షుగర్ ఉన్న పదార్ధాలు తినొద్దని ఒట్టు పెట్టుకున్నా పదే పదే ఎందుకు తినాలనిపిస్తుంది... ఎలా కంట్రోల్ చేసుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హేలీ ఓనీల్
- హోదా, ది కన్వర్జేషన్
మనమందరం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తినాలనుకుంటాం. వీటికోసం కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు మన హెల్త్ గోల్స్(ఆరోగ్య లక్ష్యాలను)ను కూడా రివ్యూ చేసుకుని ఉంటాం.
కానీ, కొన్నిసార్లు తియ్యని, ఉప్పని లేదా కార్బోహైడ్రేట్ పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తినాలనిపించడం ద్వారా మనం నిర్దేశించుకున్న లక్ష్యాలకు తూట్లు పడుతుంటాయి.
ఆరోగ్యపరమైన అలవాట్లను మెరుగుపరుచుకోవాలని లేదా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నప్పుడు మనకెందుకు చక్కెర, కార్బోహైడ్రేట్ వంటి ఆహార పదార్థాలను తినాలనిపిస్తుంది? ఆ సమయంలో మనం ఏం చేయాలి?
కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలను మనకు తినాలనిపించడానికి చాలా కారణాలుంటాయి. ఈ కారణాల్లో, చాలా మందిలో కామన్‌గా కనిపించే నాలిగింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..
1. రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గినప్పుడు
జీవ జాతులన్నింట్లో కూడా చక్కెర అనేది కీలకమైన శక్తి వనరు. అత్యంత ప్రాథమిక ఇంద్రియ అనుభవాల్లో(సెన్సరీ అనుభవం) దీని రుచి కూడా ఒకటి.
నాలుకపై తియ్యటి రుచిని గుర్తించేందుకు ఎలాంటి ప్రత్యేకమైన గ్రాహకాలు లేనప్పటికీ, చక్కెర కోసం బలమైన ప్రాధాన్యతలను ఇది అభివృద్ధి చేసుకుంటుంది.
పేగులోకి అది చేరుకున్నప్పుడు న్యూరాన్లు చక్కెరకు స్పందించేలా యాక్టివేట్ అవుతాయి. దీని వల్ల తినాలనుకునే కోరిక మరింత పెరిగి, ఎక్కువగా తింటాం.
దీర్ఘకాలంలో, ఆహారంలో ఎక్కువ చక్కెర తీసుకుంటే, అది మానసిక స్థితిపై, జీర్ణక్రియ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. పేగుల వాపు కూడా తలెత్తుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
తరచుగా చక్కెర, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తిన్న వ్యక్తులలో రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరగడం, తగ్గడం చూస్తుంటామని చెప్పాయి.
రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పడిపోయినప్పుడు, చక్కెర, కార్బోహైడ్రేట్లు వంటి తక్షణ ఎనర్జీ ఇచ్చే ఆహార పదార్థాల కోసం శరీరం చూస్తుండొచ్చు. ఎందుకంటే, ఇవి తక్షణం, తేలికగా శరీరానికి ఎనర్జీని అందించగలవు.

ఫొటో సోర్స్, Getty Images
2. డోపమైన్, సెరోటోనిన్ పడిపోవడం
డోపమైన్ లాంటి కొన్ని న్యూరోట్రాన్స్‌మిటర్స్ మెదడు రివార్డు సిస్టమ్‌లో భాగమై, ఉత్తేజకరమైన కేంద్రకాలుగా పనిచేస్తాయి.
చక్కెర, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల డోపమైన్ విడుదలను ప్రేరేపించి, ఎంజాయ్‌మెంట్‌ను సృష్టిస్తుంది. దీంతో వాటిని తినడాన్ని మరింత పెంచుతుంది.
శరీరంలో ఆనందకరమైన హార్మోన్‌గా పేరున్న సెరోటోనిన్ ఆకలిని నియంత్రించడంతో పాటు శరీరంలో ఇతర అనేక పనులు చేస్తుంటుంది. సెరోటోనిన్‌లో వచ్చే సహజ మార్పులు మానసిక స్థితి, ఎనర్జీ స్థాయిలు, దృష్టి కేంద్రీకరించడం వంటి మార్పులను ప్రభావితం చేస్తాయి.
