తెలంగాణ: వనపర్తి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమేంటి?

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
తెలంగాణ రాష్ట్రం వనపర్తి పట్టణానికి చెందిన లావణ్య అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు తన చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదనే తాను ప్రాణాలు తీసుకుంటున్నట్లు చనిపోయే ముందు తీసుకున్న వీడియోలో చెప్పారు.
ద్యారపోగు లావణ్య పదవ తరగతి తరువాత పాలిటెక్నిక్ చదివారు. ఆ తరువాత ఈసెట్ ద్వారా నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరారు. ప్రస్తుతం సెకండ్ సెమిస్టర్ మిడ్ ఎగ్జామ్స్ ఉండగా... ఆదివారం సాయంత్రం పరీక్షలున్నాయన్న సమాచారం లావణ్యకు అందింది.
‘ఒక్కసారిగా అంత డబ్బు తేలేమని చెప్పాం’
కాలేజీ యాజమాన్యం నుంచి వచ్చిన మెసేజ్‌ను సోమవారం చూసుకున్న లావణ్య అదే విషయం తల్లితండ్రులకు చెప్పారు.
'లావణ్య రూ. 20 వేలు కావాలని అడిగింది. అప్పటికప్పుడు అంతడబ్బు ఎలా తేవాలని అన్నాం. వాళ్ల నాన్న పనికి వెళ్లాడు. నన్ను ఇంటి దగ్గరే ఉండి ఎవర్నైనా అప్పు అడిగి డబ్బు సర్దమన్నాడు. చుట్టుపక్కల తెలిసిన వాళ్లను అడిగి 8 వేలు పూడ్చి, నాదగ్గర ఉన్న మరో 2 వేలు కలిపి పదివేలు ఇచ్చాం. సరేనని పుస్తకాలు, బట్టలు సర్దుకుంది. తమ్ముడి స్కూల్లో పుస్తకాలు ఇస్తారు, తమ్ముణ్ణి తీసుకుని స్కూలుకు వెళ్లు అని నాకు చెప్పింది. మేం తిరిగి వచ్చేసరికి ఆత్మహత్య చేసుకుంది'' అంటూ లావణ్య తల్లి ఈశ్వరమ్మ వివరించారు .
లావణ్యకి 8వ తరగతి చదివే తమ్ముడు ఉన్నారు. ఆమె తండ్రి స్థానిక మిషన్ భగీరథ స్కీం కాంట్రాక్టరు దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. తల్లి అక్కడే తోటమాలిగా పనిచేస్తున్నారు. ఇద్దరికీ చెరో 8 వేల జీతం.

ఫొటో సోర్స్, UGC
పెళ్లి వద్దని చదువు
లావణ్యకు చిన్నప్పటి నుంచీ చదువు అంటే బాగా ఇష్టం. ఆ ఇంట్లో ఇంజనీరింగ్ చదువుతున్నది లావణ్య ఒక్కరే. పాలిటెక్నిక్ తరువాత లావణ్యకు పెళ్లి చేయాలనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. పెళ్లి వద్దని ఇంట్లో వాళ్లను ఒప్పించి, ఇంజినీరింగ్ వైపు వెళ్లారు లావణ్య.
''నిన్ను పెద్ద చదువులు చదివించడానికి అంత పెట్టుబడి పెట్టలేమని వాళ్ల నాన్న అన్నాడు. నాకు పెళ్లి వద్దు. ఏదో రకంగా కష్టపడి మూడేళ్లు నన్ను ఇంజినీరింగ్ చదివించండి చాలు అని చెప్పి వాళ్ల నాన్నను ఒప్పించింది. ఆమె చిన్నప్పటి నుంచీ బాగా చదివేది. దాంతో వాళ్ల నాన్న కూడా ఎలాగోలా చదివిద్దాం అని ఒప్పుకున్నారు'' అంటూ వివరించారు తల్లి ఈశ్వరమ్మ.

