కరోనావైరస్: విద్యార్థుల చదువుల్ని సంక్షోభంలో పడేస్తోందా? ఆన్‌లైన్ తరగతుల ప్రభావం వారిపై ఎలా ఉంటోంది?

- రచయిత, రవి కుమార్ పాణంగిపల్లి
- హోదా, బీబీసీ ప్రతినిధి
సీబీఎస్ఈ చదువులు ప్రారంభమై నెల రోజులు దాటిపోయింది. దాదాపు అన్ని పాఠశాలలు జూమ్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలా ఏదో ఒక వీడియో కాలింగ్ ప్లాట్ ఫాం ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాకపోయినా... తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం మరో 2 నెలలు ఆలస్యం కావచ్చని ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో చెప్పారు.
పదో తరగతి విద్యార్థుల పరీక్షలు ఇంకా పూర్తి కాని నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి.
ఏపీలో సప్తగిరి ఛానెల్ ద్వారా రోజూ రెండు గంటలు, అలాగే రేడియో, రెయిన్ బో ఎఫ్ఎం ఛానెళ్ల ద్వారా పాఠాలను బోధిస్తూ విద్యార్థులను ఏదో విధంగా పరీక్షలకు సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తోంది విద్యా శాఖ.
ఇక కార్పొరేట్ పాఠశాలల విషయానికొస్తే... దాదాపు నెల రోజులుగా అన్ని పాఠాశాలలు పిల్లలకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి.
పదో తరగతి మినహా ప్రైమరీ, హైస్కూల్ విద్యార్థుల విషయానికొచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వారికి చదువులు ప్రారంభం కాలేదు. కానీ జాతీయ స్థాయిలో ముఖ్యంగా సీబీఎస్ఈ స్కూళ్లలో మాత్రం చదువులు ప్రారంభమయ్యాయి.
ఏపీ ప్రభుత్వం చెబుతున్న ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విద్యా సంవత్సరం ప్రారంభమైతే.. అక్కడ కూడా జూన్ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు ఇదే పరిస్థితి తప్పకపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఆన్ లైన్ పాఠాలు, వీడియో క్లాసులు పిల్లల తలకెక్కుతాయా?
ఇంకా ఫైనల్ పరీక్షలు పూర్తి కాని పదో తరగతి విద్యార్థుల దృష్టి మరలకుండా ఉండాలంటే ఇంతకన్నా మరో మార్గం లేదని అటు ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇటు కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక మిగిలిన తరగతుల విషయానికొస్తే లాక్ డౌన్ సమయంలో ఇంటికే పూర్తిగా పరిమితమైన విద్యార్థులకు అంతో ఇంతో చదువుపై శ్రద్ధ కలిగేలా చేసేందుకే ఈ ప్రయత్నమని చెబుతున్నాయి ప్రైవేటు విద్యాసంస్థలు.
“ఇప్పుడున్న లాక్ డౌన్ నేపథ్యంలో పూర్తిగా ఇళ్లకు పరిమితమవుతున్నారు పిల్లలు. దీంతో టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో మూడు, నాలుగు నెలల వరకు తరగతులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు లేవు. అన్నిరోజుల పాటు పిల్లలు పూర్తిగా చదువుకు దూరమైతే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాలి. అందుకే వారిని ఏదో రకంగా కాసేపు చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించేందుకు వీడియో కాలింగ్ అప్లికేషన్ల ద్వారా బోధన సాగిస్తున్నాం. ప్రస్తుతానికి వారికి కొత్తగా ఎటువంటి పాఠాలు చెప్పడం లేదు. పాతవే మరోసారి గుర్తు చేస్తూ వారి సందేహాలను తీర్చే ప్రయత్నం చేస్తున్నాం” అని పేరు చెప్పడానికి ఇష్టపడని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ప్రముఖ కార్పొరేట్ పాఠశాల జోనల్ ఇంఛార్జ్ బీబీసీకి చెప్పారు.
ఇక సీబీఎస్ఈ విషయానికొస్తే ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సాధారణంగా ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. దీంతో ఈ ఏడాది కూడా దాదాపు అన్ని పాఠశాలల్లో ఏప్రిల్ 1 నుంచే ఆన్ లైన్ తరగతుల్ని ప్రారంభించారు.
వివిధ రకాల వీడియో కాలింగ్ అప్లికేషన్లను ఉపయోగిస్తూ పాఠాలను బోధించే ప్రయత్నం చేస్తున్నారు. నోట్సులు కూడా స్వయంగా ప్రిపేర్ చేసి వాట్సాప్ ద్వారా షేర్ చేస్తూ పిల్లలకు ఓ రకంగా పాఠశాల జరుగుతోందన్న వాతావరణాన్ని కల్పిస్తున్నారు.
