మన మొదటి అడుగులు, మొదటి మాటలు మనకి ఎందుకు గుర్తుండవు?

పిల్లలు, జ్ఞాపకాలు, బాల్యస్మృతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చిన్నప్పటి విషయాలను పిల్లలు గుర్తుంచుకోలేరు.
    • రచయిత, మారియా జాకారో
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

పుట్టినరోజులు, మొదటి అడుగులు, మొదటి మాటలు మన జీవితంలో ముఖ్యమైనవి. కానీ మనమెందుకు వాటిని గుర్తుపెట్టుకోలేం?

న్యూరోసైంటిస్టులు, సైకాలజిస్టులు దశాబ్దాలుగా ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునేందుకు శ్రమిస్తున్నారు.

చిన్ననాటి ఘటనలు గుర్తుంచుకోలేకపోవడానికి ఇన్ఫెంటైల్ అమ్నేసియా (చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు జరిగిన వాటిని గుర్తుపెట్టుకోలేని స్థితి) కారణం. ఈ పరిస్థితిని వివరించడానికి చాలాకాలం నుంచి అనేక సిద్ధాంతాలను ప్రతిపాదిస్తున్నారు.

సంవత్సరాలుగా విభిన్న సిద్ధాంతాలను ముందుకు తెస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పిల్లలు, జ్ఞాపకాలు, బాల్యస్మృతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చిన్నప్పటి విషయాలు ఎందుకు గుర్తుండవనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి.

గుర్తుంచుకుని మర్చిపోతామా? అసలు గుర్తే ఉండవా?

అసలు చర్చ రెండు ప్రధాన ప్రశ్నల చుట్టూ తిరుగుతుందని అమెరికాలోని యేల్ యూనివర్శిటీలో సైకాలజీ, న్యూరోసర్జరీ ప్రొఫెసర్ నిక్ టర్క్-బ్రౌన్ చెప్పారు.

మనం చిన్నప్పుడు ఏవైనా విషయాలను గుర్తుంచుకుని తర్వాత వాటిని మర్చిపోతామా? లేకపోతే పెద్దయ్యే దాకా మనకసలు ఏమీ గుర్తుండదా?

పిల్లలకు అసలు ఎలాంటి జ్ఞాపకాలుండవని గత దశాబ్దంలో పరిశోధకులు అంచనాకు వచ్చారని ప్రొఫెసర్ టర్క్-బ్రౌన్ చెప్పారు.

తమను తాము గుర్తుంచుకోవడంగానీ, మాట్లాడడంగానీ వారికి గుర్తు ఉండదని కొందరు సైంటిస్టులు అంటున్నారు.

నాలుగేళ్ల వరకు మనకు ఎలాంటి జ్ఞాపకాలూ ఏర్పడవని, మెదడులో జ్ఞాపకాలను ఏర్పరిచే భాగం హిప్పోకాంపస్ అప్పటికి పూర్తిగా ఏర్పడదన్నది ఓ సిద్ధాంతం.

''చిన్నతనంలో హిప్పోకాంపస్ పరిమాణం వేగంగా పెరుగుతుంది. కానీ, ఆ సమయంలో అవసరమైన న్యూరల్ సర్క్యూట్‌లు అందుబాటులో లేకపోవడంతో చిన్ననాటి అనుభవాలు గుర్తుంచుకోలేకపోవచ్చు''అని ప్రొఫెసర్ టర్క్-బ్రౌన్ చెప్పారు.

పిల్లలు, జ్ఞాపకాలు, బాల్యస్మృతి

ఫొటో సోర్స్, Science Photo Library via Getty Images

ఫొటో క్యాప్షన్, పిల్లలకు అసలు ఎలాంటి జ్ఞాపకాలుండవని కొందరు శాస్త్రవేత్తలంటున్నారు.

పిల్లల మెదడులో ఏం జరుగుతుందంటే..

అయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రొఫెసర్ టర్క్-బ్రౌన్ చేసిన అధ్యయనం భిన్నమైన ఫలితాలను చూపించింది.

ఇందులో నాలుగు నెలల నుంచి రెండు సంవత్సరాల మధ్య వయస్సున్న 26 మంది పిల్లలకు అనేక ఫోటోలు చూపించారు. అదే సమయంలో, హిప్పోకాంపస్ కార్యకలాపాలను గమనించడానికి వారి మెదళ్లను స్కాన్ చేశారు.

ఆ తర్వాత ఈ పిల్లలకు పాత, కొత్త ఫోటోలను కలిపి చూపించారు.

పిల్లలు ఏ ఫోటోను ఎక్కువసేపు చూశారో తెలుసుకోవడానికి పరిశోధకులు వారి కంటి కదలికలను గమనించారు.

పిల్లలు పాత ఫోటోను ఎక్కువసేపు చూస్తే, వారు దానిని గుర్తుంచుకున్నారనే దానికి రుజువుగా పరిగణించేవారు. ఈ విషయాన్ని గత అధ్యయనాలలో కూడా గుర్తించారు.

పిల్లలు మొదటిసారి ఒక చిత్రాన్ని చూసినప్పుడు, ఆ సమయంలో వారి హిప్పోకాంపస్ మరింత చురుగ్గా ఉంటే, ఆ చిత్రాన్ని తర్వాత గుర్తుంచుకునే అవకాశాలు పెరుగుతాయని పరిశోధనలో తేలింది.

ఈ ప్రభావం.. ముఖ్యంగా 12 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో కనిపించింది.

