రహస్య సంబంధాలు కోరుకునే కోట్లమంది డేటా లీక్, తర్వాత ఏం జరిగిందంటే...

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, PA

    • రచయిత, అటహువల్పా అమెరైజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"జీవితం చాలా చిన్నది, అడ్వెంచర్ చేయండి" ఈ నినాదంతో, యాష్లే మ్యాడిసన్ వెబ్‌సైట్ ప్రపంచవ్యాప్తంగా వివాహేతర సంబంధం కోరుకునే/దానికోసం ప్రయత్నించే కోట్లమందిని ఆకర్షించింది.

అయితే, కొందరు హ్యాకర్లు ఇందులో లాగిన్ అయినవారి పర్సనల్ డేటాను, 3 కోట్ల మందికి పైగా యూజర్ల రహస్యాలను బహిర్గతం చేయడం తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.

దీని కారణంగా పెళ్లిళ్ల విచ్ఛిన్నాలు, సామాజిక బహిష్కరణలు, ఆత్మహత్యల వంటి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

టోబి పాటన్ దర్శకత్వం వహించిన "యాష్లే మ్యాడిసన్: సెక్స్, లైస్ అండ్ స్కాండల్స్" అనే మూడు-భాగాల డాక్యుమెంటరీ మినీ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.

ఈ డాక్యుమెంటరీ, చరిత్రలో అత్యంత మోసపూరితమైన డేటింగ్ ప్లాట్‌ఫామ్ గురించి వివరిస్తుంది.

యాష్లే మ్యాడిసన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యాష్లే, మ్యాడిసన్ అనేవి అమెరికాలో రెండు కామన్ పేర్లు.

యాష్లే మ్యాడిసన్ అంటే ఏమిటి?

"డాట్ కామ్స్" పెరిగి, మనుషుల రోజువారీ జీవితంలో ఇంటర్నెట్ ఒక విడదీయలేని భాగంగా మారుతున్న కాలంలో, కెనడాకు చెందిన డారెన్ జె. మోర్గెన్‌స్టెర్న్ అనే వ్యక్తి వివాహేతర సంబంధాలలో ఆసక్తి ఉన్న స్త్రీ, పురుషుల నుంచి మంచి మార్కెట్‌ను సాధించవచ్చని గుర్తించారు.

2002లో ఆయన యాష్లే మ్యాడిసన్ అనే పోర్టల్‌ను స్థాపించారు. దీనిలో యూజర్లు తమ పరిసర ప్రాంతాలో తమలాంటి అభిప్రాయాలే కలిగిన వారితో సంబంధాలు ఏర్పరచుకోవడం కోసం వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, తమ లైంగిక ప్రాధాన్యతలను ఆ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు.

దీనిలో యూజర్లయిన మహిళలు ఇతర సభ్యులతో ఉచితంగా మాట్లాడవచ్చు. అయితే, పురుషులు మాత్రం క్రెడిట్‌లను కొనుగోలు చేయాలి.

ఇదంతా కొన్నేళ్ల పాటు రహస్యంగా సాగిన తర్వాత, 2007లో కంపెనీ కొత్త సీఈఓగా నోయెల్ బిడర్మన్ బాధ్యతలు స్వీకరించారు. బిడర్మన్ నైపుణ్యం, దూకుడు, వివాదాస్పద మార్కెటింగ్ వ్యూహాలతో యూజర్ల సంఖ్యను పెంచారు.

యాష్లే మ్యాడిసన్ బిల్‌బోర్డు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యాష్లే మ్యాడిసన్ వ్యాపార ప్రకటన

అయితే, చాలా నెట్‌వర్క్‌లు యాష్లే మ్యాడిసన్ ప్రకటనలను ప్రసారం చేయడానికి నిరాకరించాయి. దీంతో బిడర్మన్ అమెరికాలోని టీవీ స్టూడియోలలో చర్చల్లో పాల్గొంటూ, వివాహ సంబంధాలపై అక్రమ సంబంధాలు సానుకూల ప్రభావాన్నే చూపుతాయంటూ సంచలనాత్మక ప్రకటనలు చేయడం ప్రారంభించారు.

దీనికితోడు వెబ్‌సైట్‌లు, మీడియా, బిల్‌బోర్డ్‌‌లపై రెచ్చగొట్టే ప్రకటనలతో ఈ సైట్ అనేక మంది దృష్టిని ఆకర్షించింది.

మీడియా దృష్టిలో పడ్డాక, ఆ ప్లాట్‌ఫామ్ అనేక దేశాలకు విస్తరించి, కోట్లాది డాలర్ల లాభాలను ఆర్జించింది. ఒకానొక సమయంలో తమకు మూడున్నర కోట్ల మంది పైగా యూజర్లు ఉన్నారని ఆ ప్లాట్‌ఫామ్ పేర్కొంది.

అయితే, ఇది అనైతికమని, సంప్రదాయ కుటుంబ విలువలకు ప్రమాదకరమని అనేక మంది భావించడంతో దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.

