బడ్జెట్ 2020: నిర్మలా సీతారామన్ పద్దు సామాన్యుడి ప్రశ్నలకు బదులిచ్చిందా?

- రచయిత, వివేక్ కౌల్
- హోదా, ఆర్థిక వేత్త
ఈ బడ్జెట్ నా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ? ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? ఏవి తగ్గుతాయి? ఆదాయపుపన్ను ఏమైనా తగ్గించుకోగలమా? లేక ఇంకా ఎక్కువగా కట్టాల్సి వస్తుందా?ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత సామాన్యుల మదిలో మెదులుతున్న ప్రశ్నలివే.
కొన్నినెలలుగా దేశ ఆర్థిక పరిస్థితి మందగమనంలో సాగుతున్న సందర్భంలో శనివారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఈ ఏడాది మరింత ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ పెరుగుదల 5.7 శాతం ఉండవచ్చని అంచనా వేశారు. కానీ, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. కేవలం 5.5 శాతం పెరుగుదలతో 2012-13 సంవత్సరం తర్వాత అతి తక్కువ వృద్ధి రేటు నమోదయ్యింది. ఇందుకు ప్రధాన కారణం వ్యక్తిగత వినిమయం తగ్గిపోవడమే.


ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వృద్ధి 4.1 శాతం మాత్రమే నమోదయ్యింది. ప్రజలు ఇప్పుడు డబ్బు ఖర్చుపెట్టే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కోనుగోళ్ళను ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో తగిన చర్యలుంటాయని భావించారు.
వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపులో ప్రత్యామ్నాయ విధానం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లను తగ్గించడమే కాదు కొత్తగా ప్రత్యామ్నాయ పద్ధతుల్ని కూడా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో పన్ను చెల్లింపుదారులు వారి వారి సేవింగ్స్‌పై, లోన్లపై ఎంతో కొంత పన్ను రిబేటు పొందుతున్నారు. కానీ ఇప్పుడు కొత్త పద్ధతిని ఎంచుకున్నవారికి ఇకపై అటువంటి రిబేట్లు ఉండవు.
అయితే, పన్ను చెల్లింపుదారులు రెండు విధానాల్లో తమకు నచ్చింది ఎంచుకోవచ్చు. పన్ను ఎక్కువ చెల్లించి మినహాయింపుల్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదా కొత్త పద్ధతి ప్రకారం మినహాయింపులను వదులుకొని తక్కువ పన్ను చెల్లించవచ్చు. అయితే, ఏ పద్ధతిని ఎంచుకోవాలో తేల్చుకోవాలంటే సంక్లిష్ట భారత ఆదాయపు పన్ను సూత్రాలను ముందుగా అర్థం చేసుకోవాలి.
ఇక, ఈ బడ్జెట్ వల్ల తన ఆదాయం ఏ మాత్రం పెరుగుతుందన్న సామాన్యుడి ప్రాథమిక ప్రశ్నకు సరైన సమాధానం దొరకలేదు. ఆర్థిక మందగమనం కొనసాగుతున్న క్లిష్టమైన పరిస్థితి ఇది. ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా ఆర్థిక మంత్రి ఆదాయపు పన్ను విషయంలో కోత విధిస్తే కచ్చితంగా సామాన్యుని ఆదాయం ఎంతో కొంత పెరిగేది. ఫలితంగా వారితో ఎంతో ఖర్చు చేయించేలా ప్రోత్సహించవచ్చు. వృద్ధి రేటు కూడా పెరగడానికి కూడా సాయపడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక మందగమనంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి...
ఆర్థిక వ్యవస్థ మందకొడిగా ఉన్నప్పుడు సాధారణంగా రాజకీయనాయకులు, ప్రభుత్వాలు ప్రముఖ బ్రిటిష్ ఆర్థిక వేత్త జాన్ మేనార్డ్ కీన్స్ సూత్రాలను ప్రస్తావిస్తుంటారు. ఆర్థికంగా తిరోగమన దశను ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వమే స్వయంగా ఖర్చును పెంచుకోవాలి. అదెలాగో కూడా కీన్స్ కొంత అతిశయోక్తిని మేళవించి చెప్పారు. ప్రజలను గుంతలు తవ్వమని ప్రభుత్వం పని కల్పించాలి. ఆ తరువాత వాటిని పూడ్చమని చెప్పి అందుకోసం కూడా ఖర్చు చేయాలి. తమ చేతికి డబ్బు వస్తే వారు దాన్ని ఖర్చు చేస్తారు. అది ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి దోహదపడుతుందని కీన్స్ వివరించారు.
భారత ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అక్షరాలా కీన్స్ చెప్పిన 'గుంతలు తవ్వి పూడ్చడం' వంటిదే. ఈ పథకంకింద ప్రజలకు కనీసం వందరోజుల పాటు ఉపాధికి హామీ కల్పించాలి.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, ఈ ఏడాది ఉపాధి హామీ పథకం నిధులకు భారీగా కోతపడింది. బడ్జెట్‌లో దీనికి కేవలం 61,500 కోట్ల రూపాయలు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే సుమారు పదివేల కోట్ల రుపాయలు తగ్గింది. నిజానికి ఆర్థిక మందగమనం కారణంగా తీవ్రంగా తెబ్బతిన్న పేదల చేతుల్లో డబ్బులు ఆడేలా చెయ్యానికి ఇంతకన్నా మంచి మార్గం మరొకటి లేదు. కానీ ఆర్థిక మంత్రి మాత్రం ఈ పథకానికి నిధుల్లో కోత విధించాలనే నిర్ణయించారు .
ఈ రకమైన ఆలోచనను చూస్తుంటే దేశ ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉందన్న విషయాన్ని కూడా అంగీకరించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం ఇష్టబడుతున్నట్టు కనిపించడం లేదన్న విషయం అర్థమవుతోంది. ఈ బడ్జెట్‌కైనా పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే కీలకం. ప్రభుత్వాలు ఎక్కువగా ఆశలు పెట్టుకునేది వాటిపైనే. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ సుమారు 24లక్షల20వేల 799 కోట్ల రూపాయల (338.5 బిలియన్ డాలర్లు) ఆదాయం రావచ్చని అంచనా వేసింది.
గత ఏడాదితో పోల్చితే ఇది 12 శాతం అధికం. అయితే 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4 శాతం మాత్రమే పెరగడంతో పోల్చితే ప్రభుత్వం ఆశిస్తున్న పెరుగుదల వాస్తవాలకు అందనంత దూరంలో ఉందని చెప్పొచ్చు. పెట్టుబడుల ఉప సంహరణ రూపంలో లేదా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థల్లో వాటాలను విక్రయించడం ద్వారా కూడా భారీ ఎత్తున ఆదాయం పెరగొచ్చని సర్కారు భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారు 15 లక్షల 22 వేల 854కోట్ల రూపాయల ఆదాయాన్ని పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఆర్జించవచ్చని అంచనా. అయితే, ఇది కూడా 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఏకంగా 223 శాతం అధికం.

