కరోనావైరస్; సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో ఆందోళన పెరుగుతోందా?

స్మార్ట్ ఫోన్ లో వార్తలు

ఫొటో సోర్స్, Emma Russell

కరోనావైరస్ వ్యాప్తి మూలంగా ప్రపంచం అంతా ప్రస్తుతం ఒక అనిశ్చితి నెలకొంది. దీనికి తోడు వెల్లువలా వస్తున్న కరోనావైరస్ వార్తలు ప్రజలని భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

కరోనావైరస్ గురించి అధిక మోతాదులో ప్రసారమవుతున్న సమాచారం ప్రజల మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా మానసిక ఆందోళన, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ (ఓసీడీ)) ఉన్న వారిలో ఇది మరీ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.

ఈ పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యం కాపాడుకోవడం ఎలా?

కరోనావైరస్ వ్యాప్తి సమయంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన సూచనలకు సోషల్ మీడియాలో సానుకూల స్పందన లభించింది.

సాధారణంగా ఆందోళన కలిగినపుడు పరిస్థితులు నియంత్రణలో లేవనే భయం, అనిశ్చిత పరిస్థితులను తట్టుకోలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని బ్రిటిష్ చారిటీ ఆంక్సియిటీ కి చెందిన నికీ లిడ్ బెటర్ పేర్కొన్నారు.

స్వాభావికంగా ఆందోళన కలిగిన మనుషులు ఇలాంటి సమయంలో మరింత ఇబ్బందులకు గురవుతుండడం సహజం అని చెప్పవచ్చు.

"తెలియని విషయం గురించి విచారించడం, ఏదో ప్రమాదం సంభవిస్తుందని భయపడటం ఆందోళనకి మూల కారణాలని" , బ్రిటన్ మానసిక ఆరోగ్య సంస్థ చారిటీ మైండ్ ప్రతినిధి రోసీ వెథర్ లీ అన్నారు.

టీవీ లో వార్తలు

ఫొటో సోర్స్, Getty Images

1. వార్తలు తగ్గించి చదవండి

  • మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే వార్తలని చదవడం కానీ, చూడటం కానీ తగ్గించండి. ఒక నిర్దిష్ట సమయం కేటాయించుకుని వార్తలు చూడండి.
  • కరోనా వైరస్ గురించి చాలా తప్పుడు సమాచారం ప్రచారమవుతోంది. ప్రభుత్వ సమాచార సాధనాలు, జాతీయ ఆరోగ్య నిపుణులు ద్వారా వచ్చే సమాచారం పై మాత్రమే దృష్టి పెట్టండి.

కరోనా వైరస్ చైనా లోని వుహాన్ నగరంలోని తలెత్తిన ప్రారంభ దశలో కరోనా వార్తలు ఎక్కువగా చూసి కరోనా సోకిందని భయంతో ఆంధ్ర ప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలోని శేషయ్యనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన బాలకృష్ణయ్య అనే వ్యక్తి ఆత్మహత్య కి పాల్పడ్డారు.

ప్రపంచంలోని పలు దేశాలలో వ్యక్తులు కరోనావైరస్ వార్తలు చూసి ఆందోళనకి గురవుతున్నారు.

యు.కెలో నిక్ అనే వ్యక్తి కూడా కరోనా వార్తలు ఎక్కువగా చూడడం వలన ఆందోళనకి గురవుతున్నట్లు తెలిపారు.

"నేను ఆందోళనకు గురైనపుడు నా ఆలోచనలు అదుపు తప్పి ఉపద్రవం ఏమన్నా తలెత్తుతుందేమో అని భయపడుతూ ఉంటాను" అని నిక్ చెప్పారు.

నిక్ తన వృద్ధ తల్లి తండ్రుల గురించి ఎక్కువ భయపడుతున్నాడు.

"నేను ఎక్కువ బాధ పడినపుడు నేను ఆ పరిస్థితి నుంచి బయటకి తప్పుకుంటాను. కానీ ఇది అసలు నా నియంత్రణలో లేదు."

సోషల్ మీడియా, వార్తలు చూడటం తగ్గించడం తనకు ఉపయోగపడిందని నిక్ చెప్పారు.

