ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు : పీవీ, మన్మోహన్‌లు సంక్షోభంలో అవకాశాలను ఎలా అందిపుచ్చున్నారు ?

పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, PRASHANT PANJIAR/THE THE INDIA TODAY GROUP VIA GE

ఫొటో క్యాప్షన్, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పీవీకి రెండో ఆప్షన్
    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

1991 జులై 24ను భారతదేశ ఆర్థిక స్వాతంత్ర్య దినోత్సవం అని పేర్కోనడంలో ఎంత మాత్రం తప్పు లేదు. సరిగ్గా 30 సంవత్సరాల కిందట ఇదే రోజు సమర్పించిన బడ్జెట్ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు బాటలు పరిచింది.

1991 నాటికి భారతదేశం క్లోజ్డ్ ఎకానమీగా ఉండేది. అంటే ప్రతి నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంత ఖర్చు చేయాలి, ఎంతమందిని వినియోగించాలి అన్నవన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. ఈ వ్యవస్థనే పర్మిట్‌ రాజ్ లేదంటే లైసెన్స్ రాజ్ అంటారు.

అందుకు భిన్నంగా ఓపెన్ ఎకానమీలో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తారు. ఈ ఆర్థిక సంస్కరణలను ప్రకటిస్తూ అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ జులై 24, 1991న బడ్జెట్ ప్రవేశపెట్టారు.

మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు మన్మోహన్ సింగ్ ఆర్థిక సలహాదారుగా పని చేశారు

ఫొటో సోర్స్, T.C. MALHOTRA/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు మన్మోహన్ సింగ్ ఆర్థిక సలహాదారుగా పని చేశారు

ఆనాటి బడ్జెట్ ముఖ్యాంశాలు

  • దేశీయ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెంచుతాం.
  • లైసెన్సింగ్ రాజ్ ముగిసింది. కంపెనీలు పర్మిట్ల నుంచి విముక్తి పొందాయి.
  • ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతి లైసెన్సింగ్‌లో సడలింపులే లక్ష్యంగా బడ్జెట్‌లో పలు మార్పులు ప్రకటించారు.
  • దిగుమతి లైసెన్సింగ్‌ను సడలించడం, ఎగుమతులను ప్రోత్సహించడం లక్ష్యంగా దిగుమతి-ఎగుమతి విధానంలో విదేశీ పెట్టుబడులను స్వాగతించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉద్యోగాలు సృష్టిస్తాయని తెలిపారు.
  • సాఫ్ట్‌వేర్ ఎగుమతి కోసం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 హెచ్‌హెచ్‌సి కింద పన్ను మినహాయింపు ప్రకటించారు.

ఈ బడ్జెట్‌ను ఆధునిక భారతదేశ చరిత్రలో అతి పెద్ద నిర్ణయాలలో ఒకటిగా పరిగణిస్తారు. దీని క్రెడిట్ అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌లకు దక్కింది.

''సమయం వచ్చినప్పుడు ఒక ఆలోచనను ఏ శక్తీ ఆపలేదు'' అంటూ ఫ్రెంచ్ తత్వవేత్త విక్టర్ హ్యూగో మాటలను అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గుర్తు చేశారు. అంటే, భారతదేశం ప్రపంచశక్తిగా, ఆర్థిక శక్తిగా మారే సమయం వచ్చిందని, దానిని ఎవరూ ఆపలేరని ఆ మాటల అర్ధం.

అయితే, మన్మోహన్ సింగ్ అభిప్రాయాలకు విరుద్ధంగా అప్పట్లో ఆర్థిక సంస్కరణలకు పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అప్పటికే భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది.

