ఆంధ్రప్రదేశ్: తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?

విశాఖలోని ఓల్డ్ లైట్ హౌస్ ఉన్న ప్రాంతం దగ్గరే సిపాయిల తిరుగుబాటు చోటు చేసుకుంది.

ఫొటో సోర్స్, CV Subrahmanyam

ఫొటో క్యాప్షన్, విశాఖలోని ఓల్డ్ లైట్ హౌస్ ఉన్న ప్రాంతం దగ్గరే సిపాయిల తిరుగుబాటు చోటు చేసుకుంది.
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

వైజాగపటం రెజిమెంట్ సైన్యం 1780లో బ్రిటిష్ అధికారులపై తుపాకులు పేల్చింది. ఈ ఘటనలో ముగ్గురు బ్రిటిష్ అధికారులు మరణించారు. ఆ సమయంలో విశాఖను వైజాగపటం అనేవారు.

ఈ సంఘటన వివరాలు సేకరించడంలో అలసత్వం చూపించడంతో చరిత్రలో చిరస్థాయిగా నిలవాల్సిన సంఘటనకు పెద్దగా ఆధారాలు లేకుండా పోయాయని చరిత్రకారులు అంటున్నారు.

1780లో పరేడ్ గ్రౌండ్‌లో ఏం జరిగింది?

విశాఖలో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు దారి తీసిన పరిస్థితులేంటి?

బ్రిటిష్ పాలనలో పోలీసు, మిలటరీ వేర్వేరుగా ఉండేవి. కానీ, రెండు విభాగాలకు చెందిన సిబ్బంది బ్రిటిష్ అధికారులను అనుసరించాల్సి వచ్చేది. ఆ సమయంలో వైజాగ్ రెజిమెంట్‌లో సైనికుల కొరత కూడా ఉండేది.

ఉన్న సిబ్బందే అధికారులకు సెక్యూరిటీ మొదలు రైతులు, జమీందార్ల నుంచి పన్నులు వసూలు చేయడం వరకూ అన్ని పనులు చేసేవారని విశాఖ చరిత్ర పై పరిశోధన చేసిన చరిత్రకారులు విజ్జేశ్వరం ఎడ్వర్డ్ పాల్ బీబీసీతో చెప్పారు.

"ఆ సమయంలో బ్రిటిష్ సైన్యంలో పని చేసే భారతీయులకు జీతాలు కూడా తక్కువగా ఇచ్చేవారు. పన్నుల వసూలు కోసం చేసే దూరప్రాంత ప్రయాణాలకు ఛార్జీలు కూడా ఇచ్చేవారు కాదు. దీంతో బ్రిటిష్ అధికారుల పట్ల సైన్యంలో తీవ్రమైన అసంతృప్తిని పెంచాయి. దీనికి తోడు మైసూరు పాలకులు హైదర్ అలీ పై యద్ధం చేసేందుకు నౌకలో ప్రయాణం చేసి వెళ్లమని భారతీయ సైన్యాన్ని బ్రిటిష్ అధికారులు ఆదేశించడంతో తిరుగుబాటుకు బీజం పడింది" అని పాల్ వివరించారు.

అక్టోబర్ 3న విశాఖలో జరిగిన తొలి సిపాయిల తిరుగుబాటు బ్రిటిషర్ల అధిపత్యం మొదలైన తర్వాత బ్రిటిష్ అధికారులను, సైనికులను భయకంపితులను చేసిన సంఘటనగా చెప్పవచ్చు.

ఈ ఘటన ఇప్పటి విశాఖ వన్ టౌన్ ఏరియాలో జరిగింది. వన్ టౌన్ ఏరియాలో ప్రస్తుతం ఉన్న రిజిస్టర్ ఆఫీస్, కన్వేయర్ బెల్ట్ ఏరియా, క్వీన్ మేరి పాఠశాల, పాత బస్ స్టాండ్ ఈ ఏరియాలన్నింటిని కలిపి అప్పట్లో పరేడ్ గ్రౌండ్ అని పిలిచేవారు. ఈ గ్రౌండ్ లోనే ఆఫీసర్ల ఇల్లు, సోల్జియర్ బరాక్స్ పక్కపక్కనే ఉండేవి.

