సుప్రీంకోర్టు: అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులపై భిన్న వాదనలు ఎందుకు వినిపిస్తున్నాయి?

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సుప్రీం కోర్టు తీర్పులపై వివాదాలు నెలకొంటున్నాయి
    • రచయిత, మిహిర్ దేశాయ్
    • హోదా, సీనియర్ అడ్వొకేట్

గుజరాత్‌లోని సర్దార్‌పురా సామూహిక హత్యాకాండ కేసులో 14 మంది దోషులకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పు అరుదైన తీర్పుల్లో ఒకటని చెప్పొచ్చు. ప్రస్తుతం బెయిల్ పొందిన వాళ్లంతా 2002లో గుజరాత్ మారణకాండలో 33 మందిని చంపిన కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాతే దోషులుగా తేలిన వ్యక్తులే.

ఆ మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన వారంతా ముస్లింలు. వారిలో 17 మంది మహిళలు, 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ కేసులో అప్పట్లో మొత్తం 56 మంది(హిందువుల్ని)ని నిందితులుగా తేల్చారు. అయితే అప్పట్లో వారందరికీ కేవలం రెండు నెలల్లో బెయిల్ మంజూరయ్యింది. గుజరాత్‌ నరమేధానికి సంబంధించిన కేసుల్లో జరుగుతున్న విచారణలో లోపాల్ని గుర్తించిన సుప్రీం కోర్టు వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది.

Presentational grey line
News image
Presentational grey line

అలాగే సర్దార్‌పూర్ కేసు సహా 8 కేసుల్ని విచారించేందుకు ప్రత్యేక న్యాయమూర్తుల్ని కూడా నియమిచింది. చివరిగా మొత్తం31 మందిని దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం వారికి జీవిత ఖైదు విధించింది. అయితే వారంతా హైకోర్టులో అప్పీలు చేసుకోవడంతో వారిలో 14 మందికి శిక్షను నిలేపి వేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసేంత వరకు దోషులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చెయ్యకూడదు.

సర్దార్ పురా సామూహిక హత్యాకాండ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం జైళ్లలో ఉన్న ఖైదీలలో 68శాతం మంది విచారణలో ఉన్న ఖైదీలే

ఏళ్ల తరబడి జైలు గోడల మధ్యే జీవితం

కేసు విచారణ పెండింగ్‌లో ఉండగా నియమాలకు లోబడే బెయిల్ మంజూరు చెయ్యాలి తప్ప వాటిని అతిక్రమించి కాదు. ప్రస్తుతం జైళ్లలో ఉన్నవారిలో 68 శాతం విచారణలో ఉన్న ఖైదీలే. వారిలో 53 శాతం దళితులు, ఆదివాసీలు, ముస్లింలు ఉన్నారు. వారిలో 29 శాతం మంది నిరక్షరాస్యులు. విచారణలో ఉన్న ఖైదీల్లో చాలా మంది లాయర్లను పెట్టుకునేందుకు కూడా తగిన ఆర్థిక స్థోమత లేని వాళ్లు. అంతే కాదు వారి విషయానికొచ్చే సరికి న్యాయ సహాయం అందించే వ్యవస్థలు పూర్తిగా విఫలమవుతున్నాయి. చాలా మందికి బెయిల్ లభించినప్పటికీ అందుకోసం చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించే పరిస్థితుల్లో వారు లేకపోవడం, అలాగే వారి విషయంలో ష్యూరిటీ ఇచ్చేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఏళ్ల తరబడి జైలు గోడల మధ్య జీవితాలు వెళ్లదీస్తున్నారు.

నిజానికి సర్దార్‌పుర్ కేసులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన వ్యక్తులు విచారణలో ఉన్న ఖైదీలు కాదు. అటు ప్రత్యేక న్యాయస్థానం , అలాగే హైకోర్టు కూడా దోషులుగా తేల్చిన వ్యక్తులు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు వ్యవహార శైలిపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. సాధారణంగా హత్య కేసులో దోషులకు బెయిల్ మంజూరు చెయ్యరు. కానీ 2019లో హత్య కేసులో రెండు సార్లు కోర్టులు దోషిగా తేల్చిన బాబు బజరంగికి ఆరోగ్య కారణాల రీత్యా అత్యున్నత న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. 2002లో జరిగిన నరొడ పాటియా నరమేధంలో ఓ ముస్లిం గర్భిణిని అత్యంత దారుణంగా హింసించి గర్భంలోని పిండాన్ని బయటకు తీశానంటూ ఓ స్టింగ్ ఆపరేషన్లో ఇదే వ్యక్తి వెల్లడించారు. ఇదే కేసులో మరో ముగ్గురు దోషులకు కూడా 2019లో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది .

ఇక గుజరాత్‌లోనే జరగిన సబర్మతీ ఎక్స్‌ప్రెస్ దహనకాండలో కూడా 94 మందిని అరెస్ట్ చేశారు. విచారణ పూర్తయ్యేంత వరకు వీరిలో ఏ ఒక్కరికీ బెయిల్ లభించలేదు. చివరకు వారిని అరెస్ట్ చేసిన 8 ఏళ్ల తర్వాత 31 మంది దోషులుగా తేలగా మిగిలిన వారు నిర్దోషులుగా తేలారు. మరోవైపు 2002లో జరిగిన గోద్రా అల్లర్ల తర్వాత అరెస్ట్ అయిన వారికి కూడా బెయిల్ లభించింది. చాలా సందర్భాల్లో ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇచ్చేటప్పుడు ప్రాసిక్యూషన్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు కూడా రాకపోవడం గమనించాల్సిన విషయం.

