కరోనావైరస్: విశాఖలో పాజిటివ్ కేసు, నగరంలో హై అలర్ట్

- రచయిత, విజయ్ గజం
- హోదా, బీబీసీ కోసం
విశాఖ నగరంలో వైద్య శాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. నగరంలో కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అల్లిపురం ప్రాంతానికి చెందిన ఒక వృద్ధుడికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరించారు. ప్రస్తుతం ఆయనకు చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఫొటో సోర్స్, PA
విశాఖ-హైదరాబాద్- సౌదీ
అల్లిపురం ప్రాంతానికి చెందిన 65 సంవత్సరాల వ్యక్తి మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చారు.
ఫిబ్రవరి 21న ఆయన గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో హైదరాబాద్ వెళ్లారు. అక్కడ 25 వరకూ తన కుమార్తె ఇంట్లో ఉన్నారు. 26వ తేదీన మక్కా వెళ్లారు. అక్కడి నుంచి మార్చి 9న మదీనా వెళ్లారు. 10వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. 11న రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి 12వ తేదీ ఉదయం విశాఖ వచ్చారు.

దగ్గు, జలుబుతో బాధపడిన ఆయనకు మొదట స్థానికంగా ఉన్న ఓ వైద్యశాలలో చికిత్స చేశారు. ఆనంతరం మూడు రోజుల క్రితం విశాఖలోని చెస్ట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన నుంచి శాంపిళ్లు సేకరించి హైదరాబాద్ పంపి పరీక్షించారు. ఆయనకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. దాంతో ఆయన్ను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఆయనతో పాటు మరో ముగ్గురు కూడా అలాంటి లక్షణాలతోనే రావడంతో వారి నుంచి శాంపిళ్లు సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు.
ఆయన నివాసం ఉండే ప్రాంతంలో వైద్య బృందాలు సర్వే చేస్తున్నాయి. ఆయన ఈ వారం రోజుల్లో ఎవరెవరిని కలిశారు? ఎక్కడికి వెళ్లారు? తదితర వివరాల గురించి ఆరా తీస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు.

విశాఖలో ఆంక్షలు
అల్లిపురం చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకూ రహదారులను మూసివేశారు. ఆశా వర్కర్లు, వాలంటీర్లతో కలిపి 141 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, మొత్తం 7,800 ఇళ్లను జల్లెడ పడుతున్నామని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తిరుపతిరావు చెప్పారు. శానిటైజర్లను స్ప్రేయింగ్ చేయడంతో పాటు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తామని తెలిపారు.
ఇంతే కాకుండా, విశాఖలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే కాల్ సెంటర్‌లో సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాలతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జూ పార్కు, అన్నీ మూతపడ్డాయి.
పర్యటక కేంద్రాలైన బొర్రా గుహలను కూడా మూసివేశారు. విశాఖ ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, కైలాసగిరిలోనూ సందర్శకుల శాతం చాలా తక్కువగా ఉంది.

- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు


ఉత్తరాంధ్ర వ్యాప్తంగా సీతంపేట ఏజెన్సీ, పార్వతీపురం ఏజెన్సీ, విశాఖ ఏజెన్సీలో వారాంతపు సంతలు, ప్రార్ధనా స్థలాలు వంటి వాటిని నిషేధించారు.
ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయిన సింహాచలం దేవస్థానం, శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం, అరసవిల్లి సూర్యదేవాలయం, అనకాపల్లి నూకాంబిక దేవాలయం, ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయం మూసేశారు. భక్తులు ఎవ్వరూ రావద్దని చెప్పారు.
కరోనా వైరెస్ మరింత వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

నష్టపోతున్న చిరువ్యాపారులు
ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలన్న ప్రధాని పిలుపు, విశాఖలో కరోనావైరస్ ఎక్కువైందన్న పుకార్లు వచ్చిన నేపథ్యంలో చిరు వ్యాపారాలు నష్టపోతున్నారు.
సీతమ్మధార జంక్షన్ దగ్గర పండ్ల దుకాణం నడిపే రామును బీబీసీ పలకరించగా... "రోజుకు దాదాపు 4 వేల రూపాయల నుంచి 5 వేల రూపాయల వరకూ పళ్లు, జ్యూస్‌లు అమ్మేవాళ్లం. కానీ, ఇప్పుడు కరోనావైరస్ వచ్చిందని చెప్పేసరికి రెండు రోజులుగా కేవలం 2 వేల వరకూ మాత్రమే వ్యాపారం జరుగుతోంది. దుకాణంలో ఎక్కడి సరుకు అక్కడే ఉండిపోయింది" అని చెప్పారు.
బీచ్‌లో ఐస్‌క్రీంలు అమ్ముకునే దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ’’గతంలో ఒక్కసారి స్టాక్ తీసుకొస్తే రెండు రోజుల్లో అమ్మేసేవాడిని. కానీ, ఇప్పుడు వారం నుంచి స్టాక్ అమ్ముడు పోవడంలేదు. మామూలు రోజుల్లో రోజూ 12 వందల నుంచి 1500 వరకూ ఐస్‌క్రీంలు అమ్మేవాడిని. ఆదివారమైతే దాదాపు 3,000 వరకూ అమ్మేవాడిని. ఇప్పుడు రోజుకు నాలుగు వందలు అమ్మడం కూడా చాలా కష్టంగా ఉంది. బండి అద్దె వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి" అని బీబీసీతో చెప్పారు.