సిపాయిల తిరుగుబాటుకు సాక్ష్యంగా నిలిచిన పత్రాలు

ఫొటో సోర్స్, EDWARD PAUL

ఫొటో క్యాప్షన్, సిపాయిల తిరుగుబాటుకు సాక్ష్యంగా నిలిచిన పత్రాలు

అక్టోబర్ 3న పాత లైట్ హాస్ దగ్గర

అప్పట్లో (1780) మైసూరు ప్రాంతాన్ని హైదర్ అలీ పాలిస్తుండేవారు. అతన్ని అణచివేసి మైసూరు ప్రాంతంపై అధిపత్యం చెలాయించేందుకు బ్రిటిషర్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండేవారు. కానీ అణిచివేసే ప్రయత్నాలు ఎన్ని చేసినా, హైదర్ ఆలీ మాత్రం బ్రిటిష్ పాలకులకు తల వంచలేదు. దీంతో మైసూరు పై బ్రిటిష్ సైన్యం యుద్ధం ప్రకటించింది.

ఆ యుద్ధంలో హైదర్ అలీ సైన్యాన్ని ఢీ కొట్టేందుకు బ్రిటిష్ సైన్యం (మద్రాసు రెజిమెంట్) సరిపోయేది కాదు. దీంతో ఏలూరు, మచిలీపట్నం, విశాఖపట్నం నుంచి మైసూరుకు సైన్యాన్ని పంపాలంటూ సెప్టెంబర్ 14, 1780లో మచిలీపట్నం, విశాఖ వర్తక కేంద్రాలకు చీఫ్‌గా వ్యవహారిస్తున్న జాన్ హెన్రీ కాస్ మేజర్ కు అప్పటి మద్రాస్ గవర్నర్ జాన్ వైట్ హాల్ నుంచి లేఖ వచ్చింది. దీంతో విశాఖ రెజిమెంట్ సైన్యాన్ని నౌక ద్వారా మద్రాసు పంపాలన్నది విశాఖలో ఉన్న బ్రిటిష్ అధికారుల ప్రణాళిక.

బ్రిటిషర్లకు పడవ ప్రయాణమంటే సాధారణ విషయం. కానీ అప్పటి హైందవ సంప్రదాయం ప్రకారం భారతీయుల్లో నౌకాయానం నిషేధం.

"బ్రిటిషర్లు వాళ్ల సంస్కృతిని భారతీయులపై రుద్దే ప్రయత్నం చేశారే తప్ప, ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. మరో వైపు మైసూరు వెళ్లి పోరాడాల్సింది భారతీయులతోనే కావడం, సంప్రదాయాలకు విరుద్ధంగా నౌక ఎక్కి ప్రయాణం చేయాల్సి ఉండటం భారత సైనికుల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది" అని పాల్ అన్నారు.

దీంతో మైసూరు పై యుద్ధానికి భారత సైన్యం ఓప్పుకోలేదు. అయితే ఏలూరు, మచిలీపట్నం రెజిమెంట్లలో ఉన్న చాలా మంది సైనికులను బ్రిటిష్ అధికారులు ఒప్పించి నౌక ఎక్కించి మద్రాసు పంపించేశారు.

"విశాఖ రెజిమెంట్ సైన్యాన్ని మద్రాసు తీసుకెళ్లేందుకు అక్టోబర్ 3న పరేడ్ గ్రౌండ్ సమీపంలోని పాత లైట్‌ హౌస్ దగ్గర నౌక సిద్ధంగా ఉంది. ఉదయం నుంచి అధికారులు సైనికులను ప్రయాణానికి సిద్ధం చేస్తున్నారు. వారిలో కొందరు ఒప్పుకున్నారు. మరికొందరు ససేమిరా అన్నారు. మధ్యాహ్నం వరకు ఈ తంతు కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత బ్రిటిషర్లను వణికించిన సంఘటన జరిగింది" అని ఎడ్వర్డ్ పాల్ చెప్పారు.

