ఆపరేషన్ పోలో: హైదరాబాద్ 'పోలీసు చర్య'లో చీకటి కోణం

ఫొటో సోర్స్, Not known
- రచయిత, మైక్ థామ్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1947లో భారతదేశం రెండు ముక్కలుగా విడిపోయినపుడు జరిగిన మతకల్లోలాలలో సుమారు 5 లక్షల మంది మరణించారు.
వారిలో ఎక్కువ మంది భారత్-పాక్ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆ తర్వాత ఒక ఏడాదికి భారతదేశం దక్షిణ ప్రాంతంలో కూడా ఒక మారణకాండ జరిగింది. అయితే దాని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందాక, 1948 సెప్టెంబర్, అక్టోబర్‌లలో హైదరాబాద్ రాష్ట్రంలో వేల మందిని దారుణంగా హతమార్చారు.
భారత సైన్యం కొందరిని వరుసగా నిలబెట్టి మరీ కాల్చి పారేసింది. ప్రభుత్వం ఈ దారుణ ఘటనపై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికను ఎన్నడూ బయట పెట్టలేదు. దాంతో ఆ మారణకాండ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆ మారణకాండ వివరాలు వెల్లడించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటిష్ పాలనలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సుమారు 500 సంస్థానాల్లో హైదరాబాద్ ఒకటి.
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించడంతో వాటిలో దాదాపు అన్నీ భారతదేశంలో కలిసేందుకు అంగీకరించాయి.
కానీ హైదరాబాద్ నిజాం మాత్రం తాము స్వతంత్రంగా కొనసాగుతామని ప్రకటించారు. అది దిల్లీలోని ప్రభుత్వాధినేతలకు ఆగ్రహం కలిగించింది.
హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేసేందుకు చాలా కాలం వేచి చూసిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తర్వాత సహనం కోల్పోయింది.
హైదరాబాద్ మారణకాండ
హిందువులు ఎక్కువగా ఉన్న భారతదేశంలో.. దేశం మధ్యభాగంలో, ముస్లిం అయిన నిజాం పాలన కింద ఉన్న హైదరాబాద్ స్వతంత్రంగా ఉంటామననడం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
నిజాం కింద ఉన్న శక్తివంతమైన రజాకార్లు, హిందువులను భయభ్రాంతులకు గురిచేసేవారు.
ఇది నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు హైదరాబాద్‌ను బలవంతంగానైనా విలీనం చేసేందకు ఒక కారణంగా కలిసి వచ్చింది. దీంతో సెప్టెంబర్, 1948 లో భారత సైన్యం హైదరాబాద్‌పై దండెత్తింది.
ఈ పోరాటంలో భారత సైన్యం నిజాం బలగాలను పెద్దగా ప్రతిఘటన లేకుండానే లొంగదీసుకుంది. పౌరుల ప్రాణనష్టం కూడా ఎక్కువగా జరగలేదు.

ఫొటో సోర్స్, Universal History Archive
అయితే ఈ చర్య అనంతరం ముస్లింల ఇళ్లను తగలబెట్టారని, ముస్లింలను మూకుమ్మడిగా హత్య చేసి, ముస్లిం మహిళలపై అత్యాచారాలు చేశారని దిల్లీ పాలకులకు సమాచారం అందింది.
దీంతో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి నెహ్రూ అన్ని మతాల వారితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, హైదరాబాద్ పంపారు.
ఈ బృందానికి కాంగ్రెస్ నేత పండిట్ సుందర్‌లాల్ నేతృత్వం వహించారు. అయితే ఆశ్చర్యకరంగా, ఆయన ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఎన్నడూ విడుదల చేయలేదు.
యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జికి చెందిన చరిత్రకారుడు సునీల్ పురుషోత్తం తన పరిశోధనలో భాగంగా ఆ నివేదిక ప్రతిని సంపాదించినపుడు దానిలో అనేక సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
నిజనిర్ధారణలో భాగంగా సుందర్‌లాల్ బృందం హైదరాబాద్ రాష్ట్రంలో డజన్ల కొద్దీ గ్రామాలలో పర్యటించింది.
వాళ్లు వెళ్లిన ప్రతి చోటా ఆ హత్యాకాండ నుంచి బయటపడిన ముస్లింలు తమపై జరిగిన దాడి గురించి వివరించారు.
''భారత సైన్యానికి చెందిన వారు, స్థానిక పోలీసులు కలిసి లూటీలతో పాటు అనేక నేరాలకు పాల్పడినట్లు మా వద్ద ఖచ్చితమైన సాక్ష్యాలు ఉన్నాయి'' అని సుందర్‌లాల్ తన నివేదికలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Thinkstock
అనేక చోట్ల ముస్లింల దుకాణాలను, ఇళ్లను దోచుకొనడానికి హిందువులను పురికొల్పారని నివేదికలో ఉంది.
గ్రామాలలోని ముస్లింల వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్న సైన్యం, హిందువుల వద్ద ఉన్న ఆయుధాలు మాత్రం పట్టించుకోలేదు. కొన్నిసార్లు హిందువుల నేతృత్వంలోని పారామిలటరీ బలగాలే హింసకు పాల్పడేవి.
మరికొన్ని చోట్ల భారత సైన్యమే హింసాకాండకు పాల్పడింది.
''చాలా చోట్ల సైన్యం గ్రామాలలోని ముస్లిం పురుషులను బలవంతంగా బయటకు లాక్కొచ్చి వాళ్లను దారుణంగా హతమార్చింది'' అని ఆ నివేదిక పేర్కొంది.
అయితే అనేక చోట్ల భారత సైనికులు ముస్లింల పట్ల చాలా గౌరవంగా వ్యవహరించారని, వాళ్లను రక్షించారని కూడా ఈ పరిశోధనా బృందం పేర్కొంది.
సుందర్‌లాల్ నివేదికతో జతపరిచిన కాన్ఫిడెన్షియల్ నోట్స్‌లో, హిందువుల ప్రతీకార చర్యల గురించి సవివరంగా ఉంది.
''అనేక చోట్ల మాకు కుళ్లిపోయిన శవాలతో నిండిన బావులు కనిపించాయి. ఒక బావిలో అయితే ఏకంగా 11 శవాలు ఉన్నాయి. వాళ్లలో ఒక మహిళ, చిన్న పిల్ల కూడా ఉన్నారు.''
''కొన్ని చోట్ల శవాలు కుంటల్లో పడి ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే శవాలను కాల్చేశారు. ఆ శవాల పుర్రెలు, ఎముకలు అక్కడ పడి ఉండడం మేం చూశాం.''

సుందర్‌లాల్ నివేదిక ప్రకారం, పోలీస్ యాక్షన్ తర్వాత జరిగిన ఈ మారణకాండలో సుమారు 27,000 నుంచి 40,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు.
అయితే సుందర్‌లాల్ నివేదికను ప్రచురించకూడదన్న నెహ్రూ నిర్ణయానికి ఎలాంటి అధికారిక వివరణా లేదు. బహుశా దీనికి కారణం - ఇలాంటి నివేదిక బయటపెడితే ముస్లింల వైపు నుంచి ప్రతీకార చర్యలు జరుగుతాయన్న అనుమానం కావచ్చు.
చాలా మందికి తెలియని సుందర్‌లాల్ నివేదికను సందర్శకులు ఇప్పుడు నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో చూడొచ్చు.
(గమనిక ఈ వార్త తొలుత 2013 సెప్టెంబరులో బీబీసీలో ప్రచురితమైంది.)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








