డీప్‌ఫేక్ : ‘నా బెస్ట్ ఫ్రెండే నా ఫోటోలను పోర్న్ చిత్రాలుగా మార్చారు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కేట్ వెస్ట్
- హోదా, బీబీసీ
హెచ్చరిక: ఈ కథనంలో అభ్యంతరకమైన భాష, లైంగికహింస వివరణలు ఉన్నాయి
ఎవరినీ నమ్మలేని కాలం వచ్చిపడింది. పక్కనే ఉంటారు. అన్ని విషయాలలో మన వెన్నంటే ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడు స్పందిస్తుంటారు. అలాంటివారు కూడా నమ్మకద్రోహం చేస్తారంటే నమ్మలేం. కానీ నమ్మితీరాలి. జోడీ కూడా ఇలాగే నమ్మాల్సి వచ్చింది. ఇంతకీ జోడీ కథేమిటి, ఆమె ఫోటోలను డీప్‌ఫేక్ చేసి పోర్న్ సైట్లలో పోస్ట్ చేసింది ఎవరు?
తన ఫోటోలను డీప్‌ఫేక్ పోర్న్ కోసం వాడుకున్నారని గ్రహించిన జోడీ, దీనికి కారణమైన వ్యక్తిని గుర్తించినప్పుడు దిగ్భ్రాంతి చెందినట్టు బీబీసీకి తెలిపారు.
2021, వసంతకాలం..
జోడీకి (పేరు మార్చాం) గుర్తుతెలియని ఈమెయిల్ ఖాతా నుంచి ఓ పోర్న్ వెబ్‌సైట్ లింక్ వచ్చింది.
దానిని క్లిక్ చేసిన ఆమెకు అనేకమంది పురుషులతో తాను సెక్స్‌లో పాల్గొన్నట్టుగా ఫోటోలు, వీడియో కనిపించాయి. మరో మహిళ శరీరానికి జోడీ ముఖాన్ని కంప్యూటర్ ద్వారా జోడించారు. దీనినే డీప్ ఫేక్ అని పిలుస్తున్నారు.
ఇలా జోడీ ముఖాన్ని డీప్‌ఫేక్ చేసిన ఫోటోలను కొందరు అశ్లీల చిత్రాల వెబ్‌సైట్‌లో పోస్టు చేసి, ఆమె తమ లైంగిక వాంఛలను ప్రేరేపించిందని పేర్కొంటూ.. ఆమె నకిలీ (ఫేక్) బూతు చిత్రాలను తయారుచేయగలరా? అని సైట్‌లోని ఇతర వినియోగదారులు అడిగారు.
‘‘నేను చాలా భయపడిపోయాను. ఏడ్చాను. నేనేం చదివానో, నేనేం చూశానో వాటి గురించి నేనేం చేయగలనే విషయం తెలుసుకోవడానికి పిచ్చిపట్టినట్టుగా నా ఫోన్‌ను స్క్రోల్ చేశాను’’ అని మొదటిసారి తన డీప్‌ఫేక్ వీడియోలను చూసినప్పుడు కలిగిన అనుభవాన్ని జోడీ వివరించారు.
‘‘ఇది నా జీవితాన్ని నాశనం చేస్తుందని తెలుసు’’ అని ఆమె తెలిపారు.
అశ్లీల చిత్రాల వెబ్‌సైట్‌ను బలవంతంగా చూడాల్సి వచ్చిన జోడీకి ప్రపంచం తలకిందులైపోయిన భావన కలిగింది.
కానీ, అలా తన ఫోటోలను చూస్తున్నప్పుడు ఓ ఫోటో దగ్గర ఆమెకో భయంకరమైన విషయం అర్థమైంది.

ఫొటో సోర్స్, SENSITY
సెక్స్‌వర్కర్ అంటూ పోస్టింగ్‌లు
జోడీ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు.
నిజానికి ఇది ఏళ్ళ తరబడి అజ్ఞాత వ్యక్తులు చేస్తున్న అన్‌లైన్ దుర్వినియోగానికి పరాకాష్ఠ.
జోడి టీనేజ్‌లో ఉన్నప్పుడు తన అనుమతి లేకుండా తన ఫోటోలను, పేరును డేటింగ్ యాప్స్‌లో వాడుతున్నారని కనిపెట్టారు.
తన ఫేస్‌ను వాడి డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలు సృష్టించిన వ్యక్తి ఎవరో తెలుసుకునే క్రమంలో ఆమెకు కలచివేసే విషయాలు తెలిశాయి.