''ఇది అనివార్యం. కొన్ని అనివార్య పరిస్థితులు ఎదురైనప్పుడు మనం దానిని సవాలుగా తీసుకోవాలి. మార్పును స్వీకరించినప్పుడే పురోగతి ఉంటుంది. 1991 నాటి సంక్షోభం అలాంటిదే. అయితే, ఆ సమయంలో నరసింహారావు వంటి సీనియర్ నాయకుడు ప్రధానిగా ఉండటం దేశం అదృష్టం. ఆయన తన ఆలోచనతో దేశానికి మేలు చేశారు. దేశం దిశ మార్చారు'' అని ప్రసారభారతి మాజీ చైర్మన్ సూర్యప్రకాశ్ బీబీసీతో అన్నారు. అప్పట్లో ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో జర్నలిస్టుగా పని చేస్తుండే వారు.

రాజకీయాల నుంచి తప్పుకునే దశలో హఠాత్తుగా పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు.

ఫొటో సోర్స్, RAVEENDRAN/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రాజకీయాల నుంచి తప్పుకునే దశలో హఠాత్తుగా పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు.

సంస్కరణల దాక పయనం

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారతదేశం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సంస్కరణల ఆవశ్యకత ఉందని తెలుసు కానీ, రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఎప్పుడూ లేదు.

ఇందిరా గాంధీ 1966లోనే సంస్కరణల కోసం విఫల ప్రయత్నం చేశారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్లు, కలర్ టీవీలను తీసుకువచ్చారు. కాని ఆర్థిక సంస్కరణల మార్గంలో ఎప్పుడూ వెళ్ళలేదు.

ఇంతలో, భారతదేశ ఆర్థిక సమస్యలు పెరిగాయి. 1980 లలో ఈ సమస్యలు మరింత పెరిగాయి. 1990 నాటికి ఈ సమస్యలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రూపాన్ని సంతరించుకున్నాయి.

ఆ సమయంలో చంద్రశేఖర్ ప్రధానిగా, యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆనాటి పరిస్థితుల గురించి ఓ సందర్భంలో యశ్వంత్ సిన్హా బీబీసీతో మాట్లాడారు.

''సుప్రసిద్ధ ఆర్థికవేత్త ఐజీ పటేల్ 1991లో బెంగళూరులో ఒక ఉపన్యాసంలో చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఐదేళ్లపాటు ఎవరికీ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించింది అని ఆయన చెప్పారు'' అని యశ్వంత్ సిన్హా వెల్లడించారు.

''దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది కాబట్టి రుణం తీసుకోవాలని 1988లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సూచించినప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దానికి అంగీకరించారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున తర్వాత ఆయన దానిని పట్టించుకోలేదు. ఆ సమయంలో ఆయన పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కూడా దీని గురించి ఆలోచించ లేదు'' అని సీనియర్ జర్నలిస్ట్ శంకర్ అయ్యర్ అన్నారు.

1989 సార్వత్రిక ఎన్నికల తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం ఏర్పడింది. ఇది రెండు ఊత కర్రల సాయంతో నడుస్తున్న ప్రభుత్వంగా అప్పట్లో చెప్పుకునే వారు. వీపీ సింగ్ సర్కారుకు కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇచ్చాయి.

వీపీ సింగ్ ప్రధాని అయిన కొత్తలో, ఖజానా ఖాళీగా ఉందని ప్రకటించారు.

ఆ తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం రిజర్వేషన్ల సంక్షోభంలో కూరుకుపోయింది. ఏడాదిన్నర తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయింది. చంద్రశేఖర్ ప్రధాని, యశ్వంత్ సిన్హా ఆయన ఆర్థిక మంత్రి కాగా, డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారు అయ్యారు.

అప్పటికి దేశ ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రంగా మారింది. నాటి సంక్షోభాన్ని గుర్తు చేసుకుంటూ సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తాకు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

''దేశం సంక్షోభంలో ఉంది. చంద్రశేఖర్ ప్రధాని అయ్యారు. ఆయన నాకు ఆర్థిక సలహాదారు పదవి ఇచ్చారు. నా శక్తినంతా ఉపయోగించి దీని నుంచి బయటపడేందుకు సహాయం చేయాలని అడిగారు. ఏం చేయాలో నేను ఆలోచించడం మొదలు పెట్టాను'' అని మన్మోహన్ సింగ్ అన్నారు.

