‘ఈ శతాబ్దంలోనే అతిపెద్ద నిఘా కుట్ర’: భారత్ సహా అనేక దేశాల రహస్యాలు చేజిక్కించుకున్న అమెరికా

సైనిక రహస్యాలను, కీలకమైన సమాచారాన్ని చేరవేసుకునేందుకు సైన్యం, ఇతర ప్రభుత్వ శాఖలు ఎన్‌క్రిప్షన్ పరికరాలను వాడుతుంటాయి.
స్విట్జర్లాండ్‌కు చెందిన క్రిప్టో ఏజీ అనే సంస్థ ఇలాంటి సమాచార మార్పిడి కోసం ఉపయోగపడే పరికరాలు తయారుచేసేది. అమెరికా-సోవియట్ యూనియన్ ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి 2000ల ఆరంభం వరకూ.. 120కుపైగా ప్రభుత్వాలకు ఆ సంస్థ క్రిప్టో పరికరాలను అందించింది.
కానీ, ఆ సంస్థ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి.
అమెరికా, పశ్చిమ జర్మనీ నిఘా సంస్థలే గోప్యంగా వెనుకుండి క్రిప్టో ఏజీని నడిపించాయని, లోపాలతో ఉన్న పరికరాలను అందించి వివిధ దేశాల రహస్యాలను తెలుసుకున్నాయని కథనాలు వస్తున్నాయి.


భారత్, ఇరాన్, పాకిస్తాన్ సహా చాలా దేశాల రహస్యాలను ఆ నిఘా సంస్థలు చేజిక్కించుకున్నాయి.
అమెరికా నిఘా సంస్థ సీఐఏ, జర్మనీ నిఘా సంస్థ బీఎన్‌డీ అత్యంత రహస్యంగా క్రిప్టో ఏజీని నడిపించిన తీరుపై.. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక, జర్మనీ వార్తా ఛానెల్ జెడ్‌డీఎఫ్, స్విట్జర్లాండ్ ఛానెల్ ఎస్ఆర్ఎఫ్ వివరాలతో కథనాలు ప్రచురించాయి.
సీఐఏ చరిత్ర గురించిన అంతర్గత నివేదికలు ఈ మీడియా సంస్థల చేతికి రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
క్రిప్టో ఏజీ నిర్వహణ కార్యక్రమాన్ని ‘ఈ శతాబ్దంలోనే అతిపెద్ద నిఘా కుట్ర’గా ఆ నివేదికలు వర్ణించాయి.
1980ల్లో అమెరికా నిఘా అధికారులు సేకరించిన విదేశీ రహస్యాల్లో 40 శాతం ఈ క్రిప్టో పరికరాల ద్వారానే వచ్చాయి.
పైగా క్రిప్టో ఏజీ సంస్థకు వచ్చిన మిలియన్ల కొద్దీ డాలర్ల లాభం కూడా సీఐఏ, బీఎన్‌డీ జేబుల్లోకి చేరింది.
‘‘వివిధ దేశాలు తమ రహస్యాలను అమెరికా, పశ్చిమ జర్మనీలకు సమర్పించుకుంటూనే.. పరోక్షంగా పెద్ద ఎత్తున డబ్బులు కూడా వాటికి చెల్లించాయి. అమెరికా, జర్మనీలతోపాటు ఇంకో మూడు, నాలుగు దేశాలకు కూడా ఆ రహస్యాలు చేరి ఉండొచ్చు’’ అని బయటకు వచ్చిన నివేదికల్లో ఉంది.
1979లో ఇరాన్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంలోకి ఓ విద్యార్థి బృందం చొరబడి, అమెరికాకు చెందిన 52 మంది దౌత్యవేత్తలు, పౌరులను 444 రోజులపాటు బంధీలుగా ఉంచుకుంది.
ఈ సమయంలో ఇరాన్ అధికారులపై క్రిప్టో ఏజీ పరికరాల ద్వారానే అమెరికా నిఘా పెట్టిందని, ఫాల్క్‌లాండ్స్ యుద్ధం సమయంలో అర్జెంటీనా సైన్యం గురించి బ్రిటన్ నిఘా సంస్థలకూ వీటి ద్వారానే సమాచారం చేరిందని వాషింగ్టన్ పోస్ట్ రాసింది.
రష్యా, చైనా ఈ పరికరాలను ఎప్పుడూ విశ్వసించలేదు. వాటిని వాడలేదు.
2018లో క్రిప్టో ఏజీలో కొంత వాటాను పొంది ఓ పెట్టుబడిదారు క్రిప్టో ఇంటర్నేషనల్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. తమకు సీఐఏ, బీఎన్‌డీలతో ఏ సంబంధాలూ లేవని ఆ సంస్థ ప్రకటించింది. తాజా కథనాలు తమకు తీవ్ర ఆవేదన కలిగించాయని తెలిపింది.
మరోవైపు ఈ వ్యవహారం గురించి గత నవంబర్‌లో తమకు సమాచారం అందిందని స్విట్జర్లాండ్ ప్రభుత్వం తెలిపింది. దీనిపై విశ్రాంత ఫెడరల్ జడ్జితో విచారణకు ఆదేశించింది.

