హైదరాబాద్: నిజాం పాలకుల క్వారంటైన్ హాస్పిటల్... ఇప్పుడు కోరంటి దవాఖానా

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
క్వారంటైన్.. ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇది. కానీ, ఈ ‘క్వారంటైన్’ పదంతో పాటు ‘క్వారంటైన్’లో ఉండటం కూడా హైదరాబాదీలకు కొత్తేం కాదు. 100 ఏళ్ల క్రితమే నగరంలో క్వారంటైన్ ఆస్పత్రిని నిర్మించారు. నిజాం కాలంలో ప్రబలిన అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో ఆ ఆస్పత్రి కీలక పాత్ర పోషించించింది. అదే ఇప్పటికీ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిగా సేవలందిస్తోంది. ఇదీ ఆ దవాఖానా కథ.
1921లో రాబర్ట్ చావెలో రాసిన 'మిస్టీరియస్ ఇండియా' పుస్తకంలో హైదరాబాద్‌ను "ల్యాండ్ అఫ్ థౌజండ్ అండ్ వన్ నైట్స్"గా అభివర్ణించారు. ఈ పుస్తకంలో హైదరాబాద్, గోల్కొండ గురించి రాస్తూ అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో తాను తిరిగిన అనుభవాల గురించి చావెలో వివరించారు. అందులో ఆయన హైదరాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాక ఎదురైన ఒక అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. స్టేషన్‌లో రాత్రి ఏడు గంటలకు దిగిన తరువాత ఒక పోలీస్ అధికారి వచ్చి తనను ప్రశ్నించారని, తాను ఎక్కడి నుంచి వచ్చారు.. ఎన్ని రోజులు ఉంటారు.. ఎక్కడెక్కడికి వెళ్తారు.. ఇలా అనేక ప్రశ్నలను ఆ అధికారి అడిగినట్లు తెలిపారు.
తనకు మొదటి రౌండ్ ప్లేగు పరీక్ష పూర్తయ్యాక రెండో దఫా స్క్రీనింగ్, శానిటేషన్ టెస్ట్‌ల కోసం పంపారని, తన 'ప్లేగ్-పాస్‌పోర్ట్'ను పరీక్షించి తదుపరి వైద్య పరీక్షల కోసం సివిల్ హాస్పిటల్‌కు వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించినట్లు చావెలో తన పుస్తకంలో ప్రస్తావించారు.
హైదరాబాద్‌లో అంటు వ్యాధులు తీవ్రంగా ప్రబలుతున్న రోజులవి. అలాంటి పరిస్థితుల్లో ఈ ఒక్క సంఘటన చాలు అప్పటి ప్రభుత్వాల సంసిద్ధత గురించి చెప్పడానికి అంటారు చరిత్రకారులు. అయితే "ప్లేగ్-పాస్‌పోర్ట్"ను ఎప్పటి నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు అనే దానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ, ఈ పుస్తకంలో రాసిన వివరాలను బట్టి చూస్తే.. అప్పట్లో ప్రయాణీకుల్ని స్క్రీనింగ్ చేసి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, ప్లేగ్ పాస్‌పోర్ట్ లేని వారిని రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేవారని హెరిటేజ్ యాక్టివిస్ట్, ఇన్‌టాక్(ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్) సభ్యురాలు పి.అనురాధ రెడ్డి అంటున్నారు.
ప్లేగుకు పరీక్ష చేయించుకొని, శానిటైజేషన్ ప్రక్రియ అంతా పూర్తయ్యాక, 10 రోజుల పాటు ఆరోగ్యంగా ఉన్నవారికి ఈ ప్లేగ్ పాస్‌పోర్టును అందజేసేవారు.
1931లో నిజాం ప్రభువుకి అందించిన నివేదికలలో ఐసొలేషన్ హాస్పిటల్ గురించి ప్రస్తావిస్తూ.. కలరా, పైరెక్సియా, టీబీ, స్మాల్ పాక్స్ వంటి అంటు వ్యాధులకు చికిత్స పొందేందుకు ఐసొలేషన్ హాస్పిటల్‌కి రోగులు వస్తున్నారని ఆ నివేదికలో తెలిపారు. 1930-31 మధ్య నిజాం ప్రభువుకు అందిన ఓ నివేదిక ప్రకారం.. "ఐసొలేషన్ హాస్పిటల్‌కు ఇది వరకు సీరియస్ కేసులకు మాత్రమే చికిత్స కోసం వచ్చేవారు. కానీ, ఇప్పుడు దాని ప్రాధాన్యం బాగా పెరిగింది. టీబీతో పాటు ఇతర వ్యాధుల చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది’’ అని అందులో ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
క్వారంటైన్ ఇలా మొదలైంది
అంటువ్యాధులు కూడా చరిత్రలో ఓ భాగమని, అప్పట్లో వ్యాపారులు ఓడల ద్వారా అంటువ్యాధులను మోసుకొచ్చేవారని చరిత్రకారులు చెబుతారు.
