లవ్ జిహాద్ కేసు: ఇబ్రహీం-అంజలి జంట తమ ఇష్టప్రకారం జీవించవచ్చన్న హైకోర్టు

ఫొటో సోర్స్, Aryan
- రచయిత, అలోక్ ప్రకాశ్
- హోదా, బీబీసీ కోసం
ఛత్తీస్‌గఢ్‌లో 'లవ్ జిహాద్' పేరుతో ప్రచారమైన ఇబ్రహీం-అంజలి ప్రేమ వివాహం కేసులో అంజలి జైన్ తనకు ఇష్టమైన వారితో తనకు నచ్చిన ప్రాంతంలో ఉండవచ్చని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది.
దీనిపై అంజలి జైన్ బీబీసీతో మాట్లాడుతూ "సఖి సెంటర్ నుంచి విడుదలైన తర్వాత తన భర్త మొహమ్మద్ ఇబ్రహీం సిద్దిఖీతో ఉంటాను" అని చెప్పింది.
స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ జరిగిన ఈ కేసు విచారణల్లో చిక్కుకుపోయిన అంజలి జైన్ గత 8 నెలలుగా రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ 'సఖి సెంటర్'లో ఉంటోంది. ఇక్కడ గత నెలలో ఆమెతో గొడవ కూడా జరిగింది.
"హైకోర్టు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సమక్షంలో అంజలి జైన్‌ను సఖి సెంటర్ నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలో సఖి సెంటర్ ఉన్నతాధికారులు కూడా ఉండేలా చూడాలని చెప్పింది" అని ఇబ్రహీం, అంజలి తరఫు వకీల్ ప్రియాంక శుక్లా అన్నారు.
అంజలి జైన్ చెల్లెలు రాసిన లేఖ ఆధారంగా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్వయంగా ఈ కేసును విచారణకు స్వీకరించింది. దీనితోపాటు అంజలి జైన్ బంధువుల తరఫున కూడా హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి ఉన్నాయి. అంజలి జైన్ కూడా స్వయంగా హైకోర్టుకు ఒక లేఖ రాశారు.
వీటన్నిటినీ విచారించిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు గత శుక్రవారం తీర్పు రిజర్వ్ చేసింది.
కేరళలో చర్చనీయాంశమైన హాదియా కేసులాగే చెబుతున్న ఈ కేసులో కోర్టు తాజా ఆదేశాల తర్వాత మాట్లాడిన అంజలి జైన్ బీబీసీతో "కోర్టుపై నా విశ్వాసం మరింత బలపడింది. నేను గత 8 నెలలుగా ఎంత నరకం అనుభవించానో, జరిగిపోయిన దానిని ఎవరూ తిరిగి ఇవ్వలేరు. కానీ ఆలస్యంగానైనా నాకు న్యాయం జరిగింది" అన్నారు.
సఖి సెంటర్ నుంచి విడుదలైన తర్వాత భర్త మొహమ్మద్ ఇబ్రహీం సిద్దిఖీ అలియాస్ ఆర్యన్ ఆర్యతోపాటూ ఉంటానని అంజలి జైన్ చెప్పారు. "ఈ కేసుకు మతం రంగు పులిమి వివాదాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, కోర్టు తీర్పుతో ఇది 'లవ్ జిహాద్' కాదని, ప్రేమ మాత్రమేనని తేలింది" అన్నారు.

ఫొటో సోర్స్, Aryan
అసలు కేసేంటి?
ఛత్తీస్‌గఢ్ ధమ్‌తరిలో ఉండే 33 ఏళ్ల మహమ్మద్ ఇబ్రహీం సిద్దిఖీ, 23 ఏళ్ల అంజలి జైన్ రెండేళ్ల పరిచయం తర్వాత 2018 ఫిబ్రవరి 25న రాయ్‌పూర్‌లోని ఆర్య మందిరంలో పెళ్లి చేసుకున్నారు.
పెళ్లికి ముందు హిందూ మతం స్వీకరించానని ఇబ్రహీం చెబుతున్నాడు. ఆ తర్వాత అతడు తన పేరును ఆర్యన్ ఆర్యగా కూడా మార్చుకున్నాడు.
మొహమ్మద్ ఇబ్రహీం సిద్దిఖీ అలియాస్ ఆర్యన్ ఆర్య "మా పెళ్లి వార్త నా భార్య అంజలి జైన్ ఇంట్లో వాళ్లకు తెలీగానే, వారు నా భార్యను ఇంట్లో బంధించారు. నేను అంజలిని ఎలాగైనా కలవాలని చాలా ప్రయత్నించా. కానీ, సాధ్యం కాలేదు" అని చెప్పారు.
ఆ తర్వాత ఇబ్రహీం ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. తన భార్య అంజలి జైన్‌ను తిరిగి తనకు అప్పగించాలని అభ్యర్థించారు.
కానీ అంజలి జైన్‌కు ఆలోచించుకోడానికి సమయం ఇచ్చిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు, ఆమె హాస్టల్ లేదా అమ్మనాన్నలతోపాటూ ఉండాలని ఆదేశాలు జారీ చేస్తూ కేసును కొట్టివేసింది.
అంజలి జైన్ మాత్రం అమ్మనాన్నలతో ఉండడానికి బదులు హాస్టల్లో ఉండాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఇబ్రహీం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
గత ఏడాది ఆగస్టులో అంజలిని సుప్రీంకోర్టులో హాజరుపరిచారు. అక్కడ అంజలి జైన్ తన తల్లిదండ్రులతో ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆమె కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కేసు డిటాచ్‌మెంట్ అయ్యిందని భావించారు.
కానీ ఫిబ్రవరిలో ఈ కేసు మళ్లీ కొత్త మలుపు తీసుకుంది.

