మీ స్నేహితులు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారా?

ఇద్దరు మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రొఫెసర్ ఒయిన్లోలా ఒయెబోడ్
    • హోదా, బీబీసీ కోసం

ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా చాలా మంది సంకల్పం చెప్పుకొంటుంటారు.

చాలా మంది చిరుతిళ్లు, ఆరోగ్యానికి మంచిదికాని ఆహారాన్ని తగ్గించుకోవాలని, వారాంతంలో వ్యాయామం చేయాలని, ఇలా వివిధ తీర్మానాలు చేసుకొంటుంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి మార్పుల కోసం ప్రయత్నిస్తుంటే వీటిని ఆచరణలోకి తీసుకురావడం తేలికని భావిస్తుంటారు.

నిజానికి మన ఆరోగ్యంపై ప్రభావం చూపే అన్ని నిర్ణయాలూ, చర్యలూ మన ఉద్దేశాలపైనే ఆధారపడి ఉండవు. ఎందుకంటే మనం బాగా అభిమానించే స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబ సభ్యుల జీవనశైలి, అలవాట్లు మనపై బాగా ప్రభావం చూపిస్తాయి.

ఆరోగ్యానికి హానికరమైన అలవాట్లను కూడా వారి ప్రభావంతో మనం అలవర్చుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు పొగ తాగడం, అధికంగా తినడం.

అంతిమంగా ఈ అనారోగ్యకర అలవాట్ల వల్ల గుండెజబ్బు, క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ఈ కోణంలో చూస్తే ఇలాంటి వ్యాధులు కూడా అంటువ్యాధుల మాదిరి ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి వ్యాప్తి చెందుతాయని చెప్పవచ్చు.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

మీ స్నేహితుల వల్ల మీకు ఊబకాయం రావొచ్చా?

మనం విలువ ఇచ్చే వ్యక్తులు, నిత్యం కలిసే వ్యక్తులే మన సామాజిక నెట్‌వర్క్‌గా ఏర్పడతారు.

ఇలాంటి నెట్‌వర్క్‌ల ప్రభావం ఎంత బలంగా ఉంటుందనేది 'ఫ్రామింగ్‌హామ్ హార్ట్ స్టడీ' అనే అధ్యయనంలో పరిశోధకులు విస్తృతంగా పరిశోధించారు. అమెరికాలో మసాచుసెట్స్ రాష్ట్రంలోని ఫ్రామింగ్‌హామ్ నగరంలో 1940ల నుంచి మూడు తరాల ప్రజలపై ఈ అధ్యయనం సాగింది.

ఒక వ్యక్తి సమూహంలో ఎవరైనా ఊబకాయులుగా మారితే ఆ వ్యక్తికి కూడా ఊబకాయం వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఈ అధ్యయనం తెలిపింది. అప్పటికే ఊబకాయం వచ్చిన వ్యక్తి స్నేహితుడు లేదా స్నేహితురాలైతే ఈ అవకాశాలు 57 శాతం, తోబుట్టువు అయితే 40 శాతం, జీవిత భాగస్వామి అయితే 37 శాతం ఉంటాయని వివరించింది.

ఊబకాయమున్న వ్యక్తి పురుషుడైతే అతడి సమూహంలోని మగవారిలో, స్త్రీ అయితే ఆమె సమూహంలోని ఆడవారిలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని అధ్యయనం తెలిపింది. ఆ వ్యక్తి పట్ల ఇతరులకు ఎంత బలమైన భావోద్వేగాలు ఉన్నాయనేది కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పింది.

ఉదాహరణకు రోజూ చూసే ఇరుగుపొరుగుతో సన్నిహిత సంబంధం లేకపోతే వారి బరువు ప్రభావం మీపై ఉండదని ఫ్రామింగ్‌హామ్ అధ్యయనం పేర్కొంది.

స్నేహబంధాలకు బాగా విలువిచ్చే వ్యక్తి స్నేహితుడు లేదా స్నేహితురాలు బరువు పెరిగితే ఆ వ్యక్తి కూడా బరువు పెరిగే అవకాశం ఎక్కువ.

