#BBCISWOTY: కుస్తీలో సాక్షీ మలిక్‌నే ఓడించిన ఒక అమ్మాయి కథ

సాక్షీ మలిక్‌ను ఓడించిన ఒక అమ్మాయి కథ

ఫొటో సోర్స్, Sat singh

    • రచయిత, సత్ సింగ్
    • హోదా, బీబీసీ కోసం

18 ఏళ్ల పహిల్వాన్ సోనమ్ మలిక్ రియో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన సాక్షి మాలిక్‌ను ఇటీవల ఓడించి తన సత్తా చూపింది. తర్వాత ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో ఆమె అదృష్టం పరీక్షించుకోనుంది.

ఈ విజయాల మైలురాళ్లు అధిగమించే ప్రయాణంలో ఆమె ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కుంది.

ఇస్వోటీ

సోనిపత్‌ జిల్లాలోని మదీనా గ్రామంలో పహిల్వాన్ రాజేందర్ మలిక్‌ను అందరూ రాజ్ పహిల్వాన్ అని పిలుస్తుంటారు. కొన్నేళ్ల క్రితం తన కూతురు బాగా రాణించేలా ఆయన ఒక మంచి క్రీడ కోసం వెతుకుతున్నారు.

ఆయన మనసులో ఒకటి అనుకున్నారు. "ఆ క్రీడ ఏదైనా కావచ్చు. కానీ కుస్తీ మాత్రం వద్దు".

News image
సాక్షీ మలిక్‌ను ఓడించిన ఒక అమ్మాయి కథ

ఫొటో సోర్స్, Sat singh

రాజేందర్ స్వయంగా కుస్తీ క్రీడాకారుడు, ప్రముఖ పహిల్వాన్ మాస్టర్ చందగీ రామ్ దిల్లీలోని అఖాడేలో ఆయన ట్రైనింగ్ కూడా ఇచ్చారు.

"నాకు మన దేశం కోసం ఎప్పటికీ కుస్తీ పట్టలేకపోయానే అని దిగులుండేది. ఎందుకంటే నేను నేషనల్ గేమ్స్‌కు ముందే గాయపడ్డాను. నా కష్టమంతా వృథా అయిపోయింది. మంచి ఆటగాళ్లని పేరున్న నా స్నేహితులు చాలామంది గాయపడ్డంతో బంగారం లాంటి కెరియర్ పోగొట్టుకున్నారు. నా కూతురికి అలా జరగడం నేను చూళ్లేను" అని రాజేందర్ అన్నారు.

సాక్షీ మలిక్‌ను ఓడించిన ఒక అమ్మాయి కథ

ఫొటో సోర్స్, Sat singh

సోనమ్ కుస్తీ ప్రయాణం

సైన్యంలో పనిచేసిన తండ్రి స్నేహితుడు, సోనమ్‌ అంకుల్ అని పిలిచే అజ్మేర్ మలిక్ 2011లో తన పొలంలో ఒక అఖాడా తెరిచి కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. రాజేందర్ తన స్నేహితుడిని కలవడానికి వస్తూ, తనతోపాటూ సోనమ్‌ను కూడా అక్కడికి తీసుకొస్తుండేవారు.

తర్వాత మెల్లమెల్లగా అజ్మేర్ మలిక్ శ్రమ, ఏకాగ్రత, అతడి ట్రైనింగ్ స్టైల్ చూసిన రాజేందర్ పహిల్వాన్‌కు మళ్లీ కుస్తీ గుర్తొచ్చింది. ఆయన తన కూతురి భవిష్యత్తును కుస్తీలోనే చూడాలని అనుకున్నారు. అప్పట్లో, అజ్మేర్ మలిక్ అఖాడాలో అబ్బాయిలకు మాత్రమే శిక్షణ ఇచ్చేవారు. దాంతో, సోనమ్‌కు మొదటి నుంచీ అబ్బాయిలతో కుస్తీ పట్టడం, వాళ్లతోపాటూ ట్రైనింగ్ తీసుకోవడం అలవాటైంది.

"నా కోచ్ అజ్మేర్ మలిక్ నాకు పూర్తిగా ఆర్మీ పద్ధతిలో ట్రైనింగ్ ఇచ్చారు. నాకు కూడా అబ్బాయిల్లాగే శిక్షణ ఇచ్చారు. ఒకసారి మ్యాట్‌పైకి వెళ్లిన తర్వాత ఎలాంటి నిర్లక్ష్యాన్ని భరించలేనని కోచ్ మాకు చెప్పేవారు" అని సోనమ్ చెప్పింది.

సాక్షీ మలిక్‌ను ఓడించిన ఒక అమ్మాయి కథ

ఫొటో సోర్స్, Sat singh

ఫలించిన కష్టం

చిన్నప్పుడు స్కూల్లో ఒకసారి క్రీడల్లో ఫస్ట్ వచ్చినపుడు, నాన్నతోపాటూ ఐపీఎస్ సుమన్ మంజరి తనకు సన్మానం చేశారని సోనమ్ చెప్పింది.

