అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ జనార్థన్
- హోదా, ఫ్రీలాన్స్ స్పోర్ట్స్ ప్రతినిధి
రియో ఒలింపిక్స్ కంటే ఈ ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రతిభను ప్రదర్శించాలన్న ఒత్తిడి భారత మహిళా అథ్లెట్ల మీద ఉంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలే వచ్చాయి. బ్యాండ్మింటన్‌లో పీవీ సింధు రజతం సాధించగా, రెజ్లింగ్‌లో సాక్షి మలిక్ కాంస్యం గెలిచారు.
2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి రికార్డు సృష్టించిన పీవీ సింధు వచ్చే ఒలింపిక్స్‌లోనూ తప్పకుండా పతకాన్ని పట్టుకొస్తారన్న ఆశ బలంగా ఉంది. కొన్నేళ్లుగా భారత మహిళా అథ్లెట్లు సాధిస్తున్న పురోగతికి అది ప్రతిబింబం లాంటిది.
షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, ట్రాక్ అండ్ ఫీల్డ్... ఇలా ఒలింపిక్స్‌లోని ఏ విభాగంలో చూసినా ప్రస్తుతం భారత్‌లో పురుషులకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు.
అయితే, క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే బాలికలకు సంప్రదాయ పురుషాధిక్య దేశమైన భారత్‌లో అనేక రకాల సాంస్కృతిక, సామాజిక అవరోధాలు ఎదురవుతాయి. వారికి సరైన వసతులు ఉండడంలేదు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.


పురుషుల కంటే తామేమీ తక్కువ కాదంటున్నారు మహిళా క్రీడాకారులు. రెండు దశాబ్దాల ఫలితాలను పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది.
20 ఏళ్ల క్రతం సిడ్నీ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌కు భారత్ 72 మంది క్రీడాకులను పంపింది. అప్పుడే కరణం మల్లేశ్వరికి వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకం వచ్చింది. ఆ ఒలింపిక్స్‌లో భారత్ సాధించింది ఆ ఒక్క పతకమే.
2016లో రియో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌కు 15 విభాగాలకు చెందిన 117 క్రీడాకారులు వెళ్లారు. అందులో 54 మంది మహిళలు. రెండు పతకాలు వచ్చాయి. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు రజతం, రెజ్లింగ్‌లో సాక్షి మలిక్ కాంస్యం సాధించారు.
పురుషులతో పోల్చితే క్రీడల్లో మహిళలు పాల్గొనడమనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వారి తల్లిదండ్రులు ఎంత అభ్యుదయవాదులు? వారు పుట్టిపెరిగింది పట్టణంలోనా లేక గ్రామీణ ప్రాంతాల్లోనా? వాళ్లు ఎంచుకున్న ఆట ఏంటి? వాళ్ల కుటుంబ ఆర్థిక నేపథ్యం ఏంటి? వంటి అంశాల ప్రభావం ఉంటుంది.
లింగ సమానత్వం అత్యంత తక్కువగా ఉన్న హరియాణా లాంటి రాష్ట్రాల్లో మహిళల మీద నేరాల రేటు అధికంగా ఉంది. దేశంలోని ప్రముఖ మహిళా క్రీడాకారుల్లో కొందరు ఈ రాష్ట్రానికి చెందినవారున్నారు. గీతా ఫోగట్, బబితా ఫోగట్, వినేష్‌లు రెజ్లింగ్‌లో అంతర్జాతీయ పతకాలు సాధించారు. గీతా, బబితల జీవిత కథల ఆధారంగా బాలీవుడ్ సినిమా 'దంగల్' కూడా వచ్చింది.
1990ల తర్వాత ముంబయి, హైదరాబాద్ లాంటి నగరాల నుంచి అనేక మంది మహిళా అథ్లెట్లు వెలుగులోకి వచ్చారు.