కొండెక్కిన కూరగాయల ధరలు
కూరగాయల రేట్లు చాలా పెరిగాయి. కరోనావైరస్ బాగా వ్యాప్తి చెంది, విశాఖలో మరో 5 కేసులు నమోదయ్యాయని పుకార్లు వ్యాప్తి చెందాయి. దీంతో విశాఖ పూర్ణా మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
"గతంలో 10 నుంచి 15 రూపాయలు ఉండే కిలో టమాటా ఇప్పుడు దాదాపు 25 రూపాయలైంది. 25 రూపాయలు ఉన్న కిలో ఉల్లి 35 రూపాయలకు చేరుకుంది. శని, ఆదివారాలు మార్కెట్ మూసేస్తున్నాం. దాంతో శుక్రవారం ఎక్కువ మంది జనాలు వచ్చారు" అని రెడ్డి అనే కూరగాయల వ్యాపారి వివరించారు.
సాధారణంగా ఇక్కడ ఉన్న 325 షాపుల్లో రోజూ కనీసం 70 లక్షల రూపాయల వ్యాపారం జరిగేది. గత కొద్ది రోజులుగా కరోనావైరస్ వస్తోందని విపరీతంగా ప్రచారం జరగడంతో కేవలం రోజుకు 20 లక్షల వ్యాపారం మాత్రమే జరుగుతోందని పూర్ణా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంత్ సాహు చెప్పారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే కూలీలకు, కార్మికులకు వేతనాలు ఇవ్వడం కష్టమవుతుందని తెలిపారు.

శానిటైజర్లు, మాస్కులకు పెరిగిన డిమాండ్
విశాఖలో కరోనా పాజిటివ్ కేసు నమోదైందన్న వార్తతో ఒక్కసారిగా మాస్కులకు, శానిటైజర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ధరలు దాదాపు 100 శాతం పెరిగాయి. మార్కెట్‌లో సింగిల్ యూసేజ్ మాస్కులు దొరకడం లేదు. త్రీ లేయర్స్ మాస్కులు అందుబాటులో లేవు. ధర ఎక్కువగా ఉండే రీ యూజబుల్ మాస్కులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
గతంలో రూ.200 ఉన్న ఈ మాస్కులు ప్రస్తుతం రూ.400 వరకూ ధర పలుకుతున్నాయి. పేరున్న కంపెనీల శానిటైజర్లు అసలు దొరకడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
"శానిటైజర్లు, మాస్కులు కంపెనీల నుంచే రావడం లేదు. రవాణా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కేవలం స్థానికంగా తయారయ్యే శానిటైజర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి కూడా గతం కంటే ఎక్కువ ధర ఇచ్చి మేం తీసుకొస్తున్నాం. బల్కులో ఆర్డర్ ఇచ్చినా రావడం లేదు. మాస్కుల కంపెనీలు ధరలు పెంచాయి. లక్ష మాస్కులకు ఆర్డరిస్తే మాకు 25 వేల మాస్కులు మాత్రమే ఇస్తున్నారు. గతంలో 500 ఎంఎల్ శానిటైజర్ బాటిల్ 250 రూపాయలు ఉండేది. ఇప్పుడు దాని ధర 500 రూపాయలు పైనే ఉంది" అని విశాఖలో ఉన్న భరత్ సర్జికల్స్ ఎండీ రఘు పిల్లలమర్రి వివరించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు- ఎలా సోకుతుంది? లక్షణాలు ఏంటి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల కోడ్ వచ్చాక సర్వాధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయా?
- డెబిట్-క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ లావాదేవీలకు కొత్త నిబంధనలు... ఇవాళ్టి నుంచే అమలు
- తెలంగాణ శాసనసభ: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి ఆమోదం
- కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- వాస్ప్-76బి: ఇనుము వర్షంలా కురిసే ఈ గ్రహం ఓ నిప్పుకణిక.. పగటి ఉష్ణోగ్రత 2,400 సెంటీగ్రేడ్లు
- ఆంధ్రప్రదేశ్: మాన్సాస్ ట్రస్ట్ వివాదం ఏంటి? సంచయిత నియామకంపై అశోక్ గజపతిరాజు న్యాయపోరాటానికి నేపథ్యం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