కొన్ని కేసుల విషయంలోనే ఎందుకలా ?

అదే సమయంలో భీమా కోరేగావ్ వంటి ఇంకా విచారణలోనే ఉన్న కేసుల్లో నిందితుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ కేసుల్లో అరెస్ట్‌యిన వారిలో చాలా మంది లాయర్లు, ప్రొఫెసర్లు ఉన్నారు. ముఖ్యంగా కొన్ని లెటర్ల ఆధారంగా వారిని మావోయిస్టులని ముద్ర వేసి కేసులు పెడుతున్నారు. నిజానికి వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఉత్తరాలు వారు రాసినవి కావు, వారిని అడ్రస్ చేసి రాసినవి కావు, కనీసం ఈ మెయిల్ ద్వారా కూడా వారికి పంపినవి కావు. సాక్షాత్తు సుప్రీం కోర్టు న్యాయమూర్తే ఈ ఉత్తరాల ప్రామాణికత విషయంలో అనుమానాలు వ్యక్తం చేశారు కూడా. అంతేకాదు ఎవరి సంతకాలతోనూ లేవు, ఎవరి చేతి రాత కాదు. కేవలం టైప్ చేసిన కాపీలు మాత్రమే. అలాంటి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వాళ్లకు గడిచిన ఏడాదిన్నర కాలంగా బెయిల్‌ తిరస్కరిస్తూనే వస్తున్నారు. ప్రొఫెసర్ సాయిబాబా కేసునే తీసుకుంటే మావోయిస్టు పేరుతో చిన్న చిన్న ఆధారాలతోనే జైల్లో నిర్బంధించారు. 90 శాతం అంగవైకల్యంతో ఉన్న ఆయనకు ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అయినా సరే ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్‌లోనే ఉంది. ఇలాంటి పరిస్థితే ఐపీఎస్ ఆఫీసర్ సంజివ్ భట్‌ది కూడా. ప్రస్తుత ప్రధానిని వ్యతిరేకించడమే ఆయన ఖైదు కావడానికి కారణమా అన్న ప్రశ్నలు కూడా అప్పట్లో తలెత్తాయి.

ప్రొఫెసర్ సాయిబాబా

ఫొటో సోర్స్, AS VASANTHA

ఫొటో క్యాప్షన్, జైల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న ప్రొఫెసర్ సాయిబాబా

ఏ బెయిల్‌ను ఎటువంటి షరతులతో ఇచ్చారన్నది కూడా ముఖ్యమే. సర్దార్ పూర్ కేసులో చూస్తే బెయిల్ పొందిన దోషులు గుజరాత్‌లో అడుగుపెట్టకూడదు కానీ మధ్య ప్రదేశ్‌లో సామాజిక సేవ చెయ్యవచ్చు. ఇది కోర్టు పేర్కొన్న షరతు . ఒకవేళ ఇలాంటి తీవ్రమైన కేసుల విషయంలో కూడా సంస్కరణలు తీసుకురావాలని భావిస్తే... ఉరి శిక్ష పడిన ఖైదీ నుంచి అత్యాచార కేసుల్లో దోషుల వరకు, అలాగే సబర్మతీ ఎక్స్ ప్రెస్ దహనకాండ కేసు నుంచి మావోయిస్టుల పేరుతో వ్యక్తుల్ని ఖైదు చేసే కేసుల వరకు అన్నింటిలోనూ ఇదే తరహా సంస్కరణలు తీసుకొచ్చే విధానాన్ని అనుసరించాలి.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

అత్యున్నత న్యాయస్థానం ప్రాధాన్యతలు మారుతున్నాయా ?

గడిచిన కొద్ది నెలలుగా సుప్రీం కోర్టు వ్యవహార శైలి చూస్తుంటే లౌకిక రాజ్యాంగంలో ఒక భాగంగా ఉన్న అత్యున్నత న్యాయస్థానం క్రమంగా తనకు తానుగా మతపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తోందన్న భావన చాలా మందిలో నెలకొంటోంది.

ఎన్‌ఐఎ విచారణ చేసిన హాదియా వివాహానికి సంబంధించిన కేసు కావచ్చు, తగినంత ప్రాధాన్యానికి నోచుకోని ఆర్టికల్ 370 రద్దు విషయం కావచ్చు, కశ్మీర్లో ఇంటర్నెట్‌ను నిషేధించిన విషయంలో కావచ్చు, కశ్మీర్లో నిర్బంధానికి గురైన వారికి సంబంధించిన హేబియస్ కార్పస్ పిటిషన్ల విషయంలో పిరికిగా వ్యవహరించిన తీరు కావచ్చు.. వీటిల్లో అత్యున్నత న్యాయస్థానం వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం.

అదే సమయంలో అయోధ్య తీర్పు విషయానికొచ్చేసరికి న్యాయాన్యాయాలను పక్కనబెట్టి విశ్వాసాలకే అధిక ప్రాధాన్యమిచ్చినట్టు కనిపించడం, అలాగే జామియా మిలియా పోలిస్ అట్రాసిటీ కేసులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించడం, శబరిమల కేసు విషయంలో ఉదారంగా వ్యవహరించడం.. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టుకు కచ్చితమైన తీర్పునిచ్చే శక్తి ఉన్నప్పటికీ దాన్ని అమలు పరిచేందుకు తగిన మార్గదర్శకాలు జారీ చేయకుండా ఆ తీర్పులను సమీక్షించేందుకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నించిందన్న విమర్శలు వస్తున్నాయి.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)