స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రభావంతో విడాకులు తీసుకోవడం, ధూమపానం, మద్యపానం కూడా పెరుగుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఈ అధ్యయనంలో తేలిన అంశాలకు ప్రాధాన్యం ఉంది.

వయసు పెరగడం లాంటి కారణాల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయన్నది వాస్తవమే. అయితే ధూమపానం, ఆహార విధానం, ఎంత శారీరక శ్రమ చేస్తారు, ఎంత మద్యం తాగుతారు లాంటి అంశాల వల్ల అంటువ్యాధులు కాని ఇతర వ్యాధుల బారిన పడే ముప్పు గణనీయంగా పెరుగుతుంది.

ఈ జాబితాలో గుండెజబ్బులు, క్యాన్సర్, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధి లాంటి సమస్యలు ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి మరణాల్లో ఏడు మరణాలకు ఇవే కారణం. బ్రిటన్లో అయితే దాదాపు 90 శాతం మరణాలు వీటివల్లే సంభవిస్తున్నాయి.

మన ప్రవర్తన, మనోస్థితిపైనా మన సమూహాలు (నెట్‌వర్క్‌లు) ప్రభావం చూపించవచ్చు. కౌమార వయసులోని ప్రముఖులు ఎవరైనా పొగ తాగితే, ఆ వయసువారిలో పొగతాగేవారి సంఖ్య పెరుగుతుంది. ఈ అలవాటును మానేసే వారి సంఖ్య తగ్గుతుంది.

టీనేజర్లలో ఎవరికైనా నిరుత్సాహపూరిత మనోస్థితి ఉంటే అది వారి స్నేహితులైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ లక్షణాలు కుంగుబాటు(డిప్రెషన్) కిందకు రావు. కానీ ఇవి టీనేజర్ల జీవన నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల కొందరిలో తర్వాతి దశలో కుంగుబాటు ముప్పు పెరగొచ్చు.

కేక్ తింటున్న పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

ఒకరి ఉద్వేగాలు మరొకరిపై ప్రభావం చూపుతాయని ఇంచుమించు ఏడు లక్షల మంది ఫేస్‌బుక్ యూజర్లపై రహస్యంగా జరిపిన వివాదాస్పద ప్రయోగంలో తేలింది.

ఫేస్‌బుక్ తన ఆల్గరిథమ్‌తో ఈ ప్రయోగాన్ని రెండు భాగాలుగా విభజించి, రెండింటినీ ఒకేసారి చేపట్టింది.

కొందరు యూజర్లకు న్యూస్‌ఫీడ్‌లో సానుకూల ఉద్వేగాలతో కూడిన పోస్టులను తగ్గించింది. మరికొందరికి ప్రతికూల ఉద్వేగాలతో కూడిన పోస్టులను తగ్గించింది.

సానుకూల ఉద్వేగాల పోస్టులను ఎక్కువగా చూసిన యూజర్లు సానుకూల పోస్టులను, ప్రతికూల ఉద్వేగాల పోస్టులను ఎక్కువగా చూసిన యూజర్లు ప్రతికూల పోస్టులను ఎక్కువగా పెట్టే అవకాశముందని ఈ ప్రయోగంలో తేలింది. మనుషులు నేరుగా ఒకరినొకరు కలవకపోయినా, శరీర భాష తెలియకపోయినా, ఆన్లైన్ సోషల్ నెట్‌వర్కుల ద్వారా ఉద్వేగాలు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందొచ్చని వెల్లడైంది.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

డ్రై జనవరి, వెగానువరి, స్టాప్‌టోబర్

స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రవర్తననే మనం కూడా అలవాటు చేసుకొనే పక్షంలో, ఈ లక్షణాన్ని సానుకూలంగా మలచుకోవడం ఎలా?

డ్రై జనవరి, వెగానువరి, స్టాప్టోబర్ అనే మూడు ప్రముఖ ఉమ్మడి ఆరోగ్య కార్యక్రమాల గురించి ఇక్కడ చెప్పుకుందాం.

