నిర్భయ కేసు దోషుల ఉరితీత: శిక్ష ఎలా అమలు చేస్తారు

ఫొటో సోర్స్, DELHI POLICE
- రచయిత, గుర్‌ప్రీత్ సైనీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు తిహార్ జైలు నంబర్-3లో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష అమలైంది. నలుగురు దోషులూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని తీహార్ జైలు డైరక్టర్ జనరల్ సందీప్ గోయెల్ వెల్లడించారని ఏఎన్ఐ తెలిపింది.
ఘటన జరిగిన ఏడేళ్ల మూడు నెలల 4 రోజుల తర్వాత వారికి శిక్ష అమలైంది.
సాధారణంగా నేరం జరిగిన ప్రాంతం పరిధిలోనే దోషులకు మరణశిక్ష విధిస్తారు. అందుకే నిర్భయ కేసులో దోషులకు కూడా దిల్లీలో ఉరిశిక్ష అమలు చేశారు. దేశంలో ఉరిశిక్షను అమలు చేయడానికి అనువైన జైళ్లు ఇంకా చాలా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా 30కి పైగా జైళ్లలో ఉరిశిక్షను అమలు చేయడానికి అనువైన ఏర్పాట్లు ఉన్నట్లు 'దిల్లీ సెంటర్ ఆన్ ది డెత్ పెనాల్టీ' డైరెక్టర్ అనూప్ సురేంద్రనాథ్ తెలిపారు.
ఉరిశిక్షను అమలు చేయడానికి ప్రతి రాష్ట్రానికి తమతమ జైల్ మాన్యువల్స్ ఉంటాయి.
తిహార్ జైలునే తీసుకుంటే అక్కడ దిల్లీ జైలు మాన్యువల్, సీఐపీసీ (కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్) ప్రకారం ఉరి శిక్ష అమలుకు ముందు బ్లాక్ వారెంట్‌ను జారీ చేస్తారు.
అందులో ఉరి శిక్షను అమలు చేసే తేదీ, స్థలాన్ని పేర్కొంటారు. ఆ వారెంట్‌కు నాలుగు వైపులా అంచులు నల్ల రంగులో ఉంటాయి. అందుకే దాన్ని బ్లాక్ వారెంట్ అని పిలుస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
మొత్తం బాధ్యత జైలు సూపరింటెండెంట్‌దే
ఉరిశిక్ష పడ్డ ఖైదీలను ప్రత్యేక వార్డులోని సెల్‌లో ఉంచుతారు.
మానసికంగా తమను తాము సిద్ధం చేసుకునేందుకు వీలుగా ఉరి శిక్ష అమలు చేయడానికి ముందు దోషులకు కనీసం 14 రోజుల సమయం ఇస్తారు. జైల్లో వారికి కౌన్సిలింగ్ కూడా అందిస్తారు. ఆ సమయంలో వారు కావాలనుకుంటే తమ కుటుంబ సభ్యులను కలవొచ్చు.
ఒకవేళ ఖైదీలు ఏదైనా వీలునామా రాయాలనుకుంటే దానికి కూడా ఏర్పాట్లు చేస్తారు. అందులో వాళ్లు తమ చివరి కోరికను కూడా పేర్కొనవచ్చు.
ఖైదీలు కోరుకుంటే వారి మత విశ్వాసాల ఆధారంగా ఉరి తీసే సమయంలో అక్కడ పండితులు, మౌల్వీ లేదా ఫాదర్‌ను కూడా హాజరుపరచొచ్చు. దీనికి జైలు సూపరింటెండెంట్ అనుమతించాలి.
ఉరి తీయడానికి అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత జైలు సూపరింటెండెంట్‌పైనే ఉంటుంది. తాడు, ముసుగు, ఉరి కంభం... ఇలా ఉరికి అనువైన ఏర్పాట్లన్నీ సరిగ్గా జరిగాయో లేదో ఆయనే సరిచూసుకోవాలి. ఉరి తీసే లీవర్‌లో నూనె సరిగ్గా వేశారో లేదో, తాడు సరిగ్గా బిగించారో లేదో.. ఇలా ప్రతి చిన్న విషయానికి ఆయనే బాధ్యుడు.
ఉరి తీయడానికి ముందు రోజు సాయంత్రం ఈ ఏర్పాట్లన్నింటినీ మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఖైదీ బరువుకంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ బరువుండే ఇసుక బస్తాలను ఉరితాడుకు వేలాడదీసి వాటిని పరీక్షిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

ఏ సమయంలో ఉరి తీయాలి?
ఎప్పుడైనా సరే ఉదయంపూటే ఉరి తీయాలని నిబంధనలు చెబుతున్నాయి.
నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య - ఉదయం 8 గంటలకు
మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ - ఉదయం 7 గంటలకు
మే నుంచి ఆగస్ట్ - ఉదయం 6 గంటలకు
ఉరి తీసే రోజుకు రెండ్రోజుల ముందే తలారీ జైలుకు వచ్చి అక్కడే ఉంటారు.