ఇది ఏళ్ళ తరబడి కొనసాగింది. 2019లో తనను లండన్‌లోని లివర్‌పూల్ స్ట్రీట్ స్టేషన్‌లో డేట్ కోసం కలుస్తానంటూ ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఆమెకు ఫేస్‌బుక్ సందేశం కూడా వచ్చింది.మీరునుకుంటున్న వ్యక్తిని తాను కాదని జోడీ ఆ వ్యక్తికి తెలిపింది.
కానీ ఆ వ్యక్తికి డేటింగ్‌యాప్‌లో తన ఫోటోలు చూశారని, తరువాత తనను ఫేస్‌బుక్‌లో కనిపెట్టారని అర్థం చేసుకున్న జోడీ కుంగుబాటుకు గురయ్యారు.
యూకేలో 2020 లాక్‌డౌన్ సమయంలో జోడీని సెక్స్‌వర్కర్‌గా పేర్కొంటూ అనేక ట్విటర్ ఖాతాలలో ఆమె ఫోటోలు పోస్ట్ అవుతున్నాయని ఓ స్నేహితురాలు జోడీని హెచ్చరించారు.
జోడీ బికినీలో ఉన్న ఫోటోను ఆమె ప్రైవేటు సోషల్ మీడియా ఖాతానుంచి తీసుకుని, ‘‘టీనేజర్ జోడీతో మీరేం చేయాలనుకుంటున్నారు’’ అనే శీర్షికతో ఆ ఫోటోను పోస్టు చేశారు.
ఇలాంటి చిత్రాలను పోస్ట్ చేసే ఖాతాలు ‘స్లట్ ఎక్స్‌పోజర్’, ‘చీఫ్ పెర్వ్’ పేరుతో ఉన్నాయి.
తాను క్లోజ్‌ఫ్రెండ్స్, కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపిన క్షణాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, ఆ చిత్రాలను ఇలా దుర్వినియోగం చేశారు.
దీంతోపాటు యూనివర్సిటీలోనూ, తన సొంతనగరం కేంబ్రిడ్జిలో తనకు తెలిసిన ఇతర మహిళల ఫోటోలు కూడా ఈ ఖాతాలలో పోస్ట్ అవుతున్న విషయాన్ని ఆమె గ్రహించారు.
‘‘ ఆ క్షణంలో నేనే దీనంతటికి కేంద్రబిందువుగా ఉన్నానని, ఈ వ్యక్తి ఎవరో నన్ను బాధించాలని చూస్తున్నాడని నాకు బలంగా అనిపించింది’’ ఆని జోడీ చెప్పారు.

తీగ లాగితే..
తాను చూసిన చిత్రాలలోని తాము డైజీ అని పిలిచే సన్నిహిత మిత్రురాలి సహా ఇతర మహిళలను జోడీ కలుసుకున్నారు.
‘‘ఒక్కసారిగా నవనాడులు కుంగిపోయినట్టు అనిపించింది’’ అని డైజీ చెప్పారు.
స్నేహితురాళ్ళందరూ కలిసి తమ ఫోటోలను పోస్ట్ చేస్తున్న ఇతర ట్విట్టర్ ఖాతాలను కనిపెట్టారు.
‘‘మేం ఎక్కువ ఖాతాలు చూస్తున్న కొద్దీ పరిస్థితి మరింత దారుణంగా కనిపించింది’’ అని చెప్పారు డైజీ.
తమ ఫోటోలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటూ ఆమె ట్విట్టర్ ఖాతాదారులను అడిగారు. తమకు అజ్ఞాత వ్యక్తుల నుంచి షేర్ చేయమంటూ ఆఫోటోలు వచ్చాయని సమాధానం లభించింది.
‘‘ఇది మీ మాజీ బాయ్‌ఫ్రెండ్ లేదా మీ మీద ఆగ్రహం ఉన్న వ్యక్తి పని అయి ఉండొచ్చు’’ అని ఓ వినియోగదారుడు సమాధానమిచ్చారు.
డైజీ, జోడీ కలిసి తమను సోషల్ మీడియాలో ఎవరు ఫాలో అవుతున్నారు, అలాగే తమ ఫోటోలను ఎవరు యాక్సెస్ చేయగలరనే వారి జాబితాను తయారు చేశారు.
ఇది జోడీ బాయ్‌ఫ్రెండ్ పనేనని అందరూ నిర్థరించారు. జోడీ అతనితో గొడవడి, అతనిని బ్లాక్ చేసేసింది.
