మహిళలను భారత సైన్యంలో కమాండర్లుగా అంగీకరించే పరిస్థితి లేదా?

సైన్యంలో మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సైన్యంలో పదాతి దళ పోరాట విధుల్లో మహిళల నియామకంపై ఉన్న నిషేధం ఎత్తివేసి, కమాండర్ల పోస్టుల్లో వారిని నియమించే విషయాన్ని పరిశీలించాలని గత నెలలో భారత సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

పురుషులతో సమానంగా వారిని పరీక్షించాలని, వారిని ఓ వర్గంగా పక్కన పెట్టొద్దని సూచించింది. ఆలోచనా దృక్పథంలో మార్పు రావాలని వ్యాఖ్యానించింది.

అయితే, గతవారం ప్రభుత్వం దీనిపై తమ స్పందనను సుప్రీం కోర్టుకు తెలియజేసింది. క్షేత్ర పోరాట విధులకు మహిళలు తగినవారు కాదని పేర్కొంది.

'మహిళా అధికారులను కమాండర్లుగా అంగీకరించేలా పురుష జవాన్లు ఇంకా మానసికంగా సన్నద్ధం అవ్వలేద'ని, 'మాతృత్వం, ప్రసూతి, పిలల్ల పోషణ లాంటి సవాళ్లు' కూడా ఉన్నాయని తెలిపింది.

Presentational grey line
News image
Presentational grey line

ప్రభుత్వ స్పందనను సైనిక చరిత్రకారుడు శ్రీనాథ్ రాఘవన్ తీవ్రంగా తప్పుపట్టారు.

ప్రభుత్వ వాదన 'విపరీతంగా, తిరోగమనంగా' ఉందని ఆయన అన్నారు.

''బ్రిటీష్ వలస పాలకులు కూడా భారతీయ సైనికులు భారతీయులను కమాండర్లుగా అంగీరించరని వాదించేవారు. ఇది కూడా అలాగే ఉంది. భిన్నమైన సామాజిక నేపథ్యాల నుంచి సైనికులు వస్తుంటారు. సైనిక శిక్షణ మౌలిక ఉద్దేశం వారి పద్ధతులను, వైఖరిని మార్చడమే'' అని ఆయన అన్నారు.

భారత సాయుధ బలగాల్లో మహిళా అధికారుల నియామకాలు 1992లో ప్రారంభయ్యాయి. వైమానిక దళంలో పోరాట విధుల్లో వారికి అవకాశం కల్పిస్తున్నారు. చాలా మంది మహిళలు ఫైటర్ పైలెట్లుగా మారి, కదన రంగంలోకీ దిగుతున్నారు. త్వరలోనే నౌకాదళంలో సెయిలర్లుగా కూడా వారిని అనుమతించబోతున్నారు.

సైన్యం మాత్రం ఇంకా మహిళలను పక్కనపెడుతూనే ఉంది. డాక్లర్లు, నర్సులు, ఇంజినీర్లు, సిగ్నలర్లు, అడ్మినిస్ట్రేటర్లు, న్యాయవాదుల వంటి పాత్రలకే వారిని పరిమితం చేస్తోంది. పోరాట క్షేత్రాల్లో గాయపడ్డ జవాన్లకు మహిళలు వైద్యం అందిస్తున్నారు. ల్యాండ్ మైన్లను గుర్తించి, తొలగిస్తున్నారు. కమ్యునికేషన్ లైన్ల ఏర్పాటులోనూ భాగమవుతున్నారు.

మహిళా అధికారులకు అర్హత, ర్యాంకును బట్టి సైన్యం 20 ఏళ్ల సర్వీసును కల్పిస్తోంది. గత ఏడాది నుంచి మహిళలను సైనిక పోలీసులుగా నియమించేందుకూ అనుమతిస్తోంది.

నమ్రతా చండీ నాయుడు

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడు మహిళలు ఒక్క క్షేత్ర పోరాట విధులు తప్ప దాదాపు అన్నీ నిర్వర్తిస్తున్నారు.

పదాతి దళం, ఆర్మ్డ్ కోర్‌ల్లో మాత్రం వారిని ఇంకా అనుమతించడం లేదు.