యశ్వంత్ సిన్హా ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టాల్సి ఉండగా ఆ అవకాశం దక్కలేదు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యశ్వంత్ సిన్హా ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టాల్సి ఉండగా ఆ అవకాశం దక్కలేదు

బంగారం తాకట్టు వివాదం

అప్పటికి భారత దేశం భారీ రుణాలు తీసుకునే దేశం కాదు. కానీ, తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పటి చిన్న చిన్న రుణాల పైనే ప్రభుత్వం ఆధారపడింది. 5 బిలియన్ డాలర్లకు రుణం చెల్లించాల్సి ఉంది. దానిపై వడ్డీ చెల్లించడానికి కూడా డబ్బు లేదు.

''నేను ఆర్థిక మంత్రి కావడానికి ముందు 5 బిలియన్ డాలర్ల స్వల్పకాలిక రుణం తీసుకున్నారు. స్వల్పకాలిక రుణం అంటే 30 రోజుల నుండి 90 రోజులలో తీర్చాల్సిన రుణం. తక్కువ విదేశీ మారక నిల్వలు ఉండటం వల్ల తీర్చలేని పరిస్థితి. అలాగని ఎగవేతదారుడిగా మారడానికి వీల్లేదు. బ్యాలన్స్‌లో, చెల్లింపుల్లో అసమతుల్యత కారణంగా ఆర్థిక సంక్షోభం తీవ్రంగా మారింది. అటువంటి పరిస్థితిలో స్మగ్లర్ల నుండి జప్తు చేసిన బంగారాన్ని కేంద్ర ప్రభుత్వం స్విట్జర్లాండ్‌లోని ఒక బ్యాంకులో తనఖా పెట్టింది. ఇవన్నీ రహస్యంగా జరిగాయి. కానీ దీనివల్ల కూడా దేశానికి పెద్దగా ప్రయోజనం కలగ లేదు'' అన్నారు యశ్వంత్ సిన్హా.

కొన్ని నెలల తర్వాత ఆర్‌బీఐ దగ్గరున్న బంగారు నిల్వలను రెండు విదేశీ బ్యాంకుల దగ్గర తనఖా పెట్టింది ప్రభుత్వం. ఇదంతా రహస్యంగా చేసినా, 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కు చెందిన ఓ పరిశోధనాత్మక జర్నలిస్ట్ దీనిని బైటపెట్టారు. నాటి దేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ స్థితిగతులను బయట పెట్టిన వారిలో ప్రముఖ జర్నలిస్ట్ శంకర్ అయ్యర్ కూడా ఒకరు.

''ఒక కుటుంబం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు, చివరి ప్రయత్నంగా మహిళల ఆభరణాలను తనఖా పెడతారు. నా రిపోర్టింగ్ ద్వారా దేశ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందుంచాను. బంగారం తనఖా పెట్టడం వల్ల వచ్చిన మొత్తం కేవలం 400 మిలియన్ డాలర్లు. ఇప్పటి లెక్కల ప్రకారం ఇది చాలా చిన్న మొత్తం. బంగారం కుదువ బెట్టినందుకు ప్రతిపక్షాలు, మీడియా అప్పటి ప్రధాని చంద్రశేఖర్, ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హాలపై విరుచుకు పడ్డాయి'' అని శంకర్ అయ్యర్ వెల్లడించారు.

''నేను పట్నాలో ఎన్నికల ప్రచారంలో ఉన్నాను. నా సంతకం కోసం ఆర్థిక శాఖ అధికారి నా దగ్గరికి వచ్చారు. బంగారం తనఖా పెట్టేందుకు ప్రభుత్వానికి బయటి నుంచి మద్ధతిస్తున్న రాజీవ్ గాంధీ కూడా అంగీకరించారు కాబట్టి నేను సంతకం చేశాను''అని యశ్వంత్ సిన్హా అన్నారు.

''మన దేశ బంగారాన్ని తనఖా పెట్టిన వ్యక్తి ఇతనే అంటూ ప్రత్యర్ధులు నాపై విమర్శలు చేశారు'' అన్నారాయన.

