కరోనావైరస్: అమెరికా నుంచి పారిపోతున్న ప్రజలు

ట్రంప్

ఫొటో సోర్స్, Alex Wong/Getty Images

    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి, వాషింగ్టన్ నుంచి

వాషింగ్టన్ నగరంలో నేను ఉంటున్న అపార్టుమెంట్ గేట్లు పూర్తిగా మూసివేశారు. కరోనావైరస్ గురించి అమెరికాలో పెరుగుతున్న భయాందోళనలను నేను స్వయంగా అనుభవిస్తున్నాను.

కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం పట్ల అమెరికన్లు కూడా తీవ్రంగా భయపడుతున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశంలోనూ ఈ వైరస్‌కు చికిత్స లేదు.

కొద్ది రోజుల క్రితం 'ఇదో రాజకీయ కట్టుకథ' అని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే వైరస్‌ను ఎదుర్కొనేందుకు అమెరికా కూడా నానా తంటాలు పడుతోంది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

తారుమారైన పరిస్థితులు

బయటి దేశాల వారు అమెరికాను ఒక పరిపూర్ణ దేశంగా చూస్తారు. ఇక్కడ స్థిరపడాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ, కొన్ని రోజులుగా ఇక్కడ పరిస్థితులు తారుమారవుతున్నాయి.

అత్యంత శక్తిమంతమైన దేశాన్ని కరోనావైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ దేశంలో ఇప్పటివరకు 230 మందికి పైగా కరోనావైరస్ కారణంగా మరణించారు. 18,500కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

మున్ముందు పరిస్థితి ఇంకెంత విషమంగా మారుతుందో, ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో ఎవరికీ తెలియదు.

కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా భావించే అమెరికా ఇప్పుడు నిస్సహాయంగా మిగిలిపోవడాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

ప్రపంచంలో ఏ మూలనైనా, ప్రతి అంశంపైనా అమెరికా నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ దేశ నాయకులు కూడా తమ దేశ సరిహద్దుల వెలుపల తమ బలాన్ని ప్రదర్శించడంలో విఫలం కారు. కానీ, కరోనావైరస్‌ను ఎదుర్కోవడంలో అమెరికా అంతర్గతంగా బలహీనంగా ఉందని నిరూపితమైంది.

మాస్కు ధరించిన యువతి

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా నుంచి పారిపోతున్న ప్రజలు

"పరిస్థితి చేయి దాటితే అమెరికా జనాభాలో సగం మంది కోవిడ్-19 బారిన పడి, పది లక్షల మందికి పైగా ప్రజలు చనిపోవచ్చు" అని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మాజీ డైరెక్టర్ టామ్ ఫ్రీడెన్ ఆందోళన వ్యక్తం చేశారు.

బయటి నుంచి వచ్చిన ప్రజలు ఇప్పుడు అమెరికాను వదిలి స్వదేశాల వైపు వెళ్లిపోతున్నారని కథనాలు వస్తున్నాయి.

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, "చదువుకునేందుకు న్యూయార్క్, లండన్ నగరాలకు పిల్లలను సంతోషంగా పంపిన చైనా తల్లిదండ్రులు, ఇప్పుడు వారికి ముసుగులు, శానిటైజర్లను పంపుతున్నారు. ఫ్లైట్ బుక్ చేసుకుని వెంటనే స్వదేశం వచ్చేయాలని కోరుతున్నారు."

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

ఇటీవల అమెరికా నుంచి తూర్పు చైనాలోని తన ఇంటికి తిరిగొచ్చిన 24 ఏళ్ల గ్రాడ్యుయేట్ విద్యార్థి, "న్యూయార్క్ కంటే చైనానే సురక్షితంగా ఉందని అనిపించింది. అందుకే, నేను మా స్వదేశం వచ్చేశాను" అని అన్నారు.

కరోనావైరస్ చైనాలోనే కొన్ని నెలల క్రితం మొదలైంది. అప్పుడు వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.

అదే సమయంలో అమెరికా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వచ్చాయి. అప్పుడు తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, పరిస్థితి అంతా పూర్తి నియంత్రణలో ఉందని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా సీఎన్‌బీసీతో అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. కానీ, పరిస్థితులు వేగంగా తారుమారయ్యాయి.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ పరీక్ష

అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ సీడీసీ కరోనావైరస్ సొంత టెస్టింగ్ కిట్స్‌ను అభివృద్ధి చేసింది. కానీ, వాటి తయారీలో లోపాలు ఉన్నాయని తేలింది. లోపాలు ఉన్న కిట్స్‌తో పరీక్షలు నిర్వహిస్తే ఫలితాల్లో కచ్చితత్వం లోపించే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం ఆ లోపాన్ని సరిచేశామని అమెరికా అధికారులు చెప్పారు.

కానీ, పరీక్షలకు అవసరమైన దూది, గ్లౌజులు, ఇతర పరికరాలకు కొరత ఏర్పడటంతో, కరోనా పరీక్షలు అంత వేగంగా జరగడం లేదని నివేదికలు చెబుతున్నాయి.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో, అధ్యక్షుడు ట్రంప్ అగ్ర పారిశ్రామికవేత్తలతో కలిసి టీవీలో కనిపించారు. కరోనాను ఎదుర్కొనేందుకు తమవంతు కృషి చేస్తామని ఆ పారిశ్రామికవేత్తలు చెప్పారు.

