ఒమన్ సుల్తాన్: సుదీర్ఘ కాలంపాటు దేశాన్ని ఏలారు.. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరు.. సీల్డ్ కవరులోని వారసుడి పేరు

ఒమన్ సుల్తాన్ కాబుస్ బిన్ సయీద్ అల్ సయీద్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సుల్తాన్ కాబుస్ బిన్ సయీద్ అల్ సయీద్ ఒమన్ రాజకీయాల్లో దాదాపు 50 ఏళ్లు ఆధిపత్యం చెలాయించారు

ఒమన్ సుల్తాన్ కాబుస్ బిన్ సయీద్ అల్ సయీద్ 79 ఏళ్ల వయసులో మృతిచెందారు. కాబూస్ అరబ్ ప్రపంచంలో అత్యంత సుదీర్ఘ కాలంపాటు సుల్తాన్‌గా ఉన్నారు.

ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఈయన ఒకరు.

ఒమన్ మీడియా వార్తల ప్రకారం సుల్తాన్ కాబుస్ శుక్రవారం సాయంత్రం మృతిచెందారు.

ఆయన గత నెలలో బెల్జియంలో చికిత్స చేయించుకుని స్వదేశానికి వచ్చారు. సుల్తాన్‌కు క్యాన్సర్ ఉందని కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సుల్తాన్ కాబూస్ 1970లో బ్రిటన్‌ మద్దతుతో తన తండ్రిని గద్దె దించి, సుల్తాన్ అయ్యారు. చమురు ద్వారా దేశానికి లభించే సంపాదనను ఆయన దేశాభివృద్ధి కోసం ఉపయోగించారు.

సుల్తాన్ కాబుస్ పెళ్లి చేసుకోలేదు. దాంతో, ఇప్పుడు ఆయనకు వారసుడు ఎవరూ లేరు.

సల్తనత్ నిబంధనల ప్రకారం సుల్తాన్ సింహాసనం ఖాళీ అయిన మూడు రోజుల్లోపు రాజ వంశానికి చెందిన కౌన్సిల్‌ కొత్త సుల్తాన్‌ను ఎన్నుకోవాలి. రాజ పరివార కౌన్సిల్‌లో సుమారు 50 మంది పురుష సభ్యులు ఉన్నారు.

కొత్త సుల్తాన్ ఎంపికపై రాజ కుటుంబంలో ఏకాభిప్రాయం రాకపోతే, రక్షణ కౌన్సిల్ సభ్యులు, సుప్రీంకోర్టు అధ్యక్షుడు, సలహా మండలి సభ్యులు, సుల్తాన్ కాబుస్ తనకు నచ్చిన కొత్త వారసుడి గురించి చెబుతూ రాసిన పత్రం ఉంచిన ఒక సీల్డ్ కవర్‌ను తెరుస్తారు. అందులో ఆయన చెప్పిన వ్యక్తినే తర్వాత సుల్తాన్‌గా చేస్తారు.

ఒమన్ సుల్తాన్ మృతి

ఫొటో సోర్స్, keystone

ఫొటో క్యాప్షన్, 29 ఏళ్లకే తండ్రిని గద్దె దించిన సుల్తాన్ కాబుస్

కొత్త సుల్తాన్ ఎవరు?

ఒమన్ సుల్తాన్ అయ్యే రేసులో కాబుస్ ముగ్గురు సోదరులు... సాంస్కృతిక మంత్రి హయ్యదమ్ బిన్ తారిక్ అల్ సయీద్, ఉప ప్రధాని అసద్ బిన్ తారీక్ అల్ సయీద్, ఒమన్ మాజీ నావికా దళ కమాండర్ శిహబ్ బిన్ తారిక్ అల్ సయీద్ ముందంజలో ఉన్నారు.

సుల్తాన్ అనేది ఒమన్ అత్యున్నత పదవి. దేశ ప్రధానమంత్రి, ఆర్మీ సుప్రీం కమాండర్, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రి పదవులు కూడా సుల్తాన్ దగ్గరే ఉంటాయి.

