భార్య తల్లితో భర్త వివాహేతర సంబంధం: సంచలనం సృష్టిస్తున్న ఇండోనేషియా సినిమా

ఫొటో సోర్స్, Netflix
- రచయిత, కోహ్ ఇవ్, రైనా ఇబ్రహీం
- హోదా, బీబీసీ ప్రతినిధులు
కొన్నినెలలుగా ఇండోనేషియా ప్రజలు ఓ సినిమా గురించి చాలా ఎక్కువగా చర్చిస్తున్నారు. ఆ సినిమా పేరు నోర్మా.
కథేంటంటే ప్రశాంతంగా ఉన్న ఓ మహిళ వైవాహిక జీవితం, తన తల్లితో ఆమె భర్త రహస్యంగా సాగించిన సంబంధంతో కకావికలమవుతుంది.
మెలోడ్రామా కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది ఎప్పుడూ ఆకర్షణీయ కథాంశమే. అయితే నోర్మాను జాతీయస్థాయిలో అందరూ మాట్లాడుకునేలా చేసింది మాత్రం...నిజ జీవిత కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కడమే. గతంలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది.
ఇండోనేషియా జావా ఐలాండ్‌లోని సెరాంగ్ నగరానికి చెందిన నోర్మా రిస్మా అనే మహిళ 2022లో ఒక టిక్‌టాక్ వీడియో చేశారు. ఆ వీడియోలో ఆమె తన భర్తకు, తన తల్లికి ఉన్న సంబంధం గురించి చెప్పారు.
ఆమె వీడియోకు చాలా కొద్దికాలంలోనే లక్షలాది వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా, ఆమెకు ఒక సినిమా ఒప్పందం కుదిర్చింది. ఆ సినిమా దక్షిణాసియా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.


ఫొటో సోర్స్, Netflix
వైరల్ విషయాలే కథాంశాలు
నోర్మా సినిమా మార్చిలో ఇండోనేషియా థియేటర్స్‌లో విడుదలయింది. ఆగస్టులో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. కొన్నిరోజులకే ఆ సినిమా ఎక్కువ మంది చూసిన సినిమాల జాబితాలో నిలిచింది. ఇండోనేషియాలోనే కాదు మలై ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే మలేసియా, సింగపూర్‌లో కూడా.
సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాలను సినిమాలుగా తీస్తే హిట్టవుతాయని ఇండోనేషియా ఫిల్మ్ మేకర్లు భావించే విన్నింగ్ ఫార్ములానే ఈ మూవీ విషయంలోనూ ఫాలో అయ్యారు.
జూన్ వరకు ఇండోనేషియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా కెకెఎన్ ది దేశా పెనారి. ఇది 2022లో తెరకెక్కిన హారర్ సినిమా.
ఎక్స్‌లో పాపులర్ అయిన థ్రెడ్ ద్వారా రూపొందిన కథాంశం. ఆరుగురు యూనివర్శిటీ విద్యార్థులను వెంటాడే హారర్ కథ. ఎక్స్‌లోనే షేర్ అయిన మరో స్టోరీతో రూపొందిన సెవు డినో 2023లో ప్రేక్షకాదరణ పొందిన ఇంకో హారర్ సినిమా.
వివాదాస్పదంగా ఉండే కథలు ఇండోనేషియాలో బాగా ప్రజాదరణ పొందుతున్నాయి. 2024లో వచ్చిన ఐపర్ అదాలహ్ మౌట్ అనే సినిమా ఓ వ్యక్తికి, ఆయన మరదలితో ఉన్న సంబంధం ఆధారంగా తెరకెక్కింది.
టిక్‌టాక్ వీడియో నుంచి తీసుకున్న నిజ జీవిత కథ ఇదని ప్రచారం చేశారు. 2022 డ్రామా సిరీస్ లయంగన్ పుటుస్ అనే సినిమా కూడా భర్త మోసం వల్ల చెల్లాచెదురైన కుటుంబం గురించి. ఇది కూడా టిక్‌టాక్ నుంచి తీసుకున్నదే.

ఫొటో సోర్స్, Netflix
గాసిప్‌లపై ఆసక్తి
వ్యభిచారం జైలుశిక్ష పడే నేరంగా భావించే ఇండోనేషియాలో ఇలాంటి అంశాలపై సమాజంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. వచ్చే ఏడాది అమల్లోకి రానున్న కొత్త క్రిమినల్ కోడ్ వివాహేతర శృంగారాన్ని నేరంగా పరిగణిస్తుంది. బాగా సంప్రదాయంగా ఉండే ప్రావిన్స్‌లో పెళ్లికి ముందు శారీరక సంబంధంలో ఉన్న జంటలను అందరిముందు కొరడాలతో కొట్టే సంస్కృతి ఇప్పటికే ఉంది.