స్విట్జర్లాండ్‌లో ఆవేదన స్వరాలు..
- బీబీసీ ప్రతినిధి ఇమోగెన్ ఫోల్కెస్
క్రిప్టో ఏజీ వ్యవహారంపై స్విట్జర్లాండ్ వ్యాప్తంగా ఆవేదన వ్యక్తమవుతోంది.
‘‘మన పేరు మంటకలిసిపోతోంది’’ అని ఓ రాజకీయ పాత్రికేయుడు అంటే.. ‘‘మన తటస్థత అంతా కపట నాటకమే’’ అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు.
క్రిప్టో ఏజీ కార్యకలాపాల గురించి ఏళ్లుగా వదంతులు వస్తున్నాయి. ఆ సంస్థ ఉద్యోగులు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.
స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి ముందు నుంచీ ఈ విషయం తెలుసు. లోపాలు లేని క్రిప్టో పరికరాలను పొందిన కొన్ని దేశాల్లో స్విట్జర్లాండ్ కూడా ఒకటి. ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తున్నట్లు మీడియా అంతటా కథనాలు రావడం ఇబ్బందికరమే.
సరైన ధరను చెల్లిస్తే ఏదైనా చేస్తుందని స్విట్జర్లాండ్‌కు ఉన్న పేరును ఈ పరిణామం గుర్తుచేస్తోంది. దాన్ని చెరిపేసుకోవాలని ఆ దేశం గట్టిగానే ప్రయత్నిస్తోంది.
నియంతలు దోచుకున్న బిలియన్ల సంపదకు ఆ దేశ బ్యాంకులు కాపలా కాసేవి. భారీ స్థాయిలో పన్ను ఎగవేసేవారిని చూసీ చూడనట్లుగా వదిలేసేవి.
అదంతా గతం అయిపోవాలి. కానీ, ఇప్పుడు ఆ దేశం గర్వించే రంగాల్లో ఒకటైన ప్రిసిషన్ ఇంజినీరింగ్ కూడా చౌకబారుగా కనిపిస్తోంది.
తటస్థత, నాణ్యత విషయంలో స్విట్జర్లాండ్‌కున్న పేరును నమ్మి, వివిధ దేశాలు ఆ పరికరాలు కొంటాయనే... క్రిప్టో ఏజీని సీఐఏ వాడుకుంది.
స్విట్జర్లాండ్ డబ్బులు తీసుకుంది. లోపాలతో ఉన్న పరికరాలను అమ్మింది. ఇప్పుడు ఇది అందరికీ తెలుసు.


ఫొటో సోర్స్, Getty Images
క్రిప్టో కథ
1940ల్లో నార్వేను నాజీలు ఆక్రమించుకున్న సమయంలో.. బోరిస్ హేగెలిన్ అనే రష్యన్ ఆవిష్కర్త అమెరికాకు పారిపోయారు.
అక్కడ ఆయన పోర్టెబుల్ క్రిప్టో పరికరాలను తయారుచేశారు. యుద్ధ క్షేత్రాల్లో వాడేంత చిన్నగా ఇవి ఉండేవి.
1,40,000 మంది అమెరికన్ సైనికులకు ఆ సైన్యం ఈ పరికరాలను అందించింది.
రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక, హేగెలిన్ స్విట్జర్లాండ్‌కు వలస వెళ్లారు. అక్కడ ఓ సంస్థను పెట్టారు. ఇదే ఆ తర్వాత క్రిప్టో ఏజీగా మారింది.
హేగెలిన్ సాంకేతకత బాగా ఆధునికంగా ఉండటంతో, వివిధ దేశాలపై నిఘా పెట్టడం కుదరదని అమెరికా ప్రభుత్వం ఆందోళన చెందింది.
ఆధునిక పరికరాలను అమెరికా చెప్పిన దేశాలకు అమ్మేలా హేగెలిన్‌ను అమెరికన్ క్రిప్టోగ్రాఫర్ కోడ్ బ్రేకర్ ఒప్పించారు.
పాత పరికరాలనే ఇతర దేశాలకు అమ్మేలా చేశారు. ఆ పాత పరికరాల ద్వారా మార్పడియ్యే సమాచారాన్ని ఎలా సేకరించాలో సీఐఏకు అదివరకే తెలుసు.

ఇవి కూడా చదవండి.
- పోలీసుల నిర్లక్ష్యం వల్లే మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారా?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- విక్టోరియా మహారాణి, ఆమె భారత గుమస్తా అబ్దుల్ కరీమ్ మధ్య అంతుపట్టని ఆ బంధాన్ని ఏమనాలి
- అరవింద్ కేజ్రీవాల్: ఎప్పటికీ రాజకీయాల్లోకి రానన్నారు.. ఇప్పుడు మూడోసారి సీఎం అవుతున్నారు
- దారా షికోహ్: సోదరుడి తల నరికి షాజహాన్‌కు బహుమతిగా పంపిన ఔరంగజేబ్
- ఎలక్ట్రిక్ కారు కొనాల్సిన టైమ్ వచ్చేసిందా...
- బాంబే డక్: ‘భారతదేశ చేపల్లో అద్భుతమైన చేప’
- నేతాజీ సుభాష్ చంద్రబోస్: 1934 - ఎ లవ్ స్టోరీ
- కరోనావైరస్ కొత్త పేరు కోవిడ్-19.. దీన్ని ఎలా పెట్టారంటే..
- ట్రాయ్: ట్రోజన్ యుద్ధం నిజంగా జరిగిందా లేక కట్టు కథా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