పాఠశాల, జిల్లా స్థాయి పోటీల్లో ఎంతమంది మహిళలు పాల్గొంటున్నారన్న అంకెలు తెలుసుకోవడం అంత సులువు కాదు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లలో పోటీపడుతున్న వారి సంఖ్య మాత్రం ఇప్పుడు బాగానే ఉంటోంది.
జనవరి 10 నంచి 22 వరకు అస్సాంలో జరిగిన ఖేలో ఇండియా పోటీలకు మహారాష్ట్ర నుంచి 591 మంది వెళ్లారు. వారిలో 312 మంది అమ్మాయిలే. అత్యధిక పతకాలు మహారాష్ట్రకే వచ్చాయి.

జనవరి 19న నిర్వహించిన టాటా ముంబయి మారథాన్‌లో 16 మంది పురుషులు, 11 మంది మహిళలు పతకాల కోసం పోటీపడ్డారు. ఈ 10 కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొనేందుకు గత ఏడాది కేవలం 753 మంది మహిళలే పేర్లు నమోదు చేసుకోగా, ఈ ఏడాది ఆ సంఖ్య 3909కి పెరిగింది.
టీవీలు, ఇంటర్నెట్ ప్రభావం వల్ల బయటి ప్రపంచం గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఫలితంగా, క్రీడల పట్ల బాలికల్లో ఆసక్తి పెరుగుతోంది. తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహిస్తున్నారు.
"రైఫిల్ షూటింగ్‌కు బాలికలను పంపాలని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు. నేషనల్ ఛాంపియన్‌షిప్స్‌లో చూస్తే పురుషులు, మహిళల సంఖ్య దాదాపు సమానంగా ఉంది" అని భారత షూటింగ్ (జూనియర్) జట్టుకు కోచ్‌గా పనిచేస్తున్న సుమా శిరూర్ అంటున్నారు.
ఐపీఎల్ క్రికెట్ కారణంగా భారత్‌లో ఆటల పోటీలను వీక్షించే మహిళల సంఖ్య పెరిగింది.
2016 సెప్టెంబర్‌లో కేపీఎంజీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2016 ఐపీఎల్ వీక్షకుల్లో 41 శాతం మంది, అంతకు ముందు 2015లో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)ను వీక్షించిన వారిలో 50 శాతం మంది, 2014లో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ వీక్షకుల్లో 57 శాతం మంది మహిళలు, పిల్లలే.
2016 రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు ఫైనల్ మ్యాచ్‌ను 66.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఒలింపిక్స్‌లో అంత భారీగా వ్యూస్ రావడం అదే అత్యధికమని కథనాలు వచ్చాయి.
గతంలో క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలంటే బాలికలకు అనేక అవరోధాలు ఎదురవుతుండేవి. కొంత కాలంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు అలాంటి సమస్యలు చాలావరకు తగ్గాయి.
"ప్రస్తుతం బాలికలు క్రీడలపై బాగా పట్టు సాధిస్తున్నారు. వారిలో తెగింపు, ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది" అని సుమా శిరూర్ అంటున్నారు.
2010 దిల్లీ కామన్వెల్త్ గేమ్స్ తర్వాత దేశంలో చాలా మార్పు వచ్చిందని టాటా ముంబయి మారథాన్ టైటిల్ కైవసం చేసుకున్న సుధా సింగ్ చెబుతున్నారు.
