సూడాన్‌లో తిరుగుబాటు, అధ్యక్షుడు అరెస్ట్, ఆందోళనకారులకు సైన్యం భరోసా

సూడాన్ తిరుగుబాటు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, సూడాన్ అధ్యక్షుడు ఒమర్-అల్ బషీర్

మూడు దశాబ్దాల వరకూ అధికారంలో ఉన్న సూడాన్ అధ్యక్షుడు ఒమర్-అల్ బషీర్ అధికారం కుప్పకూలింది.

ఆయనను అరెస్ట్ చేశామని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది.

రెండేళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సైన్యం నిర్ణయించిందని రక్షణ మంత్రి అవాద్ ఇబ్న్ వోఫ్ ప్రభుత్వ న్యూస్ చానల్‌లో తెలిపారు.

దీంతోపాటూ దేశంలో మూడు నెలలు అత్యవసర స్థితి విధించారు.

1989 నుంచీ సూడాన్‌ అధ్యక్షుడుగా ఉన్న బషీర్‌కు వ్యతిరేకంగా కొన్ని నెలల నుంచీ ఆందోళన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

ఇటు ఆందోళనలు నిర్వహిస్తున్న సంఘాల అధ్యక్షుడు తిరుగుబాటు జరిగినా నిరసన ప్రదర్శనలు కొనసాగించాలని గురువారమే పిలుపునిచ్చారు.

రక్షణ మంత్రిగా ఒక ప్రకటన చేసిన ఇబ్న్ ఓఫ్ "ప్రభుత్వం కుప్పకూలింది. బషీర్‌ను సురక్షిత ప్రాంతంలో బంధీగా ఉంచాం" అన్నారు.

"బాధ్యతారాహిత్యం, అవినీతి, అన్యాయానికి దేశం బలైపోయింది, ఇప్పటివరకూ జరిగిన హింస, హత్యలకు క్షమించాలి" అని కోరారు.

సూడాన్ తిరుగుబాటు
ఫొటో క్యాప్షన్, సూడాన్ రక్షణ మంత్రి అవద్ ఇబ్న్ ఓఫ్

సైన్యం అత్యవసర సందేశం

అధ్యక్షుడిని అరెస్ట్ చేశారనే సమాచారం బయటకు రాగానే.. రాజధాని ఖార్తూంలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు ఆందోళన ప్రదర్శనలు చేస్తున్న జనం సంతోషంగా సంబరాలు చేసుకున్నారు.

జవాన్లను కౌగలించుకున్న ఆందోళనకారులు సాయుధ వాహనాలపై ఎక్కి నృత్యాలు చేశారు. రాజకీయ బంధీలందరినీ విడుదల చేస్తామని దేశ నిఘా ఏజెన్సీ ప్రకటించినట్లు ప్రభుత్వ వార్తా ఏజెన్సీ తెలిపింది.

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్(ఐసీసీ) బషీర్‌కు వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

సూడాన్ పశ్చిమ ప్రాంతం దార్‌ఫూర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని ఆరోపించింది.

రాజధాని ఖార్తూంలో వేలాది ప్రదర్శనకారులు "ప్రభుత్వం కుప్పకూలింది. మేం గెలిచాం" అంటూ నినాదాలు చేశారు.

ప్రదర్శనలు చేస్తున్న సుడాన్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(ఎస్‌పిఏ) ప్రతినిధులు సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రకటన చేశారు.

"సైన్యం ప్రభుత్వం కుప్పకూలిందని ప్రకటించింది. కానీ అక్కడ మేం ఎవరికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశామో ఆ ముఖాలు, ఆ సంస్థలు అలాగే ఉన్నాయి" అన్నారు.

దాంతో ఆందోళనలు కొనసాగించాలని ఎస్‌పిఏ దేశ ప్రజలకు పిలుపునిచ్చింది.

సూడాన్ తిరుగుబాటు

ఫొటో సోర్స్, AFP

ఒమర్ అల్ బషీర్

ఒక మాజీ సైనికాధికారిగా ఉన్న ఒమర్ అల్ బషీర్ 1989లో సైనిక తిరుగుబాటు తర్వాత అధికారం హస్తగతం చేసుకున్నారు.

ఆయన పాలనలో సూడాన్ భయంకరమైన అంతర్యుద్ధాన్ని చూసింది. 2005లో సౌత్ సూడాన్‌లో అంతర్యుద్ధం ముగిసింది. 2011లో మరో కొత్త దేశంగా ఏర్పడింది.

కానీ దేశ పశ్చిమ భాగం దార్‌ఫూర్‌లో మరో అంతర్యుద్ధం చెలరేగింది. అద్యక్షుడు బషీర్‌పై యుద్ధ నేరాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.

అంతర్జాతీయ న్యాయస్థానం అయినపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినా 2010, 2015 ఎన్నికల్లో బషీర్ గెలిచారు. అయితే గత ఎన్నికలను బహిష్కరించాలని విపక్షాలు పిలుపునిచ్చాయి.

అరెస్ట్ వారెంట్ ఉండడంతో ఆయన అంతర్జాతీయ పర్యటనలన నిషేధం విధించారు. అయినా, ఆయన ఈజిఫ్ట్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికాలో పర్యటించారు.

సూడాన్ తిరుగుబాటు

ఫొటో సోర్స్, Reuters

2015లో దక్షిణాఫ్రికా కోర్టులో ఆయన అరెస్టుపై విచారణలు ప్రారంభమయ్యాయి. ఆయన త్వరగా తన పర్యటన ముగించి తిరిగి వెళ్లిపోయారు.

ఆందోళనలు కొనసాగుతుండడంతో, తిరుగుబాటుపై నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులకు, ప్రజల కోసమే తాము అలా చేయాల్సి వచ్చిందని సూడాన్ సైనిక నేతలు భరోసా ఇచ్చారు.

సూడాన్ రాజకీయ, ఆర్థిక భవిష్యత్తును నిరసనకారులే నిర్ణయించాలని కొత్త మిలిటరీ కౌన్సిల్‌ సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ జైన్ అల్ అబిదిన్ అన్నారు.

అయితే, తిరుగుబాటు చేసిన నేతలు అధికారం కోల్పోయిన అధ్యక్షుడు బషీర్‌కు చాలా సన్నిహితులని ఆందోళనకారులు భయపడుతున్నారు

యుద్ధ నేరాల ఆరోపణలపై ఆయన్ను అప్పగించడం ఉండదని సైన్యం చెబుతోంది.

మిలిటరీ కౌన్సిల్ ప్రకటనను బట్టి, ఆయన్ను సూడాన్‌ లోపలే విచారించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)