రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తులు: 2013 నుంచి 3 ఆమోదం.. 32 తిరస్కరణ

ఫొటో సోర్స్, DELHI POLICE
- రచయిత, అరవింద్ ఛాబ్రా
- హోదా, బీబీసీ న్యూస్
మరణశిక్ష ఎదుర్కొంటున్న ఖైదీలు సమర్పించుకునే క్షమాభిక్ష దరఖాస్తుల విషయంలో భారత రాష్ట్రపతులు ఇటీవలి కాలంలో కఠిన వైఖరిని అవలంబిస్తున్నట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి.
2012 నాటి దిల్లీ సామూహిక అత్యాచారం కేసులోని ఒక నిందితుడు ముకేష్ సింగ్ చేసుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గత వారంలో తిరస్కరించారు.
క్షమాభిక్ష దరఖాస్తులకు సంబంధించి బీబీసీ ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా పొందిన రికార్డు ప్రకారం.. 2013 తర్వాత భారత రాష్ట్రపతులు కేవలం మూడు క్షమాభిక్షలను మాత్రమే ఆమోదించారు. ఈ కాలంలో మొత్తం 32 క్షమాభిక్ష దరఖాస్తులను తిరస్కరించారు.
అయితే.. 2013కు ముందు 2000 నుంచి 2012 వరకూ క్షమాభిక్ష దరఖాస్తుల విషయంలో రాష్ట్రపతుల వైఖరి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆ కాలంలో 26 కేసుల్లో 44 మంది క్షమాభిక్ష దరఖాస్తులు చేసుకోగా.. కేవలం నాలుగు దరఖాస్తులను మాత్రమే తిరస్కరించారు. మిగతా 40 మంది క్షమాభిక్ష వినతులను ఆమోదించారు. తద్వారా వారి మరణశిక్ష జీవిత ఖైదుగా మారింది.
2009 నుంచి 2012 మధ్య కాలంలో భారత రాష్ట్రపతులు అత్యంత 'దయ'తో స్పందించారు. ఆ కాలంలో అత్యధిక సంఖ్యలో క్షమాభిక్ష దరఖాస్తులను ఆమోదించారు. ఈ కాలంలో అత్యధిక సమయం పాటు.. భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ (2007 జూలై - 2012 జూలై) పదవిలో ఉన్నారు.
2012 జూలైలో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయ్యారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2017 జూలైలో ఆ బాధ్యతలు చేపట్టారు.
''మొత్తంగా భారత రాష్ట్రపతి 60 క్షమాభిక్ష దరఖాస్తుల మీద నిర్ణయం తీసుకున్నారు. వాటిలో 24 దరఖాస్తులను ఆమోదించి.. దరఖాస్తుదారుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు'' అని కేంద్ర హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్రపతి అధికారం
మరణశిక్ష ఎదుర్కొంటున్న ఖైదీకి క్షమాభిక్ష పెట్టటం, ఆ శిక్షను రద్దు చేయటానికి, తగ్గించటానికి, మార్చటానికి.. రాజ్యాంగంలోని 72వ అధికరణ కింద భారత రాష్ట్రపతికి అధికారం ఉంది.
దోషికి సుప్రీంకోర్టు చివరిగా మరణశిక్ష ఖరారు చేసినట్లయితే.. ఆ వ్యక్తికి సంబంధించి ఎవరైనా సరే రాష్ట్రపతి కార్యాలయం లేదా కేంద్ర హోంమంత్రిత్వశాఖకు క్షమాభిక్ష దరఖాస్తు పంపించవచ్చు. సంబంధిత రాష్ట్ర గవర్నర్‌కు కూడా క్షమాభిక్ష దరఖాస్తును పంపించవచ్చు. గవర్నర్ ఆ దరఖాస్తును తదుపరి చర్యల నిమిత్తం కేంద్ర హోంశాఖకు పంపిస్తారు.


దోషి జైలు నుంచి అధికారుల ద్వారా కానీ, తన న్యాయవాది ద్వారా కానీ, తన కుటుంబం ద్వారా కానీ క్షమాభిక్ష దరఖాస్తు చేసుకోవచ్చు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లిఖిత పూర్వకంగా రాష్ట్రపతికి తెలియజేసే అభిప్రాయాన్ని.. మంత్రివర్గ అభిప్రాయంగా పరిగణనలోకి తీసుకుంటారని.. తదనుగుణంగా క్షమాభిక్ష దరఖాస్తుపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని నిబంధనలు చెప్తున్నాయి. కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి నడుచుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
వేగవంతమైన నిర్ణయం
ముకేష్ దరఖాస్తును రాష్ట్రపతి కోవింద్ తిరస్కరించటం.. అత్యంత వేగంగా తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి. గత వారం.. కేంద్ర హోంశాఖ నుంచి ఈ దరఖాస్తు తన దగ్గరకు వచ్చిన కొన్ని గంటల్లోనే రాష్ట్రపతి దానిని తిరస్కరించారు.