"అత్యవసర వైద్యం కోసం ప్రైవేటు కంపెనీలపై, దాతృత్వాలపై ఆధారపడాల్సి వస్తోంది. పనిచేయలేని ఈ అసమర్థ వ్యవస్థలో మనం బతుకుతున్నాం" అంటూ 'అమెరికా చతికిలపడిందని కరోనావైరస్ చాటిచెబుతోంది' అనే శీర్షికతో రాసిన వ్యాసంలో డోనల్డ్ ట్రంప్‌‌పై, ఆయన పాలనా యంత్రాంగంపై జర్నలిస్టు డేవిడ్ వల్లేస్- వెల్స్ తీవ్ర విమర్శలు చేశారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

బీమా లేకుంటే ఇక అంతే

పరీక్షలకు కొంతమేర సదుపాయాలు ఉన్నప్పటికీ, అందుకు అయ్యే ఖర్చులను చాలామంది భరించలేరు. ఎందుకంటే, మీకు బీమా పాలసీ లేకపోతే జీవించలేని పరిస్థితులున్న దేశం ఇది.

తనకు బీమా పాలసీ లేదని, కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోందని ఇండిపెండెంట్ జర్నలిస్టు కార్ల్ గిబ్సన్‌ రాశారు.

"అమెరికాలో వైద్య సేవలు పొందడం అంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఓసారి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రికి వెళ్లాను. నాలుగు గంటలు వేచి ఉన్నాక డాక్టర్ నన్ను చూశారు. నొప్పి నివారణ మందులు ఇచ్చి పంపించేశారు. అంత మాత్రానికే 4,000 డాలర్లకు పైనే బిల్లు వేశారు" అని ఆయన గుర్తు చేసుకున్నారు.

2018 గణాంకాల ప్రకారం, అమెరికా జనాభాలో 8.5 శాతం మందికి ఆరోగ్య బీమా లేదని అంచనా.

సహాయ శిబిరాలు, ఆశ్రయాలు, వీధుల్లో నివసించే దాదాపు 5 లక్షల మంది నిరాశ్రయులైన అమెరికన్లు కరోనావైరస్ బారిన పడే ప్రమాదం ఉంది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, AFP

కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామంటూ వైట్‌హౌస్ పోడియం నుంచి అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చెబుతున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.

సియాటెల్‌లోని వైద్యులు ప్లాస్టిక్‌ షీట్లతో ఫేస్ మాస్క్‌లను తయారు చేసుకుంటున్నారంటూ షాకింగ్ కథనాలు వస్తున్నాయి.

నిర్మాణ సంస్థలు, దంతవైద్యులు, పశువైద్యులతో పాటు మాస్కులు ఉన్నవారు ఎవరైనా విరాళంగా ఇవ్వాలని వైద్యులు, ఆసుపత్రుల సంఘం కోరిందని ఒక కథనం పేర్కొంది.

"ఓ ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స గదిలో, వైద్యులకు గడువు ముగిసిన మాస్కులు ఇచ్చారు. వాటిని ధరించేందుకు ప్రయత్నించగా తెగిపోయాయి" అంటూ మరో కథనం వెలువడింది.

"దేశవ్యాప్తంగా చాలా మంది వైద్యులు తమకున్న ఒక్క మాస్కును పదేపదే వాడాల్సి వస్తోంది. వారు దానిపై లైజాల్‌ చల్లి మళ్లీ వాడుతున్నారు. అది ఎంత వరకు సురక్షితమో తెలియదు" అని ఆ వార్తా కథనం పేర్కొంది.

బ్రూక్లిన్‌లో, తాము వాడిన మాస్కులను మళ్లీ వాడాల్సి వస్తోందని, శానిటైజర్లు కూడా సరిపడా అందుబాటులో లేవని వైద్యులు చెప్పారు.

ఇవి 'అభివృద్ధి చెందిన దేశం'లోని పరిస్థితుల గురించి పత్రికల్లో వస్తున్న కథనాలు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Reuters

అవసరమైతే, వైద్యులు మాస్కులు లేకుంటే స్కార్ఫులు, కండువాలు వాడాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సిఫారసు చేయడాన్ని చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సీడీసీ చెప్పినట్లు చేస్తే, తాము, తమ కుటుంబాలు ప్రమాదంలో పడాల్సి వస్తుందంటూ చాలామంది వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వెంటిలేటర్లు చాలా కీలకం. అమెరికాలో ప్రస్తుతం 1,60,000 వెంటిలేటర్లు ఉన్నాయి. ఇంకా చాలా అవసరమవుతాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కరోనావైరస్‌ నుంచి తప్పించుకునేందుకు బంకర్లను అమ్మడం.

ఒక విశ్లేషణ ప్రకారం, 1968లో ఇన్‌ఫ్లూయెంజా సమయంలో మాదిరి పరిస్థితులు ఇప్పుడు పునరావృతమైతే అమెరికాలో 10 లక్షల మంది ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తుంది. 3.8 కోట్ల మందికి వైద్య సహాయం, 2,00,000 మందికి ఐసీయూ అవసరం అవుతాయి.

1968లో విజృంభించిన మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా చనిపోయారు. ఒక్క అమెరికాలోనే 1,00,000 మంది మరణించారు.

అమెరికాలో 1,000 మందికి 2.8 చొప్పున ఆస్పత్రి పడకలు ఉన్నాయి. దక్షిణ కొరియాలో 1,000 మందికి 12కి పైగా ఉన్నాయి. చైనాలో 1,000 మందికి 4.3 పడకలు ఉన్నాయి.

బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)