రిలయన్స్ జియో మార్ట్: అమెజాన్‌‌కు పోటీగా ఆన్‌లైన్‌లో నిత్యావసర సరకుల విక్రయం

జియోమార్ట్

ఫొటో సోర్స్, Getty Images/Jio Mart

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఈ-కామర్స్ రిటైల్ దిగ్గజ సంస్థ అమెజాన్‌తో పోటీకి సిద్ధమయ్యారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోని రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో విభాగాలు కలిసి.. 'జియోమార్ట్' పేరుతో సరకుల డెలివరీ సేవలను ప్రారంభిస్తున్నాయి.

ఇందుకోసం రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభయ్యాయి. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఉన్న జియో వినియోగదారుల బేస్‌ను ఈ కొత్త వ్యాపారానికి ఉపయోగించుకోవాలని రిలయన్స్ భావిస్తోంది.

భారత్‌లో నడుస్తున్న దేశీయ ఆన్‌లైన్ రిటైల్ సంస్థలకు జియోమార్ట్ రూపంలో గట్టి పోటీ ఎదురుకాబోతోంది.

జియోమార్ట్ సేవలు పరిమిత స్థాయిలో ప్రారంభమైనట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.

50 వేలకు పైగా రకాల సరకులు జియోమార్ట్‌లో అందుబాటులో ఉంటాయని, వీటిని వినియోగదారుల ఇళ్లకు ఉచితంగా, వేగంగా చేరవేస్తామని తెలిపింది.

కొనుగోలు విలువ ఇంత ఉండాలన్న పరిమితి ఏదీ ఉండదని పేర్కొంది.

జియో‌మార్ట్

ఫొటో సోర్స్, JIOMART

జియోమార్ట్ సొంతగా ఉత్పత్తులను అందించకుండా, ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే దుకాణాలను, వినియోగదారులతో అనుసంధానించే యాప్‌ను తెస్తోంది.

ప్రస్తుతం ఆన్‌లైన్ సరకుల మార్కెట్ భారత్‌లో ఇంకా శైశవ దశలోనే ఉంది. మొత్తం జనాభాలో కేవలం 0.15 శాతమే ఈ సేవలను వినియోగించుకుంటున్నారని, ఏటా రూ.6200 కోట్ల మేర అమ్మకాలు సాగుతున్నాయని అంచనాలు ఉన్నాయి.

2023కు అమ్మకాల విలువ రూ.1.03 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు.

భారత్‌లో ఈ-కామర్స్ రంగంలో ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ (వాల్‌మార్ట్ అనుబంధ సంస్థ)ల ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే, విదేశీ సంస్థలు, వాటి అనుబంధ సంస్థల ఆన్‌లైన్ రిటైల్ అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ భారత ప్రభుత్వం చేసిన చట్టాలు వీటికి ప్రతికూలంగా మారాయి.

ఫలితంగా బిగ్ బాస్కెట్ లాంటి దేశీయ సంస్థలకు కొంత సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

ముఖేష్ అంబానీ

ఫొటో సోర్స్, Getty Images

ఆసియాలోనే అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీ సంపద రూ.4.2 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనా.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ప్రధాన వ్యాపారం చమురు శుద్ధి. ఆ సంస్థ మిగతా రంగాల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది.

ఆ సంస్థ స్థాపించిన జియో సంస్థ.. సుమారు 36 కోట్ల మంది వినియోగదారులతో దేశంలోనే రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది.

రిలయన్స్ రిటైల్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా దుకాణాలు ఉన్నాయి. పలు ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ల అవుట్‌లెట్లను కూడా భారత్‌లో ఆ సంస్థ నడుపుతోంది.

ప్రపంచంలోనే అతిపెద్దదైన బొమ్మల విక్రయశాల హమ్లీస్‌ను కూడా గత ఏడాది రిలయన్స్ కొనుగోలు చేసింది.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)