దాదాపు ఏడాది వయస్సు వచ్చేప్పటికి, హిప్పోకాంపస్ జ్ఞాపకాలను ఏర్పరుచుకుంటుందని ఇది స్పష్టం చేసింది.

పిల్లలు, జ్ఞాపకాలు, బాల్యస్మృతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పిల్లల జ్ఞాపకాలకు సంబంధించి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

జ్ఞాపకాలు ఎక్కడికి వెళ్తాయి?

హిప్పోకాంపస్‌లో శిశువులు జ్ఞాపకాలను ఏర్పరచుకోగలరా? లేదా? అన్నది అర్థం చేసుకోవడానికి తమ బృందం చేసిన అధ్యయనం మొదటి అడుగని, అయితే మరిన్ని పరిశోధనలు అవసరమని ప్రొఫెసర్ టర్క్-బ్రౌన్ చెప్పారు.

"ఈ జ్ఞాపకాలు మనకు గుర్తుండిపోతే, అవి ఎక్కడికి వెళ్తాయి? అవి ఇప్పటికీ ఉన్నాయా? మనం వాటిని తిరిగి గుర్తుతెచ్చుకోగలమా?''అన్నది ప్రశ్న.

2023లో జరిగిన ఓ అధ్యయనంలో చిన్న వయసులోనే చిట్టడవిని నేవిగేట్ చేయడం నేర్చుకున్న ఎలుకలు పెద్దయ్యాక దాన్ని మరచిపోతాయని తేలింది.

కానీ, నేర్చుకోవడంతో సంబంధం ఉన్న హిప్పోకాంపస్ భాగాన్ని శాస్త్రవేత్తలు యాక్టివేట్ చేసినప్పుడు, జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి.

మానవ శిశువుల విషయంలో కూడా ఇంతేనా? వారి జ్ఞాపకాలు ఎక్కడో ఉండిపోయాయా? అనే దానికి సమాధానం ఇంకా తెలియదు.

చిన్నపిల్లలు కనీసం మాట్లాడటం ప్రారంభించేప్పటికి జ్ఞాపకాలను ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని యూకేలోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కేథరీన్ చెప్పారు.

"చిన్న పిల్లలు నర్సరీ నుంచి తిరిగి వచ్చి ఏం జరిగిందో మనకు చెప్తుంటారు. కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత వారు మళ్లీ అవే విషయాలను చెప్పలేకపోతున్నారు. జ్ఞాపకాలు ఏర్పడతాయని ఇది స్పష్టంగా చూపిస్తుంది, కానీ అవి ఎక్కువ కాలం ఉండవు" అని ఆమె అంటున్నారు.

"కాలక్రమేణా మనం ఆ జ్ఞాపకాలు ఉంచుకోగలుగుతామా లేదా, అవి మసకబారిపోతాయా, లేక మనం తిరిగి గుర్తుతెచ్చుకోగలిగేంత బలంగా ఉంటాయా అనేదే అసలు ప్రశ్న''అని ఆమె అంటున్నారు.

పిల్లలు, జ్ఞాపకాలు, బాల్యస్మృతి

ఫొటో సోర్స్, ullstein bild via Getty Images

ఫొటో క్యాప్షన్, చిన్నప్పటి విషయాలు పెద్దయ్యాక గుర్తుండవు.

జ్ఞాపకాలు అబద్ధం కూడా కావొచ్చా?

మన మొదటి జ్ఞాపకాలు నిజంగా నిజమో కాదో తెలుసుకోవడం దాదాపు అసాధ్యం కాబట్టి, ఇన్ఫెంటైల్ అమ్నేసియాను అర్థం చేసుకోవడం చాలా కష్టమని ప్రొఫెసర్ కేథరీన్ అన్నారు.

ఉదాహరణకు, చాలా మంది పెద్దయ్యేటప్పుడు చిన్ననాటి సంఘటన లేదా కొన్ని క్షణాలు గుర్తొచ్చినట్టు భావిస్తుంటారు.

కానీ, అలాంటి జ్ఞాపకాలు నిజమైన అనుభవాలతో ముడిపడి ఉండే అవకాశం చాలా తక్కువని ఆమె అంటున్నారు.

"జ్ఞాపకశక్తి ఎల్లప్పుడూ పునర్నిర్మాణ రూపం" అని ఆమె చెప్పారు. "మనకు ఒక సంఘటన గురించి సమాచారం అందితే, మన మెదడు పూర్తిగా నిజమైనదిగా భావించే జ్ఞాపకాన్ని సృష్టించగలదు."

"వాస్తవానికి ఇది స్పృహకు సంబంధించిన ప్రశ్న. అత్యంత కష్టమైన విషయం ఏంటంటే, స్పృహ అంటే ఏంటన్నది స్పష్టంగా చెప్పగలగడం'' అని ఆమె అన్నారు.

ఇన్ఫెంటైల్ అమ్నేసియా రహస్యం మన గుర్తింపుతో లోతుగా ముడిపడి ఉందని ప్రొఫెసర్ టర్క్ బ్రౌన్ చెప్పారు.

"ఇది మన గుర్తింపులో భాగం" అని ఆమె అంటున్నారు.

"మన జీవితపు తొలినాళ్లలో మనకు ఏమీ గుర్తుండదనే ఆలోచన ప్రజలు తమ గురించి ఆలోచించే విధానాన్ని మారుస్తుంది" అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)