'అవి వాడొద్దు', ప్రపంచవ్యాప్తంగా కొన్ని బేబీ ఉత్పత్తులను రీకాల్ చేసిన నెస్లే సంస్థ.. విష పదార్థాలే కారణమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆర్చీ మిచెల్
- హోదా, బిజినెస్ రిపోర్టర్
తమ సంస్థకు చెందిన కొన్ని బేబీ ఫార్ములా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రముఖ సంస్థ నెస్లే ప్రకటించింది. ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే విష పదార్థాలు కలిగి ఉన్నాయనే ఆందోళనల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
తమ ఎస్‌ఎమ్ఏ బేబీ ఫార్ములా సహా దాన్ని పోలిన(ఫాలో- ఆన్) ఫార్ములాలోని కొన్ని నిర్దిష్ట బ్యాచ్‌ల ఉత్పత్తులను శిశువులకు తినిపించడం సురక్షితం కాదని నెస్లే సంస్థ తెలిపింది.
ఈ బ్యాచ్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యాయని, వాటిలో సెరూలైడ్(cereulide) అనే పదార్థం ఉండే అవకాశముందని నెస్లే చెప్పింది. ఈ సెరూలైడ్ వికారం, వాంతులకు కారణం కావొచ్చని పేర్కొంది.
ఈ ఉత్పత్తుల కారణంగా అనారోగ్యనికి గురైనట్లు ఇప్పటివరకు ఎలాంటి రిపోర్టులు రాలేదని, అయితే.. "ముందుజాగ్రత్త చర్యగా" వాటిని రీకాల్ చేసినట్లు ఆ సంస్థ తెలిపింది.

"శిశువుల భద్రత, శ్రేయస్సే మా తొలి ప్రాధాన్యం" అని నెస్లే తెలిపింది.
"తల్లిదండ్రులు, సంరక్షకులు, వినియోగదారులకు కలిగిన ఆందోళనకు, అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం" అని పేర్కొంది.
ఈ రీకాల్ ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తుందని నెస్లే సంస్థ బీబీసీకి ధ్రువీకరించింది. ప్రభావిత ఉత్పత్తులను ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, డెన్మార్క్, ఇటలీ, స్వీడన్ సహా వివిధ యూరోపియన్ దేశాల్లో విక్రయించారు.
ఇతర నెస్లే ఉత్పత్తులు, ఇతర బ్యాచ్‌లకు చెందిన ఇవే ప్రొడక్టులు తినేందుకు సురక్షితమేనని, వాటిని రీకాల్ చేయలేదని నెస్లే సంస్థ స్పష్టం చేసింది.
వినియోగదారులకు డబ్బులు తిరిగి చెల్లిస్తామని నెస్లే సంస్థ హామీ ఇచ్చింది. తమ సరఫరాదారుల్లో ఒకరు అందించిన ముడిపదార్థం కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు కంపెనీ పేర్కొంది.
గిగోజ్, నిడాల్ బేబీ ఫార్ములాకు చెందిన కొన్ని నిర్దిష్టమైన బ్యాచ్‌లను "నివారణ చర్యగా, స్వచ్ఛందంగా" రీకాల్ చేస్తున్నట్లు నెస్లే ఫ్రాన్స్ తెలిపింది.
జర్మనీలో ఈ ఫార్ములా ఉత్పత్తలను బెబా, అల్ఫామినో పేరుతో పిలుస్తారు.
యూకేలో ప్రభావిత ఉత్పత్తుల బ్యాచ్ నంబర్లు నెస్లే యూకే వెబ్‌సైట్ లేదా food.gov.uk వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
పౌడర్ ఉత్పత్తులకు సంబంధించి డబ్బా లేదా టిన్‌కు కిందివైపున సంబంధిత కోడ్‌ను వినియోగదారులు చూడాలని నెస్లే సంస్థ సూచించింది. అలాగే రెడీ-టు-ఫీడ్ ఫార్ములాకు సంబంధించిన ఉత్పత్తల ఔటర్ బాక్స్ కిందివైపున, కంటెయినర్ పక్కవైపున లేదా పైభాగాన చూడవచ్చని సూచించింది.
ఏమిటీ సెరూలైడ్?
సెరూలైడ్ అనేది కొన్ని బ్యాసిల్లస్ సెరియస్ బ్యాక్టీరియా స్ట్రెయిన్ల కారణంగా ఉత్పత్తయ్యే ఓ విషపదార్థం. ఇది ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలకు దారితీస్తుంది. దీన్ని తిన్న వెంటనే వాంతులు, కడుపులో నొప్పి వంటివి వచ్చే అవకాశముంది.
వేడి నీళ్లతో కలిపినా, లేదా పిల్లల పాలతో కలిపినా ఇది విచ్ఛిన్నం కావడం, క్రియారహితంగా మారడం వంటివి జరగవని ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ(ఎఫ్ఎస్ఏ) హెచ్చరించింది.
తల్లిదండ్రులు, సంరక్షకులు, పిల్లల బాగోగులు చూసేవారు ఈ ప్రభావిత ఉత్పత్తులను శిశువులకు లేదా చిన్న పిల్లలకు తినిపించవద్దని ఎఫ్ఎస్ఏ హెడ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జేన్ రాలింగ్ చెప్పారు.
"ముందస్తు చర్యలో భాగంగా ప్రభావిత ఉత్పత్తులను అమ్మకాల నుంచి తొలగించేందుకు అత్యవసర చర్యలు తీసుకుంటున్నామని తల్లిదండ్రులు, సంరక్షులకు మరోసారి చెప్పాలనుకుంటున్నా" అని ఆమె అన్నారు.
"ఒకవేళ ఎవరైనా దీనిని పిల్లలకు తినిపించినట్లయితే.. వారి ఆరోగ్యంపై అదెలా ప్రభావం చూపుతుందోనన్న ఆందోళనలు ఉంటే.. వెంటనే మీ జీపీ(జనరల్ ప్రాక్టీషనర్)ని లేదా ఎన్‌హెచ్ఎస్ 111కి కాల్ చేసి వైద్య నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి" అని ఆమె సూచించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