కొన్ని నెలలపాటు సోషల్ మీడియాలో వీరి ఫోటోలు పోస్ట్ చేయడం ఆగిపోయింది. దీని తరువాత ఆమెను అజ్ఞాత ఈమెయిలర్ సంప్రదించాడు.
‘‘అజ్ఞాతంలో ఉన్నందుకు మన్నించండి. ఇతనెవరో కమ్యూనిటీ గ్రూపులలో మీ ఫోటోలు పోస్ట్ చేయడం చూశాను. ఇది భయంకరమైన విషయమని తెలుసు’’ అని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు.
మెయిల్‌లోని లింక్‌ను జోడీ క్లిక్ చేయగానే అది ఆన్‌లైన్ వేదిక రెడిట్‌కు తీసుకువెళ్ళింది. అక్కడ జోడీ, ఆమె ఇద్దరి స్నేహితురాళ్ళ ఫోటోలు 1, 2,3 నెంబర్లతో పోస్టు చేసి ఉన్నాయి.
ఈ ముగ్గురిలో మీరు ఎవరితో సెక్స్‌లో పాల్గొంటారు, లేదా ఎవరిని చంపుతారు అంటూ ఓ గేమ్ ఆడేందుకు ఇతరులను ఆహ్వానిస్తూ ఈ ఫోటోలను పోస్ట్ చేశారు.
అప్పటికే వాటికి కింద 55 మంది కామెంట్స్ పెట్టారు.
ఆ సైట్‌లో ని ఫోటోలు ఈ మధ్యవే. పైగా డైజీ తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను బ్లాక్ చేసిన తరువాతే పోస్ట్ అయినవి. దీంతో తాము ఇంతకాలం ఎవరి గురించో తప్పుగా అనుకుంటున్నామని వారు అర్థం చేసుకున్నారు.
ఆరువారాల తరువాత ఆ ఈమెయిలర్ మరోసారి వీరితో టచ్‌లోకి వచ్చారు. కాకపోతే ఈ సారి డీప్‌ఫేక్ గురించి చెప్పడానికి..

నమ్మక ద్రోహం
తమ జాబితా తయారుచేసుకున్న తరువాత జోడీ, డైజీ ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టేశారు. తాము ఎవరినైతో కుటుంబంగా భావించామో, పూర్తిగా నమ్మామో అతనే ఈ పనికి పాల్పడినట్టు గుర్తించారు. అతను జోడీ బెస్ట్ ఫ్రెండ్ అలెక్స్ ఊల్ఫ్.
శాస్త్రీయ సంగీతంపై తమకు ఉన్న మక్కువ కారణంగా జోడీ, అలెక్స్ టీనేజర్లుగా ఉన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉన్నారు.
పైగా తన అనుమతి లేకుండా తన పేరును, ఫోటోలను డేటింగ్ యాప్స్‌లో వాడుతున్నప్పుడు జోడీ, ఊల్ఫ్ నుంచి ఓదార్పు కోరుకున్నారు.
ఊల్ఫ్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి మ్యూజిక్‌లో డబుల్ ఫస్ట్ (ఒకేసారి రెండు వేర్వేరు సబ్జెక్టులలో ఫస్ట్ క్లాస్‌లో పాసవడం) సాధించారు. అలాగే 2012 సంవత్సరానికి గానూ బీబీసీ యంగ్ కంపోజర్ అవార్డు పొందారు. 2021లో మాస్టర్‌మైండ్ టెలివిజన్ షోలోనూ దర్శనమిచ్చారు.
‘‘మహిళలు ఇంటర్నెట్‌లో ఎదుర్కొనే సమస్యలపై ఆయనకు (ఊల్ఫ్)కు చాలా అవగాన ఉండేది’’ అని జోడీ చెప్పారు.
జోడీ తన డీప్‌ఫేక్ అసభ్య ఫోటోలను తరచి తరచి చూసినప్పుడు ఒక ఫోటోలో తన వెనుక కేంబ్రిడ్జిలోని కింగ్స్ కాలేజీ ఉన్నట్టుగా గమనించారు.
ఆ ఫోటో ఎప్పుడు తీసిందనే విషయం ఆమెకు బాగా గుర్తుంది. ఆ ఫోటోలో ఊల్ఫ్ కూడా ఉన్నారు. ఆ ఫోటోను జోడీ కేవలం ఊల్ఫ్‌కు మాత్రమే షేర్ చేశారు.