"నా చిన్నతనంతో పోల్చితే ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. బాలికలు క్రీడలను ఎంచుకోవడాన్ని ఒకప్పుడు ప్రశ్నించిన ఇరుగుపొరుగు వారు, కుటుంబ సభ్యులు ఇప్పుడు పెద్దగా అభ్యంతరం చెప్పడంలేదు" అని ఆమె వివరించారు.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో, ఇతర మహిళా అథ్లెట్లు విజయాలు సాధిస్తుండటం వల్ల... క్రీడల్లో రాణించాలన్న పట్టుదల బాలికల్లో చిన్నతనం నుంచే కనిపిస్తోంది. పీవీ సింధు, సానియా మీర్జా, మేరీ కోమ్, సాక్షి మలిక్, దీపా కర్మాకర్, గీతా ఫోగట్, బబితా ఫోగట్ లాంటి అనేక మంది మహిళా క్రీడాకారులు నేటి బాలికలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"మా కాలంలో నేను 18 ఏళ్ల వయసులో కెరీర్ ప్రారంభించాను. పెళ్లి చేసుకుని, పిల్లలు కనాల్సిన వయసు అది. మొదటి బిడ్డ పుట్టిన తర్వాత నేను క్రీడల్లో మెరుగైన ప్రతిభ కనబర్చగలిగాను. ఇప్పటి పిల్లలయితే 17-18 ఏళ్లు వచ్చేసరికే ఆటల్లో రాటు తేలుతున్నారు" అని సుధా సింగ్ వివరించారు.
సుమా శిరూర్ లాంటి మహిళా కోచ్‌లు వచ్చాక పరిస్థితిలో మరింత మార్పు వచ్చింది. అంతకుముందు మహిళా కోచ్‌లతో పోటీలకు తమ పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు పెద్దగా ఇబ్బంది పడటంలేదు.
భారత్‌లో అనేక మంది ఆర్థిక స్తోమత పెరిగింది. తమ పిల్లలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు.
"ఒకప్పుడు ప్రజలు చాలా పరిమితంగా ఆలోచించేవారు. ఇప్పుడు మార్పు వస్తోంది. ఈ మార్పు తేవడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో వివిధ రకాల సంస్కృతులు, జీవన విధానాలు, విజయాల గురించి అందరూ తెలుసుకుంటూ, వాటిని అనుకరిస్తున్నారు. గతంలో అమ్మాయిలు బిగుతైన బనియన్లు, షార్టులు వేసుకోవాలంటే ఎన్నో అభ్యంతరాలు ఉండేవి. కానీ, ఇప్పుడు జాతీయ స్థాయి పరుగు పందెంలో బనియన్ లాంటి బిగుతైన దుస్తుల్లో పరుగెడుతున్న అమ్మాయిలను చూస్తున్నాను" అని ముంబయికి చెందిన ట్రాక్ అథ్లెట్, ఫిట్‌నెస్ ట్రైనర్ ఆయేషా బిల్లిమోరియా అంటున్నారు.
ప్రతి క్రీడా విభాగంలోనూ కొత్త లీగ్ పోటీలు వస్తున్నాయి. పెద్ద కంపెనీలు, టీవీలు స్పాన్సర్ చేస్తున్నాయి. ఆదాయాలు కూడా పెరిగాయి. 2019 ఆగస్టులో ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న 13వ క్రీడాకారిణి సింధు.

ఇంకా ముందుకెళ్లాల్సి ఉంది
క్రీడల్లో రాణించాలంటే ముందు కుటుంబం నుంచి సరైన ప్రోత్సాహం, మద్దతు ఉండాలి. అయితే, పురుషులతో పోల్చితే బాలికల పట్ల తల్లిదండ్రుల్లో అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది. పోటీల్లో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనని కొందరు తల్లిదండ్రులు ఆందోళనపడుతుంటారు.
"ప్రస్తుతం తల్లిదండ్రులు బాలికల పట్ల అతిగారాబం ప్రదర్శిస్తున్నారు. వారిని ఒంటిరిగా బయటకు వెళ్లనీయడంలేదు. కొడుకులను ఇంజినీరింగ్ చదివిస్తే ఎక్కడికైనా వెళ్లి స్థిరపడతాడని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కానీ, అలా బాలికల గురించి ఆలోచించడంలేదు" అని జాతీయ రైఫల్ జట్టు ప్రధాన కోచ్ దీపాలి దేశ్‌పాండే అంటున్నారు.