వ్యాపారులు తీసుకొచ్చే ఓడల్లో సామగ్రితో పాటు ఎలుకలు కూడా ఉండేవి. వాటి ద్వారా వ్యాధులు కూడా వ్యాపించేవి. మొదట్లో ఇలా ఎలుకల ద్వారా అంటు వ్యాధులు ప్రబలాయని, ప్లేగు కూడా అలానే వ్యాపించిందని యూరప్‌లో గుర్తించారు.
‘‘ఇటలీ భాషలో ‘క్వారంటా’ అంటే 40. క్వారంటా జియార్నీ అంటే.. అంటువ్యాధులు ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన ఓడల్ని 40 రోజుల పాటు పోర్టులోకి రానివ్వకుండా తీరంలోనే యాంకర్‌కు కట్టేసి పెట్టేవారు. ఓడలో నుంచి కూడా 40 రోజుల పాటు ఎవరినీ నేల మీదకు రానిచ్చేవారు కాదు. అలా క్వారంటైన్ అనే పదం వాడుకలోకి వచ్చింది. మొదట వెనీస్‌లో ఈ క్వారంటైన్‌ను అనుసరించినట్లు చరిత్ర చెబుతోంది’’ అంటారు అనురాధ.
ఆ స్ఫూర్తితోనే 1915లో హైదరాబాద్ రాష్ట్రంలో స్పానిష్ ఫ్లూ మహమ్మారిని అరికట్టేందుకు క్వారంటైన్ పద్ధతిని పాటించాలని నిజాం పాలకులు భావించారు. అప్పట్లో హైదరాబాద్ శివార్లలో ఉన్న ఎర్రన్నగుట్టపై గుఢారాలు వేసి వ్యాధిగ్రస్తులను అక్కడికి తరలించి చికిత్స అందించడం మొదలుపెట్టారు.
‘‘నాటి నిజాం పాలకుడు వైద్య రంగంలో చాలా ముందు చూపుతో ఉండేవారు. దానికి తగ్గట్టుగానే స్పానిష్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న సమయంలో బోయిగూడ, సీతాఫల్ మండి, ముషీరాబాద్, పాతబస్తి లాంటి అనేక ప్రాంతాల్లో ఇలా ఐసొలేషన్ క్యాంపులు ఏర్పాటుచేశారు. ఈ క్యాంపులకు వ్యాధిగ్రస్తులను కాకుండా ముందు జాగ్రత్తగా కేవలం ఆరోగ్యంగా ఉన్నవారిని మాత్రమే తరలించేవారు. వ్యాధి తీవ్రత తగ్గేవరకు ఈ శిబిరాలను నిర్వహించేవారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఈ క్యాంపుల గురించి చెప్పటం నాకు గుర్తుంది" అన్నారు అనురాధ రెడ్డి.

1915లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వారంటైన్ ఆస్పత్రి 1923 వరకు ఎర్రన్నగుట్ట మీదే ఉండేది. అంటే ప్రస్తుతం నల్లకుంటలో ఉన్న ఫీవర్ హాస్పిటల్‌కి సరిగ్గా ఎదురుగా ఉండేది.
"ఇప్పుడు ఫీవర్ హాస్పిటల్ ఉన్న ప్రాంతాన్ని అప్పట్లో ఊరు చివరిగా భావించేవారు. అక్కడ చాలా ఖాళీ స్థలం ఉండేది. అందులోనూ గుట్ట మీద స్వచ్ఛమైన గాలి వీస్తుందని భావించి గుఢారాలను అక్కడ ఏర్పాటు చేసుండొచ్చు. ఆ తరువాత 1923లో ప్రస్తుతం ఉన్న ఫీవర్ హాస్పిటల్ ప్రాంగణానికి ఆ ఆస్పత్రి మారింది.
ఆ ఆస్పత్రిని క్వారంటైన్ కోసం ఉపయోగించేవారు కాబట్టి దాన్ని క్వారంటైన్ ఆస్పత్రి అనేవారు. కానీ, చాలామందికి దాన్ని పలకడం క్లిష్టంగా అనిపించడంతో క్రమంగా దాన్ని కోరంటి ఫీవర్ హాస్పిటల్ అని పిలిచేవారు’’ అని అనురాధ వివరించారు. ఆ ఆస్పత్రి ఉన్న ప్రాంతాన్ని కూడా ఇప్పుడు కోరంటి అనే పిలుస్తున్నారు.
1998లో ఫీవర్ హాస్పిటల్‌ని సర్ రోనాల్డ్ రోస్ ఇన్‌స్టిట్యుట్ అఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూనికల్ డిసీజెస్‌గా పేరు మార్చారు. 1902లో మలేరియా పారసైట్‌ని కనిపెట్టినందుకు సర్ రోనాల్డ్ రోస్‌కు నోబెల్ బహుమతి దక్కింది. ఆయన హైదరాబాద్‌లోనే బేగంపేట్‌లో ఉంటూ తన పరిశోధనలు చేసేవారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?

