టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు

క్రీడాకారులు

ఫొటో సోర్స్, HOCKEY INDIA

    • రచయిత, ఆదేశ్ కుమార్ గుప్తా
    • హోదా, స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

టోక్యోలో వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌కు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించింది.

యునైటెడ్ స్టేట్స్ టీమ్‌తో జరిగిన రెండంచెల క్వాలిఫయర్ మ్యాచ్‌లలో గోల్స్ తేడా ఆధారంగా అర్హత పొందింది.

భారత మహిళలజట్టు మొదటి మ్యాచ్‌లో 5-1 తేడాతో అమెరికాపై నెగ్గింది. కానీ, శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో 1-4 తేడాతో సెకండ్ లెగ్ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. అయితే, ఈ రెండు మ్యాచ్‌ల విజయాల్లోని గోల్స్ తేడా ఆధారంగా భారత జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

మొత్తంగా రెండు మ్యాచ్‌లనూ కలిపి చూస్తే, భారత జట్టు 6-5 తో తన క్వాలిఫయర్లను ముగించింది.

కెప్టెన్ రాణీ రాంపాల్ (పాత ఫొటో)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెప్టెన్ రాణీ రాంపాల్ (పాత ఫొటో)

ఆ గోల్ భారత్‌కు ఒలింపిక్ బెర్త్ ఖాయం చేసింది

భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో శనివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అమెరికా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. 48వ నిమిషం వరకూ 4-0తో లీడ్‌లో ఉంది.

మరో గోల్ చేస్తే అమెరికా జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది. కానీ 48వ నిమిషంలో భారత జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్ అమెరికన్ గోల్‌కీపర్‌కు పంచ్ ఇస్తూ గోల్ సాధించింది.

ఇదే భారత మహిళల జట్టు పాలిట వరంగా పరిణమించింది. ఈ గోల్ సాధించిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో జట్టు పోరాడింది. ప్రత్యర్థి జట్టు మరో గోల్ చేయడానికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.

అంతకుముందు, అమెరికా క్రీడాకారిణి అమండా మగడాన్.. ఐదో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంలో సఫలమైంది. దీంతో కిక్కిరిసిన స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.

ఆ తర్వాత, 14వ నిమిషంలో కెప్టెన్ కేథరిన్ షార్కీ మరో గోల్‌తో స్కోరును 2-0కు చేర్చింది. 20వ నిమిషంలో ఎలిసా పార్కర్, 28వ నిమిషంలో మళ్లీ అమండా గోల్స్ చెయ్యడంతో ఆ జట్టు 4-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అమెరికా ఎదురుదాడికి జవాబివ్వడంలో అప్పటి వరకు రక్షణాత్మక ధోరణిని అవలంబించి విఫలమైంది భారత జట్టు. కానీ, 48వ నిమిషంలో రాణీ చేసిన గోల్‌తో తమ ఒలింపిక్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

క్రీడాకారులు

ఫొటో సోర్స్, Hocky India

31 మ్యాచ్‌ల్లో ఐదే విజయాలు

భారత మహిళల జట్టుకు అమెరికా జట్టుతో ఇది 31వ మ్యాచ్. ఈ 31 మ్యాచ్‌లలో కేవలం 5 మ్యాచ్‌లనే భారత్ గెల్చుకోగలిగింది. 17 మ్యాచ్‌లలో ఓటమిపాలై, 9 మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. ఈ గణాంకాలను బట్టి భారత జట్టు ప్రదర్శన పేలవంగా ఉందని చెప్పలేం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)