ఫొటో సోర్స్, Getty Images
ఎల్ఐసీ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ
దేశంలోనే అతి పెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీ నుంచి కొంత పెట్టుబడుల్ని ఉపసంహరిస్తామని ప్రభుత్వం ప్రకటించడం అత్యంత కీలక నిర్ణయమని చెప్పొచ్చు. కొంతవరకు ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ సంస్థలో పారదర్శకత పెరిగే అవకాశం ఉంది.
అయితే ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే. మరోవైపు ఈ నిర్ణయంపై రాజకీయంగా ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆ వ్యతిరేకతను ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందో చూడాలి. అంతేకాదు ఇప్పటి వరకు కేంద్రంలోని ప్రభుత్వాలకు ఆర్థిక కష్టాలొచ్చినప్పుడల్లా ఆదుకునే పాత్ర పోషిస్తూ వస్తోంది ఎల్ఐసీ. మరి ఈ సమీకరణలు ముందు ముందు ఏమైనా మారిపోతాయా అన్నది వేచి చూడాలి.
ప్రస్తుతం ఆరు శాతం కన్నా తక్కువ వృద్ధి రేటును నమోదు చేస్తున్న పరిస్థితుల్లో పది శాతం వృద్ధి రేటు అనే కలను నిజం చేసుకునేందుకు బడ్జెట్ రూపకల్పన విషయంలో మరింత కృషి చేసి ఉండాల్సింది.
(వ్యాసకర్త ఆర్థిక వేత్త, ఈజీ మనీ ట్రైలోజీ పుస్తక రచయత)

ఇవి కూడా చదవండి
- బడ్జెట్ 2020 :ఆదాయ పన్ను కొత్త శ్లాబ్స్‌తో యువత భవిష్యత్తుతో ఎందుకీ చెలగాటం?
- బడ్జెట్ 2020: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఏమన్నాయి
- 2022లోగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న నిర్మల.. ఇది సాధ్యమేనా?
- ‘నా కూతురి బొమ్మ టార్చిలైట్ నా ప్రాణాలు కాపాడింది’
- 'ప్రపంచం మౌనంగా ఉంది... నిశ్శబ్దం భయంకరంగా ఉంది'
- ఈయూ నుంచి నిష్క్రమించిన బ్రిటన్... స్వతంత్ర దేశంగా ఈయూకు తిరిగి వస్తామన్న స్కాట్లాండ్
- అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









