నైలు నదిపై నీటి యుద్ధం.. ఆఫ్రికాలో భారీ ఆనకట్ట రేపిన వివాదం

నైలు నది

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బాసిల్లో ముతాహి
    • హోదా, బీబీసీ న్యూస్, నైరోబీ

నైలు నదిపై ఇథియోపియా భారీ ఆనకట్ట ఒకటి నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఇది పూర్తయ్యేనాటికి ఆఫ్రికాలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుగా అవతరించనుంది.

ఉత్తర ఇథియోపియాలోని కొండల్లోంచి ప్రవహించే నైలు నది ఉప నది బ్లూ నైలుపై ఈ ‘గ్రాండ్ రెనైజెన్స్ డ్యామ్’ నిర్మిస్తున్నారు. 2011లో పనులు ప్రారంభించారు.

ఈ భారీ ఆనకట్ట ఇథియోపియా, ఈజిప్టుల మధ్య వివాదానికి దారి తీసింది. ఈ రెండు దేశాల మధ్యనున్న సూడాన్ కూడా ఈ వివాదంలో చిక్కుకుంది.

అమెరికా ఈ విషయంలో మధ్యవర్తిత్వం చేసి సమస్య పరిష్కరిస్తానంటోంది.

బ్లూ నైల్‌పై ఇథియోపియాలో నిర్మిస్తున్న ఆనకట్ట

ఫొటో సోర్స్, copyrightREUTERS

ఫొటో క్యాప్షన్, బ్లూ నైల్‌పై ఇథియోపియాలో నిర్మిస్తున్న ఆనకట్ట

ఎందుకీ ఉద్రిక్తతలు?

ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆఫ్రికాలోని అత్యంత పొడవైన నదిపై ఇథియోపియా ఆధిపత్యం పెరుగుతుందని ఈజిప్ట్ ఆందోళన చెందుతోంది.

జలవిద్యుత్ ప్రాజెక్టుల వల్ల దిగువకు వెళ్లాల్సిన నీరు ఏమాత్రం తగ్గకపోయినా భారీ ప్రాజెక్టు కావడంతో రిజర్వాయరు నింపడానికి నీటికి అడ్డుకట్ట పడడం వల్ల దిగువ దేశాలకు నైలు నది నీరందదని ఈజిప్ట్ అంటోంది.

గ్రేటర్ లండన్ కంటే పెద్దదైన ఈ రిజర్వాయరును నెమ్మదిగా నింపితే ఫరవాలేదు.. అలా చేస్తే నదిలో నీటి మట్టంపై పెద్దగా ప్రభావం పడదు. కానీ, త్వరత్వరగా నింపే ప్రయత్నం చేస్తే మాత్రం దిగువన నదిలో జలమట్టం తగ్గిపోతుంది.

నైల్ నది

ఫొటో సోర్స్, Getty Images

ఆరేళ్లా? పదేళ్లా?

జలాశయాన్ని ఆరేళ్లలో నింపాలని ఇథియోపియా భావిస్తోంది.

''వచ్చే వర్షాకాలం నుంచి రిజర్వాయరు నింపడం ప్రారంభిస్తాం. 2020 డిసెంబరు నుంచి రెండు టర్బైన్ల ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభిస్తాం'' అని ఇథియోపియా జల మంత్రి సెలెషి బెకెలె సెప్టెంబరులో ప్రకటించారు.

ఆరేళ్లలో కాకుండా పదేళ్ల కాలంలో నింపాలని ఈజిప్ట్ సూచిస్తోంది. అలా చేయడం వల్ల నదిలో నీటి లభ్యత ఒక్కసారిగా తగ్గిపోకుండా నివారించొచ్చని అంటోంది.

ఈ విషయంలో ఏకాభిప్రాయం, పరిష్కారం కోసం ఈజిప్ట్, ఇథియోపియా, సూడాన్ మధ్య నాలుగేళ్లుగా చర్చలు జరుగుతున్నా ఏమాత్రం ఫలితం రాలేదు.

దీంతో ఇప్పుడు అమెరికా మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తోంది.

ఇథియోపియా ఆనకట్ట ఉప గ్రహ చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇథియోపియా ఆనకట్ట ఉపగ్రహ చిత్రం

ఈజిప్ట్ అభ్యంతరమేంటి?

ఈజిప్ట్‌లో 85 శాతం నీటి అవసరాలు తీరేందుకు నైలు నదే ఆధారం. నీటి కొరత ఉన్న ఆ దేశ మనుగడకు నైలు నది ప్రవాహం స్థిరంగా ఉండడం అవసరమని ఎన్నో ఏళ్లుగా చెబుతోంది.

1929 నాటి ఒక ఒప్పందం, ఆ తరువాత 1959లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈజిప్ట్, సూడాన్‌లకు దాదాపు నైలు నది జలాలు మొత్తంపై హక్కులున్నాయి.

వలస పాలన కాలం నాటి ఈ ఒప్పందం ప్రకారం ఈజిప్ట్‌... తమ‌కు ఎగువ దేశాల్లో నైలు నదిపై చేపట్టే ఏ ప్రాజెక్టుపైనైనా అభ్యంతరం తెలిపే హక్కుంది.

అయితే, దశాబ్దాల కాలం నాటి ఈ ఒప్పందానికి ఇకపై తాము కట్టుబడి ఉండబోమంటూ ఈజిప్ట్‌తో సంప్రదించకుండానే ఇథియోపియా 2011 మార్చిలో బ్లూ నైల్‌పై భారీ ఆనకట్ట నిర్మాణం ప్రారంభించింది.

ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్ సిసి సెప్టెంబరులో మాట్లాడుతూ.. ఈజిప్ట్‌లో రాజకీయ గందరగోళం ఏర్పడితే తప్ప ఇథియోపియా ఆనకట్ట సాధ్యం కాదని అన్నారు.

ఈ ఆనకట్ట పూర్తయితే తమ దేశంలోని ఆస్వాన్ ఆనకట్ట వద్ద, నాజెర్ సరస్సులో నీరు తగ్గిపోతుందని ఈజిప్టు ఆందోళన చెందుతోంది. ఈజిప్ట్ విద్యుత్ అవసరాలు తీర్చడంలో ఆస్వాన్ ఆనకట్ట పాత్రే కీలకం.

డ్యామ్

ఫొటో సోర్స్, Getty Images

ఇథియోపియా ఎందుకంత పెద్ద డ్యామ్ కట్టాలనుకుంటోంది?

ఇథియోపియా తన పారిశ్రామిక కలల సాకారం లక్ష్యంతో 300 కోట్ల డాలర్ల ఖర్చుతో ఈ డ్యామ్ నిర్మిస్తోంది. ఇది పూర్తయితే 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతుంది.

ఇథియోపియాలో ఇప్పటికీ 65 శాతం మందికి విద్యుత్ అందుబాటులో లేదు. తీవ్రమైన విద్యుత్ కొరత ఆ దేశాన్ని వేధిస్తోంది.

ఈ బహుళార్థ సాధక ఆనకట్ట నిర్మాణం తరువాత దేశ విద్యుత్ అవసరాలు తీరడమే కాకుండా మిగులు విద్యుత్‌ను పొరుగు దేశాలకు విక్రయించే వీలు కలుగుతుంది.

మరోవైపు ఈ ప్రాజెక్టును పూర్తిగా స్వదేశీ నిధులతో నిర్మిస్తుండడంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది.

డ్యామ్

ఫొటో సోర్స్, Getty Images

పొరుగు దేశాలకు ప్రయోజనం.. సూడాన్‌కు మరింత లాభం

ఇథియోపియాకు పొరుగున ఉన్న సూడాన్, దక్షిణ సూడాన్, కెన్యా, డిజ్‌బౌతీ, ఎరిట్రియాలు కూడా ఈ ఆనకట్ట వల్ల లబ్ధి పొందుతాయి. తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న ఈ దేశాలన్నీ ఇక్కడ ఉత్పత్తి కానున్న విద్యుత్‌తో లాభపడనున్నాయి.

మరోవైపు సూడాన్‌కు ఇది మరింత ప్రయోజనం కలిగిస్తుందని చెబుతున్నారు. నైలు నది కారణంగా సూడాన్‌లో ఏటా ఆగస్టు, సెప్టెంబరులో భారీ వరదలొస్తాయి, వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడతుంది. ఇప్పుడు ఈ ఆనకట్ట పూర్తయితే ఏడాది పొడవునా నీరు ఒకేలా పొందే వీలు కలుగుతుంది.

నైలు నది గమనం

యుద్ధం వస్తుందా?

ఈజిప్ట్, ఇథియోపియాల మధ్య ఏర్పడిన ఈ వివాదం పరిష్కారం కాకుంటే యుద్ధానికి దారి తీయొచ్చన్న భయాలూ ఉన్నాయి.

ఇథియోపియాకు వ్యతిరేకంగా చర్యలకు దిగేలా ఈజిప్ట్ నాయకులు ప్రతిపాదించినట్లుగా 2013లో రహస్య టేపులు కొన్ని బయటకొచ్చాయి.

నైలు నదీ జలాలపై తమకున్న సర్వహక్కులను రక్షించుకునేందుకు ఈజిప్ట్ తగు చర్యలు చేపడుతుందని ఆ దేశ అధ్యక్షుడు సిసి కూడా పలుమార్లు చెప్పారు.

మరోవైపు ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ గత నెలలో తన దేశ ఎంపీలనుద్దేశించి మాట్లాడుతూ ఈ ఆనకట్టను నిర్మించకుండా ఏ శక్తీ ఆపలేదని అన్నారు.

ఈ వివాదంలో మధ్యవర్తిత్వానికి అమెరికా రంగంలోకి దిగడం సమస్య తీవ్రతను చెబుతోంది.

ట్రంప్‌తో ఈజిప్ట్, ఇథియోపియా, సూడాన్ ప్రతినిధులు

ఫొటో సోర్స్, @REALDONALDTRUMP

ఫొటో క్యాప్షన్, ట్రంప్‌తో ఈజిప్ట్, ఇథియోపియా, సూడాన్ ప్రతినిధులు

చర్చల్లో ఏం తేల్చారు?

ఈజిప్ట్, ఇథియోపియా, సూడాన్ నేతలు ఈ వివాద పరిష్కారానికి ఇటీవల చర్చలు జరిపారు.

అమెరికాలో మరో విడత సమావేశం కావాలని, 2020 జనవరి 15 నాటికి వివాదానికి పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు.

అప్పటికీ వారు పరిష్కరించుకోలేకపోతే మధ్యవర్తిత్వం కోరుతామని చెప్పారు.

తదుపరి చర్చలకు పరిశీలకులుగా అమెరికా, ప్రపంచ బ్యాంక్ ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)