అంటు వ్యాధులను నిజాం పాలకులు ఎలా ఎదుర్కొన్నారు?
నిజాం కాలం నాటి నివేదికలను పరిశీలిస్తే అంటు వ్యాధులు, మలేరియా కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో ప్లేగు కమిషనర్ కూడా ఉండేవారు. వ్యాధులపై అవగాహన కల్పించడం, ఆ మహమ్మారులను నివారించే చర్యలు చేపట్టడం ఈ విభాగాల బాధ్యతగా ఉండేది.
అంటువ్యాధులు, అతిసార, మలేరియా లాంటి వ్యాధుల వల్ల ఏటా ఎంత మంది మరణించారు? ఎంత మంది కోలుకున్నారు? ఎలాంటి చికిత్స అందించారు? లాంటి పూర్తి వివరాలతో పక్కా నివేదికలను రూపొందించేవారు. టీకాల వినియోగం పెరగడంతో పాటు ప్రజల్లో అవగాహన కూడా పెంచడం ద్వారా మహమ్మారులకు బలయ్యేవారి సంఖ్యను తగ్గించగలిగారు.
1931 నాటి ఒక నివేదికలో ప్రజల్లో అంటు వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో పేర్కొన్నారు.
"అంటు వ్యాధులు, మలేరియా, అతిసార, టీబీ, స్మాల్ పాక్స్ లాంటి సమస్యలతో పాటు పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రొజెక్టర్, స్లైడ్స్ ఏర్పాటు చేసి ప్రచారం చేశాం’’ అని 1931 నాటి నిజాం నివేదిక చెబుతోంది.
‘‘1908లో వచ్చిన మూసీ వరదల కారణంగా నదికి రెండు వైపులా నిర్మాణాలు పూర్తిగా చెల్లాచెదురయ్యాయి. దాన్ని అవకాశంగా మలచుకొని ప్రణాళికా బద్ధంగా నగరాన్ని పునర్నిర్మించేందుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజినీర్ల సాయంతో నిర్మాణ పనులు మొదలుపెట్టారు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అప్పుడు ఆయన దృష్టిలో పెట్టుకున్న ప్రధాన అంశం ‘ఫిజికల్ డిస్టెన్సింగ్’. పార్కులు, ఆట స్థలాలు, ఇళ్లు, దుకాణాలు.. ఇలా జనాభా ప్రాతిపదికను సరైన దూరం ఉండేలా నిర్మాణాలు మొదలుపెట్టారు. కానీ, కాలక్రమంలో జనాభా పెరుగుతూ నగరం ఇరుకుగా మారుతూ వచ్చింది’’ అంటూ అనురాధ వివరిస్తారు.
ఫీవర్ హాస్పిటల్‌లో కోవిడ్ శాంపిల్స్ సేకరణ
ప్రస్తుతం నల్లకుంటలో ఉన్న ఫీవర్ హాస్పిటల్‌ను ఇతర వ్యాధుల చికిత్సతో పాటు కోవిడ్ పరీక్షల కోసం ఉపయోగిస్తున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్ డా.శంకర్ తెలిపారు. "పరీక్షలు చేసి పాజిటివ్ వస్తే గాంధీకి తరలిస్తున్నాము. లేకపోతే హోం క్వారంటైన్‌కి పంపుతున్నాము. ఇప్పటికీ చికెన్ పాక్స్, మీజెల్స్, మమ్స్, విష జ్వరాలు, డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధుల చికిత్స కోసం ఈ ఆస్పత్రినే ఆశ్రయిస్తారు. ప్రతి వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక ఐసొలేషన్ వార్డులు ఇక్కడ ఉన్నాయి" అని వివరించారు డా శంకర్.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: అమెరికా ఎన్నడూ లేనంతగా భయపడుతోందా?
- ఎయిర్ ఇండియా పైలట్లు కరోనావైరస్ బారిన పడే ముప్పు ఎక్కువ ఉందా?
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్డౌన్’.. పంటను కోయలేరు, అమ్మలేరు..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
- హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు?
- జాకబ్ డైమండ్: హైదరాబాద్ నిజాం 'పేపర్ వెయిట్'గా వాడిన రూ.900 కోట్ల వజ్రం ఇదే
- హైదరాబాద్ నిజాం సొమ్ము కేసు: పాకిస్తాన్‌కు రూ.53.7 కోట్లు జరిమానా విధించిన బ్రిటన్ కోర్టు
- హైదరాబాదీల్లో నిజాయితీ ఎంత?.. పర్సు దొరికితే తిరిగి ఇచ్చేది ఎందరు?
- ఆపరేషన్ పోలో: హైదరాబాద్ 'పోలీసు చర్య'లో చీకటి కోణం
- హైదరాబాద్‌కు 500 ఏళ్లు: ఎక్కడ మొదలైంది? ఎలా ఎదిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