మధ్యాహ్నం వేళల్లో కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాన్ని తినేలా చేస్తాయి. ఒకవేళ ఆహారం ఆరోగ్యకరమైనది కాకపోతే, పేగుల్లో మంటగా ఉండటం లేదా ఇతర పర్యావసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇది యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి వాటికి దారి తీస్తుంది. ఈ ఆహార పదార్థాలకు, ఒత్తిడి, డిప్రెషన్ పెరిగేందుకు మధ్యలో కొంత సంబంధం ఉందని ఇటీవలే ఒక పరిశోధన సూచించింది.
కార్బోహైడ్రేట్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను పురుషులతో పోలిస్తే, మహిళలకు ఎక్కువగా తినాలనిపిస్తుంది.
చిరాకుగా అనిపించడం, అలసట, డిప్రెషన్ లేదా కార్బోహైడ్రేట్లు తినాలనిపించడం వంటివన్నీ పీరియడ్స్ రావడానికి సంకేతాలు. సెరోటోనిన్ స్థాయిలు తగ్గేందుకు సంబంధించినవై కావొచ్చు.
3. ఫ్లూయిడ్స్ తగ్గిపోవడం, రక్తంలో చక్కెర ఉప్పు స్థాయిలు పడిపోవడం
కొన్ని సార్లు మన శరీరం తనలో తగ్గిన హైడ్రేషన్ లేదా ఉప్పు స్థాయిలను కోరుకుంటూ ఉంటుంది. తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం తినడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పడిపోవడం, సోడియం, నీటి నిలుపుదల తగ్గడం జరుగుతుంటుంది.
కెటోజెనిక్ డైట్స్ వంటి తక్కువ కార్బోహైడ్రేట్ ఆహార పదార్థాలు ‘కెటోసిస్’ని ప్రేరేపిస్తుంది. దీని ద్వారా శరీరం కొవ్వును తన ప్రాథమిక శక్తి వనరుగా వాడుకుంటుంది. కార్బోహైడ్రేట్స్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
కెటోసిస్ వల్ల మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ఫ్లూయిడ్ స్థాయిలు తగ్గిపోవడం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, ఉప్పు పదార్థాలు ఎక్కువగా తినాలనే కోరిక కలుగుతుంటుంది.
4. ఒత్తిడి పెరుగుతుంది లేదా భావోద్వేగాలు దెబ్బతింటాయి
ఒత్తిడి, విసుగు, భావోద్వేగ స్థాయిలు పెరగడం వంటివి ఈ ఆహార పదార్థాలను తినేలా ప్రోత్సహిస్తాయి. దీని వల్ల, ఒత్తిడిని కలిగించే హార్మోన్లు మన ఆకలిపై, కడుపు నిండిన భావనను, ఆహార ఎంపికలను ప్రభావితం చేస్తాయి.
ఒత్తిడిని కలిగించే హార్మోన్ కార్టిసాల్ ముఖ్యంగా తియ్యటి ఆహార పదార్థాలను తినేలా చేస్తుంది. ఒత్తిడికి సంబంధించిన 59 మంది ప్రీమెనోపాజల్ మహిళలపై 2001లో చేపట్టిన ఒక అధ్యయనంలో ఒత్తిడి వల్ల వారిలో కేలరీల వినియోగం పెరిగిందని తేలింది.
దీర్ఘకాలికంగా ఉండే ఒత్తిడి, హై కేలరీలు ఆహారంలో కలిసినప్పుడు తియ్యటి ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలపిస్తుంది.
ఒత్తిడి సమయంలో బరువు పెరగకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన ఆహార ప్రాధాన్యతను ఇది సూచిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
చక్కెర, కార్బోహైడ్రేట్లు తినాలపించినప్పుడు ఏం చేయాలి?
ఇలాంటి పదార్థాలను అనిపించినప్పుడు ఈ కింద టిప్స్‌ను పాటిస్తే వీటిని తీసుకోకుండా కాస్త నియంత్రించుకోవచ్చు.
- సమతుల్య ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించాలి. మీ భోజనంలో సరైన ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. ఇవి మీ కడుపు నిండేందుకు.. చక్కెర, కార్బోహైడ్రేట్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తినడాన్ని తగ్గిస్తాయి.
