బాయ్స్ లాకర్ రూమ్: ఈ టీనేజ్ అబ్బాయిల ఇన్‌స్టాగ్రామ్‌ గ్రూప్‌లో ఏం జరిగింది? దీనిపై ఎవరేమన్నారు?

ప్లకార్డు ప్రదర్శన

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, ఆండ్రూ క్లారెన్స్, ఆయేషా పెరెరా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక గ్రూప్‌లో మైనర్ బాలికల ఫోటోలు షేర్ చేస్తూ, వారిపై అసభ్యకరమైన వ్యాఖ్యల్ని చేస్తున్నఒక పదిహేను సంవత్సరాల మైనర్ బాలుడిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

"బాయ్స్ లాకర్ రూమ్" అనే పేరుతొ ఇన్‌స్టాగ్రామ్‌ గ్రూప్‌లో దిల్లీకి చెందిన కొంతమంది స్కూల్ పిల్లలు సభ్యులుగా ఉన్నారు.

ఈ గ్రూప్‌లో జరిగిన సంభాషణలకి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి.

ఇప్పటికే అమ్మాయిలకి రక్షణ లేదని భావించే నగరంగా పేరున్న దిల్లీలో ఈ ఘటన ప్రజలని మరింత ఆగ్రహానికి గురి చేసింది.

2012లో చోటు చేసుకున్న నిర్భయ ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించగా, దీని తర్వాత దేశంలో మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలు కూడా రూపుదిద్దుకున్నాయి.

అప్పటి నుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చినట్లు పెద్దగా దాఖలాలు లేవు.

ఈ గ్రూప్ పబ్లిక్ గా ఎలా మారింది?

ఈ గ్రూప్ గురించి తెలుసుకున్న కొందరు ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌లు ఈ గ్రూప్ విషయాలు బయట పెట్టారు.

ఈ గ్రూప్‌లో ఉన్నఅబ్బాయిలు తమతో పాటు చదువుకుంటున్న మైనర్ బాలికల ఫోటోలు వారి అనుమతి లేకుండా షేర్ చేసి, వారిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు, లైంగిక దాడులు, రేప్, బాడీ షేమింగ్‌కి సంబంధించిన సంభాషణలు చేస్తున్నట్లు తెలిసింది.

దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు, ట్విటర్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అయ్యాయి.

లా ఎన్ఫోర్స్‌మెంట్ తో దగ్గరగా పని చేసే శుభం సింగ్ అనే సైబర్ నిపుణుడు ఈ గ్రూప్ వివరాలని పరిశోధించిన వారిలో ఒక సభ్యుడు. “ఈ గ్రూప్ కి సంబంధించినవిగా షేర్ చేసిన చాలా స్క్రీన్ షాట్లు ఎడిట్ చేసినట్లు కనిపిస్తున్నాయని” ఆయన అన్నారు.

“ప్రస్తుతం షేర్ అయిన స్క్రీన్ షాట్లలో కొన్ని ఈ గ్రూప్ కి సంబంధించినవి అయితే, మరి కొన్ని స్నాప్ చాట్ లాంటి మాధ్యమాలలో ఇతర గ్రూప్‌ల నుంచి సేకరించినవి” అని చెప్పారు.

కొంత మంది ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు తనకి ఈ గ్రూప్ కి సంబంధించిన స్క్రీన్ షాట్లు పంపించినట్లు చెప్పారు.

"నేను దీనిని పరిశోధించడానికి చూశాను, కానీ ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకి రాలేదు. అప్పుడు ఈ గ్రూప్ వెనక ఉన్నదెవరో తెలుసుకోవడానికి ప్రయత్నించాం. అప్పటికే వారి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్స్‌ని తొలగించారు. కానీ, స్క్రీన్ షాట్లు, ఐ పి నంబర్ల సహాయంతో ఈ గ్రూప్ సభ్యులని తెలుసుకోవడానికి ప్రయత్నించాం’’ అని సింగ్ చెప్పారు.

ఈ సమాచారాన్ని పోలీసులకి అందించడంతో పోలీసులు ఒక టీనేజ్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

"బోయ్స్ లాకర్ రూమ్" పేరుతో ఇంస్టాగ్రామ్ లో టీనేజ్ అబ్బాయిలు చేస్తున్న అకృత్యాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఇంకా ఏమి జరిగింది?

ఈ గ్రూప్ పై విచారణ చేపట్టాలని, నేరస్థులపై కేసు ఫైల్ చేసి చేపట్టిన చర్యలతో కూడిన నివేదికని అందచేయాలని దిల్లీ మహిళా కమీషన్ దిల్లీ పోలీసులను కోరింది.

