కెన్యా: 47 మంది ప్రయాణికులను తీవ్రవాదుల దాడి నుంచి కాపాడిన బస్సు డ్రైవర్

"47 మంది ప్రయాణికులను తీవ్రవాదుల దాడి నుంచి కాపాడాను. అంత మాత్రాన నేను హీరోను కాదు. ఎందుకంటే, ప్రయాణికులంతా నా తల్లి, అన్న, చెల్లెళ్ల లాంటివారు. నాతో పాటు, నా ఆత్మీయులను రక్షించుకునేందుకు ఎలా ప్రత్నిస్తానో ఇప్పుడు అలాగే చేశాను" అని అంటున్నారు ఈ బస్సు డ్రైవర్.
జనవరి 2న తూర్పు కెన్యా ప్రాంతంలోని మొంబాసా, లాము పట్టణాల మధ్యలో రెండు బస్సులపై తీవ్రవాదులు దాడికి దిగారు. ఆ రెండింటిలో రేమండ్ జుమా నడుపుతున్న బస్సు కూడా ఉంది.
"భారీగా ఆయుధాలతో, సైనిక దుస్తుల్లో ఉన్న వ్యక్తులు రోడ్డు పక్కన ఒక మినీ వ్యానులో ఉన్నారు. ఒక్కసారిగా బయటకు వచ్చి గాల్లోకి కాల్పులు జరుపుతూ 'హేయ్... బస్సు ఆపు' అంటూ అరిచారు.
అది ఒక హారర్ సినిమాలా అనిపించింది. అయినా, నేను బస్సును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాను. నేను ఆపకపోయే సరికి వాళ్లు నేరుగా బస్సు మీద కాల్పులు జరపడం ప్రారంభించారు.
నేను బస్సును ఆపితే వాళ్లు నన్ను, ప్రయాణికులను ప్రాణాలతో వదలరని నాకు అర్థమైంది.
ఆ కాల్పులతో బస్సులో ఉన్నవారంతా భయంతో కేకలు వేస్తూ ఏడుస్తున్నారు. నేను బస్సు వేగం మరింత పెంచడంతో కొంతమంది బస్సులో పడిపోయారు.

అత్యంత భయంకరమైన అనుభవం
కొన్ని బుల్లెట్లు బస్సు అంచులను తాకుతూ వెళ్లాయి. కొన్ని టైర్లకు తగిలాయి. దాంతో ముందు టైర్లు పేలిపోయాయి. దాంతో 100 మీటర్ల దూరం వెళ్లి బస్సు ఆగిపోయింది.
బస్సు ఆగగానే ప్రయాణికులు ప్రాణాలను కాపాడుకునేందుకు కిటికీల నుంచి బయటకు దూకి పరిగెత్తడం ప్రారంభించారు. తలోవైపు పరుగులు తీశారు. కొందరు అడవిలోకి వెళ్లారు.
నేను కూడా వేగంగా పరిగెత్తాను. గంట పాటు ఆగలేదు. ఆఖరికి మరో బస్సు డ్రైవర్ చూసి నాకు లిఫ్ట్ ఇచ్చారు. నా జీవితంలో అత్యంత భయానక ఘటన అది. దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డాం.
అదృష్టం కొద్దీ మా బస్సు బోల్తా పడలేదు. చివరికి అందరమూ ప్రాణాలతో బయటపడ్డాం. కానీ, మా వెనకాల వస్తున్న రెండో బస్సు డ్రైవర్ మాత్రం తీవ్రవాదుల నుంచి తప్పించుకోలేకపోయారు" అని రేమండ్ జుమా వివరించారు.

ఫొటో సోర్స్, Reuters
కండక్టర్‌ను చంపేశారు
ఆ తీవ్రవాదులను చూసి భద్రతా సిబ్బంది కావచ్చు, తనిఖీ చేసేందుకు ఆపుతున్నారు అని రెండో బస్సు డ్రైవర్ అనుకున్నారు. వాళ్లు అడ్డగించగానే ఆయన బస్సును ఆపేశారు. అప్పుడు ఆ బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు.
"అందరినీ తీవ్రవాదులు కిందికి దింపేశారు. అందరూ ముస్లిం షహాదా (విశ్వాస ప్రకటన) చదివి వినిపించాలని ఆదేశించారు. చదవని వారిని అక్కడే కాల్చి చంపేశారు" అని రెండో బస్సు డ్రైవర్ హెమెద్ బీబీసీతో చెప్పారు.
తాను భయంతో వణుకుతూ షహాదా వినిపించానని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఆ బస్సులో ముగ్గురిని తీవ్రవాదులు కాల్చి చంపారు. మృతుల్లో బస్సు కండక్టర్ కూడా ఉన్నారు. మరికొంతమంది గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ దాడికి పాల్పడిన తీవ్రవాదులు సోమాలియా కేంద్రంగా పనిచేస్తున్న అల్- షబాబ్ అనే మిలిటెంట్ గ్రూపుకు చెందినవారు అయ్యుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గత కొన్నేళ్లుగా అల్- షబాబ్ జిహాదీ గ్రూపు రోడ్ల మీద ఈ తరహా దాడులు చేస్తోంది.
సోమాలియాలో ఈ తీవ్రవాద గ్రూపుతో పోరాడేందుకు కెన్యా బలగాలు ఆఫ్రికన్ యూనియన్ ఫోర్స్‌లో భాగంగా పనిచేస్తున్నాయి.
తన భూభాగంపై పట్టు కోల్పోయిన ఈ మిలిటెంట్ సంస్థ, అప్పుడప్పుడు సరిహద్దుల వెంట గెరిల్లా తరహా దాడులు చేస్తోంది. జనవరి 5న కెన్యా- అమెరికా సైనిక స్థావరంపై దాడికి దిగింది. ఆ దాడిలో ముగ్గురు అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు.
అల్- షబాబ్ జరిపిన దాడుల్లో వందలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.

ఫొటో సోర్స్, AFP
ఈ మిలిటెంట్ గ్రూపు సభ్యులను ఏరివేసేందుకు 2015 నుంచి కెన్యా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య జరుగుతున్న సంఘర్షణతో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి.
అక్కడ పనిచేసేందుకు ఉపాధ్యాయులు, నర్సులు భయపడుతున్నారు. దాంతో, మారుమూల గ్రామాల్లో పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటోంది.
భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య ఏళ్ల తరబడి సాగుతున్న ఘర్షణల కారణంగా అనేక మంది సామాన్య కుటుంబాలు ఇళ్లు, పొలాలను వదిలేసి ప్రాణ భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