నిజానికి తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంవత్సరం సాధారణంగా ఏప్రిల్ 24 నాటికి ముగుస్తుంది. ఆ తరువాత జూన్ 12 వరకు వేసవి సెలవులే. ఆ లెక్క ప్రకారం ప్రస్తుతం వారు వేసవి సెలవుల్లో ఉన్నారు కనుక సమస్య లేదు.
అయితే ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు విద్యా సంవత్సరం ప్రారంభయ్యే సూచనలు లేవని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో అన్నారు.
“ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్నంత సౌలభ్యం ప్రభుత్వ పాఠశాలల విషయంలో ఉండదు. అదీగాక ఎక్కుమ మంది గ్రామీణ విద్యార్థులే ఉంటారు కనుక మేం పబ్లిక్ బ్రాడ్ కాస్టర్స్ ద్వారానే పాఠాలు చెప్పించగలం. త్వరలోనే కేబుల్ టీవీ ద్వారా కూడా పాఠాలు చెప్పేందుకు ప్రయత్నిస్తాం. వీలైతే సిలబస్ కూడా తగ్గించేందుకు ప్రయత్నిస్తాం” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Satyarao
ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇద్దరికీ కొత్తే!
నిజానికి ఆన్ లైన్ బోధనా విధానం యూనివర్శిటీ స్థాయిలో దూర విద్యా విధానంలో అక్కడక్కడ ఉంది. పాఠశాల స్థాయికి వచ్చేసరికి మాత్రం కేవలం డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటు ఉందే తప్ప... బోధన పూర్తిగా క్లాస్ రూంలకు దూరంగా ఎప్పుడూ జరగలేదు. అందుకే ఇటు విద్యార్థులకు, అటు ఉపాధ్యాయులకు కూడా ఇది పూర్తిగా కొత్త విధానం అనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో వీడియో కాలింగ్ అప్లికేషన్ల వినియోగం, ఆన్ లైన్ ద్వారా పాఠాలను పిల్లలకు ఎలా బోధించాలి? ఈ బోధనలో ఎలాంటి ఉపకరణాలను వినియోగించాలి? ఎటువంటి పద్ధతుల్లో బోధించడం ద్వారా పిల్లల్ని ఆకట్టుకోగలం? వంటి విషయాలను తాము కూడా కొత్తగా నేర్చుకుంటున్నామని దిల్లీలోని ఆంధ్ర ఎడ్యుకేషనల్ సొసైటీ పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మశ్రీ తెలిపారు.
“ఈ విధానం మాకు కూడా కొత్తే. ఉపయోగించే కొద్దీ చాలా విషయాలు తెలుస్తున్నాయి. నేను కూడా విద్యార్థుల కోసం నోట్స్ ప్రిపేర్ చెయ్యడానికి గూగుల్ స్ప్రెడ్ షీట్స్, ఆన్ లైన్ బోర్డ్స్ తదితర టూల్స్ వినియోగం గురించి మా స్నేహితులను అడిగి తెలుసుకుంటున్నా. ఏదో విధంగా పిల్లకు వీలైనంత సులభంగా పాఠాలు అర్థమయ్యేలా, వారికి ఆకట్టుకునే విధంగా బోధించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నాం” అని ఆమె బీబీసీతో అన్నారు.
మొదట్లో కొద్ది కాలం పాటే ఈ పరిస్థితి ఉంటుందని భావించామని... కానీ మున్ముందు కూడా ఇది కొనసాగే పరిస్థితి ఉండటంతో అందుకు తగినట్టు ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని సిద్ధం చేస్తున్నామని ఆంధ్ర ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఎ.వి.ఎస్ లక్ష్మీ అన్నారు.
“మొదట్లో ఇది త్వరగా పూర్తవుతుందని పాఠాలు ఈ విధానంలో మొదలుపెట్టాం. కానీ ఇప్పుడు, భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని అవలంబించక తప్పని పరిస్థితి నెలకొంది. మొదట్లో పిల్లలు, తల్లిదండ్రుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ తరువాత తరువాత ఈ పరిస్థితి కొనసాగక తప్పదని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకున్నారు.
