అరవింద్ కేజ్రీవాల్: ఐఐటీ విద్యార్థి నుంచి దిల్లీ సీఎం దాకా...

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Rajeev saraf

ఫొటో క్యాప్షన్, కాలేజీ రోజుల్లో మిత్రుడితో కేజ్రీవాల్
    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2012 అక్టోబర్ 2న హాఫ్ షర్టు, వదులుగా ఉన్న ప్యాంట్, తలపై 'మై హూ ఆమ్ ఆద్మీ' (నేను సామాన్యుడిని) అనే టోపీ పెట్టుకున్న అరవింద్ కేజ్రీవాల్ కాన్‌స్టిట్యూషనల్ క్లబ్‌ వేదికపైకి వచ్చారు.

ఆయన వెనుక మనీష్ సిసోదియా, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, కుమార్ విశ్వాస్, గోపాల్ రాయ్, అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆయనతో కలిసి పాల్గొన్న మిగతావారూ కూర్చుని ఉన్నారు.

అడ్డగీత
News image
అడ్డగీత

రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన కేజ్రీవాల్.. "మేం ఎన్నికల్లో పోటీ చేసి చూపిస్తామని ఈరోజు ఈ వేదికపై ప్రకటిస్తున్నాం. దేశ ప్రజలు ఈరోజు ఎన్నికల రాజకీయాల్లోకి దూకుతున్నారు. ఇక మీరు మీ రోజులు లెక్కించుకోవడం ప్రారంభించండి" అన్నారు.

అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మార్చిన కేజ్రీవాల్, తర్వాత ఎన్నికల్లో పోటీచేసి గెలవడమే కాదు, మూడోసారి దిల్లీ ఎన్నికల్లో గెలిచి మోదీ మ్యాజిక్‌కు సమాధానం తన దగ్గరే ఉందని నిరూపించారు.

ఒక ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిగా, ఐఐటీ విద్యార్థిగా 2011లో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో కేజ్రీవాల్ తన రాజకీయ పునాదులు వేసుకున్నారు. కానీ, ఒక సామాజిక కార్యకర్తగా ఆయనకు అంతకు ముందే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, AFP

2002 ప్రారంభంలో కేజ్రీవాల్ ఐఆర్ఎస్ నుంచి సెలవు తీసుకుని దిల్లీలోని సుందర్ నగర్ ప్రాంతంలో తన 'యాక్టివిజం' ప్రయోగాలు చేస్తున్నారు.

ఒక ప్రభుత్వేతర సంస్థను స్థాపించిన కేజ్రీవాల్ దానికి 'పరివర్తన్' అనే పేరు పెట్టారు. తన కొందరు స్నేహితులతో కలిసి అక్కడ క్షేత్రస్థాయి మార్పులు తీసుకురావాలని భావించారు.

కొన్ని నెలల తర్వాత 2002 డిసెంబర్‌లో అభివృద్ధి అంశంపై మొదటిసారి పట్టణ ప్రాంతాల్లో కేజ్రీవాల్ ఎన్జీవో పరివర్తన్ ప్రజావిచారణ నిర్వహించింది. ఆ సమయంలో ప్యానల్‌లో జస్టిస్ పీబీ సావంత్, మానవహక్కుల కార్యకర్త హర్ష్ మందర్, రచయిత్రి అరుంధతి రాయ్, సమాచార హక్కు కార్యకర్త అరుణా రాయ్ లాంటి వారు ఉన్నారు.

తర్వాత చాలా ఏళ్లపాటు కేజ్రీవాల్ యూపీ సరిహద్దుల్లోని తూర్పు దిల్లీలో ఉన్న ఈ ప్రాంతంలో విద్యుత్, నీళ్లు, రేషన్ లాంటి అంశాలపై పనిచేశారు.

ఆయనకు మొదటి గుర్తింపు 2006లో లభించింది. 'ఎమర్జింగ్ లీడర్‌షిప్' విభాగంలో ఆయనకు రామన్ మెగసెసె పురస్కారం ఇచ్చారు.

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Getty Images

ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి పనిచేసిన అమిత్ మిశ్రా ఇప్పటికీ ఆయనతోనే ఉన్నారు. "అరవింద్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండేవారు. ఏ పని కావాలన్నా, చాలా స్పష్టంగా చెప్పేవారు. కాదు, ఎలా చేయాలి అనే మాటలే వినేవారు కాదు. లాజికల్ వాదనలు మాత్రం వినేవారు" అని మిశ్రా అన్నారు.

