ట్రాయ్: ట్రోజన్ యుద్ధం నిజంగా జరిగిందా లేక కట్టు కథా?

ట్రోజన్ గుర్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డైజీ డన్
    • హోదా, బీబీసీ కోసం

ప్రాచీన కథలతో ఓ కొత్త పుస్తకం 'ఆఫ్ గాడ్స్ అండ్ మెన్' రూపొందించే క్రమంలో.. ట్రోజన్ వార్ కథ యుగాలుగా ఎంతగా విస్తరించి ఉందో తెలిసినపుడు నేను చాలా ఆశ్చర్యపోయాను.

జాన్ డ్రైడెన్, అలెగ్జాండర్ పోప్, లూయీ మాక్‌నీస్ వంటి విభిన్న రచయితలు.. ఈ ప్రాచీన కాల్పనికతను తర్జుమా చేయటానికి నడుం కట్టారు.

ఈ ట్రోజన్ వార్.. ఇంతగా ఇంతమందిని ఆకర్షించటానికి ఒక కారణం అదొక అద్భుతమైన కథ అయితే.. అది నిజంగా జరిగివుండొచ్చని చాలా కాలంగా ఉన్న భావన మరొక కారణం.

నిజానికి.. ప్రాచీన గ్రీకు ప్రజల్లో చాలా మందికి ట్రోజన్ వార్ అనేది కల్పితం కన్నా ఎక్కువైనదే. అది వారి ప్రాచీన చరిత్రలో ఒక నిర్ణయాత్మక ఘట్టం. చారిత్రక ఆధారాలు.. హెరిడోటస్, ఎరటోస్తనీస్‌లు చూపినట్లు అది ఒక నిజమైన సంఘటనగానే సాధారణంగా భావించేవారు.

అమెజాన్ రాణి పెంథీసిలియాను అచిలిస్ చంపుతున్న దృశ్యాన్ని వర్ణించే ఈ ఎథీనియన్ పాత్ర క్రీస్తు పూర్వం 530వ సంవత్సరానికి చెందినది

ఫొటో సోర్స్, Trustees of the British Museum

ఫొటో క్యాప్షన్, అమెజాన్ రాణి పెంథీసిలియాను అచిలిస్ చంపుతున్న దృశ్యాన్ని వర్ణించే ఈ ఎథీనియన్ పాత్ర క్రీస్తు పూర్వం 530వ సంవత్సరానికి చెందినది

హోమర్ ఇలియడ్ ప్రకారం.. మేసినీ రాజు అగామెమ్నాన్ సారథ్యంలోని గ్రీకులు - ప్రియామ్ రాజు నేతృత్వంలోని ట్రోజన్ల మధ్య సంఘర్షణ కాంశ్య యుగం చివర్లో చోటుచేసుకుంది. ఆ యుద్ధం దాదాపు పది సంవత్సరాలు కొనసాగింది.

ప్రియామ్ కుమారుడు పారిస్.. ఆఫ్రోడైట్ అత్యంత అందమైన దేవత అని తీర్పు చెప్పటం.. అందుకుగాను అతడికి అగామెమ్నాన్ అందమైన మరదలిని పారిస్‌కు ఆఫ్రోడైట్ కానుకగా ఇవ్వటంతో ఈ సంఘర్షణ మొదలయింది.

హెలెన్‌ను వెనక్కు తీసుకువెళ్లాలని, ట్రోజన్లను శిక్షించాలని కంకణం కట్టుకున్న అగామెమ్నాన్, అతడి సోదరుడు.. భారీ సైన్యంతో ట్రాయ్ మీదకు దండెత్తారు. చివరికి ట్రాయ్‌ను జయించారు.

ఈ యుద్ధం నిజంగానే జరిగిందని విశ్వసించటానికి ప్రాచీన కాలంలో గౌరవమన్ననలు పొందిన చరిత్రకారులు సైతం సంసిద్ధంగా ఉన్నారు. క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దం రెండో అర్థభాగంలో నివసించిన హెరొడోటస్‌ను 'చరిత్ర పితామహుడు'గా వ్యవహరిస్తుంటారు. ఆయన తన కాలం కన్నా 800 సంవత్సరాల ముందు ట్రోజన్ వార్ జరిగినట్లు చెప్పాడు. ఇక గణితశాస్త్రవేత్త ఎరటోస్తనీస్ అయితే.. క్రీస్తు పూర్వం 1184-1183లో ట్రోజన్ వార్ జరిగిందని ఏకంగా సంవత్సరం కూడా రాశాడు. అయితే ఆధునిక పరిశోధకులు.. ఎక్కువగా సందేహాస్పదంగా స్పందించారు. మరైతే.. ట్రోజన్ వార్ నిజంగా జరిగిందా లేదా?

