ఏపీ హైకోర్టు: బెయిల్ వచ్చిన వెంటనే నిందితుడి విడుదలకు 5 మార్గదర్శకాలు

ఫొటో సోర్స్, hc.ap.nic.in
బెయిలు ఇచ్చిన తరువాత కూడా ఖైదీల విడుదలలో జాప్యం జరుగుతున్న సందర్భాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
అండర్ ట్రయల్ ఖైదీలు, నిందితులు బెయిల్ పొందిన తరువాత వెంటనే విడుదలయ్యేందుకు వీలుగా సులభతర విధానాన్ని రూపొందించింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ఆదేశాలు జారీచేశారు.

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN
''వ్యక్తుల స్వేచ్ఛను కాపాడడం న్యాయస్థానాల విధి. నిందితుల హక్కుల పరిరక్షణకూ నేర న్యాయ విచారణ వ్యవస్థ ప్రాధాన్యమిస్తుంది. బెయిలు పిటిషన్లను వేగంగా పరిష్కరించాలని కోరే హక్కు నిందితులకు ఉంది. అందుకే బెయిల్ ఉత్తర్వులు వెంటనే అమలయ్యేలా ఈ విధానం తీసుకొస్తున్నాం'' అని న్యాయమూర్తి ఈ సందర్భంగా చెప్పారు.
ఈ ఆదేశాలు జులై 26 నుంచి అమలులోకి వస్తాయి.

ఫొటో సోర్స్, APhighcourt
కొత్త మార్గదర్శకాలు
1) పార్టీలు కానీ న్యాయవాదులు కానీ హైకోర్టు వెబ్‌సైట్ నుంచి కేసు వివరాలతోపాటు న్యాయస్థానం ఇచ్చిన బెయిలు ఆర్డర్ కాపీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
2) ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి తరఫున పూచీకత్తుల సమర్పణ సమయంలో మెమో దాఖలు చేసినప్పుడు న్యాయవాదులు అందులో.. ఆర్డర్ కాపీని హైకోర్టు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నట్లు స్పష్టం చేయాలి.
సంబంధిత అడ్మినిస్ట్రేవ్ ఆఫీసర్ కానీ చీఫ్ మినిస్టీరియల్ ఆఫీసర్ కానీ హైకోర్టు వెబ్‌సైట్‌లో ఆ ప్రతిని పరిశీలించుకున్నాక ఆర్డర్ కాపీని న్యాయస్థానం ముందుంచాలి.
3) పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఈ వ్యవహారంలో కోర్టుకు సహాయకారిగా ఉండాలి.
4) ప్రిసైడింగ్ అధికారి అదే రోజు ఆ అభ్యర్థనను పరిష్కరించి విడుదల ఉత్తర్వులు ఆ రోజే జారీచేయాలి. వాటిని సంబంధిత జైలు అధికారులకు వెంటనే ఈ- మెయిల్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ విధానంలో కానీ పంపించాలి.
5) ఒకవేళ ముందస్తు బెయిలు విషయంలో అయితే న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల కచ్చితత్వాన్ని పరిశీలించాల్సిన బాధ్యత సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌పై ఉంటుంది. ఈ విషయంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ అవసరమైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూచనలు తీసుకుని అదే రోజు విడుదల ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది.
‘వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షించే తీర్పు’
ఇది వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షించే తీర్పని ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది డాక్టర్ మజ్జి సూరిబాబు అన్నారు.
‘రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాపాడేందుకు, నిర్బంధంలో ఉన్న వ్యక్తి తనను తాను కాపాడుకోవడం కోసం బెయిల్ పొందిన తరువాత ఒక్క క్షణం కూడా చట్టపరమైన కస్టడీలో ఉండకుండా చూసేందుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన అత్యుత్తమమైన తీర్పు ఇది. భారత చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షించడం గురించి చెప్పిన మాటలకు ఏపీ హైకోర్టు నుంచి వచ్చిన సత్వర స్పందన ఇది' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- టోక్యో ఒలింపిక్స్: ఘనంగా ప్రారంభమైన ప్రపంచ క్రీడా వేడుక
- తెలంగాణ: వనపర్తి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమేంటి?
- కృష్ణా జల వివాదం: నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకీ వివాదం, దీనికి మూలం ఎక్కడ?
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్లో రోడ్ల మీదే చేపల వేట
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