గల్ఫ్ యుద్ధం- చమురు సంక్షోభం

బంగారం తాకట్టు పెట్టడం ద్వారా భారత ప్రభుత్వానికి పెద్దగా ప్రయోజనం రాలేదు. ఆర్థిక సంక్షోభం పెరుగుతూనే ఉంది. అటువంటి పరిస్థితిలోనే గల్ఫ్ యుద్ధం ప్రారంభమైంది. ఇది భారత దేశానికి రెండు రకాల సమస్యలను తెచ్చిపెట్టింది. మొదటిది దౌత్యపరంగా ఇరాక్, అమెరికాలలో ఎవరికి మద్దతివ్వాలో నిర్ణయించుకోవాల్సి రావడం.

రెండవది, యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడి చమురు ధరలను అదుపు చేయడం.

యుద్ధానికి ముందు భారతదేశం ప్రతి నెలా చమురు దిగుమతుల కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసేది. యుద్ధం ప్రారంభమైన తరువాత ఆ ఖర్చు నెలకు రూ. 1200 కోట్లకు చేరింది.

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి చంద్రశేఖర్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధిని సంప్రదించవలసి వచ్చింది. ''ఆయన (చంద్రశేఖర్) ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు, మైనారిటీ ప్రభుత్వం కావడంతో అంతర్జాతీయ ద్రవ్య నిధిలో అమెరికా మద్దతు లభించలేదు. సుబ్రమణ్య స్వామి వాణిజ్య మంత్రిగా ఉన్న సమయంలో అమెరికా విదేశాంగ శాఖతో మాట్లాడి వారి సహకారం పొందాలని చంద్రశేఖర్ చెప్పారు'' శంకర్ అయ్యర్ వెల్లడించారు.

గల్ఫ్ యుద్ధంలో పాల్గొనే విమానాలకు ఇంధనం నింపడానికి భారత విమానాశ్రయాలను ఉపయోగించడానికి అమెరికాకు అనుమతి అవసరం. దానికి స్వామి అంగీకరించారు.

''ఒప్పందం కుదిరిన మరుసటి రోజు మొదటి అమెరికా విమానం భారత దేశంలో ల్యాండ్ అయింది. ఆ తర్వాత నాలుగైదు రోజుల తర్వాత భారత దేశపు రుణ విజ్ఙప్తిని ఐఎమ్ఎఫ్ అంగీకరించింది'' అని శంకర్ అయ్యర్ వెల్లడించారు.

చంద్రశేఖర్, సుబ్రమణ్య స్వామిల దూరదృష్టి కారణంగా అతి తక్కువ కాలంలోనే భారత్‌కు రుణం లభించింది. ఆ రోజుల్లో భారత్‌కు అప్పు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ మినహా ఎవరూ సిద్ధంగా లేరు.

జులై 24, 1991న మన్మోహన్ సింగ్ చరిత్రాత్మక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

ఫొటో సోర్స్, BUDA MENDES/LATINCONTENT VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, జులై 24, 1991న మన్మోహన్ సింగ్ చరిత్రాత్మక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

మన్మోహన్ సింగ్ పాత్ర

అంతర్జాతీయ ద్రవ్య నిధి అప్పు ఇచ్చి 25 షరతులు విధించింది. ఇందులో భారత దేశ ఆర్థిక వ్యవస్థను ఓపెన్ ఎకానమీగా మార్చడం ఒకటి. అలాగే ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణకు అంగీకరించాలి.

1991 మే లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీవ్ గాంధీ టికెట్ ఇవ్వకపోవడంతో పీవీ నరసింహారావు రాజకీయాల నుండి సగం రిటైర్మెంట్ తీసుకున్నారు. కానీ విధి మరోలా ఉంది. రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. నరసింహారావు ప్రధాన మంత్రి అయ్యారు.