ఫొటో సోర్స్, ALOK PUTUL
వేధింపుల ఆరోపణ
ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు తనను శారీరకంగా, మానసికంగా వేధించారని అంజలి జైన్ ఫిర్యాదు చేసింది.
తండ్రి తనకు ఏవో మందులు ఇచ్చేవారని, వాటి వల్ల తను ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేదాన్నని ఆమె ఆరోపించింది.
ఆ ఇంట్లో ఉన్నప్పుడే ఎలాగోలా డీజీపీ నంబర్ సేకరించానని, ఆయనకు ఫోన్ చేసి తనను వేధింపుల నుంచి, ఇంటి నుంచి విముక్తి కల్పించాలని కోరానని అంజలి చెప్పారు.
ఆ తర్వాత పోలీసులు ఆమెను తన ఇంటి నుంచి విముక్తి కల్పించారు. రాయ్‌పూర్‌లో ఉన్న సఖి సెంటర్‌లో ఆమెను ఉంచారు. గత 8 నెలలుగా ఆమె అక్కడే ఉంటున్నారు.
సఖి సెంటర్‌లో కూడా బంధువులు, హిందూ సంస్థలు, పోలీసు అధికారులు తనను వేధించారని అంజలి ఆరోపించారు.

ఫొటో సోర్స్, ALOK PUTUL
కోర్టుకు చేరిన కేసు
దీనికి సంబంధించి ఆమె ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు వివరంగా ఒక లేఖ రాశారు.
ఇటు ఈ కేసు సుప్రీంకోర్టు కూడా చేరింది. ప్రస్తుతం అంజలి-ఇబ్రహీం గురించి ఛత్తీస్‌గఢ్‌లో చాలా ప్రదర్శనలు జరుగుతున్నాయి. కొన్ని హిందూ సంస్థల సాయంతో అంజలి జైన్ ఈ విషయంపై బంద్ కూడా నిర్వహించారు.
ఈ విషయంపై రాయ్‌పూర్ నుంచి దిల్లీ వరకూ వచ్చిన అంజలి జైన్ తండ్రి ఈ కేసును 'లవ్ జిహాద్'గా చెబుతూ మత సంస్థలు సాయం కోరారు. దాంతో, కేసు మరింత జటిలం అవుతూ వెళ్లింది.
గత నెల అంజలి జైన్‌ను కలిసిన తర్వాత ఆమె లాయర్ ప్రియాంక శుక్లాపై కూడా ఒక సీనియర్ పోలీస్ అధికారి, ఒక సామాజిక కార్యకర్త దాడి చేసినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత ఈ కేసు మరింత తీవ్రమైంది.
ఈ దాడి తర్వాత స్టేట్ బార్ కౌన్సిల్ కూడా ఈ కేసుపై చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దాడి చేశారని చెబుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి:
- మసీదు దేవుడి ఇల్లయితే, మహిళలకు తలుపులు ఎందుకు మూస్తున్నారు...
- మా అమ్మకు వరుడు కావలెను
- అయోధ్య తీర్పు: 'కోర్టు ద్వారానే మందిరం నిర్మించాలనుకుంటే ఉద్యమం ఎందుకు'
- తెలంగాణ ఆర్టీసీ సమ్మె: కార్మికుల నిరాహార దీక్షలు... అశ్వత్థామరెడ్డి ఇంటివద్ద భారీగా పోలీసులు
- టిక్ టాక్ యాప్‌తో దేశ భద్రతకు ప్రమాదమా?
- పెద్ద నోట్ల రద్దు: ‘రాజకీయంగా అది మాస్టర్ స్ట్రోక్’
- నేపాల్‌తో చైనా స్నేహం భారత్‌కు ప్రమాదమా
- భారత నగరాలు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనవి ఎందుకయ్యాయి
- మీ ఆహార వృథాను అరికట్టటానికి ఆరు మార్గాలు: ప్రపంచ ఆకలిని తగ్గించటంలో మీ వంతు పాత్ర పోషించండిలా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