టీచర్ల విషయానికొస్తే ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానంతో పరిచయం ఉన్నవారు వెంటనే ఈ విధానంలో ఒదిగిపోయారు. క్లాస్ రూం బోధనకు మాత్రమే అలవాటు పడ్డవారు మాత్రం మొదట్లో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే వాళ్లు కూడా అలవాటు పడుతున్నారు” అని ఆమె చెప్పారు.
పిల్లల విషయానికొస్తే నిన్న మొన్నటి వరకు గాడ్జెట్లకు దూరంగా ఉండాలని చెప్పిన తల్లిదండ్రులే కోరి వాటిని ఇచ్చి మరీ చదివిస్తూ ఉండటం వారికి కాస్త కొత్త కొత్తగా ఉంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
కొద్ది కొద్దిగా అలవాటు పడుతున్న పిల్లలు, తల్లిదండ్రులు
ఆన్ లైన్ తరగతులకు హాజరు విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొదట్లో పెద్దగా శ్రద్ధ చూపకపోయినా ఇప్పుడిప్పుడు అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా ఈ తరహా విధానం కొత్తగా ఉండటం వాళ్లను బాగానే ఆకర్షిస్తోంది. సుమారు 60-70 శాతం పిల్లలు తరగతులకు హాజరవుతున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కార్పెరేట్ విద్యా సంస్థకు చెందిన జోనల్ ఇంఛార్జ్ చెప్పారు.
“మొదట్లో పేరెంట్స్ నుంచి కూడా వ్యతిరేకత వచ్చేది. కానీ వాళ్లే తరువాత పరిస్థితి అర్థం చేసుకున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో పిల్లల దృష్టిని ఎంతో కొంత మరల్చాలంటే ఇది ఓ మార్గమని గుర్తించారు. మేం కూడా కొత్తగా ఏ పాఠాలు చెప్పడం లేదు. ప్రాథమిక విషయాలను మరోసారి వారికి గుర్తు చేస్తూ వారిని ఏదో విధంగా ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం” అని అన్నారు.
తల్లిదండ్రులు కూడా ఇప్పుడిప్పుడే ఈ విధానానికి అలవాటు పడుతున్నారు. మొదట్లో ఇబ్బందుల పడ్డ మాట వాస్తవమేనని కానీ ప్రస్తుత పరిణామాల దృష్ట్యా పాఠశాల యాజమాన్యాలకు కూడా అంతకు మించి మరో మార్గం లేదని అభిప్రాయపడుతున్నారు. కనీసం ఏదో విధంగా పిల్లలకు చదువుకు దూరం కాకుండా ఉండగల్గుతున్నారని హైదరాబాద్‌కు చెందిన భాస్కర్ అభిప్రాయపడ్డారు.
“మా అబ్బాయికి రోజు ఆన్ లైన్ తరగతులు జరుగుతున్నాయి. జూమ్ తరహా వీడియోకాలింగ్ అప్లికేషన్ల ద్వారా తరగుతులు నిర్వహిస్తున్నారు. వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు సబ్జెక్ట్‌కు సంబంధించిన వివరాలను ఉపాధ్యాయులు పంపిస్తున్నారు. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. కానీ ఇప్పుడు మరో మార్గం లేనప్పుడు ఏదో ఒకటి అనుసరించాలి కదా” అని ఆయన వ్యాఖ్యానించారు.

మొదట్లో ఇబ్బందులు తప్పవు
అయితే ఈ తరహా విద్యా విధానం వల్ల తెలివైన విద్యార్థులకు దీర్ఘకాలంలో లాభం కల్గినా మిగిలిన విద్యార్థులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని పదిహేనేళ్లుగా ఉపాధ్యాయునిగా పని చేస్తూ, ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో సైకాలజీ మోటివేటర్‌గా పని చేస్తూ, వివిధ దిన పత్రికల ద్వారా విద్యార్థులకు స్టడీ మెటిరియల్‌ను అందిస్తున్న నాగరాజు అన్నారు.
“ప్రాథమిక స్థాయిలో ఈ తరహా బోధన చాలా కష్టం. ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రులే ఉపాధ్యాయుల పాత్ర పోషించాల్సి ఉంటుంది. విద్యార్థికి చెప్పిన పాఠం ఎంత వరకు అర్థమయ్యిందన్న విషయం తప్పని సరిగా తెలుసుకోవాలి. వీడియో కాలింగ్ అప్లికేషన్లు, వాట్సాప్ మేసెజ్‌ల ద్వారా ఉపాధ్యాయుని పరోక్షంలో అది అంత సమర్థవంతంగా జరగదు. ఓ రకంగా పిల్లలు తమకు అర్థం కాని సబ్జెక్ట్ పట్ల విముఖత పెంచుకునే ప్రమాదం ఉంది. అది ఓరకంగా వారిలో నిరుత్సాహక వాతావరణాన్ని కలిగించవచ్చు కూడా. అది చాలా ప్రమాదం. తమకు రాదు, చెయ్యలేం అన్న భావన ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్లో పెరగకూడదు. శాస్త్రీయ దృక్పథం కొరవడుతుంది. అప్పుడప్పుడు కొత్తదనం కోసం ఇటువంటి విధానాలను ప్రయత్నించవచ్చు. అంతే తప్ప అందరిని ఒకే గాటన కట్టి ఇదే విధానాన్ని అనుసరించడం వల్ల దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవు" అని ఆయన చెప్పారు.