మెజారిటీకి సరిపడా ఎంపీలను కూడగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆర్థిక మంత్రి పదవికి ఆయన మొదటి ఆప్షన్ ఆర్థికవేత్త ఐజీ పటేల్. కానీ, పీవీ ప్రతిపాదనను పటేల్ తిరస్కరించడంతో చంద్రశేఖర్ ఆర్థిక సలహాదారుగా ఉన్న మన్మోహన్ సింగ్‌పై పీవీ దృష్టి పడింది.

అప్పటికి ఆయన యూజీసీ ఛైర్మన్‌గా పని చేస్తున్నారు.

‘‘అంతర్జాతీయ ఆర్థిక సంస్థలలో డాక్టర్ సింగ్‌కు మంచి పేరు ఉంది. ఆయనను ఆర్థిక మంత్రిని చేయడం వెనుక ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు ఉద్దేశం అంతర్జాతీయ బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందవచ్చు అన్నదే’’ అని శంకర్ అయ్యర్ తెలిపారు.

డాక్టర్ సింగ్ ఆర్థిక మంత్రి అయ్యాక, నరసింహారావు ఎప్పుడూ ఆయనకు దూరంగా లేరు. ‘‘ఆర్థిక సంస్కరణలు తెచ్చినందుకు వామపక్ష పార్టీలు మన్మోహన్‌ను తీవ్రంగా విమర్శించేవి. కానీ, ప్రధాని ఆయనకు అండగా నిలబడ్డారు'' అన్నారు సూర్యప్రకాశ్.

''డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి తనవంతు ప్రయత్నం చేశారు. ఆయనకు వెనకుండి మేం మద్ధతిచ్చాం'' అని శేఖర్ గుప్తాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీవీ నరసింహారావు స్వయంగా వెల్లడించారు.

సొంత పార్టీ నుంచి వ్యతిరేక కనిపించినా సంస్కరణలు ముందుకు తీసుకెళ్లడానికే పీవీ సిద్ధమయ్యారు

ఫొటో సోర్స్, ROBERT NICKELSBERG/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సొంత పార్టీ నుంచి వ్యతిరేక కనిపించినా సంస్కరణలు ముందుకు తీసుకెళ్లడానికే పీవీ సిద్ధమయ్యారు

జూలై 24, 1991 చరిత్రాత్మక దినం

జూన్‌లో నరసింహారావు ప్రభుత్వం ఏర్పడింది. మరుసటి నెలలోనే చరిత్రాత్మక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ దేశం గతిని మార్చేసింది. సాధారణంగా బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి మూడు నెలల సమయం పడుతుంది. కానీ, మన్మోహన్ సింగ్ దానిని నెల రోజుల్లోనే దానిని సిద్ధం చేశారు.

అనేక మార్పులు అవసరం ఉండటంతో పరిశ్రమల శాఖను పీవీ తన వద్దే ఉంచుకున్నారు. తన సహచరుల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన సంస్కరణలు అమలు చేశారు.

కొద్దికాలంలోనే దాని ఫలితాలు కనిపించడం ప్రారంభించాయి. ప్రభుత్వానికి ఆదాయం రావడం మొదలైంది. విదేశీ పెట్టుబడులు వచ్చాయి.

అయితే, విదేశీ కంపెనీల రాక వల్ల భారతీయ కంపెనీలు దెబ్బతింటాయని లేదంటే విదేశీ కంపెనీలకు లోకల్ సప్లయర్లుగా మిగిలిపోతాయన్న ఆందోళన కూడా కనిపించింది.

కానీ, మార్కెట్లో మిలియన్ల కొద్దీ కొత్త ఉద్యోగాలు వచ్చాయి. కోట్ల మంది ప్రజలు మొదటిసారిగా దారిద్య్ర రేఖకు ఎగువకు చేరుకున్నారు.

వీడియో క్యాప్షన్, ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు: పీవీ, మన్మోహన్ తీసుకున్న కీలక నిర్ణయాలేంటి?

ఆర్థిక సంస్కరణల హీరో ఎవరు ?