కానీ, ఇవేవీ నిర్వాహకులను ఇబ్బంది పెట్టలేదు. ‘‘చెడు ప్రచారం అంటూ ఏమీ లేదు, ఏ ప్రచారమైనా మంచిదే’’ అని ఈ డాక్యుమెంటరీలో ఒకరు అనడం దీనికి రుజువు.

యాష్లే మ్యాడిసన్ డాట్ కామ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2015లో ది ఇంపాక్ట్ టీమ్ అని పిలిచే ఒక బృందం యాష్లే మ్యాడిసన్ సిస్టమ్‌ సర్వర్‌లలోకి ప్రవేశించి, దాదాపు మొత్తం సమాచారాన్ని హ్యాక్ చేసి దొంగలించింది.

హ్యాకింగ్ ఎందుకు జరిగింది?

ఈ పోర్టల్ తమ వినియోగదారుల వ్యక్తిగత డేటాను రక్షించే విషయంలో సంపూర్ణ విచక్షణ, కఠినమైన గోప్యతా విధానం, అత్యధిక భద్రతా ప్రమాణాలుంటాయని వాగ్దానం చేసింది.

అయితే, ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు ఇదంతా నిజంకాదని, సంస్థ భద్రతా ప్రమాణాలు అంత పటిష్టంగా లేవని డాక్యుమెంటరీలో ఒప్పుకున్నారు.

2015లో ది ఇంపాక్ట్ టీమ్ అని పిలిచే ఒక బృందం యాష్లే మ్యాడిసన్ సిస్టమ్‌ సర్వర్‌లలోకి ప్రవేశించి, దాదాపు మొత్తం సమాచారాన్ని దొంగిలించింది.

30 రోజుల్లోగా ఆ వ్యాపారాన్ని శాశ్వతంగా మూసివేయకపోతే, డార్క్ వెబ్‌లో ఆ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం పబ్లిష్ చేస్తామని యాష్లే మ్యాడిసన్‌ను హెచ్చరించింది.

ఇంపాక్ట్ టీమ్ వెనకాల ఉన్న వ్యక్తులను కనిపెట్టడానికి పలు ఉద్దండులైన హ్యాకర్లతో చేసిన అనేక ప్రయత్నాలు విఫలం అయ్యాక కూడా యాష్లే మ్యాడిసన్ బ్లాక్‌ మెయిల్‌కు దిగి రాలేదు.

దీంతో, ఇంపాక్ట్ టీమ్‌ ఈ డేటాను డార్క్ వెబ్‌లో లీక్ చేసింది.

డార్క్ వెబ్‌లో లీక్ అయిన సుమారు 3 కోట్ల మందికి పైగా వ్యక్తుల డేటాలో పేర్లు, ఫోటోలు, చిరునామాలు, ఈమెయిల్‌లు, వాళ్ల లైంగిక ప్రాధాన్యతలు ఉన్నాయి.

మరో డేటా డంప్‌లో యూజర్ల సన్నిహిత చిత్రాలు, క్రెడిట్ కార్డ్ నంబర్‌లు, ప్రైవేట్ సమాచారం ఉన్నట్లు తేలింది.

లీక్‌ అయిన ఇమేజ్

ఫొటో సోర్స్, NETFLIX

ఫొటో క్యాప్షన్, సామ్, నియా రాడర్‌ల జీవితాలను మార్చిన యాష్లే మ్యాడిసన్ లీక్‌ అయిన ఫోటో

వేధింపులు, కక్ష సాధింపు చర్యలు

ఈ సమాచారం మొత్తం డార్క్ వెబ్ నుంచి చాలావేగంగా ప్రజలకు యాక్సెస్ ఉన్న ఇంటర్నెట్ పేజీలపైకి వచ్చింది. ఒక వ్యక్తి ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తే చాలు, అతను యాష్లే మ్యాడిసన్‌ని ఉపయోగించారా లేదా అని తెలుసుకోవచ్చు.

ఈ ప్లాట్‌ఫామ్ ప్రధాన మార్కెట్ అయిన అమెరికాలో, అనేక మంది భార్యాభర్తలు, బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లు ఇలాంటి సంబంధాలు ఉన్నాయేమో వెతకడానికి ప్రయత్నించడంతో ఇది వేధింపులకు, కక్ష సాధింపు చర్యలకు దారి తీసింది.

టెక్సస్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్‌లు సామ్, నియా రాడర్‌ల విషయంలో అదే జరిగింది. అతను యాష్లే మ్యాడిసన్‌లో వివాహేతర సంబంధాల కోసం ప్రయత్నించినట్లు తేలడంతో వాళ్ల వివాహ బంధం ప్రమాదంలో పడింది.

ఖచ్చితమైన డేటా లేకున్నా, యాష్లే మ్యాడిసన్ యూజర్ల సమాచారాన్ని ప్రచురించడం వల్ల అమెరికా, ఇతర దేశాలలో అనేక జంటల వివాహాలు విచ్ఛిన్నమయ్యాయి.