"ఆ రోజుల్లో మేం పరివర్తన్ కోసం మొహల్లా సభలు పెట్టేవాళ్లం. ఆ సభల్లో మేం లోకల్ గవర్నెన్స్ మీద చర్చించేవాళ్లం. ఆ సభలకు అధికారులను పిలిచి వారిని వివిధ అంశాలపై ప్రశ్నించేవాళ్లం" అన్నారు.

"అరవింద్ కేజ్రీవాల్ ఆ సమయంలో చిన్న చిన్న విధానాలు రూపొందించేవారు. వాటితో అధికారులు, నేతలను కలిసేవారు. వారిని ప్రశ్నించేవారు. తను లేవనెత్తిన అంశాలపై పార్లమెంటులో ప్రశ్నించడానికి, ఆయన అప్పటి నుంచే నేతలను కలవాలని ప్రయత్నించేవారు" అంటారు అమిత్.

కేజ్రీవాల్ తర్వాత చాలా ఏళ్లవరకు సుందర్ నగర్‌లో సమస్యలపై పనిచేస్తూ వచ్చారు. సమాచార హక్కు కోసం జరుగుతున్న ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించారు.

సుందర్ నగర్‌లో ప్రజలు, వారి సమస్యలు తెలుసుకోడానికి అరవింద్ కేజ్రీవాల్ అక్కడే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు. అక్కడి ప్రజల ప్రాథమిక అవసరాలు తెలుసుకున్నారు. వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండేవారు.

2010లో దిల్లీలో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణలో కుంభకోణం జరిగిందంటూ మీడియాలో వార్తలు వచ్చాక ప్రజలు అవినీతిపై ఆగ్రహించారు. సోషల్ మీడియాలో 'ఇండియా అగైనెస్ట్ కరప్షన్' ఉద్యమం మొదలైంది. కేజ్రీవాల్ దానికి ముఖచిత్రంగా మారారు. దిల్లీలో, దేశంలోని చాలా ప్రాంతాల్లో అవినీతికి వ్యతిరేకంగా ప్రజాసభలు జరిగాయి.

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Getty Images

2011 ఏప్రిల్‌లో గాంధేయవాది, సమాజ సేవకుడు అన్నా హజారే దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అవినీతికి వ్యతిరేకంగా జనలోక్‌పాల్ డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగినప్పుడు, ఆ వేదికపై అన్నా వెనుక కేజ్రీవాల్ కనిపించారు.

ఏప్రిల్ 9న అన్నా హఠాత్తుగా తన నిరవధిక నిరాహారదీక్షను ముగించినపుడు, ఉత్సాహంగా ఉన్న యువకుల గుంపు కేజ్రీవాల్‌ను చుట్టుముట్టింది.

ఆ అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కేజ్రీవాల్ అప్పటికే ఆర్కిటెక్ట్ అయ్యారు. తర్వాత కొన్ని నెలల్లోనే ఆయన 'టీమ్ అన్నా'ను విస్తరించారు. సమాజంలో ప్రతి వర్గం నుంచీ ప్రజలను దానిలోకి తీసుకొచ్చారు. వారిని సూచనలు అడిగారు. అలా, ఒక పెద్ద ప్రజాఉద్యమానికి నాంది పలికారు.

తర్వాత 2011 ఆగస్టులో దిల్లీ రామలీలా మైదాన్‌లో అన్నాహజారే జనలోక్‌పాల్ కోసం పెద్ద ఉద్యమం మొదలైంది. తలపై 'మై అన్నా హూ' (నేను అన్నాహజారేను) అనే టోపీ పెట్టుకున్న ప్రజలు అక్కడ పోటెత్తారు. మీడియా దానికి 'అన్నా విప్లవం' అనే పేరు పెట్టింది. కేజ్రీవాల్ ఆ విప్లవానికి ముఖచిత్రం అయ్యారు. జర్నలిస్టులు ఆయన్ను చుట్టుముట్టేవారు, టీవీలో ఆయన ఇంటర్వ్యూలు వచ్చేవి.

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, RAJEEV SARAF

కానీ, ఆ ఉద్యమం ద్వారా కేజ్రీవాల్ అనుకున్నది సాధించలేకపోయారు. తర్వాత ఆయన దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సభలు నిర్వహించడం ప్రారంభించారు.

వేదికపైకి రాగానే ఆయన నేతలపై విరుచుకుపడేవారు. వారి అవినీతి చిట్టాలు విప్పేవారు. దాంతో కేజ్రీవాల్‌కు ఒక 'యాంగ్రీ యంగ్‌మన్‌' ఇమేజ్ వచ్చేసింది. వ్యవస్థతో విసిగిపోయిన ఆయన మార్పు కోరుకునేవారు. దాంతో దేశంలో వేలాది యువత తమకు తాముగా ఆయనతో కలిశారు.