హెలెన్ ఆఫ్ ట్రాయ్: 1882లో ఎడ్వర్డ్ బర్న్-జోన్స్ వేసిన చిత్రం

ఫొటో సోర్స్, Trustees of the British Museum

ఫొటో క్యాప్షన్, హెలెన్ ఆఫ్ ట్రాయ్: 1882లో ఎడ్వర్డ్ బర్న్-జోన్స్ వేసిన చిత్రం

ట్రాయ్: నిజమా? కల్పితమా? అనే అంశంతో లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ఒక ప్రదర్శన ఉంది. కాంస్య యుగం చివరి కాలానికి చెందిన పురా వస్తువులతో పాటు.. ట్రాయ్ స్ఫూర్తితో పుట్టిన కథలను వివరించే గ్రీకు కలశాలు, రోమన్ కుడ్యచిత్రాలు, ఆధునిక కృతులు చాలా వాటిని ఇక్కడ ప్రదర్శనలో పెట్టారు.

ట్రోజన్ వార్‌ కథలో నిజమేమిటో తెలుసుకోవటానికి చరిత్రలో ఎంతోమంది ఎంత ఆసక్తి కనబరిచారనేది ఈ ప్రదర్శనలో చాలా స్పష్టంగా కనిపించే అంశం.

మిగిలిన ట్రోజన్ల వారసులం తామని చెప్పుకునేంత దూరం వెళ్లారు రోమన్లు.

గ్రీకులు చెక్క గుర్రంలో దాక్కుని కోటలోకి ప్రవేశించిన తర్వాత.. దగ్ధమవుతున్న ఆ కోట నుంచి తమ కథానాయకుడు ఏనీస్ కొంతమంది అనుచరులతో కలిసి ఎలా తప్పించుకున్నాడనేది వర్జిల్ తన పద్యం 'ఐనీడ్'లో వర్ణించాడు.

ఇంగ్లండ్‌ మొట్టమొదటి అధికారిక కవి జాన్ డ్రైడెన్.. ఆ చెక్క గుర్రం తయారు చేసిన ఘట్టాన్ని అద్భుతంగా తర్జుమా చేశాడు: ''అంతులేని ఆ యుద్ధంతో గ్రీకులు అలసిపోయారు.. మినర్వా సాయంతో ఒక నిర్మాణం చేశారు.. రాకాసి ఎత్తున్న ఓ గుర్రం ఆవిర్భవించింది''.

ఐనీస్, అతడి అనుచరులు ట్రాయ్ వదిలిపెట్టి ఇటలీ చేరుకున్నారు.

ట్రాయ్‌లో లభించిన కాంస్య యుగపు కుండ బ్రిటిష్ మ్యూజియంలోని ట్రాయ్ ప్రదర్శనలో ఉంది

ఫొటో సోర్స్, Claudia Plamp/ Staatliche Museen zu Berlin, Museum

ఫొటో క్యాప్షన్, ట్రాయ్‌లో లభించిన ఈ కాంస్య యుగపు కుండ బ్రిటిష్ మ్యూజియంలోని ట్రాయ్ ప్రదర్శనలో ఉంది

చేదు నిజాలు

ట్రోజన్ వార్ వాస్తవంగా జరిగిందని జనం నమ్మటంలో ఆశ్చర్యం లేదు. ఆ యుద్ధానికి సంబంధించిన చేదు వాస్తవాలను.. ఇలియడ్‌లో ఎంత వివరంగా అభివర్ణించారంటే.. అది ప్రత్యక్షంగా చూసి రాసిందే తప్ప, వేరే ఆధారాలతో రాసింది కాదని, నమ్మలేనంత వివరంగా ఉంటుంది.

నీటి సమీపంలో ఒక సైనికుడు చనిపోతాడు. ''ఈల్స్, చేపలు అతడి చుట్టూ మూగి.. అతడిని తినటంలో.. అతడి కిడ్నీల చుట్టూ ఉన్న కొవ్వును పీక్కు తినటంలో తలమునకలవుతాయి''. మార్టిన్ హమాండ్ తర్జుమా చేసినట్లు.. అచిలిస్ తన బల్లెంతో హెక్టార్‌ను ''కంఠ నాళంలో.. ఒక మనిషి ప్రాణాన్ని వేగంగా హరించే చోట పొడుస్తాడు''.