విశాఖ సముద్ర తీరం

ఫొటో సోర్స్, AMBURAO

ఫొటో క్యాప్షన్, విశాఖ సముద్ర తీరం

మధ్యాహ్నం 3 గంటలకు పేలిన తుపాకులు

"సమయం మధ్యాహ్నం మూడు కావస్తోంది. అప్పటికే తుపాకులతో బెదిరించి బ్రిటిష్ అధికారులు విశాఖ రెజిమెంట్‌కు చెందిన కొందరు సైనికులను బలవంతంగా నౌకలోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు.

సైన్యంలో అగ్రహాం కట్టలు తెంచుకుంది.

"విశాఖ రెజిమెంట్ సైనికులు ఒక్కసారిగా ఫైర్ ఓపెన్ చేశారు. దాంతో షాక్‌కు గురైన బ్రిటిష్ సైన్యం కూడా తమ తుపాకులకు పని చెప్పింది. అయితే అప్పటీకే ముగ్గురు బ్రిటిష్ అధికారులు విశాఖ రెజిమెంట్ సైనికులు జరిపిన కాల్పుల్లో మరణించారు. ఆ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున విశాఖ వర్తక కేంద్రానికి చీఫ్ గా ఉన్న జాన్ హెన్రీ కాస్ మేజర్‌ను భారతీయ సైనికులు బంధించారు. అతడి దగ్గరున్న కొన్ని పత్రాలను ధ్వంసం చేశారు" అని పాల్ వివరించారు.

"అప్పటికే ప్రాణభయంతో ఉన్న కాస్ మేజర్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన రూ. 21,999 సొమ్మును సైన్యానికి అప్పగించి, వారి డిమాండ్లను అంగీకరిస్తూ పత్రాలపై సంతకాలు సైతం చేశారు".

"ఈ ఘటనపై మద్రాస్ గవర్నర్‌కు కాస్ మేజర్ రిపోర్ట్ అందచేశారు. వైజాగపటం రెజిమెంట్ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైనదని అందులో పేర్కొన్నారు. దీనిని బట్టి ఇక్కడ సంఘటన ఎంత తీవ్రమైనదో అర్థం అవుతుంది" అని అన్నారు చరిత్రకారులు పాల్.

ఓల్డ్ పోస్ట్ ఆఫీసు దగ్గరున్న సమాధులు

ఫొటో సోర్స్, EDWARD PAUL

ఫొటో క్యాప్షన్, ఓల్డ్ పోస్ట్ ఆఫీసు దగ్గరున్న సమాధులు

ఫిరంగికి కట్టి పేల్చేశారు...

"విశాఖ రెజిమెంట్ సైన్యం చేసిన తిరుగుబాటుతో బ్రిటిష్ అధికారులు, సైన్యం భయకంపితులైయ్యారు. వీరంతా ప్రాణాలను రక్షించుకునేందుకు పారిపోయి వేర్వేరు ప్రదేశాల్లో దాక్కున్నారు. ఆ రోజు రాత్రంతా భారతీయ సైనికులు అక్కడే ఉండి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు."

"మైసూరులో హైదర్ అలీతో బ్రిటిషర్లు చేస్తున్న యుద్ధంలో హైదర్ అలీకి సహాయంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడ నుంచి మార్చ్ చేసుకుంటూ బయలుదేరారు. అయితే విషయం తెలుసుకున్న బ్రిటిష్ ఉన్నతాధికారులు, సమీప జమీందార్లకు ఆదేశాలు జారీ చేశారు.

విశాఖ రెజిమెంట్ లో తిరుగుబాటు చేసి మైసూరు బయలుదేరిన సైనికులు ఆచూకీ తెలియపర్చాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వీరి ఆదేశాలను ఎక్కువ మంది జమీందార్లు పట్టించుకోలేదని ఆంధ్ర విశ్వవిద్యాలయం హిస్టరీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ బీబీసీతో చెప్పారు.

"విశాఖలో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు సుబేదార్‌ షేక్‌ అహ్మద్‌ నాయకత్వం వహించారు. బృందాలుగా విడిపోయి విశాఖ రెజిమెంట్ నుంచి మైసూరు బయలుదేరిన సైనిక బృందాల్లో కొందరు బ్రిటిష్ సైన్యానికి చిక్కారు.