ఫొటో సోర్స్, Getty Images
సెల్‌లోనే నల్లముసుగు తొడుగుతారు
ఉరి అమలుకు కొన్ని నిమిషాల ముందు మాత్రమే జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్‌లు కలిసి ఖైదీలుండే సెల్‌కు వెళ్తారు. వారెంట్‌లో ఉండే వివరాలతో ఖైదీని సరిపోల్చుకుంటారు. తరువాత ఖైదీకి అతడి మాతృభాషలోనే వారెంట్‌ను చదివి వినిపిస్తారు. అతడి వీలునామాను రికార్డు చేస్తారు.
ఆ తరువాత డిప్యూటీ సూపరింటెండెంట్ సమక్షంలో సెల్‌లోనే ఖైదీ ముఖానికి నల్ల ముసుగు తొడుగుతారు. చేతులను వెనక నుంచి బంధిస్తారు. ఒకవేళ ఖైదీ కాళ్లకు సంకెళ్లు ఉంటే వాటిని తొలగించి అక్కడ్నుంచి ఉరికంభం దగ్గరకు తీసుకెళ్తారు.
ఉరి కంభం దగ్గరకు తీసుకువెళ్లే సమయంలో జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌తో పాటు హెడ్ వార్డెన్, మరో ఆరుగురు వార్డెన్‌లు కూడా ఉంటారు. ఖైదీకి ముందు వైపు ఇద్దరు వార్డెన్‌లు, వెనుకవైపు ఇద్దరు వార్డెన్‌లు, అతడి భుజాలను పట్టుకొని మరో ఇద్దరు వార్డెన్‌లు నడుస్తారు.
ఉరి కంభం దగ్గర అప్పటికే సూపరింటెండెంట్, మెజిస్ట్రేట్, వైద్య అధికారి సిద్ధంగా ఉంటారు. ఉరితీతకు ముందు జరగాల్సిన ప్రక్రియలన్నీ పూర్తయినట్లు సూపరింటెండెంట్, మెజిస్ట్రేట్‌కు వివరిస్తారు. తరువాత ఖైదీని తలారీకి అప్పగిస్తారు. ఖైదీని ఉరి కంభం కింద నిల్చోబెట్టే వరకు వార్డెన్‌లు అతడి చేతులు పట్టుకొనే ఉంటారు.

ఫొటో సోర్స్, Getty Images
వైద్యులు ధ్రువీకరించాల్సిందే
తరువాత తలారీ ఖైదీ రెండు కాళ్లను గట్టిగా కట్టేస్తాడు. ఆపైన మెడకు ఉరితాడు బిగిస్తాడు.
సూపరింటెండెంట్ సంకేతం ఇవ్వగానే తలారీ లీవర్ లాగేస్తాడు. దాంతో ఖైదీ ఏ చెక్కలమీద అయితే నిల్చున్నాడో, అవి రెండూ కింద వెల్‌లోకి జారిపోతాయి. తాడు మెడ చుట్టూ గట్టిగా బిగుసుకుపోవడంతో నెమ్మదిగా ఖైదీ ప్రాణాలు వదిలేస్తాడు. శరీరం దాదాపు అరగంటసేపు అక్కడ వేలాడుతూనే ఉంటుంది. తరువాత ఖైదీ మరణించాడని వైద్యుడు ప్రకటిస్తాడు. అప్పుడు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయడానికి పంపిస్తారు. ఆపైన సూపరింటెండెంట్ ఉరి శిక్ష పూర్తయినట్లు ప్రకటిస్తారు.
ఉరిశిక్ష పూర్తయ్యాక ఐజీకి సూపరింటెండెంట్ రిపోర్ట్ చేస్తాడు. డెత్ వారెంట్‌ను జారీ చేసిన కోర్టుకే ఆ వారెంట్‌ను తిరిగి పంపిస్తాడు.
పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని ఖైదీ కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. ఒకవేళ భద్రతా పరమైన కారణాలు ఉన్నాయని భావిస్తే జైలు సూపరింటెండెంట్ సమక్షంలోనే మృతదేహాన్ని ఖననం చేస్తారు.
ప్రభుత్వ సెలవు దినాల్లో ఉరిశిక్షను అమలు చేయకూడదని నిబంధనలు చెబుతున్నాయి.
(ఈ వ్యాసం దిల్లీ జైల్ మాన్యువల్, తిహార్ జైలు మాజీ జైలర్ సునీల్ గుప్తాతో జరిపిన సంభాషణ ఆధారంగా రాసింది. సునీల్ గుప్తా సమక్షంలో మొత్తం 8 మందిని ఉరి తీశారు. బిల్లా - రంగా, కరతార్ సింగ్ - ఉజాగర్ సింగ్, సత్వంత్ సింగ్ - కెహర్ సింగ్, మక్బూల్ భట్, అఫ్జల్ గురులను ఆయన సమక్షంలోనే ఉరి తీశారు)
ఇవి కూడా చదవండి:
- సీరియల్ రేపిస్ట్: మగాళ్ళను ట్రాప్ చేస్తాడు... లైంగిక అత్యాచారాన్ని వీడియో తీస్తాడు
- బిహార్: వేధింపులను అడ్డుకున్నందుకు తల్లీకూతుళ్లకు గుండు కొట్టించి ఊరేగించారు
- పాకిస్తాన్లో క్షమాభిక్షలు కొనుక్కుంటున్న హంతకులు
- ఆంధ్రప్రదేశ్: ‘మహిళల్ని నమ్మించి అత్యాచారాలకు పాల్పడుతున్న కేసులు పెరిగాయి’
- సెక్స్ వర్కర్లకు విముక్తి: బలవంతంగా ‘చాకిరీ’ చేయించే విధానం రద్దు
- ఓ పదేళ్ల వయసు చిన్నారి నరహంతకుడు కాగలడా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