ట్రాయ్ నగరాన్ని కూడా.. ఆ పురాణంలో ఎంత వివరంగా అభివర్ణిస్తాడంటే.. పాఠకుడు ఆ అద్భుతమైన కోట గోడల మధ్యకి వెళ్లిపోకుండా ఉండలేడు.

హోమర్ వర్ణించిన ట్రాయ్‌ని వెదికి పట్టుకోవాలనే ప్రయత్నంలోనే.. సంపన్నుడైన ప్రష్యా వ్యాపారవేత్త హీన్రిస్ ష్కీల్మన్ 19వ శతాబ్దం చివరిలో నేటి టర్కీకి ప్రయాణమయ్యాడు.

ట్రాయ్ ప్రదేశం.. ఆధునిక టర్కీలోని పశ్చిమ తీరంలో హిసార్లిక్ దగ్గర ఉండవచ్చునని చెప్పటంతో.. అక్కడ తవ్వకాలు మొదలుపెట్టిన ష్కీల్మన్ ప్రాచీన సంపదలను పెద్ద సంఖ్యలో వెలికితీశాడు. వాటిలో చాలా వరకూ ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియం ప్రదర్శనలో ఉన్నాయి.

క్రీస్తు శకం ఒకటో శతాబ్దానికి చెందిన ఈ రోమన్ వెండి పాత్ర మీద అచిలిస్ పాత్రను చిత్రీకరించారు

ఫొటో సోర్స్, Roberta Fortuna and Kira Ursem/ National Museet De

ఫొటో క్యాప్షన్, క్రీస్తు శకం ఒకటో శతాబ్దానికి చెందిన ఈ రోమన్ వెండి పాత్ర మీద అచిలిస్ పాత్రను చిత్రీకరించారు

అక్కడ లభించిన ఆ ప్రాచీన సంపదల్లో చాలా వరకూ.. ట్రోజన్ వార్ జరిగిందని హోమర్ చెప్పిన కాంస్య యుగపు మలి దశకు చెందినవని అతడు తొలుత చెప్పాడు. కానీ.. నిజానికవి అంతకన్నా చాలా శతాబ్దాలు పురాతనమైనవి. అతడు ఖచ్చితమైన ప్రదేశంలోనే తవ్వకాలు జరిపాడు. చాలా మంది చరిత్రకారులు.. హిసార్లిక్ దగ్గర ప్రాచీన ట్రాయ్‌ని కనుగొనవచ్చునని అంగీకరించారు. ట్రాయ్ అనేది నిజమని భావించారు.

హిసార్లిక్ పురాతన పొరలో.. మంటలు అంటుకున్న దాఖలాలు, అక్కడ లభ్యమైన కొన్ని బాణాల మొనలు.. హోమర్ చెప్పిన ట్రోజన్ వార్ కాలానికి సరిపోయాయి. అక్కడ యుద్ధం జరిగిందనటానికి అవి నిదర్శనం కావచ్చు.

మధ్య టర్కీలో నివసించిన ప్రాచీన ప్రజలు హిటైట్లు.. ట్రాయ్ మీద వివాదానికి సంబంధించి రాసిన శాసనాలు కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. ట్రాయ్ నగరాన్ని వారు 'వులుసా' అని పిలిచారు. అయితే.. ఇవేవీ ట్రోజన్ వార్‌కి సాక్ష్యం కాదు. కానీ.. ఈ యుద్ధం నిజమని నమ్మేవారు ఈ ఆధారాలను స్వాగతిస్తారు.

ట్రోజన్ వార్ నిజంగా జరిగి ఉన్నట్లయితే.. హోమర్ కావ్యంలో ప్రధానంగా వర్ణించిన యుద్ధం కన్నా చాలా భిన్నంగా ఉండి ఉంటుంది. పురాతత్వ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఆ కోట చాలావరకూ చెక్కుచెదరకుండా ఉంది. అలాంటపుడు.. హోమర్ వర్ణించినంత భారీ స్థాయి యుద్ధం జరిగినట్లు.. పదేళ్ల పాటు కొనసాగినట్లు ఊహించటం కష్టం. అయితే.. హోమర్ యుద్ధంలోని సైనికుల ప్రవర్తన మానవ నైజంగానే, వాస్తవికంగానే కనిపిస్తుంది.