మానసిక ఆరోగ్య సంస్థలు తమ హెల్ప్ లైన్ ల ద్వారా అందించిన సహాయం కూడా ఉపయోగపడిందన్నారు.

మాస్క్ ధరించిన మహిళ

ఫొటో సోర్స్, Getty Images

2. సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోండి

  • ట్విట్టర్ లాంటి వెబ్ సైట్ లలో పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా వస్తున్న సమాచారాన్ని, అకౌంట్లను మ్యూట్ లేదా అన్ ఫాలో చేయండి.
  • మీకు అక్కరలేని సమాచారాన్ని ఇస్తున్న వాట్సాప్ సందేశాల్ని మ్యూట్ చేయండి. అలాగే మూకుమ్మడిగా వస్తున్న ఫేస్ బుక్ పోస్టులను కూడా అన్ ఫాలో చేయవచ్చు.

24 ఏళ్ల అలిసన్ తన వృత్తి రీత్యా కరోనా వైరస్ గురించి ఎక్కువ సమాచారం చదవవలసి వస్తుంది. సోషల్ మీడియా వలన కూడా తనకి మానసిక ఆందోళన కలుగుతోందని ఆమెకి తెలుసు.

"సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు హాష్ టాగ్స్ చూస్తూ నేను భయాందోళనలకు గురయ్యాను. ఒక్కొక్కసారి భయంతో ఏడ్చేశాను" అని చెప్పారు

ఇప్పుడు ఆమె హాష్ టాగ్స్ మీద క్లిక్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తూ, తనని ఆందోళనకి గురి చేసే సమాచారానికి దూరంగా ఉంటున్నానని చెప్పారు.

సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంటూ, టీవీ చూడటం, పుస్తకాలు చదవటంలో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు చెప్పారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
చేతులు శుభ్రపర్చుకుంటున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

3. మీ చేతులు శుభ్రపరుచుకోండి. కానీ పదే పదే కాదు

అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ (ఓసీడీ) ఉన్న వ్యక్తులు తమ చుట్టూ ఉన్న వారిని కూడా వైరస్ భయంతో చేతులు తరచుగా కడుక్కోమని చెబుతూ ఉంటారు

ఏదైనా వ్యాధి వ్యాపిస్తుందేమో అనే భయం తన అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ కి కారణమని ' బికాస్ వి ఆర్ బ్యాడ్' అనే పుస్తకంలో లిలీ బైలీ పేర్కొన్నారు.

తరచుగా చేతులు కడుక్కోమని హెచ్చరించడం కూడా ఆందోళనకి దారి తీస్తుందని ఆమె అన్నారు.

నేను మానేయాలనుకున్న కొన్ని ప్రవర్తనలని మళ్ళీ అలవర్చుకోవాలంటే కాస్త కష్టమే అని ఆమె అభిప్రాయపడ్డారు.

వదిలేసినా వ్యసనాలని తిరిగి అలవాటు చేసుకోవడం మరింత కష్టమని, సోప్, శానిటైజర్ లాంటివి వ్యసనం లాంటివని ఆమె అన్నారు.

సబ్బులు, లోషన్ లు

ఫొటో సోర్స్, Emma Russell

ఈ చేతులు కడుక్కునే ప్రక్రియ వైరస్ నుంచి రక్షించుకునేందుకు చేస్తున్నారా, లేదా ఒక వ్యసనంలా పదే పదే చేస్తున్నారా అనే విషయాన్ని పరిశీలించుకోవాలని ఓసీడీ యాక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ చెబుతోంది.

చాలా మందికి ఇంటి నుంచి బయటకి వెళితే పరిస్థితి మెరుగు పడినట్లు భావిస్తారని, కానీ తమని తాము ఒంటరితనంలోకి నెట్టుకొవడాన్ని ఇంకొక సవాలుగా చూస్తారని బైలీ చెప్పారు.

ఇంటిలో ఖాళీగా ఉండటం వలన ఈ ఓ సి డి బారిన పడే అవకాశాలు ఇంకా ఎక్కువని చెప్పారు.