ఈ సమాచారం అందగానే తమ విచారణని చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. ఇదే కేసు విషయంలో ఒక స్కూల్ యాజమాన్యం కూడా క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేసినట్లు స్థానిక మీడియాకి చెప్పారు.

గ్రూప్ కి సంబంధించిన సభ్యులని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌ ఈ గ్రూప్ వివరాలు, ఐ పి నంబర్ల వివరాలు వెల్లడించాలని, ఇన్‌స్టాగ్రామ్‌ ఈ విషయంలో ఎటువంటి నివారణ చర్యలు చేపట్టిందో వివరించాలని దిల్లీ కమిషన్ అఫ్ విమెన్ డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు ఈ అంశం పై ఇన్‌స్టాగ్రామ్‌ ఏమి వివరణ ఇవ్వలేదు.

అయితే, దీనికి సోషల్ మీడియా కంపెనీ బాధ్యత వహించాలని, ఇంటర్నేషనల్ కమిషన్ అఫ్ సైబర్ సెక్యూరిటీ లా చైర్మన్ పవన్ దుగ్గల్ అన్నారు.

"ఇలా జరుగుతుందని తమకి తెలియదని ఇంస్టాగ్రామ్ చెప్పడానికి లేదని” అన్నారు.

“ఇలాంటి అసభ్యకర పోస్టుల్ని ఇన్‌స్టాగ్రామ్‌ తనంతట తానుగా తొలగించేటట్లు ఉండాలని అన్నారు. వాళ్ళు అలా చేయలేని పక్షంలో పోలీసులు వారిపై కూడా కేసు వేయవచ్చని” ఆయన బీబీసీకి చెప్పారు.

సోషల్ మీడియా నెట్‌వర్క్‌ల పట్ల భారతదేశం వ్యవహరిస్తున్న తీరు ఇలాంటి గ్రూప్‌ల ఆవిర్భావానికి దారి తీస్తోందని ఆయన అభిప్రాయ పడ్డారు.

దిల్లీలో ఒక స్కూల్ విద్యార్థి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్న పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని ఆందోళన కారులు చెబుతున్నారు

ఈ ప్రవర్తనకి కారణం ఏమిటి?

లాక్ డౌన్ సమయంలో పోర్న్ సైట్ లకి, "డార్క్ వెబ్" లో బ్రౌజ్ చేసే యూజర్లు ఎక్కువైనట్లు తమ సంస్థ గమనించిందని దుగ్గల్ చెప్పారు.

గత 40 రోజుల లాక్ డౌన్ సమయంలో పిల్లల ఆన్లైన్ ఆక్టివిటీ పెరిగి సమాజంలో అనేక సాంఘిక, మానసిక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు.

“చాలా మంది సెక్సువల్ ఫాంటసీ గ్రూప్ లు తయారు చేస్తున్నారని, అలా రూపొందినదే ఈ గ్రూప్ కూడా అని” ఆయన అన్నారు.

"ఇలాంటి గ్రూప్లు లాక్ డౌన్ కి ముందు కూడా ఉన్నాయని , అనివార్య పరిస్థితులు వాటిని బయట పడేటట్లు చేస్తున్నాయని”, మానసిక నిపుణులు డాక్టర్ రోమా కుమార్ అన్నారు.

ఇలాంటి ప్రవర్తన పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని దుగ్గల్ సూచించారు.

ఇప్పటికే ఈ గ్రూప్ సభ్యుల పై విపరీతమైన ఆగ్రహం వెలిబుచ్చతూ వారినందరిని అరెస్ట్ చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.

కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారంల మీద వారి పేర్లని కూడా వెల్లడించారు.

“ఇలా పేర్లని బయట పెట్టడం దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చదని” రోమా కుమార్ అన్నారు.

"వారిని నాశనం చేయడం ముఖ్య ఉద్దేశ్యం కాకూడదు. ఇలాంటి ప్రవర్తన నుంచి బయటకి తేవడం ముఖ్యం” అని ఆమె అన్నారు. ఈ వయసులో ఉండే పిల్లల్లో కనిపించే ఒక విపరీతమైన ప్రవర్తన ధోరణి ఇదొకటి అని అన్నారు.

"వారిని వెంబడించడం వలన వారిని మరింత మొండిగా చేసినవారిమవుతాం. దీంతో సమస్య పరిష్కారం అవ్వదు . ఈ పిల్లలు ప్రవర్తన మార్చుకుని సమాజంలో మంచి పౌరులుగా మారడానికి సహకరించగలగాలి”.

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)