46 లక్షల మంది జనాభా ఉన్న ఒమన్‌లో 43 శాతం మంది ప్రవాసులే. ఒమన్ రాజకీయాల్లో దాదాపు ఐదు దశాబ్దాలుగా సుల్తాన్ కాబుస్ ఆధిపత్యం చెలాయించారు.

కాబుస్ 29 ఏళ్ల వయసులో తన తండ్రిని సుల్తాన్ పదవి నుంచి తొలగించి సింహాసనం ఆక్రమించారు. ఆయన తండ్రి సయీద్ బిన్ తైమూర్‌ను ఒక కరడుగట్టిన సంప్రదాయవాదిగా చెబుతారు. రేడియో వినడం, సన్ గ్లాసెస్ ధరించడం లాంటి వాటిపై ఆయన నిషేధం విధించారు. దేశంలో పెళ్లిళ్లు, విద్య, విదేశాలకు వెళ్లడం లాంటి అంశాల్లో కూడా నిర్ణయాలు తీసుకున్నారు.

తండ్రి తర్వాత సుల్తాన్ అయిన కాబుస్ వెంటనే తను ఆధునిక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానని, చమురు వల్ల వచ్చే డబ్బును దేశాభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆ సమయంలో ఒమన్‌లో కేవలం 10 కిలోమీటర్ల పక్కా రోడ్లు, మూడు స్కూళ్లు ఉండేవి.

ఒమన్ సుల్తాన్ మృతి

ఫొటో సోర్స్, Getty Images

ప్రజాదరణతోపాటూ వ్యతిరేకత కూడా

కాబుస్ విదేశాంగ విధానంలో ఒక తటస్థ మార్గాన్ని అనుసరించారు. 2013లో అమెరికా, ఇరాన్ మధ్య రహస్య చర్చలు జరపడానికి కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత రెండేళ్లకు చారిత్రక అణు ఒప్పందం జరిగింది.

సుల్తాన్ కాబుస్‌ను చరిష్మా ఉన్న నేతగా, దార్శనికుడుగా చెబుతారు. ఒమన్‌లో ఆయనకు చాలా ప్రజాదరణ ఉంది.

కానీ, కాబుస్‌ తన వ్యతిరేక గళాన్ని కూడా అణచివేశారు. 2011లో అరబ్ విప్లవం సమయంలో కాబుస్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి.

అప్పుడు, ఒమన్‌లో ఎలాంటి పెద్ద విప్లవాలూ రాలేదు. కానీ, మెరుగైన వేతనం, మరిన్ని ఉద్యోగాలు, అవినీతికి వ్యతిరేకంగా చాలామంది ఆందోళనలు చేశారు.

భద్రతా బలగాలు మొదట్లో నిరసన ప్రదర్శనలను పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత టియర్ గ్యాస్, రబ్బర్ బులెట్లు, ఆయుధాలతో ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

ఆ సమయంలో ఇద్దరు మృతిచెందారు. చాలామంది గాయపడ్డారు. చట్టవిరుద్ధంగా గుమిగూడి సుల్తాన్‌ను అవమానించినందుకు వందలాది మందికి శిక్షలు కూడా వేశారు.

ప్రజల నిరసన ప్రదర్శనల వల్ల ప్రత్యేకంగా ఎలాంటి మార్పూ రాలేదు. కానీ సుల్తాన్ కాబుస్ అవినీతిపరులను, చాలాకాలంగా మంత్రులుగా ఉన్న కొందరిని తొలగించారు. సలహా మండలి అధికారాలను పెంచారు. ప్రభుత్వ ఉద్యోగాలు పెంచుతానని హామీ ఇచ్చారు.

కాబుస్ ఆ తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించే స్థానిక పత్రికలను అణచివేశారని, సామాజిక కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని హ్యూమన్ రైట్స్ వాచ్ వివరాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)