు. అంటే ఇక్కడ సావర్కర్ బ్రిటిష్ వారిని విమర్శించినట్లు లెక్క. ఖైదీల పట్ల వారి అమానుష ప్రవర్తనను ఎత్తి చూపించారు." అని రంజిత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
1940లో లాహోర్‌లో జరిగిన సమావేశంలో ముస్లిం లీగ్ తొలిసారిగా ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలనే ప్రతిపాదన తీసుకువచ్చింది.
కానీ, ఇదే మాటను సావర్కర్ అంతకుముందు నుంచే చెబుతూ వచ్చారు.
1937లో అహమ్మదాబాద్‌లో మాట్లాడుతూ, హిందూ, ముస్లిం దేశాలు వేరని, రెండు వర్గాలకూ ఈ భూభాగంపై సమాన హక్కులు ఉండవని స్పష్టం చేశారు.
సావర్కర్‌ను విమర్శించేవాళ్లు ఈ విషయాన్ని కూడా తరచూ ప్రస్తావిస్తారు.
దీనిపై రంజిత్ స్పందిస్తూ.. "ఒక వార్తాపత్రిక సావర్కర్ రెండు దేశాల సిద్ధాంతాన్ని వక్రీకరించి రాసింది. వెంటనే సావర్కర్ దాన్ని ఖండించారు కూడా. కానీ, విమర్శకులు దాన్నే ప్రస్తావిస్తారు. సావర్కర్ ఖండించారన్న విషయాన్ని పట్టించుకోరు. సావర్కర్ పుట్టక ముందే 1883లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కానీ, సావర్కర్ దానికి వ్యతిరేకంగా పోరాడారు" అని వివరించారు.
'క్విట్ ఇండియా' కాంగ్రెస్ చేసిన ఉద్యమం
అయితే, సావర్కర్ స్వతంత్ర పోరాటంలో ఎందుకు పాలుపంచుకోలేదు? క్విట్ ఇండియా ఉద్యమంలో ఎందుకు భాగం కాలేదు?
1942లో ముస్లిం లీగ్ తమకు మాద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంది. అందుకే స్వతంత్రం వచ్చిన తరువాత ముస్లిం లీగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అనుమతిస్తుందని, జిన్నా ప్రధాని కావొచ్చని గాంధీ చెప్పారు.
"దీన్ని సావర్కర్ "బుజ్జగింపు"గా పేర్కొన్నారు. ఇలాగే ముస్లింలను బుజ్జగిస్తూ ఉంటే భారత విభజన తప్పదని అన్నారు. అంబేద్కర్ కూడా క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించారు. 1942లో ఈ ఉద్యమాన్ని కేవలం కాంగ్రెస్ లేవనెత్తింది. ఇదేమీ జాతీయ స్థాయిలో వచ్చిన ఉద్యమం కాదు అందరూ పాల్గొనడానికి."
క్విట్ ఇండియా ఉద్యమంలో చేరనందుకే సావర్కర్ బ్రిటిష్ మద్దతుదారు అయితే, అంబేడ్కర్, కమ్యూనిస్టు నాయకుడు ఎంఎన్ రాయ్ కూడా బ్రిటిష్ సమర్థకులే అవుతారని రంజిత్ అన్నారు.

ఫొటో సోర్స్, Public domain
నెలకు 60 రూపాయల పెన్షన్
సావర్కర్ ఆంగ్లేయుల నుంచి నెలకు రూ. 60 పెన్షన్ పొందారన్న విమర్శ కూడా ఉంది.
అది పెన్షన్ కాదని, కారావాస భత్యం (డిటెన్షన్ అలవెన్స్) అని, సాధారణంగా రాజకీయ ఖైదీలందరికీ ఇస్తారని రంజిత్ సమర్థించారు.
ఈ అలవెన్స్ ఏడాదిన్నర తరువాత సావర్కర్‌కు అందిందని, అది కూడా మిగతా ఖైదీలకు ఇచ్చిన దాన్లో సగమేనని ఆయన తెలిపారు.
