పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?

బియ్యంలో పురుగులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దిగవల్లి పవన్ కాంత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇంట్లో నిల్వ చేసుకునే బియ్యానికి పురుగులు ఎందుకు పడతాయి? పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే నిపుణులు చెబుతున్న చిట్కాలేంటి?

ఇంట్లో అన్నం వండుకునే ముందు బియ్యాన్ని శుభ్రం చేసుకుంటాం. బియ్యానికి పురుగు పట్టినా, లేదా అందులో మట్టి వంటి వ్యర్థాలున్నా వాటిని తొలగించేందుకు చెరగుతాం.

సాధారణంగా ఇళ్లల్లో బియ్యాన్ని నెల రోజుల నుంచి సంవత్సర వరకు నిల్వ చేసుకుంటారు. అలాంటప్పుడు బియ్యానికి పురుగులు పడుతుంటాయి.

బియ్యం

ఫొటో సోర్స్, Getty Images

బియ్యానికి పురుగులు ఎందుకు పడతాయి?

నిల్వ చేసిన ధాన్యాలకు సాధారణంగా నుసి పురుగులు, ముక్కు పురుగులు, లద్ది పురుగులు పడుతూ ఉంటాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ వెలువరించే పాడిపంటలు పత్రిక చెబుతోంది.

ఈ పురుగులు ధాన్యం గింజలను గుల్ల చేస్తాయి, ధాన్యానికి రంధ్రం చేసి, పొడి చేస్తాయి. ఇలా పొడిగా అయిన బియ్యాన్ని శుభ్రం చేయడం కాస్త కష్టమే అవుతుంది. పైగా పురుగులు పట్టిన బియ్యాన్ని శుభ్రం చేసుకుని తినడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తాయని కొందరు వైద్యులు చెబుతున్నారు.

సిరిధాన్యాలతో పోల్చి చూసినపుడు వరి, గోధుమలకు పీచు పదార్థం ఉన్న కవచం తక్కువగా ఉంటుంది. దీని కారణంగానే వరి, గోధుమలు నిల్వ చేసినపుడు పురుగులు ఎక్కువగా పడతాయని సిరిధాన్యాల నిపుణుడు డాక్టర్ ఖాదర్ వలీ బీబీసీతో చెప్పారు.

‘’సిరిధాన్యాల పొట్టులో పీచు పదార్థం కవచంలా పనిచేస్తున్న కారణంగా 30 ఏళ్లైనా కూడా వాటికి పురుగులు రావు. కానీ బియ్యం, గోధుమలకు ఈ పీచు కవచం చాలా పలుచగా ఉంటుంది కాబట్టి వీటికి సులభంగా పురుగులు పడతాయి’’ అని డాక్టర్ ఖాదర్ వలీ వివరించారు.

నల్ల బియ్యం

ఫొటో సోర్స్, Getty Images

దంపుడు బియ్యం, నల్ల బియ్యానికీ పురుగులు పడతాయా?

ఎలాంటి బియ్యంలోనైనా ఫైబర్ మోతాదు చాలా తక్కువగానే ఉంటుందని ఖాదర్ వలీ చెబుతున్నారు. పీచు పదార్థం తక్కువ ఉన్నప్పుడు ఆ ధాన్యం సహజంగానే బలహీనంగా ఉంటుందని ఆయన అన్నారు.

‘’దంపుడు బియ్యం, నల్ల బియ్యం అనేవి ఒరిజినల్ బియ్యం వెరైటీలు. కాబట్టి పాలిష్డ్ బియ్యం కన్నా పదిరెట్లు మేలు. అంతే కానీ మొత్తంగా బియ్యం వెరైటీలు ఏవైనా సరే జబ్బులను నయం చేసే శక్తి వాటికి ఉండదు’’ అని డాక్టర్ ఖాదర్ వలీ చెప్పారు.

వెల్లుల్లి

ఫొటో సోర్స్, Getty Images

బియ్యానికి పురుగులు పట్టకుండా ఏం చేయాలి?