న్యూ ఓర్లీన్స్‌కు చెందిన పాస్టర్, సెమినేరియన్ అయిన జాన్ గిబ్సన్ వంటి కొందరు వ్యక్తులకు ఇలాంటి సైట్లలో సభ్యత్వం ఉందని తెలియడంతో ఆయన సంఘ బహిష్కరణను ఎదుర్కొని చివరకు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన భార్య తెలిపారు.

అయితే మరొక జంట డేటింగ్ సైట్‌తో తమకు లాభం జరిగిందని, దాని వల్ల పలువురితో సంబంధాల విషయంలో తమకు ప్రోత్సాహం లభించిందని అన్నారు.

యాష్లే మ్యాడిసన్‌ యూజర్లలో దాదాపు 40% మంది మహిళలు ఉన్నట్లు తెలిసింది. అయితే, అది వాస్తవమైన సంఖ్య కాదన్న విమర్శలున్నాయి. పురుషులను ఆకర్షించడానికి, వాళ్లు క్రెడిట్‌లను కొనుగోలు చేసేలా ప్రేరేపించేలా సంస్థే చాలా నకిలీ ప్రొఫైల్‌లు లేదా బాట్‌లను సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.1600 చెల్లిస్తే వారి డేటాను శాశ్వతంగా తొలగిస్తామని కూడా ఆ సంస్థ చెప్పినా, ఇది తప్పని, 2015 హ్యాక్‌లో ఈ డేటా సైతం లీక్ అయ్యిందని వెల్లడైంది.

ఇంపాక్ట్ టీమ్, యాష్లే సీఈఓ నోయెల్ బిడర్మన్‌కు చెందిన ప్రైవేట్ ఈమెయిల్‌లనూ ప్రచురించింది.

ఆయన పలు టెలివిజన్ డిబేట్‌లలో తనకు భార్యతో తప్ప వేరే సంబంధాలు లేవని పేర్కొన్నారు. కానీ, ఆయనకూ అనేక అక్రమ సంబంధాలు ఉన్నాయన్న విషయం బహిర్గతమైంది.

నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌‌పై చేపట్టిన ప్రమోషన్ చిత్రం

ఫొటో సోర్స్, NETFLIX

ఫొటో క్యాప్షన్, నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌‌పై చేపట్టిన ప్రమోషన్ చిత్రం

యాష్లే మ్యాడిసన్‌కు ఏమైంది?

2015లో హ్యాకింగ్ దెబ్బకు బిడర్మన్‌ సీఈఓ పదవి నుంచి వైదొలిగారు.

యాష్లే మ్యాడిసన్‌పై మోసం, నష్టపరిహారం ఫిర్యాదులు న్యాయస్థానాలలో వెల్లువెత్తాయి. వీటి విలువ మొత్తం 90 కోట్ల రూపాయలు. దీనిని పలువురు బాధితులకు పంపిణీ చేశారు. కానీ ఆ ప్లాట్‌ఫామ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

దాని యజమానులు మారారు. అది ప్రపంచంలో "నంబర్ వన్ మ్యారీడ్ డేటింగ్ యాప్"గా ప్రచారం చేసుకుంటూ, తమకు అనేక దేశాలలో 8 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్నారని పేర్కొంటోంది.

సాధ్యమైనంత వరకు నైతిక సమస్యలను చర్చించకుండా, సమతుల్యంగా చూపించడానికి ప్రయత్నించినట్లు ఈ డాక్యుమెంటరీ దర్శకుడు టోబీ పాటన్ తెలిపారు.

"యాష్లే మ్యాడిసన్‌లో ఉన్న వ్యక్తులను మందలించడం కంటే, వాళ్లు ఎందుకు ఆ సైట్‌కి ఆకర్షితులయ్యారు అనే దానిపై మాకు ఎక్కువ ఆసక్తి ఉంది. వాళ్లు దేని కోసం వెతుకుతున్నారు? వాళ్ల వివాహ సంబంధాలలో ఏం జరుగుతోంది? మరీ ముఖ్యంగా, దీనిపై వాళ్ల భాగస్వామి ప్రతిస్పందన ఏమిటి అన్నది తెలుసుకోవాలి" అని పాటన్ అన్నారు.

"వివాహ సంబంధంలో మోసం చేయడం మంచిదికాదని, బాధాకరమైనదని మనందరికీ తెలుసు. కానీ అదే సమయంలో, యాష్లే మ్యాడిసన్‌లో 3 కోట్ల 70 వేల మంది సభ్యులు ఉన్నారనే వాస్తవం మనందరికీ తెలిసిన మరొక విషయం చెబుతుంది: ‘జీవితాంతం ఒకే వ్యక్తికి కట్టుబడి ఉండటం నిజంగా చాలా కష్టమైన విషయం’

ఇంత జరిగినా, లక్షలాది జంటల వివాహపు పునాదులను కదిలించిన ఆ హ్యాకింగ్‌కు పాల్పడిన వ్యక్తులు ఎవరో మాత్రం ఇప్పటికీ తెలియదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)