పిల్లలపై అన్ని విధాలా మానసిక ఒత్తిడి పడుతుందన్నది ముమ్మాటికి వాస్తవమేనని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్ బీబీసీతో అన్నారు.
“ఒక్కసారిగా బోధనా విధానం మారిపోవడం పిల్లల్ని చిక్కుల్లోకి నెట్టేదే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో దారి లేదు. ఇక్కడ రేపటి తరం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలు. ఈ సంక్షోభం తర్వాత మొత్తం మన విద్యావ్యవస్థలోనే సమూల మార్పులను తీసుకురావాలి. మన ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని బోధన కొనసాగాలి. అందుకు తగిన ప్రణాళికల్ని రూపొందించాలి. ఇక తల్లిదండ్రుల విషయానికొస్తే వారు అనవసరంగా ఆందోళనకు గురి కావద్దు. పిల్లల్ని ఇబ్బందులకు గురి చేయవద్దు. ఈ విధానాలకు అలవాటు పడేందుకు తగిన ప్రోత్సాహాన్ని అందించే ప్రయత్నం చేయాలి” అని సూచించారు.

ఫొటో సోర్స్, Satyarao
విద్యార్థుల్లో మిశ్రమ స్పందన
ఇక పిల్లల విషయానికొస్తే మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు విద్యార్థులు ఈ తరగతుల పట్ల ఆసక్తి కనబరుస్తుండగా.. మరి కొందరు మాత్రం విముఖత వ్యక్తం చేస్తున్నారు.
“మొదట్లో పాఠాలు అర్థం కాకపోయినా ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నా. ఫరవాలేదు” అని దిల్లీలోను ఓ ప్రముఖ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న శృతి అనే విద్యార్థిని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. కొత్త విషయాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునేందుకు సిద్ధం కావాలని అంటున్నారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తప్పనిసరి అని చెబుతున్నారు.
మరోవైపు సీబీఎస్ఈ బోర్డు ఇప్పటికే వచ్చే విద్యా సంవత్సరానికిగాను పాఠ్యాంశాలను కుదించాలని యోచనలో ఉంది. అటు తెలుగు రాష్ట్రాలు కూడా వీలైనంత వరకు సెలవుల్ని కుదించడం అవసరమైతే పాఠ్యాంశాలను కూడా తగ్గించాలని ఆలోచిస్తున్నాయి.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

హాస్టళ్లలో సామాజిక దూరం పాటించడం ఎలా?
ఇక పాఠశాల్లో ప్రధాన సమస్య సామాజిక దూరం పాటించడం. కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడంలో సామాజిక దూరం తప్పనిసరి కావడంతో ఈ దిశగాను కసరత్తు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. వీలైతే షిఫ్టుల విధానాన్ని పరిశీలిస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో చెప్పారు.
పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను అనుసరించి రెండు పూటలా వేర్వేరుగా తరగతులు నిర్వహించే యోచన కూడా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయుల పనిగంటలు పెరిగే అవకాశం ఉందని, ఈ సంక్షోభ పరిస్థితుల్లో అందుకు తగ్గట్టు వారు కూడా సిద్ధం కావాలని పరోక్షంగా సూచించారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం విషయానికొస్తే ఇప్పటికే మిగిలిన పోయిన పదో తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
అందుకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలను రెట్టింపు చేశారు. మున్ముందు పాఠశాలల నిర్వహణ విషయంలోనూ షిఫ్టుల విధానాన్నే పాటించే అవకాశం ఉంది.
ప్రైవేటు విద్యాసంస్థల విషయానికొస్తే రవాణా సౌకర్యం, హాస్టళ్ల విషయాలకొచ్చేసరికి వారికి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అక్కడ భౌతిక దూరం పాటించాలంటే ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, భవనాలను రెట్టింపు చేయాల్సి ఉంటుంది.