గాయపడ్డ అచిలిస్, 1825 - ఫిలిప్పో అల్బాసినీ శిల్పం

ఫొటో సోర్స్, Devonshire Collections, Chatsworth/ Chatsworth Set

ఫొటో క్యాప్షన్, గాయపడ్డ అచిలిస్, 1825 - ఫిలిప్పో అల్బాసినీ శిల్పం

యుద్ధంలో వాస్తవికతలను బలంగా చెప్పటానికి సార్వజనీన సంఘర్షణను మరింత గంభీరంగా మలచటం హోమర్ ప్రతిభ.

కాంస్య యుగపు యుద్ధ రంగంలో కార్యాచరణ గతిని ప్రభావితం చేసే దేవుళ్లు ఎవరూ ఉండి ఉండరు. అయితే.. రక్తసిక్తమైన యుద్ధంలో ఓడిపోతున్న పరిస్థితుల్లో ఉన్న వారు.. అక్కడ దేవుళ్లు ఉండి ఆ పని చేస్తున్నారని, పరిస్థితులు తమకు ప్రతికూలంగా మారాయని ఊహించుకుని ఉండవచ్చు. హోమర్.. నిత్య సత్యాలను ఈ కావ్యంలో అద్భుతంగా ఒడిసిపట్టాడు.

గ్రీకులు.. తాము రక్తసిక్త, అధమ ప్రపంచంలో నివసించటానికి గల వివరణను ట్రోజన్ వార్‌ వారసత్వంలో చూసుకున్నారు.

అచిలిస్, ఒడిస్సియస్ కథానాయకుల శకంలో జీవించారు. వారి శకం ఇప్పుడు అంతరించింది. మిగిలిందంతా.. రక్తదాహం మాత్రమే. ట్రోజన్ వార్‌లోని హీరోయిజం కానీ, యుద్ధ కౌశలం కానీ కాదు. ఆ యుద్ధపు తక్షణ పర్యవసానం కూడా హింసే. గ్రీకు విషాద రచయిత ఏషిలస్.. హోమర్ స్ఫూర్తితో రచించిన ఒక నాటకాన్ని లూయీ మాక్‌నీస్ తర్జుమా చేశాడు.

ట్రోజన్ వార్ నుంచి ఇంటికి వెళ్లే ప్రయాణంలో.. ఒడిస్సియస్ సైరెన్ల నుంచి తప్పించుకునే దృశ్యాన్ని క్రీస్తుపూర్వం 480-470 కాలానికి చెందిన ఈ ఎథీనియన్ కూజా మీద చిత్రించారు

ఫొటో సోర్స్, Trustees of the British Museum

ఫొటో క్యాప్షన్, ట్రోజన్ వార్ నుంచి ఇంటికి వెళ్లే ప్రయాణంలో.. ఒడిస్సియస్ సైరెన్ల నుంచి తప్పించుకునే దృశ్యాన్ని క్రీస్తుపూర్వం 480-470 కాలానికి చెందిన ఈ ఎథీనియన్ కూజా మీద చిత్రించారు

ట్రాయ్‌కి సముద్రమార్గంలో వెళ్లటానికి గాలి తనకు అనుకూలంగా మారటం కోసం దేవుళ్లను సంతోష పెట్టటానికి ''తన గొర్రెల మందలోని ఒక గొర్రె తల మాదిరిగా.. తన సొంత కుమార్తె ఇఫిజెనియాను బలి ఇచ్చిన'' తన భర్త అగామమ్నాన్‌ను క్లైటమ్నెస్ట్రా ఆ యుద్ధం తర్వాత హత్య చేయటాన్ని అందులో వర్ణించాడు.

వాస్తవంతో ఎంత సంబంధం ఉందనే దానితో నిమిత్తం లేకుండా.. ట్రోజన్ వార్ కల్పన.. గ్రీకుల మీద, మన మీద శాశ్వత ప్రభావం చూపింది.

ప్రాచీన కాలంలో జరిగిన యుద్ధంతో స్ఫూర్తి పొందిందైనా.. లేకపోతే కేవలం అద్భుతమైన కల్పనే అయినా.. అది ప్రపంచం మీద తన ముద్ర వేసింది. ఓ చారిత్రక ప్రాధాన్యత దానికి ఉండిపోయింది.

'ఆఫ్ గాడ్స్ అండ్ మెన్: 100 స్టోరీస్ ఫ్రమ్ ఏన్షియంట్ గ్రీస్ అండ్ రోమ్' పుస్తకం ఇటీవలే ప్రచురితమైంది.

ట్రోజన్ వార్

ఫొటో సోర్స్, Alamy

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)