ఫోన్లలో మాట్లాడుతున్న వ్యక్తులు

ఫొటో సోర్స్, Getty Images

4. ఆప్తులతో మాట్లాడుతూ ఉండండి

స్వీయ నిర్బంధంలోకి వెళ్లే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నందున ఆ సమయంలో మీకు కావల్సిన వారి ఫోన్ నంబర్లు ఇమెయిల్ అడ్రస్లు అందుబాటులో ఉంచుకోవడం మంచిది.

మీకు కావల్సిన వారితో తరచుగా సంభాషణల్లో ఉండటం మంచిదని వెథర్ లీ సూచించారు.

ఒక వేళ మీరు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లయితే, ప్రతి రోజు ఒకేలా ఉండకుండా కొత్త పనులు చేసేటట్లు రోజును రచించుకోండి. అలా చేయడం వలన రెండు వారాల పాటు చాలా పనులు చేసినట్లు అనిపిస్తుంది.

ఎప్పటి నుంచో చేయకుండా మిగిలిపోయిన పనులు, చదవాలనుకుంటున్న పుస్తకాలు చదువుకోవచ్చు.

తోటలో టీ తాగుతున్న చిత్రం

ఫొటో సోర్స్, Emma Russell

5. ఎక్కువగా శ్రమించకండి

కరోనావైరస్ మరి కొన్ని వారాలు, నెలల పాటు ఉండే అవకాశం ఉంది

సూర్యరశ్మిలో ఉంటూ, ప్రకృతితో గడిపే పనులు చేయవచ్చని మెంటల్ హెల్త్ చారిటీ మైండ్ సూచిస్తోంది. మంచి ఆహారం తీసుకుంటూ, సరైన వ్యాయామం చేయమని చెబుతోంది. శరీరానికి తగినంత నీరు తీసుకోమని సూచించింది.

ఆంక్సైటీ యు.కె మానసిక ఆందోళన తగ్గించుకునేందుకు కొన్ని సలహాలు ఇస్తోంది.

గుర్తించండి: అనుకోని పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని ముందు గుర్తించండి

ఆగండి: పరిస్థితిని గుర్తించిన వెంటనే స్పందించకండి. ఒక్క క్షణం ఆగి దీర్ఘంగా శ్వాస తీసుకోండి

వెనక్కి తగ్గాలి: కేవలం ఆందోళనే మిమ్మల్ని భయపెడుతోందని తెలుసుకోండి. అది కేవలం మీ ఆలోచన మాత్రమే. మీరు అనుకున్నవన్నీ నిజమవుతాయని ఊహించుకోకండి. మీ ఆలోచనలు అన్నీ ప్రకటనలు, నిజాలు కావని గ్రహించండి

ముందుకి కదలండి: మీ ఆలోచనని వదిలేయండి. అది దానంతటదే వెళ్ళిపోతుంది. మీరు మీకు వచ్చే ఆలోచనలన్నిటికీ స్పందించనక్కర లేదు. అవన్నీ ఒక మబ్బులా మాయమవుతున్నట్లు ఊహించుకోండి.

మరింత శోధించండి: ప్రస్తుత క్షణాన్ని శోధించండి. ఎందుకంటే ఈ క్షణం అంతా బాగానే ఉంది. మీ శ్వాసని గమనించండి. ఈ క్షణంలో మీరు నిల్చున్న భూమిని పరిశీలించండి. చుట్టూ చూడండి. మీరు ఏమి వింటున్నారో, ఏమి చూస్తున్నారో, ఏమి తాకుతున్నారో, ఏమి ఆఘ్రాణిస్తున్నారో పరిశీలించండి. నెమ్మదిగా మీ దృష్టిని మరో అంశం పైకి మరల్చండి. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో, ఈ ఆందోళన మిమ్మల్ని ముంచెత్తక ముందు మీరు ఏమి చేస్తున్నారో ఎలా ఉన్నారో ఒక సారి గుర్తు చేసుకోండి. మీ పూర్తి ఏకాగ్రతతో మీకు ఇష్టమైన పని ఏదైనా చేయండి.

కరోనావైరస్ గురించి సమాచారం

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)