వాలంటైన్స్ డే: ఈ మందు వేసుకుంటే బ్రేకప్ బాధను మరచిపోవచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జెస్సికా మర్ఫీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
పోస్ట్ ట్రామటిక్ స్ట్రెస్ డిజార్డర్(పీటీఎస్‌డీ)తో బాధపడుతున్న అనేక మందిపై కెనడాకు చెందిన మానసిక నిపుణుడు డాక్టర్ అలైన్ బ్రూనెట్ 15 ఏళ్లకు పైగా అధ్యయనం చేశారు.
పీటీఎస్‌డీ బాధితులు చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పదేపదే బాధపడుతుంటారు, భావోద్వేగాలకు లోనవుతుంటారు.
అలాంటి బాధను దూరం చేసేందుకు డాక్టర్ బ్రూనెట్ ఒక సరికొత్త చికిత్సా విధానాన్ని కనిపెట్టారు. దానిని ఆయన 'రీకన్సాలిడేషన్ థెరపీ' అని పిలుస్తున్నారు.
అధిక రక్తపోటును, మైగ్రెయిన్ లాంటి రుగ్మతలకు చికిత్స కోసం చాలాకాలంగా ప్రొప్రనొలోల్ అనే ఔషధాన్ని వాడుతున్నారు. అయితే, ఈ మందుతో ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్ బ్రూనెట్ పరిశోధనలో వెల్లడైంది.


ఆయన రూపొందించిన 'రీకన్సాలిడేషన్ థెరపీ'లో ముందుగా రోగికి ప్రొప్రనొలోల్‌ను ఇస్తారు. అనంతరం ఓ గంట తర్వాత వారు తమ బాధాకరమైన జ్ఞాపకాలను వివరంగా రాసి, అందరికీ వినిపించేలా పెద్దగా చదివి వినిపించాల్సి ఉంటుంది.
"పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని, అప్‌డేట్ చేసి, మళ్లీ సేవ్ చేసుకోవచ్చు" అని ఈ డాక్టర్ అంటున్నారు.
బాధితులను వెంటాడుతున్న అత్యంత భావోద్వేగపూరితమైన అంశం ఏంటన్నది ఈ థెరపీ ద్వారా గుర్తించవచ్చని ఆయన చెబుతున్నారు.
"రోగులకు చికిత్స అందించేందుకు మనలో జ్ఞాపకాలు ఎలా రూపుదిద్దుకుంటాయి? అవి ఎలా అన్‌లాక్ అవుతాయి? ఎలా అప్‌డేట్ అయ్యి మళ్లీ మెదడులో నిక్షిప్తమవుతున్నాయి? అన్నది నాడీ శాస్త్రం నుంచి పొందిన అవగాహనతో అర్థం చేసుకుంటున్నాం" అని డాక్టర్ బ్రూనెట్ చెప్పారు.
అయితే, "ఈ థెరపీ వల్ల పాత జ్ఞాపకాలు మెదడు నుంచి పూర్తిగా తొలగిపోవు. కానీ, అవి మనల్ని వేధించకుండా ఉంటాయి" అని బ్రూనెట్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Rex Features
జ్ఞాపకాలు, వాస్తవ, తటస్థ అంశాలు మెదడులోని హిప్పోక్యాంపస్ (జ్ఞాపకాల నిధి)లో నిక్షిప్తమై ఉంటాయి. భావోద్వేగాలు మాత్రం మెదడులోని అమిగ్దల అనే భాగంలో నిక్షిప్తమవుతాయి.
"ఉదాహరణకు మీరు ఒక పాత తరం సినిమా చూశారనుకుందాం. అందులోని దృశ్యాలు, శబ్దాలు రెండు మీ మెదడులోని రెండు వేర్వేరు భాగాల్లో నిక్షిప్తమై ఉంటాయి. తర్వాత దానిని ఎప్పుడైనా గుర్తు చేసుకున్నప్పుడు ఆ రెండు భాగాల నుంచి సమాచారం గుర్తుకొస్తుంది" అని ఆయన వివరించారు.
అందులో భావోద్వేగాలు నిక్షిప్తమై ఉన్న భాగాన్ని గుర్తించేందుకు ప్రొప్రనొలోల్ సాయపడుతుందని అంటున్నారు. ఈ ఔషధ ఉత్ప్రేరకం సాయంతో ఆ భావోద్వేగపూరిత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుని (రీకాల్ చేసి), భావోద్వేగ తీవ్రతను తగ్గించిన తర్వాత మెదడులో మళ్లీ 'సేవ్' చేసుకుంటారు.
అంటే, ఈ థెరపీ తర్వాత భావోద్వేగాల తీవ్రత తగ్గుతుంది.
ఈ థెరపీ ద్వారా 70 శాతం మంది బాధితులు చాలా వేగంగా ఉపశమనం పొందారని డాక్టర్ బ్రూనెట్ పరిశోధన చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ అధ్యయనం కోసం డాక్టర్ బ్రూనెట్ హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పీటీఎస్‌డీ నిపుణుడు డాక్టర్ రోజర్ పిట్‌మాన్‌తో పాటు మరికొంత మంది పరిశోధకులతోనూ కలిసి పనిచేశారు.
2019లో ఫ్రాన్సులోని పారిస్, నీస్ నగరాల్లో భయంకర తీవ్రవాద దాడులు జరిగాయి. మానసికంగా తీవ్ర ఆందోళనకు గురైన ఆ దాడుల బాధితులకు, ప్రత్యక్ష సాక్షులకు, పోలీసులకు చికిత్స అందించడం కోసం 200 మంది వైద్యులకు శిక్షణ ఇచ్చేందుకు డాక్టర్ బ్రూనెట్ ఫ్రాన్సులో ఒక కార్యక్రమం ప్రారంభించారు.
ఇప్పటి వరకు ఫ్రాన్సులో 400 మందికి పైగా 'రీకన్సాలిడేషన్ థెరపీ' చేశారు.
అలాంటి భయానక దాడుల మాదిరిగానే ప్రేమ విఫలమవ్వడం వల్ల కూడా చాలామంది తీవ్రమైన కుంగుబాటుకు లోనవుతుంటారు. ఏళ్లు గడిచినా... ఆ జ్ఞాపకాలను పదేపదే గుర్తు చేసుకుంటూ తీవ్రంగా బాధపడుతుంటారు. కాబట్టి, వారికి కూడా ఈ థెరపీ పనిచేస్తుందని బ్రూనెట్ అంటున్నారు.