తర్వాత కేజ్రీవాల్ చేసిన మొదటి అతిపెద్ద ధర్నా 2012 జులైలో జంతర్ మంతర్ దగ్గర జరిగింది. అప్పుడు ఆయన, ఆయన వెంట ఉన్న కార్యకర్తల తలలపై 'మై అన్నా హూ' అనే టోపీ ఉంది. అది కూడా అవినీతి, జనలోక్‌పాల్ కోసమే జరిగింది.

ఆరోజు రోడ్లపైకి వచ్చిన ప్రజలకు ఆహ్వానం పలికిన కేజ్రీవాల్.. "ఏ రోజు ఈ దేశ ప్రజలు మేలుకుంటారో, రోడ్లపైకి దిగివస్తారో, అప్పుడు వారు ఎంత పెద్ద ప్రభుత్వాన్నైనా తలకిందులు చేస్తారు" అన్నారు.

నిరాహారదీక్ష చేస్తున్న కేజ్రీవాల్ మనోబలం పెంచేందుకు అప్పుడు అన్నా హజారే కూడా జంతర్ మంతర్ దగ్గరికి వచ్చారు.

దీక్షలో కేజ్రీవాల్ బరువు తగ్గిపోతూ వస్తే, దేశవ్యాప్తంగా ఆయన గుర్తింపు పెరుగుతూ పోయింది. కేజ్రీవాల్ నిరాహారదీక్ష ముగిసేసరికి ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారనే విషయంలో స్పష్టత వచ్చింది.

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Getty Images

రోడ్డుపై ఉద్యమిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కేజ్రీవాల్, తన పది రోజుల నిరాహార దీక్ష ముగియగానే "మనం చిన్న పోరాటం నుంచి పెద్ద పోరాటం వైపు వెళ్తున్నాం. పార్లమెంటును శుద్ధి చేయాలి. ఇక ఉద్యమం రోడ్డు మీదా ఉంటుంది.. పార్లమెంటు లోపల కూడా జరుగుతుంది. అధికారాన్ని దిల్లీలో అంతం చేసి దేశంలోని ప్రతి గ్రామం దగ్గరకూ చేర్చాలి" అన్నారు.

ఇక పార్టీని ఏర్పాటు చేస్తానని, ఎన్నికల రాజకీయాల్లోకి దిగుతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. "ఇది పార్టీ కాదు, ఉద్యమం అవుతుంది. ఇక్కడ ఎలాంటి హైకమాండ్ ఉండరు" అన్నారు.

రాజకీయాల్లోకి రావాలనే కేజ్రీవాల్ నిర్ణయాన్ని గుర్తు చేసుకున్న అమిత్.. "మొదట్లో నాకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం అసలు లేదు అని అరవింద్ చెప్పేవాడు. 'ఆస్పత్రిలో డాక్టర్ చికిత్స చేయలేనంత మాత్రాన, మనం డాక్టరు అయిపోలేం కదా' అనేవారు. కానీ జనలోక్‌పాల్ ఉద్యమం జరిగినప్పుడు అందరిలోనూ నైరాశ్యం చూసిన తర్వాత ఇక రాజకీయాల్లోకి రాక తప్పదని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు" అన్నారు.

2012 నవంబర్ 26న కేజ్రీవాల్ తన పార్టీ ఏర్పాటును అధికారికంగా ప్రకటించారు. ఆ పార్టీలో హైకమాండ్ ఎవరూ ఉండరని, అది ప్రజా సమస్యలపై, ప్రజల డబ్బుతో ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు.

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Getty Images

మొదట్లో అరవింద్ తనను ఎవరు కలిస్తే వారిని పార్టీలో చేర్చుకునేవారు. తన వాగన్ ఆర్ కారులో ఒక ఇంటర్వ్యూ చేశాక, రికార్డర్ ఆపేయగానే, కేజ్రీవాల్ నాతో, "జర్నలిజం వదిలేసి, మా పార్టీలోకి వచ్చెయ్. న్యాయంగా ఉండడం కాదు, ఇది అవినీతికి వ్యతిరేకంగా నిలబడాల్సిన సమయం" అన్నారు.