ఆర్థిక సంస్కరణల నిజమైన హీరో పీవీ నరసింహారావు అని సూర్య ప్రకాశ్, శంకర్ అయ్యర్‌ లాంటి సీనియర్ జర్నలిస్టులు చెప్పినా, నాటి మీడియా మాత్రం డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను హీరోగా చేసింది.

1991లో ప్రభుత్వం పడిపోకపోతే, చంద్రశేఖర్, యశ్వంత్ సిన్హాలు ఆర్థిక సంస్కరణల హీరోలుగా మిగిలే వారు.

1991 బడ్జెట్‌ను యశ్వంత్ సిన్హా సిద్ధం చేశారు. ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన అనేక నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. ఫిబ్రవరి 28న బడ్జెట్‌ను సమర్పించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం, కాంగ్రెస్‌లకు మధ్య భేదాభిప్రాయల కారణంగా అది సాధ్యం కాలేదు.

యశ్వంత్ సిన్హాను మధ్యంతర బడ్జెట్ మాత్రమే సమర్పించాలని కోరారు. దీంతో యశ్వంత్ సిన్హా రాజీనామా చేశారు. ''తాత్కాలిక బడ్జెట్‌ను సమర్పించమని అడిగినప్పుడు, నేను దానిని తీవ్రంగా వ్యతిరేకించాను. ఇంటికి వచ్చి నా రాజీనామా లేఖను ప్రధానమంత్రికి పంపాను’’ అని యశ్వంత్ సిన్హా వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు మన జీవితాల్ని ఎలా మార్చేశాయి?

కానీ, ప్రధాని చంద్రశేఖర్ ఒప్పించడంతో యశ్వంత్ సిన్హా రాజీనామాను ఉపసంహరించుకున్నారు. మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. (కొన్ని వారాల తరువాత ప్రభుత్వం పడిపోయింది)

''బడ్జెట్ ప్రసంగం సిద్ధంగా ఉంది. కానీ, మధ్యంతర బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఆ బడ్జెట్ ప్రసంగాన్ని చూడండి. జూలైలో మన్మోహన్ సింగ్ సమర్పించిన బడ్జెట్ ప్రసంగాన్ని చూడండి. రెండింటిలోనూ భాష ఒకేలా ఉంటుంది. మా మధ్యంతర బడ్జెట్‌లో మేం చెప్పిన అనేక పేరాలు, మాటలు, భాష కూడా మన్మోహన్ ప్రసంగంలో ఉన్నాయి'' అన్నారు యశ్వంత్ సిన్హా

జర్నలిస్ట్ శంకర్ అయ్యర్ కూడా దీనిని అంగీకరించారు. ''కాంగ్రెస్ పార్టీకి చంద్రశేఖర్ ప్రభుత్వం సంస్కరణల క్రెడిట్ తీసుకోవడం ఇష్టం లేదు. పెద్ద ఎత్తున సంస్కరణలను ప్రకటించబోతున్నారని కాంగ్రెస్‌కు తెలిసింది. అది ఇష్టం లేక ప్రభుత్వాన్ని కూల్చేశారు'' అని ఆయన అన్నారు.

''సిన్హా బడ్జెట్‌ను సమర్పించినట్లయితే సంస్కరణల క్రెడిట్ ఆయనకు దక్కేది. ఆయన గురించి నాకు ఎప్పుడూ ఒకటే అనిపిస్తుంది. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ టైమ్ అని. ఆయన టైమ్ బాగా లేదు అంతే '' అన్నారు శంకర్ అయ్యర్.

కొందరు సంస్కరణలు నెమ్మదిగా సాగుతున్నాయని వాదిస్తే, మరికొందరు వీటి కారణంగా సమాజంలో ఆర్ధిక అసమానతలు పెరిగాయని వాదిస్తారు. అయితే, ఒక్కటి మాత్రం అందరూ అంగీకరిస్తారు. 30 సంవత్సరాల కిందట తీసుకున్న నిర్ణయం దేశాన్ని భారీ ఆర్థిక వ్యవస్థగా మార్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)