పురుగుల సమస్యను ఎదుర్కోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. ముందుగా బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలోకానీ, దాని చుట్టూ కానీ తేమ లేకుండా చూసుకోవాలి. తేమ కారణంగా పురుగులు పడతాయని హోమియోపతి డాక్టర్ టీ ఇందిరా చెప్పారు.

బియ్యం నిల్వ ఉంచే డబ్బాల్లో ఘాటైన వాసన ఉండే పదార్థాలు వేయడం వల్ల పురుగులు చేరకుండా ఉంటాయని ఇంకొందరు నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో వేపాకు, బిరియానీ ఆకు, లవంగాలు, ఇంగువ, కర్పూరం, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, రాతి ఉప్పు వంటి పదార్థాలున్నాయి. వీటి సాయంతో బియ్యంలో పురుగులు రాకుండా చేయవచ్చు.

అలానే వేపాకు, లవంగాలు, కర్పూరాన్ని పొడిగా చేసి ఒక గుడ్డలో కట్టి బియ్యం డబ్బాలో వేసినా, వాటి వాసనకు పురుగులు పట్టకుండా ఉంటాయని డాక్టర్ టీ ఇందిర చెప్పారు.

‘’వేపాకు, లవంగాలకు క్రిమికీటకాలతో పోరాడే శక్తి ఉంటుంది. అలానే వాటి ఘాటైన వాసన కారణంగా బియ్యానికి పురుగు పట్టకుండా ఉంటుంది. కొందరు బోరిక్ పౌడర్‌ను కూడా గుడ్డలో కట్టి బియ్యం నిల్వ చేసే డబ్బాల్లో వేస్తారు. అయితే బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండేలా మార్కెట్‌లో కొన్ని కెమికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి’’ అని డాక్టర్ టీ ఇందిర అన్నారు.

బియ్యం

ఫొటో సోర్స్, Getty Images

పురుగులు పట్టిన బియ్యం తినొచ్చా?

బియ్యానికి పురుగులు పట్టడం అనేది ఆందోళన చెందాల్సిన అంశం కాదని డాక్టర్ టీ ఇందిర అన్నారు.

‘‘అందరూ బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత నీటిలో ఉడకబెట్టి తింటారు. కాబట్టి ఆ వేడికి బియ్యంలో ఏవైనా కీటకాల మలినాలున్నా, బ్యాక్టీరియా ఉన్నా చనిపోతాయి. కాబట్టి ఆరోగ్యంపైన పెద్దగా ప్రభావం చూపదు. అజీర్ణ సమస్యల తీవ్రత కూడా తక్కువగానే ఉంటుంది’’ అని టీ ఇందిర వివరించారు.

ముంబయికి చెందిన నేచురోపథిక్ మెడిసిన్ నిపుణులు, అశావరి పట్వర్థన్ కూడా బియ్యంలో పురుగులు, కీటకాలు చేరిన కారణంగా జబ్బు పడిన కేసులు భారత్‌లో చాలా అరుదని చెప్పారు.

‘’పాతకాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ మొత్తంలో బియ్యాన్ని దీర్ఘకాలం నిల్వ చేసుకునేవి. కానీ ప్రస్తుతం చిన్న కుటుంబాలే ఎక్కువ. వీళ్లు తక్కువ మోతాదులోనే బియ్యాన్ని నిల్వ చేసుకుంటున్నారు. బియ్యానికి పురుగులు, కీటకాలు పట్టిన కారణంగా జబ్బు బారిన పడ్డ వాళ్లు చాలా తక్కువ’’ అని అశావరి పట్వర్థన్ అన్నారు.

బియ్యానికి పురుగులు పట్టకుండా ఈ మధ్య బోరిక్ పౌడర్, ఆముదం నూనె వంటి వాటిని కూడా బియ్యం డబ్బాల్లో ఉంచుతున్నారని అశావరి పట్వర్థన్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)