సీరియల్ రేపిస్ట్: మగాళ్లను ట్రాప్ చేస్తాడు... లైంగిక దాడిని వీడియో తీస్తాడు

ఫొటో సోర్స్, Police handout
136 అత్యాచారాలతో పాటు మొత్తం 159 లైంగిక నేరాల్లో దోషిగా తేలిన వ్యక్తికి 2020 జనవరిలో ఇంగ్లండ్ కోర్టు జీవిత ఖైదు విధించింది.
ఇండోనేసియా పౌరుడైన 36 ఏళ్ల రెయిన్‌హార్డ్ సినగా... ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో ఉంటూ నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
అతనికి జీవిత ఖైదు (కనీసం 30 ఏళ్లు జైలులో ఉండేలా) విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
అతని మీద నమోదైన కేసుల విచారణ 18 నెలల పాటు జరిగింది. ఇన్నాళ్లూ అతడి గుర్తింపును బయటపెట్టొద్దంటూ మీడియాపై కోర్టు ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు ఆ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పులో ప్రకటించారు.
పీహెచ్‌డీ విద్యార్థి అయిన సినగా... ఇప్పటికే 2018, 2019లలో విచారణ పూర్తైన కొన్ని కేసుల్లో దోషిగా తేలి జీవిత ఖైదు (కనీసం 20 ఏళ్లు జైలులో ఉండేలా) శిక్ష అనుభవిస్తున్నారు.
మాంచెస్టర్ పరిసర ప్రాంతాల్లోని క్లబ్బుల్లో 48 మంది పురుషులను నమ్మించి తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి, వారికి మత్తు పదార్థాలు ఇచ్చి, ఆ తర్వాత వారిపై లైంగిక దాడి చేస్తూ వీడియో చిత్రీకరించిన కేసుల్లో అతడిని దోషిగా విచారణలో కోర్టు తేల్చింది.
అతడు కనీసం 190 మందిని వేధించాడని నిరూపించే ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని పోలీసులు చెప్పారు.
అతడి మీద నమోదైన కేసులపై నాలుగు వేర్వేరు విచారణలు జరిగాయి. 136 అత్యాచారాలు, 8 అత్యాచార యత్నాలు, 14 లైంగిక వేధింపులు, మరో కేసులో జననాంగంపై దాడి చేయడంలో సినగా దోషిగా తేలారు. ఈ కేసుల్లో 48 మంది బాధితులు ఉన్నారు.

ఫొటో సోర్స్, Greater Manchester Police
నైట్ క్లబ్‌ల దగ్గర సినగా వేచి చూసేవాడు. ఎవరైనా పురుషులు బయటకు రాగానే మద్యం తాగుదామనో, ఇంకేవైనా మాటలు చెప్పో నమ్మించి మాంచెస్టర్ ప్రిన్సెస్ స్ట్రీట్‌లోని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లేవాడు.
మొదట వారికి మాదకద్రవ్యాలు ఇచ్చేవాడు. వాళ్లు స్పృహ కోల్పోయిన తర్వాత వారిపై దాడి చేసేవాడు. బాధితుల్లో చాలామంది అసలేం జరిగిందో మేల్కొన్న తర్వాత తమకు గుర్తులేదని చెప్పారు.
అతడు బాధితులకు జీహెచ్‌బీ (గామా-హైడ్రాక్సీబ్యుటిరేట్ C4H8O3) అనే డ్రగ్ ఇచ్చి ఉంటాడని అంతకు ముందు విచారణ సమయంలో న్యాయమూర్తి చెప్పారు.
తమ జీవితాలను నాశనం చేసిన అతడు జీవితాంతం జైలు నుంచి బయటకు రాకుండా చేయాలని బాధితులు తమ వాంగ్మూలంలో చెప్పారు.
అతడి దాడికి గురయ్యాక తమ మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయని కొందరు బాధితులు అన్నారు.
బ్రిటిష్ న్యాయ చరిత్రలో బహుశా ప్రపంచంలోనే ''అత్యధిక నేరాలకు పాల్పడిన రేపిస్టు" ఇతడే అయ్యుంటాడని ప్రధాన ప్రాసిక్యూటర్ ఇయాన్ రుస్టన్ వ్యాఖ్యానించారు. "అతడు స్వలింగ సంపర్కులతో ఎక్కువ ఆనందం పొంది ఉంటాడు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Greater Manchester Police
యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌లో పీహెచ్‌డీ చదువుతూ కొన్ని ఏళ్లపాటు అతడు ఈ నేరాలకు పాల్పడ్డాడు.
2017 జూన్‌లో ఒక బాధితుడు స్పృహలోకి వచ్చి, పోలీసులకు కాల్ చేయడంతో తొలిసారి అతడి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసులు అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తే, అనేక మందిపై దాడి చేస్తూ తీసిన వీడియోలు బయటపడ్డాయి. కొన్ని గంటల నిడివి ఉన్న ఫుటేజీ దొరికింది.
ఆ వీడియోల ఆధారంగా పోలీసులు పదుల సంఖ్యలో బాధితులను గుర్తించారు. అతడు దాదాపు పదేళ్లుగా ఈ తరహా నేరాలకు పాల్పడి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Greater Manchester Police
సినగా కేసులపై 18 నెలల పాటు మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో విచారణ జరిగింది. అన్ని కేసుల్లోనూ అతడు దోషిగా తేలాడు.
అయితే, ఇంకా 70 మంది బాధితులను గుర్తించలేకపోతున్నామని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అతడి వేధింపులకు గురైన వారు ఎవరైనా ఉంటే బయటకు రావాలని వారు కోరుతున్నారు.
అతడు దోషిగా తేలింది 2015 జనవరి నుంచి 2017 జూన్ వరకు జరిగిన నేరాలలోనే. కానీ, అంతకు ముందు కూడా అతడు నేరాలకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
అయితే, తనపై వచ్చిన ఆరోపణలన్నీ బూటకమని, పరస్పర అంగీకారంతోనే తాము లైంగిక చర్యలో పాల్గొన్నామని, నిద్ర పోతున్నట్లు నటిస్తుండగా వీడియో చిత్రీకరించేందుకు వాళ్లు అందరూ సమ్మతం తెలిపారని సినగా కోర్టులో చెప్పాడు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఇవి కూడా చదవండి:
- ఎన్ని చట్టాలున్నా లైంగిక నేరాలు ఎందుకు తగ్గడం లేదు
- తెలంగాణ: వైద్యుడిపై ఆరోపణలు, దాడి... సంచలనం రేపిన సీసీటీవీ ఫుటేజ్
- పిల్లలపై లైంగిక నేరాలు నిజంగానే పెరుగుతున్నాయా?
- ఇరాన్: డాన్స్ చేసిన యువతి అరెస్ట్ - నృత్యాలతో మహిళల నిరసన
- ఉత్తరాదిలో రెండు లక్షల మంది తెలుగు వారు ఏమయ్యారు?
- YouTube Stars: అమ్మాయిల కోసం, అమ్మాయిల చేత, అమ్మాయిలతో.. ‘గాళ్ ఫార్ములా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