2019 లెక్కల ప్రకారం సైన్యంలో మహిళల శాతం 3.8 మాత్రమే. వారి వాటా వైమానిక దళంలో 13 శాతం, నౌకాదళంలో 6 శాతంగా ఉంది.

40 వేలకుపైగా మంది పురుష అధికారులంటే.. 1,500 మంది మహిళా అధికారులు ఉన్నారు.

మహిళా సాధికారత విషయంలో దీన్నొక మైలురాయి అని భావించలేమని దిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్‌కు చెందిన పరిశోధకురాలు ఆకాంక్ష ఖుల్లర్ అన్నారు.

''చాలా పరిమితంగానే ద్వారాలు తెరిచారు. పురుషాధిక్యత బాహాటంగానే ఉంది. సంస్థాగత నిర్మాణ స్థాయిలోనే మహిళలను దూరం పెట్టడం ఉంది'' అని ఆమె అభిప్రాయపడ్డారు.

''సైన్యంలో పైస్థాయిలోని వైఖరుల్లోనూ లింగ అసమానతలు ప్రతిబింబిస్తున్నాయి. మిగత దళాలతో పోలిస్తే, సైన్యంలో పురుషాధిక్య భావనలు ఎక్కువగా పాతుకుపోయాయని అనుకుంటున్నా'' అని ఆకాంక్ష వ్యాఖ్యానించారు.

ఆమె సరిగ్గానే చెప్పారు. సైన్యంలో ముందువరుసలో సేవలందించేందుకు మహిళలు ఇబ్బందిపడతారు కాబట్టే, వారు క్షేత్ర స్థాయిలో పోరాట విధుల్లో లేరని మాజీ సైనికాధిపతి, ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపన్ రావత్ 2018లో వ్యాఖ్యానించారు.

మాతృత్వ సెలవులు ఓ సమస్య అని.. మహిళలకు భద్రత, గోప్యత కూడా ఎక్కువ అవసరమని ఆయన అన్నారు. పోరాటంలో ప్రాణాలు వదిలిన 'మహిళల మృతదేహాల బ్యాగులను' స్వీకరించేందుకు భారత్ ఇంకా సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు.

మహిళా అధికారులను వారి కన్నా కింది స్థాయి జవాన్ల కళ్ల నుంచి 'కాపాడాల్సి' ఉంటుందని కూడా అన్నారు. రావత్ వ్యాఖ్యలపై అప్పట్లో దుమారం రేగింది.

సైన్యంలో మహిళలు

ఫొటో సోర్స్, AFP

కదన రంగంలో అవకాశాల కోసం ప్రపంచవ్యాప్తంగా, మహిళలు గట్టిగానే పోరాడాల్సి వస్తోంది. ప్రస్తుతం పదికిపైగా దేశాల్లో సైన్యంలో క్షేత్ర స్థాయి పోరాట విధుల్లో మహిళలు ఉన్నారు.

2013లో అమెరికా, 2018లో బ్రిటన్ సైన్యాలు ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నాయి. చాలా మంది ఈ చర్యలను స్వాగతించారు.

అయితే, స్త్రీ, పురుషులు కలిసి ఉన్న పోరాట బృందాల్లో సమన్వయ లోపం ఉంటుందని విమర్శకులు అంటున్నారు. శారీరక సామర్థ్యం, ఇతర పరీక్షల్లో మహిళలు ఉత్తీర్ణత సాధించే అవకాశాలు తక్కువని కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి.

''శారీరక సామర్థ్యం చాలా ఎక్కువగా కావాలి కాబట్టి, పోరాట విధులకు అవసరమైన కఠోర శ్రమను మహిళలు తట్టుకోలేకపోవచ్చని కొందరు వాదిస్తుంటారు. కానీ, తట్టుకోగలిగేవాళ్లు కూడా ఉంటారు. వాళ్లు ఎందుకు అవకాశం కోల్పోవాలి? శారీరక, నాణ్యత ప్రమాణాలకు ఏ భంగం కలగనంతవరకూ.. పురుషులతో సరిసమానంగా సాయుధ బలగాల్లో ఏ విభాగంలోనైనా పనిచేసే అవకాశం మహిళలకు ఇవ్వాలి'' అని విశ్రాంత భారత సైనిక జనరల్ హెఎస్ పనాగ్ అన్నారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)