- ప్రతి భోజనంలో 20 నుంచి 40 గ్రాముల మధ్యలో ప్రొటీన్లు పెద్ద వారు తీసుకునేలా చూసుకోవాలి. ముఖ్యంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో ప్రొటీన్లు ఉండాలి. కండరాల ఆరోగ్యానికి శరీర బరువులో ప్రతి కేజీకి కనీసం 0.8 గ్రాముల ప్రొటీన్లను ప్రతి రోజూ తీసుకోవాలి.
- ఫైబర్ అత్యధికంగా ఉన్న కూరగాయలు, తృణధాన్యాలను తినాలి. ఇవి రక్తంలో మీ చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ఉదాహరణకు బ్రోకోలి, క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్, బీన్స్ వంటివి తినాలి.
- ప్రాసెస్డ్ కుకీలు, సోడాలు, బేక్ చేసిన పదార్థాలు వంటి అత్యధిక చక్కెర ఉన్న రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లకు బదులుగా.. తృణధాన్యల బ్రెడ్ లేదా ముఫిన్స్, నట్, సీడ్ బార్స్, చియా సీడ్స్‌తో తయారైన ఎనర్జీ బైట్లను, ఓట్స్‌ను తీసుకుంటూ ఉండాలి.
- ప్రాణాయామం, యోగ లేదా గట్టిగా శ్వాస తీసుకోవడం వంటి విధానాల ద్వారా ఒత్తిడి స్థాయిలను నియంత్రించుకోవాలి.
- ఆహార పదార్థాల విషయంలో శ్రద్ధగా ఉండటం, నెమ్మదిగా తినడం, శరీర స్పందనలకు అనుభూతి చెందడం వంటివి రోజూ తీసుకునే కేలరీలను, కార్బోహైడ్రేట్స్ తినాలనే కోరికను, ఒత్తిడి వల్ల కలిగే కోరికను తగ్గించుకోవచ్చు.
- సరైన నిద్రపోవాలి. ప్రతి రోజూ రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలని నిర్దేశించుకోవాలి. కనీసం 7 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. నిద్ర సరిగ్గా లేకపోతే కూడా హార్మోన్లు ప్రభావితమై, ఆకలి, తినాలనే కోరిక విషయంలో నియంత్రణ కోల్పోతాం.
- ఆరోగ్యకరమైన ఆహారం తినాలనుకున్నప్పుడు లేదా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు తీపి, ఉప్పు, కార్పోహైడ్రేట్ లాంటి పదార్థాలు తినాలనే కోరికను అధిగమించడం పెద్ద సవాలుతో కూడిన అంశమే.
- ఈ ప్రయత్నంలో మీకు సమస్యలు ఎదురుకావొచ్చు. కానీ, మీకు మీరు సహనంతో ఉండాలి. అప్పుడప్పుడు తినాలపించే కోరికలు, తిండి విషయంలో మీ విజయాన్ని నిర్వచించవు. కానీ, వాటిని ఎలా నిర్వహిస్తున్నాం, అధిగమిస్తున్నామో దాని సామర్థ్యంపై విజయం ఆధారపడి ఉంటుంది.
( రచయిత హేలీ ఓనీల్ బాండ్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, మెడిసిన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. )
ఇవి కూడా చదవండి:
- సీతాదేవి: రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన ఈ పిఠాపురం యువరాణి కథ ఏంటి?
- 'ఉత్తరకాశీ సొరంగం నుంచి 41 మందిని కాపాడాను, ప్రతిఫలంగా మా ఇంటిని కూల్చేశారు' -ర్యాట్ హోల్ మైనర్ వకీల్ హసన్
- గ్రీన్ అమ్మోనియా: కంపెనీలు దీని కోసం ఎందుకు పోటీ పడుతున్నాయి?
- పారిపోయిన ఇద్దరు పిల్లలు తిరిగి తమ ఇంటికి చేరుకోవడానికి 13 ఏళ్ళు పట్టింది... ఇన్నేళ్ళూ వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేశారు?
- బెంగాల్ క్షామం: లక్షల మందిని పొట్టన పెట్టుకున్న ఆనాటి దుర్భిక్షాన్ని అనుభవించిన వారిలో కొందరు ఇంకా బతికే ఉన్నారు, వారు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