మతపరంగా సంప్రదాయబద్ధంగా ఉండే ఇలాంటి సంస్కృతిలో ఇళ్లల్లో జరిగే వివాదాస్పద ఘటనలపై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటిచుట్టుపక్కల వాళ్లు చెప్పుకునే గాసిప్‌లా ఉండే విషయాలు సోషల్ మీడియా వల్ల వైరల్ కంటెంట్‌గా మారాయి. ఇండోనేషియాలో దీన్ని ''పెలాకర్'' అనే పదంతో వర్ణిస్తున్నారు.
ఇలాంటి వ్యవహారాలు నడిపే భర్తల గురించి చెప్పడానికి ఇండోనేషియన్లు తమ భాషలో వాడే ఓ యాస పదం పెలాకర్. అలాంటి భర్తల గురించి చెప్పే భార్యలు ఈ కీవర్డ్ ఉపయోగిస్తారు.
‘‘ఇలాంటి కథలతో రూపొందిన సినిమాల వల్ల పక్కింటివారి సమస్యల్లోకి తొంగి చూసే అవకాశం మరొకరికి కలుగుతోంది’’ అని జకార్తా ఆర్ట్స్ కౌన్సిల్ ఫిల్మ్ కమిటీ సభ్యులు ఎస్ఎం గైట్టీ తంబునన్ బీబీసీతో చెప్పారు.
''ప్రత్యేకించీ సంప్రదాయ సమాజంలో ప్రజలకు ఇలాంటి విషయాలు తెలుసుకోవడంపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Dee Company
క్లైమాక్స్ సీన్‌తో కన్నీళ్లు
జకర్తాకు చెందిన వెరో వయసు 42 ఏళ్లు. టిక్‌టాక్‌లో వైరల్ అయినప్పటినుంచి ఆమె నోర్మా కథను ఫాలో అవుతున్నారు. భర్త ఆమె తల్లితో సంబంధం పెట్టుకోవడం తనకు చాలా కోపం తెప్పించిందని బీబీసీతో చెప్పారు వెరో.
''ఈ కథను సినిమాగా తీస్తున్నారని తెలిసినప్పుడు వాళ్లిద్దరూ నోర్మాతో ఎంత క్రూరంగా ప్రవర్తించారో చూడాలని నాకనిపించింది'' అని ఆమె అన్నారు.
తన ఇంటి బయట గుమికూడిన జనంలోనుంచి తప్పించుకుంటూ నోర్మా లోపలికి వెళ్లి గదిలో భర్తను అర్ధనగ్నంగా తల్లితో కలిసి చూసిన క్లైమాక్స్ సీన్‌లో ఆమె ఏడ్చారు.
నోర్మా భర్త, తల్లి మొదట్లో తమ ఆలోచనలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ తర్వాత ప్రేమలో పడతారు. ఈ సున్నితమైన సీన్లు తెరకెక్కిన విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అదే సమయంలో ఆకట్టుకుంటాయి.
ఆ జంట ముద్దుపెట్టుకుంటున్న దృశ్యంపై ఓ టిక్‌టాక్ యూజర్ ఇలా కామెంట్ చేశారు. ''ఇది చిత్రీకరించిన తర్వాత కచ్చితంగా వాళ్లు అసౌకర్యానికి గురై ఉంటారు'' అని రాశారు.
సినిమాలో వారిద్దరినీ ప్రత్యక్షంగా పట్టుకుని, వారి సంబంధం గురించి తెలుసుకున్న ఓ స్నేహితురాలు వాంతులు చేసుకుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
‘మగవాళ్లకు శిక్ష పడడం లేదు’
మోసం చేసిన భర్తలు కంటే భార్యలను నిందించే ప్రమాదకర సంస్కృతి ఈ కథలతో పెరుగుతోందని గైట్టీ హెచ్చరిస్తున్నారు. భర్త, ప్రియురాలి మధ్య కథల్లో మగవారికి ఎలాంటి శిక్షలు పడడం లేదని ఆమె అన్నారు.