"అదే రోజు నాకు కూడా ఐపీఎస్ సుమన్ మంజరిలా గొప్ప పేరు తెచ్చుకోవాలని అనిపించింది. తర్వాత నేను స్కూల్ లెవల్, డిస్ట్రిక్ట్ లెవల్, నేషనల్ లెవల్లో నాతో కుస్తీ పట్టిన పహిల్వాన్లందరినీ చిత్తు చేయడానికి పెద్దగా టైం తీసుకోలేదు"

అక్కడి నుంచి మొదలైన విజయాల పరంపర సోనమ్‌ను ఐదుసార్లు 'భారత్ కేసరి'గా నిలిపింది. ఆర్మీ నుంచి సుబేదార్‌గా రిటైరైన అజ్మేర్ మలిక్ "సోనమ్ తన కంటే వయసులో పెద్దవాళ్లను, ఎంతో అనుభవం ఉన్న ప్రముఖ పహిల్వాన్లను కూడా ఓడించింది" అన్నారు.

తనకంటే పెద్ద, బలవంతులైన పహిల్వాన్ల నుంచి ఒత్తిడికి గురికాకుండా వారిని ఎదుర్కోవడం సోనమ్ ప్రత్యేకతగా భావిస్తారు. ప్రతి పోటీలో వంద శాతం కష్టపడేందుకు ప్రయత్నిస్తానని సోనమ్ చెప్పింది.

సాక్షీ మలిక్‌ను ఓడించిన ఒక అమ్మాయి కథ

ఫొటో సోర్స్, Sat singh

కష్టాల సమయం

2013లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల సమయంలో సోనమ్ కుడి చేయి పనిచేయడం ఆగిపోయింది. ఆమె తండ్రి, కోచ్‌ దానిని మొదట మామూలు దెబ్బేలే అనుకున్నారు.

"మేం స్వదేశీ చికిత్స చేయించాం. కానీ, చెయ్యి మెల్లమెల్లగా పట్టు తప్పుతూ వచ్చింది. ఒకరోజు చేయి పనిచేయడమే ఆగిపోయింది" అని సోనమ్ చెప్పింది.

రోహ్తక్‌లో ఒక స్పెషలిస్టుకు చేతిని చూపించారు. ఆయన సోనమ్‌తో నువ్విక కుస్తీ మర్చిపోవాలని చెప్పారు. ఆ సమయంలో ఆమె తండ్రి రాజేందర్‌కు "కూతురిని కుస్తీలోకి తీసుకొచ్చి తప్పు చేశానేమో" అనిపించింది.

సాక్షీ మలిక్‌ను ఓడించిన ఒక అమ్మాయి కథ

ఫొటో సోర్స్, Sat singh

ఇరుగుపొరుగువారు 'ఇక సోనమ్‌ను ఎవరు పెళ్లి చేసుకుంటారు' అని సూటిపోటి మాటలు అనేవారు.

"కానీ, దాదాపు 10 నెలలపాటు చికిత్స జరుగుతున్నా మేం గ్రౌండ్ వదల్లేదు. సోనమ్ చేతులకు బదులు కాళ్లతో కుస్తీ పట్టడం ప్రాక్టీస్ చేసేది. ఎందుకంటే కుస్తీలో కాళ్ల రోల్ కూడా చాలా కీలకం. ఆమె ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ వదలివెళ్లాలని అనుకునేది కాదు. పది నెలల చికిత్స తర్వాత డాక్టర్ సోనమ్‌ మళ్లీ ఫిట్ అని చెప్పారు. ఆ తర్వాత సోనమ్ ఎప్పుడూ వెనుదిరిగి చూడలేదు" అని రాజేందర్ చెప్పారు.

"గాయం అనేది పహిల్వాన్లకు ఒక అలంకారం లాంటిది, దాన్ని చూసి భయపడకూడకు" అని కోచ్ అజ్మేర్ మలిక్ చెప్పిన మాటను సోనమ్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది.

సాక్షీ మలిక్‌ను ఓడించిన ఒక అమ్మాయి కథ

ఫొటో సోర్స్, Sat singh

సోనమ్ కల ఏంటి?

62 కిలోల విభాగంలోకి వెళ్లడానికి ముందు కూడా, చాలా మంది ఆమెకు "ఆ కేటగిరీలో ముందుకెళ్లడం చాలా కష్టం" అని చెప్పారు.

"కానీ అదే కేటగిరీలో పోటీపడాలని నేను కూడా మొండిపట్టు పట్టాను. ఎందుకంటే ఎదురుగా సాక్షి మలిక్ ఉంది. సాక్షిని ఓడిస్తే, ఒలింపిక్ మెడల్ పక్కా వచ్చినట్టే లెక్క. అదే జరిగింది" అని సోనమ్ చెప్పింది.

ప్రస్తుతం సోనమ్ ఒలింపిక్ ట్రయల్ కోసం సన్నాహాలలో ఉంది.

"నేను సాక్షిని ఓడించాను అంటే, ఒలింపిక్ 2020లో కనీసం గోల్డ్ మెడల్ తీసుకువచ్చి తీరుతాను" అంటోంది సోనమ్.

ఫుటర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)