తమ అధ్యయనంలో పాల్గొన్న విఫల ప్రేమికుల్లో చాలామంది ఒక్కసారి ఈ థెరఫీ చేయించుకోగానే ఆ బాధ నుంచి ఉపశమనం పొందారని డాక్టర్ బ్రూనెట్, ఆయనతో కలిసి పనిచేసిన డాక్టర్ లోనెర్గాన్ వివరించారు.
"ఈ థెరపీతో క్రమంగా బాధతో కూడిన జ్ఞాపకాలను మరచిపోయే అవకాశం ఉంటుంది" అని వారు అంటున్నారు.
ఈ థెరపీతో చేదు జ్ఞాపకాల దూరం చేయడంతో పాటు, ఫోబియా, వ్యసనాలను, విచారాలను కూడా దూరం చేసే అవకాశం ఉందని బ్రూనెట్ చెబుతున్నారు.
"భావోద్వేగంతో కూడిన ఘటనల వల్ల కలిగే బాధలన్నింటినీ ఈ థెరపీ దూరం చేయగలదు" అని ఆయన అంటున్నారు.

ఇవి కూడా చదవండి:
- ప్రేమలేఖ: ‘ఇలాంటి ఓ ప్రేమ, ఇలాంటి ఓ ముద్దు, ఇలాంటి ఆలింగనం ఒక్కటైనా... ఒక్కసారైన వుండాలి’
- లవ్ ఎట్ ఫస్ట్ సైట్: తొలిచూపు ప్రేమ నిజమేనా?
- 35ఏళ్ల తరవాత బయటికొచ్చిన ఒబామా ప్రేమలేఖలు
- హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి.. తమ ప్రేమను నిలబెట్టుకున్నారు
- ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
- వేశ్యా గృహాల్లో ప్రేమకు చోటుందా?
- కరోనావైరస్ పశ్చిమ బెంగాల్‌లోని ఈ పల్లెపై ఎలాంటి ప్రభావం చూపించింది
- డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్యలో ఈ గోడ ఎక్కడి నుంచి వచ్చింది
- ‘ఈ శతాబ్దంలోనే అతిపెద్ద నిఘా కుట్ర’
- ఇది కొత్త ప్రేమ ఫార్ములా
- వాలంటైన్స్ డే: ప్రేమికుల రోజు వెనకున్న కథేంటి?
- సైస్స్ ఆఫ్ లవ్: ప్రేమంటే ఏమిటి? మీరిప్పుడు ప్రేమలో ఉన్నారా?
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- #HerChoice: నా భర్త నన్ను ప్రేమించాడు, కానీ పడగ్గదిలో హింసించాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)