"ఖైదీలకు డిటెన్షన్ అలవెన్స్ ఇస్తారు. ఎందుకంటే జీవనోపాధికి ఆస్కారం లేని చోట్ల వారిని ఉంచుతారు. అందుకే నెల నెలా కొంత సొమ్ము ముట్టజెపుతారు. సావర్కర్‌ను రత్నగిరిలో ఉంచారు. ఆయన ఎల్ఎల్‌బీ డిగ్రీని ముంబయి విశ్వవిద్యాలయం రద్దు చేయడంతో న్యాయవాద వృత్తి చేపట్టేందుకు అనుమతి ఇవ్వలేదు. రత్నగిరిలో కూడా లా ప్రాక్టీస్ చేసేందుకు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. కోట్ల విలువైన సావర్కర్ ఆస్తులను జప్తు చేశారు. ఆయన 60 రూపాయల పెన్షన్‌కు రాజీ పడతారా? ఇది హాస్యాస్పదం. నిజంగా సావర్కర్ బ్రిటిషర్లతో రాజీ పడి ఉంటే తన ఆస్తిని తిరిగి అడిగేవారు."
సావర్కర్ రాజకీయ జీవితంలో రెండు దశలు
నీలాంజన్ ముఖోపాధ్యాయ ఆర్ఎస్ఎస్ గురించి రాసిన పుస్తకం 'ది ఆర్ఎస్ఎస్: ఐకాన్స్ ఆఫ్ ది ఇండియన్ రైట్'లో సావర్కర్ గురించి ఓ అధ్యాయంలో చర్చించారు.
సావర్కర్ జీవితంలో రెండు దశలు ఉన్నాయని ఆయన అంటారు. కాలా పానీ జైలుకు వెళ్లాక ఆయనలో మార్పు వచ్చిందని, అంతకుముందు సావర్కర్‌కు, తరువాత సావర్కర్‌కు వ్యత్యాసం ఉందని ముఖోపాధ్యాయ వివరించారు.
"సావర్కర్ భారతదేశంలో పుట్టి పెరిగారు. స్కాలర్‌షిప్ అందుకున్నారు. జాతీయవాదుల సంఘాలలో చేరారు. విదేశాలు వెళ్లారు. లండన్‌లోని ఇండియా హౌస్‌లో బస చేశారు. అక్కడ భారత విప్లవకారులు, జాతీయవాదులతో జత కట్టారు. 1857లో విప్లవం గురించి ఓ మంచి పుస్తకం రాశారు. 1857 విప్లవం బ్రిటిషర్ల పాలిట సింహస్వప్నంగా మారడానికి కారణం హిందూ, ముస్లింలు ఏకమై పోరాడడమేనని ఆ పుస్తకంలో రాశారు. అంటే ఆయన హిందూ-ముస్లిం ఐక్యతను సమర్థించారని అర్థం. బ్రిటిష్ సామాజ్యవాదాన్ని ఎదుర్కోవడానికి ఈ ఐక్యత ఒక సాధనం అని సావర్కర్ భావించారని చెప్పవచ్చు."
1910లో నాసిక్ కలెక్టర్ హత్య కేసులో సావర్కర్‌ను లండన్‌లో అరెస్ట్ చేసి కాలా పానీ జైలుకు పంపించారు.
"సావర్కర్‌లో వచ్చిన మార్పు ఆయన రాసిన 'హిందుత్వ: హూ ఈజ్ ఏ హిందూ?' పుస్తకంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన నవలలు, నాటకాలు ఏకకాలంలో రచించారు. అవన్నీ సమాజాన్ని రెచ్చగొట్టేవిగా ఉండేవి. రాజకీయాల దృష్ట్యా మహిళలను బలాత్కారించడం తప్పు కాదని వాదించేవారు. ముస్లిం రాజులు దండయాత్రలు చేసి హిందూ మహిళలను చెరబడితే హిందూ రాజులు కూడా అదే పని చేయాలి అని సమర్థించేవారు."
"సావర్కర మొదటి దశలో నిజమైన జాతీయవాదిగా నడుచుకునేవారని ఉదారవాదులు కూడా అంగీకరిస్తారు. ముస్లిం వ్యతిరేకత, హిందుత్వ భావాలు రెండో దశలో వచ్చినవి. రెండో దశలో సావర్కర్ జీవితానికి అంటిన మచ్చలను, మొదటి దశలోని గుణగణాలతో చెరిపేయడానికి నేటి అధికార పీఠం ప్రయత్నిస్తోంది."
"అండమాన్ వెళ్లక ముందు సావర్కర్‌కు, వెళ్లిన తరువాత సావర్కర్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అండమాన్ జైలుకు వెళ్లక ముందు సావర్కర్ గురించి, ఆయన కార్యకలాపాల గురించి కాంగ్రెస్ మాట్లాడదు. సావర్కర్ రాసిన క్షమాపణ పత్రాల గురించి, తదనంతర పరిణామాల గురించి మాట్లాడడానికి ఇవతలి పక్షం ఇష్టపడదు" అని ముఖోపాధ్యాయ అన్నారు.