‘పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసింది ’
'మామా నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలి అంది. తల్లితండ్రులు సమక్షంలోనే పెళ్లి వద్దు, చదువుకుంటాను అని చెప్పింది. నేను కూడా ఆమెకే మద్దతిచ్చాను. మా ఇంట్లో ఎవరూ ఇంత పెద్ద చదువులు చదువుకోలేదు. పైగా ఈఅమ్మాయికి చిన్నప్పటి నుంచీ చదువు అంటే ఇష్టం. ఎంతో ధైర్యంగా ఉండేది. ఇలా ఆత్మహత్యకు పాల్పడేంత పిరికిది కాదు'' అంటూ లావణ్య మామ కుమరయ్య బీబీసీతో చెప్పారు.
ఇంట్లో మిగతా వారెవరూ పెద్దగా చదువుకున్నవారు కాకపోవడంతో, వారికి లావణ్య చదువు వివరాలు ఏమీ తెలియవు. ఆమె చదివే కోర్సు, కాలేజీ ఫీజు వివరాలు వంటివి కుటుంబసభ్యులు ఎవరికీ తెలియవు. అంతా తానే స్వయంగా, స్నేహితుల సహాయంతో చూసుకునేది లావణ్య.
ఈ క్రమంలో హైదరాబాద్ శివార్లలోని ప్రిన్స్‌టన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో మేనేజ్‌మెంట్ కోటాలో చేరారు. మేనేజ్మెంటు సీటు కావడంతో ఆమెకు ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ పథకాలు రాలేదు.
ఏడాదికి 35 వేల ట్యూషన్ ఫీజు, 15 వేలు హాస్టల్ ఫీజు ఒప్పందం కింద కాలేజీలో చేరారు. లావణ్య మేనేజ్ మెంట్ కోటాలో ఎందుకు చేరారనే విషయంలో స్పష్టమైన కారణం తెలియదు.

ఫీజు తెమ్మన్నారు: కుటుంబసభ్యులు
''మూడు రోజుల్లో పరీక్షలున్నాయి. ఫీజు కట్టమని మెసేజీ వచ్చింది.'' అని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అంత డబ్బు సర్దలేక పోవడం, పైగా తన తల్లితండ్రులు చాలా ఇబ్బంది పడడం చూసి వారిని ఇబ్బందిపెట్టడం ఇష్టం లేకే లావణ్య చనిపోయిందని ఆమె మామ కుమరయ్య చెప్పారు.
లావణ్య చివరి వీడియోలో కూడా ''ఇక నావల్ల కాదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను'' అని చెప్పారు.
మేం ఫీజు అడగలేదు: కాలేజీ యాజమాన్యం
ఈ విషయమై లావణ్య చదివే కాలేజీ వైస్ ప్రిన్సిపల్ బీబీసీతో మాట్లాడారు. 'ఆమె ఫీజు బకాయి ఉంది. కానీ మేం అడగలేదు. ఆమె చేరింది 2020 నవంబరులో. అప్పటి నుంచీ కరోనా కావడంతో ఎవర్నీ మేం ఇబ్బంది పెట్టడం లేదు. ఇప్పుడు కూడా కేవలం మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయని మాత్రమే ఆమెకు సమాచారం ఇచ్చాం. అసలు మిడ్ ఎగ్జామ్ కి ఫీజే అక్కర్లేదు’’ అని వివరించారు.
తమ దగ్గర కన్వీనర్ కోటా ఫీజు 62 వేలు కాగా, లావణ్యకు 35 వేలకే అడ్మిషన్ ఇచ్చినట్టు కాలేజీ యాజమాన్యం వెల్లడించింది.
ఒకవేళ పరీక్షల కోసం వెళ్లినప్పడు ఫీజు బకాయి అడుగుతారన్న ఆలోచన కలిగి ఆ అమ్మాయి ఇలా చేసే అవకాశమూ ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. లావణ్య మరణించిన సమయంలో ఆసుపత్రి వద్ద వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేశాయి. పోలీసులు సీఆర్పీసీఎస్ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం
- 1971 యుద్ధంలో భారత్ ముందు లొంగిపోయిన పాక్ ఫొటోను అఫ్గానిస్తాన్ ఉపాధ్యక్షుడు ఇప్పుడెందుకు షేర్ చేశారు?
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్‌లో రోడ్ల మీదే చేపల వేట
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