'డ్రై జనవరి' జనవరిలో మద్యానికి దూరంగా ఉండటాన్ని ప్రోత్సహిస్తుంది.

'వెగానువరీ' ఈ నెల్లో మాంసాహారానికి దూరంగా ఉంటూ శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలని ప్రోత్సహిస్తుంది.

'స్టాప్‌టోబర్' అక్టోబరు నెల్లో ఇంగ్లండ్‌లో ప్రజలను ధూమపానాన్ని ఆపేయాలని ప్రోత్సహిస్తుంది. 2012లో మొదలైన స్టాప్‌టోబర్ పెద్ద విజయం సాధించింది. సోషల్ నెట్‌వర్కుల ద్వారా జీవనశైలిలో మార్పు తీసుకొచ్చే విధానం ప్రాతిపదికగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకొంది.

'స్టాప్టోబర్' పది లక్షల మందికి పైగా ప్రజలతో ధూమపానం ఆపే ప్రయత్నం చేయించిందని అంచనా. ఏడాదంతా తక్కువ స్థాయిలో నిరంతరం చేసే ప్రయత్నాల కన్నా, ఒక్కసారిగా పెద్దయెత్తున చేసే ప్రయత్నం ఎక్కువ మందిపై ప్రభావం చూపొచ్చని ఇది చెబుతోంది.

స్టాప్టోబర్ పెద్ద విజయమే అయినప్పటికీ, ఉన్నతస్థాయి ఆరోగ్య కార్యక్రమాలు అందరిపైనా ప్రభావం చూపవు.

స్టాప్టోబర్ కార్యక్రమం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 'స్టాప్‌టోబర్' అక్టోబరు నెల్లో ఇంగ్లండ్‌లో ప్రజలను ధూమపానాన్ని ఆపేయాలని ప్రోత్సహిస్తుంది. 2012లో మొదలైన స్టాప్‌టోబర్ పెద్దయెత్తున విజయవంతమైంది.

మొత్తం జనాభా ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే ఏం చేయాలి?

సంప్రదాయ ఆరోగ్య ప్రచార కార్యక్రమాలతో ఆరోగ్య అసమానతలు ఇంకా పెరగొచ్చు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో ఇచ్చే సలహాలను స్వీకరించి అమలు చేయగల స్థితిలో అందరూ ఉండరు.

ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యమిచ్చే, విద్య, డబ్బు ఉన్న, జీవనశైలిలో మార్పులు చేసుకోవడానికి సామాజిక మద్దతు దొరికే వారిపైనే ఈ ప్రచారం ఎక్కువగా ప్రభావం చూపుతుంది.

అయితే ఆరోగ్య స్పృహ లేని వారు కూడా తాము నిత్యం కలిసే, తాము పట్టించుకొనే వారి జీవనశైలితో ప్రభావితమవుతారు.

మొత్తం జనాభా ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే, తమ సమూహాల్లోని ఎక్కువ మంది వ్యక్తులను ప్రభావితం చేయగలవారిపై దృష్టి పెట్టాలి.

సమూహాల్లో ఒకరి జీవనశైలి మరొకరిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేదానిపై మరింత లోతైన పరిశోధనలు చేస్తే దీనితో ముడిపడిన రోగాల నియంత్రణకు, ఆరోగ్యకరమైన జీవనశైలి వ్యాప్తికి ఉపకరిస్తుంది. భవిష్యత్తులో అంటువ్యాధులు కాని రోగాలతో సంభవించే మరణాలను తగ్గించవచ్చు.

(వ్యాసకర్త డాక్టర్ ఒయిన్లోలా ఒయెబోడ్ బ్రిటన్లోని 'యూనివర్శిటీ ఆఫ్ వార్‌విక్ మెడికల్ స్కూల్‌'లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ విశ్లేషణాత్మక కథనాన్ని బీబీసీ ప్రతినిధి ఇలీనర్ లారీ ఎడిట్ చేశారు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)