ఫొటో సోర్స్, SAVARKARSMARAK.COM
సావర్కర్ పట్ల బీజేపీ ప్రేమ
2000 సంవత్సరంలో సావర్కర్‌కు 'భారత రత్న' ఇవ్వాలని వాజ్‌పేయి ప్రభుత్వం అప్పటి రాష్ట్రపతి కే ఆర్ నారాయణన్‌కు ప్రతిపాదన పంపింది. అయితే, నారాయణనన్ ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు.
2014 మే నెలలో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రెండు రోజులకు, సావర్కర్ 131వ జయంతి సందర్భంగా పార్లమెంటులో ఆయన చిత్రపటానికి శిరస్సు వంచి నివాళులు అర్పించారు.
సావర్కర్ చిత్రపటాన్ని 2003లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఆవిష్కరించారు. ఆ సమయంలో విపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.
ఆర్ఎస్ఎస్ సభ్యులు సావర్కర్‌ను ప్రశంసించడంలో ఎప్పటికీ అలిసిపోరు. కానీ, ఆర్‌ఎస్‌ఎస్ పట్ల సావర్కర్ వైఖరి చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఒక సంస్థగా ఆర్ఎస్ఎస్‌కు సావర్కర్ ఎప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వలేదని నీలాంజన్ ముఖోపాధ్యాయ తన పుస్తకం 'ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ రైట్'లో రాశారు.
1937లో సావర్కర్, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల గురించి చెప్తూ, వాళ్ల స్మృతిచిహ్నంలో ఏం రాసుంటుందంటే.. "ఆయన పుట్టి పెరిగి ఆర్ఎస్ఎస్‌లో చేరారు. జీవితంలో ఏమీ సాధించకుండానే మరణించారు" అని అన్నారు.
"విచిత్రం ఏమిటంటే సావర్కర్ రచనల స్ఫూర్తితో ఆర్ఎస్ఎస్‌ను స్థాపించారు. కానీ, ఆయన ఎప్పుడూ ఆర్ఎస్ఎస్‌లో చేరలేదు. పైగా దాని గురించి అలాంటి ఘాటైన వ్యాఖ్య చేశారు" అని ముఖోపాధ్యాయ వివరించారు.
సావర్కర్ ఓ పక్క బ్రిటిష్ వారికి పదే పదే అభ్యర్థనలు పంపిస్తూనే, మరో పక్క గాంధీని, ఆయన విధానాలను బహిరంగంగానే విమర్శించేవారని నిపుణులు అంటారు.
"గాంధీ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణోద్యమం, ఖిలాఫత్ ఉద్యమాలను వ్యతిరేకిస్తూ సావర్కర్ 'సత్యం, అహింసల వింత నిర్వచనాల' గురించి వ్యాఖ్యానించారు. ఖిలాఫత్ ఉద్యమం ఘోరంగా విఫలమవుతుందని అన్నారు.
సావర్కర్‌ను విడిచిపెట్టడానికి బ్రిటిషర్లు ఎందుకు అంగీకరించారంటే ఐదేళ్ల పాటూ ఆయన బహిరంగంగా లేదా వ్యక్తిగతంగా రాజకీయాల్లో పాల్గొననని మాటిచ్చారు" అని ముఖోపాధ్యాయ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- విక్రాంత్‌ను ముంచాలని వచ్చిన పాక్ 'ఘాజీ' విశాఖలో జలసమాధి ఎలా అయ్యింది?
- సంజయ్ గాంధీకి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేస్తారని ఇందిర భయపడిన రోజు..
- చే గువేరా: క్యూబా మంత్రి హోదాలో భారత్ వచ్చినప్పుడు తన రిపోర్టులో ఏం రాశారు?
- ఈస్టిండియా కంపెనీ: వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?
- భారతదేశపు రాజులు నిజంగానే మగతనం లేని అసమర్ధులా?
- హైదరాబాద్ నిజాం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, పిసినారి కూడా..
- అడాల్ఫ్ హిట్లర్: ఆర్యుల మూలాలు కనుక్కోవాలని పరిశోధకులను హిమాలయాలకు పంపినప్పుడు ఏమైంది?
- డన్‌కర్క్: ‘చరిత్ర చెప్పని, పుస్తకాల్లో చోటు దక్కని’ 300 మంది భారత సైనికుల కథ
- 1897 సారాగఢీ యుద్ధం: ఒక భారతీయ సైనికుడి విగ్రహాన్ని బ్రిటన్‌లో ఎందుకు పెట్టారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)