నా గురించి ఏం తెలీకపోయినా కేజ్రీవాల్ నాకు ఆ ప్రతిపాదన చేశారు. నాకే కాదు, తనను ఎవరు కలిసినా వారిని తమ కొత్త పార్టీలోకి ఆహ్వానించేవారు.

కేజ్రీవాల్‌కు ఉన్న ఆ సంస్థాగత సామర్థ్యం తర్వాత రోజుల్లో ఆయన బలంగా మారింది. కేజ్రీవాల్ ఎలాంటి కార్యకర్తలను తనతో చేర్చుకున్నారంటే, ఆకలిదప్పులతో ఉన్నా వారు ఆయన కోసం పనిచేయడానికి సిద్ధమయ్యేవారు. లాఠీ దెబ్బలు తినడానికి కూడా తెగించేవారు.

ఆ కార్యకర్తల బలంతోనే కేజ్రీవాల్ 2013లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ పార్టీ మొదటి ఎన్నికల్లోనే 28 సీట్లు గెలుచుకుంది. న్యూ దిల్లీ సీటు నుంచి పోటీ చేసిన ఆయన అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను 25 వేలకు పైగా ఓట్లతో ఓడించారు.

కానీ అదే షీలా దీక్షిత్, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Getty Images

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయడానికి దిల్లీ మెట్రోలో రాంలీలా మైదాన్ చేరుకున్నారు. ఏ రాంలీలా మైదాన్‌లో అన్నాతో కలిసి నిరాహారదీక్ష చేశారో, అది ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారానికి సాక్ష్యంగా నిలిచింది.

ప్రమాణ స్వీకారం తర్వాత ప్రసంగంలో ఆయన "ఇది కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం కాదు. ఈరోజు దిల్లీలోని ప్రతి పౌరుడూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఈ పోరాటం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావాలని చేయలేదు, అధికారం ప్రజల చేతికి అందించడానికే ఈ పోరాటం" అన్నారు.

సీఎంగా ప్రమాణం చేసిన కొన్నిరోజులకే దిల్లీ పోలీసుల అవినీతికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ రైల్ భవన్ బయట ధర్నాకు దిగారు. దిల్లీ చలిలో అవినీతికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడినపుడు, మన గళం వినిపించడానికి ఒకరు ఉన్నారని దిల్లీ ప్రజలకు అనిపించింది.

కేజ్రీవాల్ ప్రభుత్వం 49 రోజులే నడిచింది. కానీ, ఆ 49 రోజుల్లో దిల్లీ రాజకీయాల్లో ఒక కొత్త యుగాన్ని చూశారు. కేజ్రీవాల్ బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడుతూ అవినీతి అధికారులను వీడియో తీయాలని చెప్పేవారు. దాంతో, అవినీతి అధికారులు ఆయన పేరు వింటే వణికిపోయేవారు.

వీలైనంత త్వరగా జనలోక్‌పాల్ బిల్లు పాస్ చేయించాలని కేజ్రీవాల్ అనుకున్నారు. కానీ సంకీర్ణ సర్కారులో భాగస్వామి అయిన కాంగ్రెస్ దానికి ఒప్పుకోలేదు. దాంతో 2014 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. మళ్లీ రోడ్డుపైకి దిగారు.

"నాకు అధికారంపై ఆశ ఉంటే, ముఖ్యమంత్రి పదవిని వదిలేవాడ్ని కాను. కొన్ని సిద్ధాంతాల కోసం నేను సీఎం కుర్చీని వదిలాను" అన్నారు.

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Getty Images

మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. దాంతో కేజ్రీవాల్, నరేంద్ర మోదీపై పోటీ చేసేందుకు బనారస్ చేరుకున్నారు. నామినేషన్ వేశాక "మిత్రులారా నా దగ్గర ఏమీ లేదు. నేను మీలో ఒకడిని. ఈ పోరాటం నాది కాదు. ఈ పోరాటం అవినీతి రహిత భారత్ కోసం కలకంటున్న మీ అందరికోసం" అన్నారు.

కేజ్రీవాల్ బనారస్‌లో 3 లక్షల 70 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాజకీయాల్లో సుదీర్ఘ రేస్ కోసం మొదట చిన్న మైదానంలో ప్రాక్టీస్ చేయాలనే విషయం ఆయనకు అర్థమైంది. దాంతో మళ్లీ దిల్లీలోనే ఉండాలని అనుకున్నారు.