నోర్మా సినిమా ప్రత్యేకతేంటంటే ఇందులోని ప్రధాన పాత్రధారి సినిమా సృజనాత్మకత సంబంధించిన విషయాల్లో భాగమయ్యారని స్క్రీన్ రైటర్ ఒకా ఔరోరా బీబీసీతో చెప్పారు.
ఐపర్ అదాలహ్ మౌట్, లయంగన్ పుటుస్ వంటి సినిమాల స్క్రిప్ట్ కోసం కూడా ఆమె పని చేశారు. ఇవి రెండు కూడా టిక్ టాక్ వీడియోల ఆధారంగా తీసిన సినిమాలే.
నోర్మా ఫీలింగ్స్ గురించి, ఆమె తల్లి గురించి చర్చించిన తర్వాత మూల కథాంశం సినిమాలా విస్తృతమైనదని భావించినట్టు ఒకా చెప్పారు. అయితే ప్రేక్షకుల ఎమోషన్స్‌కు తగ్గట్గుగా కొన్ని భాగాలను మరింత నాటకీయంగా మార్చామని తెలిపారు.
''ప్రేక్షకుల భావోద్వేగాలకు తగ్గట్టుగా ఉండడమే కాకుండా, సరదా అనుభూతి ఇచ్చే సినిమా ఇది. సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకులు బయటకు వెళ్తూ అనుభూతితో మాట్లాడుకునే విషయాలు ఇందులో ఉన్నాయి'' అని ఒకా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నోర్మా జీవితం
ప్రస్తుతం సెరాంగ్‌లో ఔట్ సోర్సెడ్ వర్కర్‌గా నోర్మా పనిచేస్తున్నారు. అది ఆమె సొంతూరు.
వివాహేతర సంబంధం నేరంలో ఎనిమిది నెలల జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆమె తల్లి రిహాన్హా కుటుంబంతో కలిసి జీవించేందుకు ఇంటికి తిరిగి వచ్చారు. నోర్మా మాజీ భర్త రోజీకి తొమ్మిది నెలల శిక్ష పడింది.
మోసపోయిన భార్యల నుంచి తనను ప్రోత్సహిస్తూ మెసేజ్‌లు వచ్చాయని ఫిబ్రవరిలో ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో నోర్మా చెప్పారు.
''ఆ సంబంధం గురించి నాకు తెలిసినప్పుడు నాకు దగ్గరి వ్యక్తి చేతిలో నేనెందుకు మోసపోయాను? నాకొక్కదానికే ఈ అనుభవం ఎదురయిందా?'' అని అనిపించింది.
''నేను బయటకు చెప్పిన తర్వాత చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్న విషయం నాకర్ధమయింది'' అని నోర్మా తెలిపారు.
ఈ సినిమా వెనక ఓ సందేశం ఉందని స్క్రీన్ రైటర్ ఒకా చెప్పారు. ''తాము ఎదర్కొంటున్న హింస, మోసాన్ని బయటకు చెప్పడానికి మహిళలు ముందుకొచ్చేలా చేసే ఓ చిన్న అడుగు'' అని ఆమె అన్నారు.
ఇంట్లో సమస్యలులాంటి నిజమైన కథలను ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కే నోర్మాలాంటి సినిమాలు మహిళల సాధికారితకు చోటు కల్పిస్తాయని, పితృస్వామ్యవ్యవస్థలో వారు ధైర్యంగా మాట్లాడే అవకాశాన్నిస్తాయని గైట్టీ చెప్పారు.
తన జీవితం వివరాలు సోషల్ మీడియా అకౌంట్‌లో పంచుకుంటున్నప్పటికీ ఇంటర్వ్యూ కోసం బీబీసీ ఇండోనేషియా ప్రయత్నించగా నోర్మా తిరస్కరించారు.
సోషల్ మీడియాలో ఇండోనేషియన్ల నుంచి ఆమెకు మంచి మద్దతుంది.
సినిమా ప్రొడక్షన్ కంపెనీ పంపిన కేక్‌కు సంబంధించిన ఫోటోలను ఈ నెలలో ఆమె టిక్‌టాక్‌లో పోస్టు చేశారు. అనేకమంది ఆమెను అభినందించారు.
''మీరు దీనికి అర్హురాలు'' అని ఓ యూజర్ రాశారు.
''నోర్మా, సినిమాలో మీ జీవిత కథ చూసిన తర్వాత నాకు నిజంగా మిమ్మల్ని హత్తుకోవాలని ఉంది'' అని మరో యూజర్ కామెంట్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