అలా అక్టోబర్ 8వ తేదీన సుబేదార్ షేక్ అహ్మద్ బృందం కూడా బ్రిటిషర్లకు చిక్కింది. బ్రిటిషర్లకు చిక్కిన భారతీయ సైనికులను ఎక్కడికక్కడే కాల్చిచంపగా, కొందరిని రెజిమెంట్‌కు తీసుకుని వచ్చి అక్కడే అంతా చూస్తుండగా కాల్చేశారు.

కానీ తిరుగుబాటను ముందుడి నడిపించిన షేక్‌ అహ్మద్‌ను మాత్రం ఫిరంగి గొట్టం ముందు భాగంలో ఉన్న రంధ్రానికి అడ్డంగా కట్టి పేల్చేశారు. దీంతో అతని శరీరం ముక్కలు ముక్కలై చెల్లా చెదురుగా పడింది. చిన్నాభిన్నమైన అహ్మద్‌ శరీర భాగాలను అప్పటి వన్ టౌన్ ఏరియా స్థానికులు ఒక చోటికి చేర్చి అలంగీర్‌ దర్గా వద్ద ఉంచి మినార్‌ను నిర్మించారు. ఈ విషయాలు లండన్ ఆర్క్‌హైవ్స్ ఉన్న గెజెట్‌లో ఉన్నాయి" అని ప్రొఫెసర్ సూర్యనారాయణ తెలిపారు.

వన్ టౌన్ ఏరియా
ఫొటో క్యాప్షన్, వన్ టౌన్ ఏరియా

తిరుగుబాటుకు సాక్ష్యం సమాధులే

"సిపాయిల తిరుగుబాటులో మరణించిన లెప్ట్‌నెంట్‌ క్రిప్స్‌, కింగ్స్‌ ఫోర్ట్‌ వెన్నర్‌, రాబర్ట్‌ రూథర్‌‌ఫర్డ్‌ సమాధులు పాత పోస్టాఫీసు దగ్గర ఓల్డ్ యూరోపియన్ సెమెట్రీలో న్నాయి. ఈ సమాధులు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతానికి ఈ సమాధులు మాత్రమే నాటి తిరుగుబాటుకు సాక్ష్యాలుగా మిగిలి ఉన్నాయి. మూడు సమాధుల్లో కింగ్స్‌ ఫోర్ట్‌ వెన్నర్‌ సమాధి మాత్రమే గుర్తించేందుకు వీలుగా ఉంది. వీటిని కూడా రక్షించకపోతే విశాఖ ప్రాంతంలో జరిగిన చారిత్రక ఘట్టాలు, స్వాతంత్య్రం నాటి ఘటనలు, పోరాటాలు భవిష్యత్తు తరాలకు అందించలేం" అని కొల్లూరు సూర్యనారాయణ అన్నారు.

"1780 అక్టోబర్ 3న జరిగిన సిపాయిల తిరుగుబాటు, దానికి దారి తీసిన పరిస్థితులకు సంబంధించిన ఆనవాళ్లు, చిహ్నాలు సేకరించి వాటిన భద్రపరచాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ సంఘటనను వివరించే ఛాయా చిత్రాలు, చారిత్రక ఆధారాలను ప్రదర్శించాలి".

"ఈ ఘటనను సంబంధించిన పోరాట ఘట్టాలు, దీనికి సంబంధించిన వివరాలు మద్రాస్‌ పోర్ట్‌ సెయింట్‌ జార్జ్‌ మ్యూజియంలో కూడా కొన్ని ఉన్నాయి. ఆ తిరుగుబాటులో సిపాయిలు, అధికారులు వాడిన ఆయుధాలు, ధరించిన దుస్తులు వంటివి అక్కడ భద్రపరిచారు" అని వివరించారు.

విశాఖ రెజిమెంట్ సైన్యం బ్రిటిషర్లపై చేసిన తిరుగుబాటును స్ఫూర్తిగా తీసుకుని తమిళనాడు, వెల్లూరులో సైనికులు 1806లో తిరుగుబాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అక్కడి ప్రభుత్వం 2006లో 200 సంవత్సరాలు సిపాయిల తిరుగుబాటుని గుర్తు చేసుకుంటూ ఉత్సవాలు కూడా నిర్వహించారని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)