నైరాశ్యంలో ఉన్న పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ "మన పార్టీ ఇంకా కొత్తది. మనం అందరితో కలిసి దీనిని మరింత బలంగా నిర్మిద్దాం. రాబోవు రోజుల్లో మనం సంస్థను బలోపేతం చేద్దాం. ఈ సంస్థ ఈ దేశానికి మరోసారి విముక్తి కల్పించడంలో పెద్ద పాత్ర పోషిస్తుందని నాకు నమ్మకం ఉంది" అన్నారు.

అప్పుడు, కేజ్రీవాల్ పూర్తిగా సామాన్యుడిలాగే మెలిగారు. మామూలు బట్టలతో ఉండేవారు. తన వాగన్ ఆర్ కారులో ప్రయాణించేవారు. ధర్నాలు చేసేవారు. ప్రజలతో వారి మధ్యే పడుకునేవారు.

ఆ సమయంలో ఒక వీడియో విడుదల చేసిన కేజ్రీవాల్ "నేను మీలో ఒకడిని, నా కుటుంబం కూడా మీ కుటుంబం లాంటిదే. మేం కూడా మీలాగే ఉంటాం. మీలాగే ఈ వ్యవస్థను మార్చాలని ప్రయత్నిస్తున్నాం" అన్నారు.

అరవింద్ కేజ్రీవాల్

ఆ వీడియోలో దగ్గుతున్న కేజ్రీవాల్ 'మఫ్లర్ మాన్' అవతారం పాపులర్ అయ్యింది. తలకు మఫ్లర్ చుట్టుకుని దిల్లీలో ఎక్కడ వీలైతే అక్కడ ఆయన ప్రజాసభలు పెట్టేవారు.

తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పూర్తి మెజారిటీ ఇవ్వాలని కేజ్రీవాల్ దిల్లీ ప్రజలను కోరారు. ప్రజలు కూడా ఆయనకు చారిత్రక విజయాన్ని అందించారు. 70 స్థానాల్లో 67 గెలుచుకున్న ఆయన 2015 ఫిబ్రవరిలో మళ్లీ దిల్లీ సీఎంగా ప్రమాణం చేశారు.

ఈసారీ ఆయన దగ్గర పూర్తి మెజారిటీ ఉంది. మాట నిలబెట్టుకోడానికి ఐదేళ్లు ఉంది. కానీ ఏ జనలోక్‌పాల్ తీసుకొస్తానని ఆయన మాట ఇచ్చారో, దానిని తీసుకురాలేదు.

ఐదేళ్లపాటు దిల్లీలో ఆరోగ్యం, విద్య, మిగతా ప్రజా సేవలపై పనిచేయడంలో ఆయన మునిగిపోయారు. మధ్యమధ్యలో కేంద్రం తనకు సహకరించలేదని ఆరోపణలు చేస్తూ వచ్చారు. విద్యుత్-నీళ్లు ఉచితం లాంటి ప్రముఖ పథకాలు అమలు చేశారు. నేను నిజాయతీపరుడినని తరచూ తనకు సర్టిఫికెట్ ఇచ్చుకునేవారు.

కానీ వీటన్నిటి మధ్యా అవినీతి, జనలోక్‌పాల్ అంశాలు కనిపించకుండా పోయాయి. దిల్లీలో ఎంత అవినీతి తగ్గిందో దిల్లీ ప్రజలకే తెలుసు. జనలోక్‌పాల్ విషయానికి వస్తే ఇప్పుడు చాలామందికి ఆ పేరు కూడా గుర్తులేదు.

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, EPA

ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని చెప్పిన కేజ్రీవాల్, ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. నేను ఆమ్ ఆద్మీ (సామాన్యుడి)లాగే ఉంటానని, ఎర్ర లైట్ వాడనని ఆయన చెప్పారు. ఇప్పుడు విలాసవంతమైన ముఖ్యమంత్రి నివాసంలో ఉంటున్నారు. పాత వాగన్ ఆర్ స్థానంలో, ఇప్పుడు లగ్జరీ కారులో ప్రయాణిస్తున్నారు.

"ఇందులో హైకమాండ్ ఎవరూ ఉండరు" అని ఆయన ఏ పార్టీని ప్రారంభిస్తూ చెప్పారో, అందులో ఇప్పుడు ఆయనొక్కరే హైకమాండ్. అప్పుడు పార్టీలో ఆయనతో సమాన హోదాలో ఉన్న నేతలు అందరూ ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు.

ఇప్పుడు కేజ్రీవాల్‌కు 51 ఏళ్లు. దేశ రాజకీయాల్లో ఒక పెద్ద అడుగు వేయడానికి ఆయన దగ్గర ఇప్పుడు అనుభవం ఉంది, ముందు చాలా సమయం కూడా ఉంది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)