ఇది ఓ రకంగా ఆర్థికంగా పెను భారం కానుంది. కార్పొరేట్ విద్యాసంస్థలు కొంత మేర తట్టుకున్నప్పటికీ చిన్న చిన్న విద్యాసంస్థలకు మాత్రం నిర్వహణ కష్టాలు తప్పక పోవచ్చు.
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల విషయానికి వస్తే పాఠశాలలు తెరిచిన తర్వాత వసతి గృహాలలో ఏర్పాటు చేయాల్సిన అంశాలపై జాగ్రత్తలు గురించి తగు నిర్ణయం తీసుకుంటామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ బీబీసీతో అన్నారు.
“ప్రస్తుత కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో విద్యారంగంలో పలు మార్పులు తప్పవు. సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలల్లో, వసతి గృహాల్లో వాటికి అనుగుణంగా చర్యలు ఉంటాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయంలో స్పష్టత రాలేదు. లాక్ డౌన్ తర్వాత దాని మీద నిర్ణయం ఉంటుంది. విద్యార్థుల హాస్టల్ గదుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి పరిస్థితి కి తగ్గట్టుగా ఈ విషయంలో విధాన పరమైన నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇబ్బంది పెడుతున్న నెట్ వర్క్ సమస్యలు
నగరాల్లో ఈ తరహా బోధనకు మొబైల్ నెట్ వర్క్, ఇంటర్నెట్ పరంగా పెద్దగా ఇబ్బందులు ఎదురుకావడం లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ముఖ్యంగా తమ పిల్లల్ని గొప్పగా చదివించాలన్న తాపత్రయంతో ప్రైవేటు విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నప్పటికీ వారి కోసం ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్ కొనే పరిస్థితి లేదు. ఉన్న ఒక్క ఫోన్ వారు తీసుకెళ్లాల్సినవసరం ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారని, అలాగే నెట్ వర్క్ సమస్య కూడా తీవ్రంగా వేధిస్తోందని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన స్మార్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ పి.వి.వి.శేషు కుమార్ చెప్పారు.
“నెట్ వర్క్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కోసం అందరూ పూర్తిగా మొబైల్ నెట్ వర్క్ పైనే ఆధారపడటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులకు సాంకేతి పరిజ్ఞానం వినియోగించడం పట్ల గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. అయినా ప్రాథమిక స్థాయిలో ఈ సమస్యలు తప్పవు, ఎలాగోలా అలవాటు పడాల్సిందే” అని ఆయన అన్నారు.
మొత్తంగా అటు ఉపాధ్యాయులు, ఇటు నిపుణులు, ప్రభుత్వాలు చెబుతున్నది ఒక్కటే... విద్యావ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయి. అందుకు తగినట్టు విద్యార్థులు, తల్లిదండ్రులు సిద్ధం కావాల్సిందే.
విద్యార్థులపై మానసిక ఒత్తిడి పడనుందన్న మాట వాస్తవమే కానీ ఆ పరిస్థితిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇక మనం దృష్టి సారించాల్సి ఉంటుంది.
అలాగే ఇకపై తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విషయంలో తల్లిదండ్రుల పాత్ర మరింత కీలకం కానుంది. అదే సమయంలో ప్రభుత్వం కూడా బోధనా విధానాల్లోనూ, బోధించే అంశాల విషయంలోనూ సమూల మార్పులను తీసుకురావాలి. ఆ మేరకు మౌలిక సదుపాయాలను కూడా పెంపొందించాల్సి ఉంది.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ పుట్టింది ప్రయోగశాలలోనేనా.. అమెరికా 'ల్యాబ్ థియరీ'కి చైనా ప్రభుత్వ మీడియా సమాధానం ఏంటి
- కరోనావైరస్తో మనుషులు చనిపోతుంటే... మరో వైపు మాఫియా డాన్లు ఏం చేస్తున్నారు?
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ మరింత బలపడతాయా
- విశ్వ రహస్యం గుట్టు విప్పే ప్రయత్నంలో మరో 'ముందడుగు'
- చైనాలో యాంటీ వైరస్ కార్లు నిజమా.. గిమ్మిక్కా
- ప్రపంచంలో అత్యంత వేగవంతమైన భాష తెలుగే: ఆస్ట్రేలియా ప్రొఫెసర్ పరిశోధన
- ‘ప్రపంచ భాష ఇంగ్లిష్’కు రోజులు దగ్గరపడ్డాయా!
- ఎలాన్ మస్క్: ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల రూపాయలు ఆవిరి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