గతంలో క్షమాభిక్ష దరఖాస్తు మీద రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవటానికి చాలా సంవత్సరాలు పట్టింది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న ముగ్గురు నిందితులు తమ క్షమాభిక్ష దరఖాస్తుల మీద దశాబ్ద కాలం పైగా రాష్ట్రపతి ఏ నిర్ణయమూ తీసుకోలేదని.. కాబట్టి తమ శిక్షను జీవితఖైదుగా మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్షమాభిక్ష దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవటంలో జాప్యానికి సంబంధించిన ఇటువంటి ఉదంతాలు పత్రికల్లో పతాక శీర్షకలకు కూడా ఎక్కిన సందర్భాలున్నాయి.
వి.శ్రీహరన్ అలియాస్ మురుగన్, టి.సుతేంద్రరాజా అలియాస్ శంతన్, ఎ.జి.పెరారివలన్ అలియాస్ అరివుల మరణశిక్షలను కోర్టు చివరికి 2012లో జీవితఖైదుగా మార్చింది.
''క్షమాభిక్ష మీద నిర్ణయాలు తీసుకోవటం కోసం ప్రభుత్వం సహేతుకమైన కాల పరిమితిలో రాష్ట్రపతికి సలహా అందించాలని మేం ప్రభుత్వానికి సూచిస్తున్నాం... ఇప్పుడు జరుగుతున్న దానికన్నా ఇంకా వేగంగా క్షమాభిక్ష మీద నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని విశ్వసిస్తున్నాం'' అని సుప్రీంకోర్టు ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇంతకుముందు.. 2006లో బిహార్‌లోని ఒక గ్రామంలో ఒక మహిళను, ఐదుగురు చిన్నారులు నిద్రపోతుండగా వారి ఇంటికి నిప్పుపెట్టి వారిని హత్య చేసిన కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న జగత్‌రాయ్ క్షమాభిక్ష దరఖాస్తును 2018లో తిరస్కరించారు. అతడి మరణశిక్షను సుప్రీంకోర్టు 2013లో ఖరారు చేసింది. అతడు 2016 జూలైలో క్షమాభిక్ష దరఖాస్తు చేసుకున్నాడు.
2017లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫారసును పక్కనపెట్టి.. నలుగురు దోషుల క్షమాభిక్ష దరఖాస్తులను ఆమోదించి వారి మరణశిక్షను జీవితఖైదుగా మార్చారు.
1992లో బిహార్‌లోని గయ సమీపంలో గల బారా గ్రామంలో 34 మంది అగ్ర కులస్తులను హత్య చేసిన కేసులో.. క్రిష్ణ మోచి, నన్నే లాల్ మోచి, బిర్ కౌర్ పాస్వాన్, ధర్మేంద్ర సింగ్ అలియాస్ ధారు సింగ్ అనే ఆ నలుగురికీ కోర్టు మరణశిక్ష విధించింది. బారా మారణకాండగా వ్యవహరించే ఆ కేసులో ఆ నలుగురికీ క్షమాభిక్ష ఇవ్వటమే ఇప్పటివరకూ ఆఖరుదని హోంమంత్రిత్వశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ రాజధాని రగడ: శాసనమండలి రద్దవుతుందా?
- రూల్ 71 అంటే ఏంటి? అసెంబ్లీ ఆమోదించిన బిల్లును మండలి తిరస్కరిస్తే ఏం జరుగుతుంది?
- జైల్లో సొరంగం తవ్వారు.. 75 మంది ఖైదీలు పరారయ్యారు
- వినోదం కోసం ఇంట్లో చిరుతల్ని పెంచుకుంటున్నారు
- ఏనుగు ఈ స్టార్ హోటల్‌కు రెగ్యులర్ కస్టమర్.. చూడండి ఏం చేస్తోందో
- వసతి గృహంలో బాలికలపై అత్యాచారం కేసు: 19 మందిని దోషులుగా తేల్చిన కోర్టు
- ‘నా న్యూడ్ చిత్రాలు గీశాక, నా కాళ్లకు నమస్కరిస్తారు’
- పోర్నోగ్రఫీ వెబ్సైట్లలో పెరిగిపోతున్న టీనేజీ అమ్మాయిల కంటెంట్.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
- RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్‌కు కలిగే లాభమేంటి.. జరిగే నష్టమేంటి
- రూపాయి చరిత్ర : కరెన్సీ నోట్ల మీదకు గాంధీ బొమ్మ ఎప్పుడు వచ్చింది...
- హైదరాబాద్‌లో రోహింజ్యాల ఫుట్‌బాల్ జట్టు ఇదీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