‘‘నా జీవితంపై ఇదెంత లోతైన ప్రభావాన్ని చూపుతుందో ఆయనకు తెలుసు’’ అని జోడీ చెప్పారు.

‘సిగ్గు పడుతున్నా’
జోడీ సహా 15 మంది మహిళల చిత్రాలను సోషల్ మీడియా నుంచి తీసుకుని అశ్లీల వెబ్‌సైట్స్‌లో పోస్టు చేసినందుకు గానూ 2021 ఆగస్టులు ఊల్ఫ్ (26) దోషిగా తేలారు.
ఆయనకు 20 వారాల జైలు శిక్షతో పాటు బాధితులందరికీ 100 పౌన్ల చొప్పున పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నట్టు ఊల్ఫ్ బీబీసీకి చెప్పారు.
తన చర్యలకు క్షమాపణలు కోరుతున్నట్టు ఆయన బీబీసీకి చెప్పారు.
‘‘ప్రతి రోజూ నేను వారికి కలిగించిన బాధ గురించే ఆలోచిస్తున్నాను. ఇది నిస్సందేహాంగా నన్ను జీవితాంతం వెంటాతూనే ఉంటుంది’’ అని చెప్పారు.
‘‘నేను చేసిన పనికి నిష్కృతి లేదు. ఆ సమయంలో నేనెందుకు ఇంత నీచంగా వ్యవహరించానో వివరించలేను’’ అని ఆయన చెప్పారు.
కానీ తనపై అభియోగాలు మోపే ముందు జోడీ ఎదుర్కొన్న వేధింపులతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఊల్ఫ్ చెప్పారు.
అయితే తన స్నేహితుడే ఈ పనికి పాల్పడటమనేది ‘‘పూర్తిగా అవమానం, నమ్మకద్రోహం’’ అని జోడీ చెప్పారు.
‘‘ఈ విషయంలో నేను ఆయనతో పంచుకున్న ప్రతి విషయం గుర్తుంది. ఆయన నాకు ఎంతగానో మద్దతుగా నిలిచారు. నన్ను సౌకర్యవంతంగా ఉండేలా చేశారు. నా పట్ల చాలా దయ చూపేవారు. కానీ ఇదంతా అబద్ధమని తెలిసిపోయింది’’ అని జోడీ చెప్పారు.
మా ఫోటోల పోస్టింగ్ గురించి మేం ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) ను, రెడిట్ ను సంప్రదించాం. ఎక్స్ స్పందించలేదు. కానీ రెడిట్ ప్రతినిధి మాత్రం అనుమతి లేకుండా ఇలాంటి సన్నహిత చిత్రాలకు రెడిట్ వేదికపై చోటు లేదని, సబ్‌రెడిట్ గ్రూపును, పోర్న్ సైట్ ను కూడా తొలగించినట్టు చెప్పారు.
ఆన్‌లైన్ రక్షణ బిల్లులో భాగంగా అక్టోబర్ 2023లో డీప్‌ఫేక్ చిత్రాలను షేర్ చేయడం నేరంగా పరిగణించారు.
ఆన్‌లైన్‌లో కుప్పలు తెప్పలుగా డీప్ ఫేక్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. వీటిల్లో 98శాతం అశ్లీలమైనవే అని తాజా పరిశోధనలు కనుగొన్నాయి.
అయితే డీప్‌ఫేక్ తయారుచేయమని ఇతరులను కోరే వ్యక్తిని నేరస్తుడిగా భావించని కొత్త చట్టంపై జోడీ కోపంగా ఉన్నారు. ఆలెక్స్ ఊల్ఫ్ ఈ పనే చేశారు. డీప్ ఫేక్ తయారీ అక్రమం కూడా కాదు.
‘‘ఇది వేలాది మంది మహిళలను బాధిస్తుంది. ఎవరూ కూడా ఇలాంటి పనులకు పాల్పడకుండా ,మనకు తగిన చట్టాలు, యంత్రాంగం ఉండాలి’’ అంటారు జోడీ.
ఇవి కూడా చదవండి :
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- తెల్ల గుడ్లు, ఎర్ర గుడ్లు: వేటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్: పింఛన్లు ఇంకా అందకపోవడానికి అసలు కారణమేంటి? ఈసీ ఏం చెప్పింది?
- కుప్పం నియోజకవర్గానికి నీళ్లొచ్చాయా? రాలేదా? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