కొన్ని రాష్ట్రాల్లో, సముదాయాల్లో మహిళలు ఇప్పటికీ ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. తనతో పాటు కలిసి చదువుకున్న గుజరాతీ, మార్వాడీ అమ్మాయిలను గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఉద్యోగాలకు పంపించడంలేదని దేశ్‌పాండే చెప్పారు.
ఎక్కడైనా పురుషులతో సమానంగా మహిళలకూ అవకాశాలు ఉన్నాయి. కానీ, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రం స్పోర్ట్స్ కోటా కింద వారికి సరైన అవకాశాలు లభించడంలేదు. చాలా పోస్టులు పురుషులకే రిజర్వ్ చేస్తున్నారు.

దిల్లీ కామన్వెల్త్ గేమ్స్ తర్వాత దేశంలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు చాలా మెరుగయ్యాయి. అయినప్పటికీ, అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చితే ఇంకా చాలా మెరుగవ్వాల్సి ఉంది.
ఇప్పటికీ దేశంలో క్రికెట్‌దే ఆధిపత్యం. అయితే, క్రీడా అభిమానులు, మీడియా పురుషుల క్రికెట్ జట్టుకు ఇచ్చినంత ప్రాధాన్యత, మహిళల జట్టుకు ఇవ్వడంలేదు.
"క్రికెటర్లకు వచ్చినంత గుర్తింపు మా ప్రపంచ, ఏషియన్, కామన్వెల్త్ ఛాంపియన్లకు రావడంలేదు. ఖేలో ఇండియా గేమ్స్‌లో బాలికలు పతకాలు సాధిస్తున్నారు. కానీ, పత్రికలు ఆ వార్తను పట్టించుకోకుండా హార్ధిక్ పాండ్యా (క్రికెటర్) అర్ధ నగ్న ఫొటోను పెద్దగా ముద్రిస్తున్నాయి" అని షూటింగ్‌లో పలు అంతర్జాతీయ పతకాలు సాధించిన 17 ఏళ్ల రామ్ కిషన్ భాకెర్ అంటోంది.
భారత్ లాంటి విశాలమైన దేశంలో సవాళ్లు ఉన్నప్పటికీ, గ్రామాల స్థాయిలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపడితే మహిళా అథ్లెట్లు మరింత మంది ముందుకొచ్చే అవకాశం ఉంటుంది.
మెరుగైన శిక్షణ, పోషకాహారం లాంటి కారణాలతో ఇప్పటికీ దేశంలో క్రీడలు పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"కొన్ని చిన్న గ్రామాల్లో ఆటల గురించి ఏమాత్రం అవగాహన ఉండదు. పోటీల గురించి కొంతమంది గ్రామీణులకు తెలియదు. కానీ, కాస్త దృష్టి పెడితే ఆ ఊళ్లలోనే మెరుగైన ఆటగాళ్లు దొరుకుతారు. మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలి. అబ్బాయిల్లాగే తాము కూడా క్రీడల్లో రాణించగలమని పోరాడాలి. సాంస్కృతిక, సంప్రదాయ అవరోధాలను అధిగమించాలి" అని సుమా శిరూర్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:
- కోబ్ బ్రయాంట్: బాస్కెట్ బాల్ సూపర్ స్టార్, ఆయన 13 ఏళ్ళ కూతురు హెలీకాప్టర్ ప్రమాదంలో దుర్మరణం
- పీవీ సింధు విజయాల వెనుక పీబీఎల్ పాత్ర కూడా ఉందా
- ‘మిస్సింగ్ 54’ మిస్టరీ: ఆ భారత సైనికులు ఏమయ్యారు... దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోనే మగ్గుతున్నారా?
- దీప కర్మాకర్ అడుగుజాడల్లో త్రిపుర నుంచి దూసుకువస్తున్న మరో జిమ్నాస్ట్..
- కుస్తీలో సాక్షీ మలిక్‌నే ఓడించిన ఒక అమ్మాయి కథ
- సానియా మీర్జా: క్రీడల్లో సత్తా చాటిన మరో అమ్మ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











